అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

2, ఫిబ్రవరి 2022, బుధవారం

జీవితగమ్యం

ఈ మధ్యన ఒక పాత మిత్రుడిని కలవడం సంభవించింది. ఆయన స్టేట్ గవర్నమెంట్ లో హై పొజిషన్ లో రిటైర్ అయ్యాడు. ఇద్దరికీ ఇద్దరి గురించీ తెలిసినా నా నాణేనికి ఉన్న రెండోవైపు ఆయనకు తెలీదు. అందుకని మామూలు ధోరణిలోనే మాటలు సాగాయి.

నా మిత్రులలో ఎవరిని నేను కలిసినా ఆస్తిపాస్తుల గురించీ, పిల్లల గురించీ, ఎంత సంపాదించావ్?, ఎంత వెనకేశావ్? ఇలాంటి చచ్చుప్రశ్నలు ఎప్పుడూ అడగను. నేనడిగేది ఒకటే ప్రశ్న, 'ఎలా ఉన్నావ్?' అని. మహా అడిగితే 'ఆరోగ్యం బాగుందా?' అని రెండో ప్రశ్న అడుగుతా, అంతే. అంతకుమించి అడగకపోవడంతో, నాకు జనరల్ నాలెడ్జి తక్కువని సహజంగానే వారనుకుంటూ ఉంటారు. వారలా అనుకోవడమే నాకూ కావాలి గనుక, నేనూ మౌనంగా ఊరుకుంటాను.

'నీకింకా ఎన్నాళ్ళుందేంటి సర్వీసు?'అనడిగాడు తను.

'ఇంకెంత? కొద్ది నెలలు. జూలైలో రిటైర్ అవుతున్నా' అన్నా.

'మరి సంపాదించుకున్నావా? పిల్లలెక్కడున్నారు?' అనడిగాడు.

'ఆ ! తింటానికి ఉంటానికి సరిపోతుంది. నా రాతను బట్టి నా సంపాదన. పిల్లల రాతను బట్టి వాళ్ళు సెటిలయ్యారు. చెప్పుకోడానికేముంది?' అన్నా.

'ఏదో ఆశ్రమం పెడుతున్నావుట? నాగేశ్వర్రావు చెప్పాడు. ఓల్డేజి హోమా?' అన్నాడు.

నాగేశ్వర్రావు గుంటూరులో మాకిద్దరికీ కామన్ ఫ్రెండ్. వాడిద్వారా ఈ విషయం తెలుసుకున్నట్లున్నాడు.

'అలాంటిదే' అన్నా, అన్నీ అందరికీ చెప్పడం ఎందుకని.

'బాగుంటుందిలే. దానిమీద కూడా బాగా సంపాదించవచ్చు' అన్నాడు.

చాలా జాలేసింది ఆ మాట విని. సంభాషణ పొడిగించడం ఇష్టం లేక, మౌనంగా ఊరుకున్నా.

ఇక తన గురించి మొదలుపెట్టి, హైద్రాబాద్ లో తను ఎన్ని విల్లాలు కొన్నదీ, పిల్లలు ఎలా ఫారిన్ లో సెటిలైందీ, ఎక్కడెక్కడ ఎన్నెన్ని స్థలాలున్నదీ గర్వంగా చెప్పుకొచ్చాడు. మధ్యలో ఆపి, 'కనీసం ఒక్క విల్లా కూడా కొనలేదా నువ్వు?' అన్నాడు జాలిగా.

'లేదు. అంత అవసరమూ లేదు, అవకాశమూ రాలేదు' అన్నాను.

'రాలేదా? నువ్వు ప్రయత్నం చేయలేదా?' అన్నాడు హాస్యంగా.

'రెండోదే నిజమనుకో' అన్నా ఈ టాపిక్ పొడిగించడం ఇష్టం లేనట్లు.

'క్రిప్టో గురించి చూస్తున్నావా?'అడిగాడు.

తెలిసినా తెలీనట్లు, 'అదేంటి?' అన్నా

'నువ్వింతే' అన్నట్లు జాలిగా ముఖం పెట్టి, 'ఓహో ! అయితే నీకర్ధం కాదులే. నువ్వు చాలా వెనుకబడి ఉన్నావ్, ఫ్యూచరంతా క్రిప్టో దే' అన్నాడు.

'ఐసీ' అన్నా నిరాసక్తంగా. 

'ఇప్పుడు మనకు లీవ్ బాధ లేదుగా. వచ్చే నెలలో అమెరికా వెళ్తున్నా, హ్యాపీ' అన్నాడు.

'అమెరికా వెళ్తే హ్యాపీనా? మరి అక్కడున్న NRI లు వెనక్కొస్తున్నారేంటి? వాళ్ళు హ్యాపీ కాదా?' అడిగా నవ్వుతూ.

'ఇందాకట్నుంచీ చూస్తున్నా నీ ధోరణి? ఎడ్డెమంటే తెడ్డెమంటావ్? అసలేంటి నీ గోల? చేతనైతే సంపాదించాలి. అంతేగాని  ఇలా కుళ్ళుకోకూడదు' అన్నాడు కొంచం కోపంగా.

నాకు నవ్వుతో పొలమారింది. 'కుళ్ళా? ఎందుకు?' అన్నా నవ్వాపుకుని.

'అదే. నేను బాగా సెటిలయ్యాను. నువ్వు కాలేదు. అందుకే నీకు కుళ్ళు' అన్నాడు.

'నేను బాగా సెటిలవ్వలేదని ఎవరన్నారిప్పుడు?' అన్నా.

'మరి సంపాదించి దాచిపెట్టలేదని నువ్వే అంటున్నావ్ గా?' అన్నాడు.

'దానికీ, 'బాగా' సెటిలవ్వడానికీ సంబంధం ఏంటి?' అన్నా అమాయకంగా.

'ఓరి దేవుడో ! నీతో పెట్టుకుంటే నాకు పిచ్చెక్కేలా ఉందిగాని, నీకో దణ్ణం నేనొస్తా' అంటూ అవతలకి పోబోయాడు.

ఈ జీవికి కొంచం జ్ఞానబోధ చేద్దామని జాలి కలిగింది. ఆపి, ఇలా అడిగా.

'సరే. ఇప్పటిదాకా నువ్వు ప్రశ్నలడిగావ్ నేను జవాబులు చెప్పా. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలడుగుతా, నీకు చేతనైతే ఆన్సర్స్ చెప్పు' అన్నా.

ని ఈగో దెబ్బతింది. పోబోతున్నవాడల్లా ఆగి, 'సరే అడుగు' అన్నాడు అనుమానంగా.

'ప్రస్తుతం నీ వయసెంత?' అడిగా.

'అరవై ఒకటి' అన్నాడు.

'ఓకే. నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?' అన్నా.

'అన్ని రోగాలూ ఉన్నాయి. మందులున్నాయిగా. నడుస్తోంది బండి. కరోనా కూడా రెండుసార్లు వచ్చి తగ్గింది.  మొదటిసారి పైదాకా వెళ్లి వచ్చా. రెండోసారి లైట్ గా బ్రష్ కోటింగ్ పడింది' అన్నాడు.

'ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతావని నీ అంచనా?' అన్నా.

షాకయ్యాడు ఆ మాటకి.

'ఏమో? కనీసం ఇంకా పదీ ఇరవై ఏళ్ళు బ్రతుకుతానేమో?' అన్నాడు.

'అబ్బో అంత గ్యారంటీ ఉందా? నియో కవ్ అని ఇంకో కరోనా వెరైటీ వస్తోందిట. సోకిన ముగ్గురిలో ఒకడు గ్యారంటీగా పోతాట్ట' అన్నా.

'అవి పుకార్లు, నమ్మకు. పేపర్లలో ఏవో రాస్తుంటారు' అన్నాడు.

'సరే ఇంకో పదీ ఇరవై ఏళ్ళు బ్రతుకుతావని అనుకుందాం. అది కూడా, క్రిప్టో కరెన్సీ, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ అంటూ బ్రతికి చివరకేం చేస్తావ్?' అన్నా.

'ఏముంది? అందరూ ఏం చేస్తారు? పోవడమే' అన్నాడు.

'మరి చివరకు, ఇంత సంపాదించిన నువ్వూ పోయి, ఏమీ సంపాదించని నేనూ పోయి, అందరూ పోయేదే కదా? నాకంటే డిఫరెంట్ గా ఏంటి నువ్వు సాధించింది?' అన్నా.

'ఎవరైనా సాధించేది డబ్బే కదా ! లగ్జరీగా బ్రతకడమేగా ఎవరైనా చేసేది? ఇంకేముంది?' అన్నాడు.

'లగ్జరీ ఒక్కటే జీవిత పరమావధి కాదు. అలా కాకపోయినా బాగా బ్రతకవచ్చు. డబ్బు, కంఫర్ట్స్, ఇవొక్కటే జీవితానికి అంతిమగమ్యాలు కావు. నువ్వు పోయాక ఎక్కడికి పోతావో, ఏమౌతావో, అప్పుడు నువ్వు సంపాదించిన ఈ భూములు, విల్లాలు, అపార్ట్ మెంట్లు, ఆస్తులు ఏమౌతాయో ఆలోచించావా ఎప్పుడైనా?' అడిగా.

'ఏముంది? నా పిల్లలు ఎంజాయి చేస్తారు?' అన్నాడు.

'ఎంతని ఎంజాయి చేస్తారు? వాళ్లేమో అమెరికాలో సెటిలయ్యారు. నీ డబ్బు వాళ్ళకెందుకు? ఇక్కడ నీ ఆస్తులు వాళ్లెలా ఎంజాయి చేస్తారు? అమ్ముకుంటారు' అన్నా.

'పోన్లే. ఆ డబ్బు వాళ్లకు మిగులుతుంది కదా !' అన్నాడు మొండిగా.

'ఏం చేసుకుంటారు ఆ డబ్బుని? అప్పుడు కూడా, నీ బ్లాక్ మనీని వాళ్లెలా అక్కడికి ట్రాన్స్ ఫర్ చేసుకోగలరు? పోనీ ఏదో చేస్తార్లే అనుకున్నా, ఒక లిమిట్ దాటాక డబ్బు ఎందుకు? మినిమమ్ లివింగ్ ఉంటే చాలదా ? ఆ తర్వాత ఏం చేసుకుంటావ్ డబ్బుని? ఇప్పుడు నీకు కోట్లున్నాయి. మరి నీ రోగాలు తగ్గడం లేదు కదా? ఏంటి ఉపయోగం?' అన్నా.

'ఓహో ఫిలాసఫీనా ! అయితే నీ ఆశ్రమంలో చేరమంటావా నన్ను? డొనేషన్ కావాలా?' అన్నాడు నవ్వుతూ.

ఇలా కాదని సూటిగా విషయం లోకొచ్చా.

'చూడు గుర్నాధం ! ఎవడు బడితే వాడు ఇచ్చే డొనేషన్ మేము తీసుకోము. ఇవ్వాలన్నా ఒక అర్హత ఉండాలి. అవినీతి డొనేషన్లు మాకక్కర్లేదు. నీతిగా సంపాదించిన మా సంపాదన మాకు చాలు. ఇకపోతే, నువ్వు చేరతానని వచ్చినా, మా ఆశ్రమంలో ఎవరిని బడితే వారిని చేర్చుకోవడం జరగదు. నిన్నసలు గేట్ లోపలకే రానివ్వం. మాతో చేరాలన్నా, మాతో ఉండాలన్నా కొన్ని అర్హతలుండాలి' అన్నా.

'అబ్బో ! ఏంటో అవి?' అన్నాడు ఎగతాళిగా.

'మొదటగా, జీవితమంటే లోతైన ఆలోచనా, అవగాహనా నీకుండాలి. జీవితంలో నీ ప్రయారిటీలు 'సంపాదన, డబ్బు, సుఖాలు' ఇవే కాకూడదు.  ఉన్నతమైన తాత్త్వికచింతన నీలో ఉండాలి. నేను ఇందాక అడిగానే, ఆ ప్రశ్నలకు జవాబులు నీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. ఆధ్యాత్మికమార్గంలో నడవాలన్న తీవ్రమైన తపన నీలో ఉండాలి.  అప్పుడు మాత్రమే నీకు మా ఆశ్రమం తలుపులు తెరుచుకుంటాయి. లేకపోతే తెరుచుకోవు. నువ్వు ఇప్పటిదాకా బ్రతికింది చాలా డొల్ల జీవితం. అసలైన జీవితం నీకేమీ తెలీదు. నీకు తెలీని జీవితం చాలా ఉంది. అలా బ్రతికితేనే దానికి సార్ధకత' అన్నా.

'ఓహో ! లేకపోతే ఏమౌతుంది?' అన్నాడు.

'ఏమీ కాదు. రోడ్డు ప్రక్కన బెగ్గరూ చస్తాడు. ఒక మధ్యతరగతి మనిషీ చస్తాడు. నువ్వూ చస్తావు.  కాకపోతే నువ్వు అపోలో లో పోతావు. మామూలు మనిషి మామూలు ఆస్పత్రిలో పోతాడు.  అంతే తేడా ! ఒక ఇరవై ఏళ్ల తర్వాత నువ్వనేవాడివి ఒకప్పుడు ఉన్నావని కూడా ఎవడికీ గుర్తుండదు. నిన్ననుకునేవారే ఉండరు. మీలాంటి వాళ్ళెవరూ జీవితపు మౌలికసమస్యలకు సొల్యూషన్స్ కనుక్కోలేరు.  ఎందుకంటే మీరా దిశగా ప్రయత్నం చేయడం లేదు గాబట్టి' అన్నా.

'నువ్వొక్కడివే పెద్ద ఫిలాసఫర్ ననుకోకు. నేనూ ఫలానా స్వామీజీ భక్తుడినే. ఆయన మా ఇంటికి కూడా వొచ్చాడు' అన్నాడు.

'దానివల్ల ఉపయోగం జీరో. ఆయనకూ అసలు విషయం తెలీదు, నీకూ తెలీదు. ఆయనా నువ్వూ ఒకే పడవలో ఉన్నారు. ఆయనకూ పరమావధి డబ్బే. నీకూ అదే' అన్నా.

వాడికి పిచ్చి కోపం రేగింది. తమాయించుకుని, 'నీకసలు క్రిప్టో కరెన్సీ గురించే తెలీదు, షేర్ మార్కెట్ ఎలా ఉందో తెలీదు. నువ్వు నాకు ఫిలాసఫీ చెబుతున్నావ్ ! నువ్వు మారవురా ! నీ ఖర్మ. పడు' అంటూ విసురుగా వెళ్ళిపోయాడు.

నాకు నవ్వూ జాలీ ఒకేసారి కలిగాయి. వాడు వెళ్ళినవైపు చూస్తూ ఉండిపోయా కాసేపు.

మనుషులు ఎంత మాయలో కూరుకుపోయి ఉన్నారు? 61 వచ్చినా ఇంకా 'డబ్బు డబ్బు' అంటూ అంగలారుస్తున్నాడు మిత్రుడు.  ఏంటీ ఖర్మ? మాయంటే ఇదేనా? మనుషుల పైన దీని పట్టు ఇంత ఘోరంగా ఉంటుందా? కళ్ళముందు ప్రతిరోజూ ఎంతో మంది చనిపోవడం చూస్తూ కూడా, ఇంకా డబ్బని ఆస్తులని పరిగెత్తడం ఎంత వింత? సరే జీవితమంతా దానికోసమే బ్రతికాడు. కనీసం ఇప్పుడైనా జీవితపు మౌలికసమస్యల గురించి కాస్త ఆలోచించాలి కదా? తర్వాత ఏంటి? అన్న ఆలోచన రావాలి కదా.

ప్రపంచ జనాభా 790 కోట్లు. వీళ్ళలో నిజమైన ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్లు కనీసం ఒక లక్షమందైనా ఉంటారా? ఒకవేళ ఉంటే, వాళ్లలో ఎంతమంది సిన్సియర్ గా సరియైన దారిలో నడుస్తారు? అలా నడిచేవారిలో ఎంతమంది గమ్యానికి చేరతారు? కనీసం ఒక పదిమంది ఉంటారా? లేక వారూ ఉండరా? ఈ లోకం ఇంతేనా? ఒకవేళ దీని నియమం ఇంతేనేమో? ఇదెప్పటికీ ఇలా ఉండటమే కరెక్టేమో? కర్మనియమమూ, లోకరీతీ ఇంతేనేమో? ఈ రొచ్చులోంచి బయటపడటం వీళ్ళవల్ల కాదేమో? మరి వీళ్లకు చెప్పాలని ప్రయత్నించడం కరెక్టేనా? అసలీ ప్రయత్నమే తప్పేమో?

పై ప్రశ్నలన్నీ నాలో తలెత్తాయి. హఠాత్తుగా, శ్రీ రామకృష్ణుల వారు చెప్పిన 'వలా - చేపలూ' కధ గుర్తొచ్చింది. నాకు నాకే సమాధానం కూడా దొరికింది.

'చీకట్లో చిరుదీపాన్ని వెలిగించడమే నీ పని. అది ఎవరికి  ఉపయోగపడాలో వారికి పడుతుంది. మిగతాది నీపని కాదు. ఎక్కువ దీనిగురించి ఆలోచించకు. లోకం సంగతి నీకనవసరం. దానిని చూచుకునేవాడు ఒకడున్నాడు. అది వాడి పని. మనుషులు అంత తేలికగా వెలుగుదారిలోకి రాలేరు. ఈ ప్రపంచం ఒక ప్లాన్ ప్రకారం పోతున్నది. దానిపని అది చూచుకుంటుంది. నీ పని నీవు చెయ్యి. ఇంతకు ముందు కూడా చాలాసార్లు నీకిదే చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను' అన్నది ఒక స్వరం.

'సరే అలాగే చేద్దాం' అనుకుంటూ నా దారిన నేనొచ్చేశా.

అంతకంటే చేసేది మాత్రం ఏముంది గనుక?

read more " జీవితగమ్యం "

27, జనవరి 2022, గురువారం

'తంత్రసారము' ఈ బుక్ విడుదలైంది

'పంచవటి  పబ్లికేషన్స్' నుండి  వస్తున్నవి మామూలు పుస్తకాలు కావు. అవి జ్ఞానభాండాగారాలు. మన ప్రాచీన విజ్ఞానపు నిధులు. అటువంటి పుస్తకాలలో మరొక్క మహత్తరమైన గ్రంధరాజం ఈ రోజున, అంటే పుష్య బహుళ  దశమి రోజున వెలువడుతున్నది.

దానిపేరు 'తంత్రసారము'.

ఈ పుస్తకం కోసం ఎంతోమంది మేధావులు, తంత్రశాస్త్రాభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. కొందరైతే,  సంస్కృతంలో ఉన్న ఈ గ్రంధానికి తెలుగు వ్యాఖ్యానాన్ని వ్రాయమని నన్ను గతంలో కోరారు కూడా. వారందరి కోరికను తీరుస్తూ 'తంత్రసారము' అనబడే ఈ పుస్తకాన్ని తెలుగులో నేడు విడుదల చేస్తున్నాము. మా సంస్థ నుండి వెలువడుతున్న మిగతా చాలా పుస్తకాలలాగా ఇది కూడా మొదటిసారిగా తెలుగులోకి వస్తున్నది. అదికూడా నా చేతులమీదుగా జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

'తంత్రశాస్త్రం' అంటే లోకులలో చాలా అపోహలున్నాయి. దానికి కారణం అసలైన తంత్రమంటే ఏమిటో లోకానికి తెలియకపోవడం. భూతప్రేతాలు, క్షుద్రపూజలు, చేతబడులు మొదలైన పనికిరాని తంతులతో కూడినదే తంత్రమని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది శుద్ధపొరపాటు. అది క్షుద్రతంత్రం. అసలైన తంత్రం వేరు. అసలైన తంత్రం శుద్ధమైన సాధనామార్గం. 

తంత్రశాస్త్రమనేది ఒక ఆధ్యాత్మిక సాధనామార్గం. దీనికి శాస్త్రప్రామాణికత ఉన్నది. ఆ శాస్త్రములను ఆగమములంటారు. వీటిలో శైవాగమములు, శాక్తాగమములు, వైష్ణవాగమములు ప్రధానములుగా ఉన్నాయి. ఇవన్నీ ద్వైతసిద్ధాంతమును ప్రబోధించే మార్గములే. వీటిలో ఒక్క శైవాగమశాస్త్రములలోనే అద్వైతమార్గం ఉన్నది. అది శివాద్వైతశాస్త్రంలో మాత్రమే మనకు గోచరిస్తుంది. దీనికే త్రికశాస్త్రమని పేరు. నేడు దీనినే కాశ్మీరశైవమని పిలుస్తున్నారు.

పదవశతాబ్దం నుంచి మనదేశం పైన జరిగిన తురకల దండయాత్రలలోను, వారు బుద్ధిలేకుండా మనదేశంలో జరిపిన విధ్వంసకాండలోను, మన దేవాలయాలు గ్రంధాలయాలు వేలాదిగా ధ్వంసమయ్యాయి. వేలాది  విలువైన గ్రంధాలు తగలబెట్టబడ్డాయి. వాటిలోని విలువైన జ్ఞానసంపదంతా నాశనమైపోయింది. మన అదృష్టం బాగుండి కొన్నికొన్ని గ్రంధాలు మాత్రం బ్రతికి బయటపడ్డాయి. వాటిల్లో, మాలినీ విజయోత్తర తంత్రము, తంత్రాలోకము, తంత్రసారము అనే గ్రంధాలు కొన్ని. ఇవి దాదాపుగా  900 వంవత్సరాల తర్వాత క్రీ. శ . 1900 ప్రాంతంలో కాశ్మీర్ లో పురాతన తాళపత్ర గ్రంధాలలో దొరికాయి. వాటిని భద్రపరచిన ఘనత అప్పటి కాశ్మీరరాజైన శ్రీప్రతాపసింహమహారాజు గారికీ, ఆయన ఏలుబడిలో ఉన్న పురాతన తాళపత్రాల గ్రంధాలయాధికారి శ్రీముకుందరామశాస్త్రి గారికీ  చెందుతుంది. నూరేళ్లక్రితం దీనిని హిందీలోకి అనువదించింది ఈయనే. ఈ మహానుభావుల కృషి వల్లనే ఈ గ్రంధాలను మనం ఈనాడు చదువుకోగలుగుతున్నాం.  మనమేకాదు, సంస్కృతం నేర్చుకున్న  వందలాది మంది యూరోపియన్లు, అమెరికన్లు నేడు ఈ పుస్తకాలను చదివి, వాటిలోని అత్యున్నతమైన ఫిలాసఫీకీ, లాజిక్ కీ ముగ్దులైపోయి, శివభక్తులుగా మారారు. మారుతున్నారు.

వీటిలో 'శ్రీ మాలినీ విజయోత్తర తంత్రము' ను తెలుగులో నా వ్యాఖ్యానంతో ఇప్పటికే ప్రచురించాము. ఇప్పుడు, అభినవగుప్తులవారు వ్రాసిన 'తంత్రసారము' ను ప్రచురిస్తున్నాము. త్వరలో ఈయన యొక్క లైఫ్ టైం వర్క్ అయిన 'తంత్రాలోకము' కూడా నా వ్యాఖ్యానంతో  తెలుగులోకి రాబోతున్నది.

క్రీ.శ.1000 కంటే ముందు మనదేశంలో,ముఖ్యంగా శైవాగమాలలో  ప్రచారంలో  ఉన్న, స్పంద, క్రమ, కుల, ప్రత్యభిజ్ఞములనే అన్ని శైవతంత్ర సిద్ధాంతాలనూ ఒకేచోట చేర్చి, వాటిని సతార్కికంగా వివరిస్తూ ఒక బృహద్గ్రంధాన్ని వ్రాయమని తన కౌలాచార గురువైన శ్రీ శంభునాధులవారు తనను ఆదేశించినట్లు, దానిననుసరించి  తానీ గ్రంధాన్ని వ్రాసినట్లు అభినవగుప్తులవారు తన 'తంత్రాలోకము' ముందు మాటలో వ్రాశారు. ఇవన్నీ క్రీ. శ 1000 ప్రాంతంలో కాశ్మీర్ లో జరిగిన సంఘటనలు. ఆ తంత్రాలోకానికే ఈ 'తంత్రసారము' సంక్షిప్తరూపం. ఇదే 550 పేజీలలో ఉందంటే ఇక 'తంత్రాలోకం'  ఎంత పెద్ద గ్రంధమో అర్ధం చేసుకోవచ్చు. ఈ గ్రంధం బ్రతికి బట్ట కట్టబట్టే, ఆయా తాత్వికచింతనలన్నీ ఒకప్పుడు ఉన్నాయని నేడు మనం తెలుసుకోగలుగుతున్నాం. 

ప్రపంచంలోని ఏ మతమైనా తీసుకోండి, వాటన్నిటికంటే ఎంతో గొప్పదీ ఉత్తమమైనదీ శివాద్వైతం. అంతేకాదు, హిందూమతం లోని అన్ని తాత్త్విక చింతనామార్గాలలోకీ శిఖరం లాంటిది ఈ శాస్త్రం. దీనిని వ్రాసిన అభినవగుప్తులవారు మామూలు మనిషి కాదు. అటువంటి మహానుభావులు వెయ్యేళ్లకు ఒక్కరు మాత్రమే పుడతారు. ఈయన సాంఖ్య, బౌద్ధ, వైష్ణవ, శైవశాస్త్రములను క్షుణ్ణంగా అధ్యయనము చేసిన మహాపండితుడు మాత్రమే గాక, మహా తపస్వి, జ్ఞానీ కూడా. నేటి సోకాల్డ్ ప్రవక్తలతో పోలిస్తే ఈయనను 'మహాప్రవక్త' అనవచ్చు. అటువంటి మహాప్రవక్త వ్రాసిన ఈ గ్రంధమును తెలుగులోకి తేవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.

ఇందులో 22 అధ్యాయాలున్నాయి. వీటిల్లో ఎంతో నిశితమైన లాజిక్ తో కూడిన సిద్ధాంత భాగమేగాక, అణవోపాయము, శాక్తోపాయము, శాంభవోపాయము, అనుపాయము, శక్తిపాతము, షడధ్వములు, వివిధరకములైన దీక్షలు, విధులు, ఆగమప్రామాణికతలను వివరిస్తూ, వీటన్నిటికీ తలమానికంగా, చివరి అధ్యాయములో ఆరువిధములైన సాధనలతో కూడిన కౌలాచారతంత్రమును కూడా వివరించడం జరిగింది.      

ఈయన దాదాపుగా 50 గ్రంధములను రచించారు. వాటితో బాటు తనకెంతో ఇష్టమైన 'భైరవస్తవము' అనే తొమ్మిది శ్లోకములతో కూడిన స్తోత్రమును కూడా రచించారు.  దానినీ, ఆ శ్లోకములకు నేను వ్రాసిన తెలుగు పద్యములనూ ఈ గ్రంధంలో ఇచ్చాను. దానినాయన  పుష్య బహుళదశమి నాడు వ్రాసినట్లుగా అందులో వ్రాసుకున్నారు. బహుశా అది క్రీ. శ. 1016 సంవత్సరం కావచ్చు. మా గ్రంధం కూడా, అనుకోకుండా అదే తిధికి దగ్గరలోనే, పుష్యమాసంలోనే పూర్తయింది. అలా జరగాలని మేము ప్లాన్ చెయ్యలేదు. అనుకోకుండా అలా జరిగింది. కనుక, అదే పుష్య బహుళ దశమి నాడు, అంటే ఈరోజున, ఈ పుస్తకాన్ని 'ఈ బుక్' గా విడుదల చేస్తున్నాను. దీనిని కాకతాళీయంగా నేను భావించడం లేదు. ఎందుకంటే, ప్రపంచంలో ఏదీ కాకతాళీయం కాదని నాకు తెలుసు కాబట్టి.

'భైరవ స్తవము' చివరలో అభినవగుప్తులవారు వ్రాసిన సంస్కృత శ్లోకము, దానికి నా తెలుగు పద్యమూ, దాని వివరణలూ ఇవి.

శ్లో|| వసురసపౌషే కృష్ణ దశమ్యామ్

అభినవగుప్తః స్తవమిమ మకరోత్ 

యేన విభుర్భవ మరుసంతాపం

శమయతి ఝటితి జనస్య దయాళుః 


ఆ || అరువదెనిమిదేండ్ల యరుదైన దినమందు

స్తవము నభినవుండు చక్కజేసె

దీనినెంచి మిగుల దయతోడ నీశుండు

తాపతతుల నెల్ల దీర్చుగాత 


అష్టవసువులు గనుక, వసు అంటే 8. షడ్రసములు గనుక రస అంటే 6. 'అంకానాం వామతో గతి: (అంకెలన్నీ కుడినుంచి ఎడమకు నడుస్తాయి)' గనుక, వసురస అనేపదం 68 ని సూచిస్తున్నది. అంటే, 'తన 68 వ సంవత్సరంలో పుష్యమాసపు కృష్ణదశమి, మకరసంక్రాంతి నాడు అభినవగుప్తుల వారు ఈ స్తోత్రమును రచించారు. దీనిని పఠించడం వల్ల, దయాళువైన పరమేశ్వరుడు కరుణిస్తాడు. జనులకు కలిగే బాధలను శమింపజేస్తాడు' - అని ఈ శ్లోకం యొక్క అర్ధం.

ప్రస్తుతం మా ఆశ్రమస్థలాన్ని సేకరించే పని అయిపోయింది గనుక, ఇక పుస్తకాల ప్రింటింగ్ మళ్ళీ మొదలౌతుంది. ఆ క్రమంలో 'తంత్రసారము' కూడా పుస్తకంగా వస్తుంది. ఈ లోపల 'ఈ బుక్' ని  చదివి ఆనందించండి మరి !

యధావిధిగా, ఈ పుస్తకాన్ని వ్రాయడంలో త్రిశక్తుల సహాయం నాకు లభించింది. వారు, నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితలు. సంస్కృతశ్లోకాలను, వచనాన్ని తెలుగులో వ్రాయడంలో శ్రీలలిత ప్రధానపాత్ర పోషిస్తే, పుస్తకం టైప్ సెట్టింగ్, ప్రూఫ్ రీడింగ్, పబ్లిషింగ్ మొదలైన పనులలో ఎంతో ఓర్పుతో అఖిల సహాయపడింది. నాకైతే చిన్నప్పటినుంచీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ గనుక నేనీ పనులు చేస్తున్నాను. నాతోబాటు వీరందరూ కూడా ఇంత కష్టపడుతున్నారంటే అది జగజ్జనని అనుగ్రహం కాక మరేమనుకోవాలి?  వీరు ముగ్గురి తోడ్పాటు లేకుంటే నా పుస్తకాలలో ఒక్కటి కూడా వెలుగు చూచేది కాదు. అందుకే వీరికి ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. అయినా సరే, వీరికి మళ్ళీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఇకపోతే, ముఖచిత్రాన్ని యధావిధిగా అద్భుతంగా తీర్చిదిద్దాడు శిష్యుడు ప్రవీణ్. చిరకాలం లోకంలో నిలచిపోయే ఇలాంటి ఉత్తమ గ్రంధాలను  తెలుగు ప్రపంచానికి  అందించే పనిలో, నాకు సహచరులయ్యే అదృష్టం వీరికి పట్టింది. అది వారి సుకృతం. వీరందరికీ ఋణపడి ఉన్నాను. పరమ శివానుగ్రహం వీరికి నిరంతరం ఉండాలని ప్రార్ధిస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకం కూడా గూగుల్ ప్లే బుక్స్ నుండి ఇక్కడ లభిస్తుంది. ఇంకొక క్రొత్త పుస్తకంతో మళ్ళీ త్వరలో కలుసుకుందాం. అప్పటివరకూ ఈ మహోత్తమగ్రంధాన్ని అధ్యయనం చేయండి.

read more " 'తంత్రసారము' ఈ బుక్ విడుదలైంది "

16, జనవరి 2022, ఆదివారం

బికనీర్ ఎక్స్ ప్రెస్ ఘోరప్రమాదం - గ్రహాల పాత్ర ఏమిటి?

క్రొత్త సంవత్సరం రైలుప్రమాదంతో మొదలైంది. 13-1-2022 గురువారం సాయంత్రం 5 గంటలకు ఒక ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ లోని బికనీర్ నుండి అస్సాం లోని గౌహతికి వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జల్పాయిగురి జిల్లాలో ఉన్న మైనగురి అనే ఊరి దగ్గర పట్టాలు తప్పింది. రైల్లో 18 పెట్టెలుంటే వాటిలో 12 పట్టాలు తప్పి చిందరవందర అయ్యాయి. S - 5 మరియు S - 6 పెట్టెలు ఒకదానిపైకి ఒకటి ఎక్కాయి. తొమ్మిదిమంది చనిపోయారు. 36 మంది గాయాలపాలయ్యారు. యధావిధిగా రైల్వే మంత్రిగారు, ఇతర అధికారులు వచ్చారు. చూచారు. రైలు ఇంజన్లో లోపం ఉందన్న ప్రాధమిక సమాచారాన్ని రైల్వేమంత్రిగారే స్వయంగా వెల్లడించారు. బాధితులకు  నష్టపరిహారం ప్రకటించారు. ఎంక్వైరీ వేశారు. విచారణ జరుగుతోంది.

గ్రహాలేమంటున్నాయి?

భారతదేశానికి సూచికైన మకరరాశిలో శని బుధులు మూడు డిగ్రీల తేడాలో ఉన్నారు.  బుధుడు వేగంగా శనిని సమీపిస్తున్నాడు. వీరిద్దరికీ సూర్య గురువుల ద్వారా అర్గలదోషం పట్టింది.  శుక్రునికి గల వక్రత్వం వల్ల వృశ్చికంలోకి పోతున్నాడు. కనుక అర్గలదోషంలో ఈయన పాత్ర లేదు. శనిబుధులపైన హటాత్తు సంఘటనలకు విద్రోహచర్యలకు కారకుడైన యురేనస్  ఖచ్చితమైన డిగ్రీ కేంద్రదృష్టి ఉన్నది. కనుక ఈ కోణాన్ని కాదనలేము. వీరిపైన రాహుచంద్రుల కోణదృష్టి కూడా ఉన్నది. రాహుచంద్రులు కూడా విద్రోహచర్యలను సూచిస్తారు. కనుక ఈ అనుమానానికి బలం ఏర్పడుతున్నది. కానీ రైల్వేమంత్రిగారు మాత్రం, ఇంజన్ లోని భాగాలలో లోపమున్నదని అంటున్నారు. మకరరాశిలో శనిబుధుల డిగ్రీ స్థితి, వాయవ్యదిక్కును సూచిస్తున్నది. కానీ ప్రమాదం జరిగింది ఈశాన్యదిక్కులో. కనుక మకరరాశిని కేంద్రంగా చేసుకున్న ఈ విశ్లేషణ కరెక్ట్ కాకపోవచ్చు.

మరొక్క కోణం నుంచి పరిశీలిద్దాం.  భారతదేశాన్ని సూచించే వృషభరాశి నుంచి చూద్దాం.
  • లగ్నము సూర్యుడూ ఒకే డిగ్రీమీదుంటూ ఈ చక్రంలో సూర్యుని పాత్రను స్పష్టంగా సూచిస్తున్నారు.
  • హోరాధిపతి శుక్రుడయ్యాడు. కనుక ధనుస్సుకు ప్రాముఖ్యత ఏర్పడుతూ ఇదే విశ్లేషణకు కేంద్రమని చూపిస్తున్నది.
  • యాక్సిడెంట్ ను సూచించే అష్టమంలో ఉన్న సూర్యుడికి పాపార్గలం పట్టింది. డిగ్రీ పరంగా సూర్యుడు ఈశాన్యదిక్కును సూచిస్తూ అస్సాం ప్రాంతంలో జరుగబోతున్న యాక్సిడెంట్ ను ఖచ్చితంగా సూచిస్తున్నాడు.
  • నవమంలో ఉన్న శనిబుధులపైన ఉన్న యురేనస్ దృష్టిని బట్టి ఇందులో దూరదేశపు విద్రోహకోణం ఉన్నట్లు, ధనుస్సు నుండి కుటుంబస్థానము కావడంతో ఇంటిదొంగల పాత్ర కూడా ఉందని అనుమానించవలసి వస్తున్నది.
  • సూర్యుడంటే శరీరానికి గుండెకాయ. రైలుకైతే ఇంజన్. కనుక ఇంజన్లో లోపం నిజమే కావచ్చు. అయితే, ఆ లోపం ఏర్పడటానికి కారణమేంటనేది అసలు ప్రశ్న. 
  • అర్గల గ్రహాలను పరిశీలిద్దాం. శనిబుధుల వలన పాతబడిపోయిన వైర్లు, లింకులు, ఇంజన్లోని స్టీలుపార్టులు సూచింపబడుతున్నాయి. వృశ్చికంలోని కుజకేతువుల యుతివల్ల, చేయవలసిన దానికంటే ఎక్కువకాలం పాటు ఓవర్ లోడై పనిచేసిన ఇంజన్ విడిభాగాలు, అవికూడా ఇంజన్లో బయటగా కాకుండా బాగా లోపలగా ఉన్న భాగాలు సూచింపబడుతున్నాయి. ఈ రెండు కారణాలవల్ల, ఇంజన్ లో లోపం ఏర్పడినట్లు కనిపిస్తున్నది.
అలాంటప్పుడు, భారతీయ రైల్వేలలో ఇంజన్లకు జరుగవలసిన మెయింటెనెన్స్ సరిగా జరగడంలేదా? కనీసం ఈ ఇంజన్ కు జరగలేదా? అన్న అనుమానం తలెత్తుతుంది. ఈ అనుమానాన్ని నివృత్తిచేయవలసింది శాఖాపరమైన విచారణ మాత్రమే.

అయితే, విచారణలో ఏమి తేలినప్పటికీ, పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? నష్టపరిహారంగా ఇచ్చిన ఎక్స్ గ్రేషియా, వ్యక్తుల లోటును పూడుస్తుందా? బాధ్యులకు శిక్షలు పడతాయా? లోపభూయిష్టమైన మన వ్యవస్థలో తిరిగి ఇవే తప్పులు జరుగకుండా ఉంటాయా? అన్న ప్రశ్నలు మాత్రం  జవాబులు లేని శేషప్రశ్నలు గానే మిగిలిపోతాయి.
read more " బికనీర్ ఎక్స్ ప్రెస్ ఘోరప్రమాదం - గ్రహాల పాత్ర ఏమిటి? "

13, జనవరి 2022, గురువారం

పంచవటి చిహ్నం

చాలా రోజులనుంచీ పంచవటి చిహ్నాన్ని మా పుస్తకాలమీద మీరు చూస్తున్నారు. ఈమధ్య దానిని మరింత అందంగా తీర్చిదిద్దాము., కానీ దాని వెనుక ఉన్న అర్ధాలు మీకు తెలిసి ఉండక పోవచ్చు. అందుకే ఈ పోస్ట్.

ఈ చిహ్నం చుట్టూ ఆవరించి ఉన్న మూడు వలయాలు త్రిగుణములకు సూచికలు. సత్త్వ, రజో, తమోగుణముల పట్టులోనే ఏ మనిషి జీవితమైనా ఉంటుంది, నడుస్తుంది, ముగుస్తుంది. భూమ్మీద ఉన్న జీవులలో ఎవరూ వీటిని దాటి లేరు.

ఈ వలయాల లోపల పంచభూతములున్నాయి. అవి, పృధివి (నేల), ఆపస్సు (నీరు), తేజస్సు (అగ్ని), వాయువు (గాలి), ఆకాశము (నింగి). ఈ చిత్రంలోని చెట్టుకు ఆధారంగా భూమి ఉంది. పంచవటి అక్షరాలున్న నీలపు ప్రదేశం నీరు. ఆకాశంలో ఉన్న సూర్యకాంతి అగ్ని. ఎగురుతున్న పక్షులు గాలికి సూచికలు. ఆకాశం కనిపిస్తూనే ఉంది. ఈ పంచభూతాలే మనిషి జీవనానికి ఆధారాలు. వీటిలో, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు ఇమిడి ఉన్నాయి. ఈ 20 తత్త్వములూ శరీరస్థాయిలో ఉంటాయి. ఇది మా సాధనామార్గంలో బాహ్యాధారం.

పచ్చని పంచవటి వృక్షం ప్రాణశక్తికి సూచిక. శ్రీ రామకృష్ణుల వారు సాధనలు చేసిన పంచవటి వృక్షానికి ఇది నమూనా. ప్రాణంలోనే మనస్సు ఇమిడిపోయి ఉంటుంది. ప్రాణము మనస్సులు మా సాధనామార్గంలోని అంతరిక ఆధారాలు.

దేహము, ప్రాణము, మనస్సు - ఈ మూడింటినీ మా మార్గంలో నేర్పించబడే అనేక సాధనాప్రక్రియల ద్వారా స్థిరపరచి, శుద్దీకరణ చేసి, ఈశ్వరుని వెలుగును శక్తిని వాటిలో ప్రతిక్షేపించే సాధనలను మేము అనుసరిస్తాము.

వీటినెలా చేస్తాము?

శరీరస్థాయి

ఆసనములు, ఇంకా ఇతర హఠయోగ వ్యాయామములను క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తాము. ఆహారనియమాన్ని పాటిస్తూ, జీవితాన్ని ప్రకృతి సూత్రాలకనుగుణంగా దిద్దుకుంటాము. మా మార్గంలో దేహాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రమూ జరుగదు. 

ప్రాణస్థాయి

తొమ్మిది విధములైన ప్రాణాయామ ప్రక్రియలను అనుసరించడం ద్వారా ప్రాణాన్ని స్థిరపరచి, శుద్దీకరించి, అదుపులోకి తెచ్చుకోవడం ఈ స్థాయిలో జరుగుతుంది. ఈ తొమ్మిది ప్రక్రియలూ, వాటి వాటి కాంబినేషన్లతో కూడి లెక్కలేనన్ని ప్రక్రియలౌతాయి. ఒ మనిషి దేహతత్వాన్ని బట్టి అతనికి మాత్రమే సరిపోయే విధానాలను ఉపదేశించడం జరుగుతుంది. కుండలినీ యోగసాధనలు ఈ స్థాయిలో అంతర్భాగాలుగా ఉంటాయి. 

మానసికస్థాయి

ఈ స్థాయిలో వేదాంత, బౌద్ధ, యోగ, తంత్రమార్గాలకు చెందిన ఎన్నో ధ్యానవిధానాలను అభ్యాసం చేస్తాము. ఇవి కూడా మనిషిని బట్టి మారిపోతూ ఉంటాయి. ఎవరికి సరిపోయే ధ్యానవిధానం వారికి ఉపదేశింపబడుతుంది. అందరినీ ఒకే క్లాసులో కూచోబెట్టడం జరుగదు. వీటివల్ల, మనస్సులోని చేతన, ఉపచేతన, అంతచ్చేతనా స్థాయిలు శుభ్రమై, వెలుగుతో నింపబడతాయి.

వీటిని చేయడం వల్ల ఏం జరుగుతుంది?

ఈ సాధనలవల్ల మనిషి జీవితం మొత్తం మారిపోతుంది. ఎంతో ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని సంతరించుకుంటుంది. ఈ సాధనామార్గం ఎంతో గొప్పదైన తృప్తిని మీకు అందిస్తుంది. ఈ తృప్తి మీకు డబ్బు వల్ల రాదు, విలాసాల వల్ల, పదవుల వల్ల, ఇంకా మిగతా దేనివల్లా రాదు. మీ జీవితంలో మీరెంతో సాధించి ఉండవచ్చు. కానీ ఈ సాధనామార్గంలో నడవడం ద్వారా కలిగే తృప్తితో పోల్చుకుంటే, మీరు సాధించిన లౌకికవిజయాలు ఏ మూలకూ సరిపోవు.

చివరగా ఈ చిహ్నంలో మీరు 'ఓం'కారమును చూడవచ్చు. ప్రాణము, మనస్సులలో నిండిన దైవశక్తికి ఇది సూచిక. పరిమితదృష్టితో చూచినప్పుడు ఇది జీవాత్మ అవుతుంది. అపరిమితమైన దృష్టితో చూచినప్పుడు ఇదే ఓంకారము పరబ్రహ్మమౌతుంది. సగుణబ్రహ్మానికీ (రూపంతో ఉన్న దేవునికి), నిర్గుణబ్రహ్మానికీ (రూపం లేని దేవునికి) ఇదే సూచిక. రకరకాల మతాలు రకరకాల దేవుళ్ళ పేర్లతో పూజిస్తూ ఉన్నది దీనినే.

ఈ సాధనామార్గంలో నడవడం మనిషిని జీవన్ముక్తునిగా, సిద్ధునిగా చేస్తుంది. ఇది సనాతన భారతీయ సాధనా మార్గం. దీనికి వేదోపనిషత్తుల ఆధారమూ, ప్రామాణికతా  ఉన్నాయి. మంత్ర, తంత్ర శాస్త్రముల ఆధారం మా సాధనామార్గానికి ఉన్నది. ఇదే మానవజీవితానికి ఉన్న అసలైన గమ్యం. దీనిని అందుకోలేకపోతే, మీరెన్ని సాధించినప్పటికీ, చివరకు మీ జీవితం ఖచ్చితంగా వృధా అవుతుంది. అసంతృప్తితో ముగుస్తుంది.

మా పుస్తకాలపైనా, మా ఫేస్ బుక్ పేజీలోనూ, వెబ్ సైట్లలోనూ ఇదే చిహ్నాన్ని మీరు చూడబోతున్నారు. మా ఆశ్రమంలో ఎగురబోయే జెండా పైన కూడా ఇదే చిహ్నాన్ని మీరు త్వరలో చూస్తారు. పంచవటి సభ్యుల సాధనావిధానాన్ని, జీవనవిధానాన్ని ఈ చిహ్నం క్లుప్తంగా మీకు విశదపరుస్తుంది.

దీనిని అర్ధం చేసుకోవడం ద్వారా మా మార్గం మొత్తం మీకు సులభంగా అర్ధమౌతుంది.
read more " పంచవటి చిహ్నం "

3, జనవరి 2022, సోమవారం

విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో 'పంచవటి' పుస్తకాలు

విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో 'పంచవటి' పుస్తకాలు లభిస్తున్నాయి. ఈ ఎగ్జిబిషన్ 1 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు ఉంటుంది.

2022 వ సంవత్సరంలో 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' వేస్తున్న అడుగులలో మొదటిది, బుక్ ఎగ్జిబిషన్ లో మా పుస్తకాలను ప్రదర్శించడం. ప్రస్తుతానికి స్టాల్ నంబర్ 103, 104 (భారతీయ గ్రంథమాల) లో మా పుస్తకాలు లభిస్తాయి. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.

బుక్ ఎగ్జిబిషన్ లో మా పుస్తకాల స్టాల్ కోసం చాలామంది మెయిల్స్ ఇస్తున్నారు. అందుకని ఈ ఏడాదికి తాత్కాలికమైన ఈ ఏర్పాటును చేస్తున్నాం. వచ్చే ఏడాదినుంచీ విజయవాడ, హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్లలో ప్రత్యేకంగా మా స్టాల్ ను పెట్టడం జరుగుతుంది. 

గమనించండి !







read more " విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో 'పంచవటి' పుస్తకాలు "

26, డిసెంబర్ 2021, ఆదివారం

మా ఆశ్రమ స్థలమహత్యం

ఉత్సాహభరిత పండుగ రోజులు

24-12-2021 న మా ఆశ్రమస్థలం రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ రోజు మార్గశిర బహుళ పంచమి. పంచమిరోజున పంచవటికి పంచ దొరికింది. ఇది చాలా ప్రాముఖ్యత ఉన్న రోజు.

"పెట్టింది ముహూర్తం కాదు, జరిగినదే ముహూర్తం" అనేది జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కులలో ఒకటి. అదే విధంగా, ఈ సంఘటన కూడా జరిగింది. ఇది నేననుకొని పెట్టిన ముహూర్తం కాదు. ఆ విధంగా అలా కలసి వచ్చింది. ఒక అద్భుతమైన రోజున, మేము ఊహించనిరీతిలో, శరవేగంగా ఈ రిజిస్ట్రేషన్ జరిగిపోయింది.

ఈ రోజు ప్రాముఖ్యతను వినండి మరి.

24-12-1886 న నరేన్,  రాఖాల్,బాబూరామ్, తారక్, శశిభూషణ్, శరత్ మొదలైన యువకులు సన్యాసదీక్షను స్వీకరించి, వివేకానంద, బ్రహ్మానంద, ప్రేమానంద, శివానంద, రామకృష్ణానంద, శారదానంద మొదలైన సన్యాసనామాలను స్వీకరించారు. ఇది బెంగాల్లో అంతపూర్ అనే ఊరిలో జరిగింది. కామార్పుకూరు వెళ్లే దారిలో మేమీ అంతపూర్ అనే ఊరిలో ఆగి ఉపాహారం సేవించాము. అంతపూర్ అనేది ఆ విధంగా ఒక చారిత్రాత్మకమైన ఊరు. అక్కడే రామకృష్ణ మఠానికి పునాది పడింది. 

సరిగ్గా 135 ఏళ్ల తర్వాత అదే డిసెంబర్ 24 తేదీన "పంచవటి ఆశ్రమస్థలం" రిజిస్ట్రేషన్ జరిగింది. మర్నాడు క్రిస్మస్, అది కూడా పవిత్రమైన రోజే. క్రీస్ట్ అంటే మాకేమీ ద్వేషం లేదు. క్రిస్టియన్స్ మనల్ని  ద్వేషిస్తారు గాని, మనకు వాళ్ళన్నా, క్రీస్ట్ అన్నా వ్యతిరేకభావం ఏమీ ఉండదు. మతమార్పిడులు, హిందూదేవతలను తిట్టడాలంటే మనకు గిట్టదు గాని, క్రీస్ట్ యొక్క ఒరిజినల్ బోధనలంటే మనకిష్టమే. ఎందుకంటే, వాటికీ హిందూమతానికీ ఏ భేదమూ లేదు కాబట్టి. పైగా, క్రీస్ట్ కూడా భారతదేశం వచ్చి యోగసాధన చేసినవాడే. ఆయన నేర్చుకున్నదంతా ఇక్కడే నేర్చుకున్నాడు. హిమాలయాలలో బౌద్ధాన్ని నేర్చుకున్నాడు. కనుక ఆయనంటే మాకేమీ ద్వేషం లేదు.

ఇకపోతే, ఈరోజు శారదామాత జన్మదినం. ఇది క్రిస్మస్ కంటే ఇంకా పవిత్రమైన రోజు. ఆమెను సాక్షాత్తు కాళికాదేవిగా, శ్రీ రామకృష్ణులవారే పూజించారు. కనుక, ఇలాంటి పవిత్రమైన రోజులలో మా ఆశ్రమస్థలం రావడం చాలా శుభసూచకమని నా భావన.

కాళీకటాక్షం - శక్తి ఉపాసన

మా ఆశ్రమస్థలం వచ్చిన ఊరి గ్రామదేవత పేరు అంకమ్మతల్లి. అంకమ్మ. అంకాలమ్మ అనేవి  కాళికాదేవి యొక్క గ్రామీణపేర్లు. పల్లెటూర్లలో, అంకమ్మ, అంకయ్య, అంకమ్మరావు మొదలైన పేర్లున్నవారు చాలామంది కనిపిస్తారు. ఈ పేర్లు చాలా మంచివి. శక్తిస్వరూపిణి అయిన కాళికాదేవి పేర్లవి. ఆ పేర్లను పెట్టుకున్న వాళ్ళందరూ జీవితంలో బాగా వృద్ధిలోకి రావడాన్ని నేను గతంలో చాలాసార్లు గమనించాను\. తమిళనాడులో కూడా అమ్మాయిలకు 'అంకి' 'అంకు' అనే పేర్లుంటాయి. అవికూడా అంకమ్మతల్లి పేర్లే.

మన గ్రంధాలలో ఈమెకే "చాముండి" అనే పేరుంది. ఈమెను సప్తమాతృకలలో  ఒకరుగా దేవీభాగవతం వర్ణించింది. ఈమెకే మరోపేరు మహిషాసురమర్దిని. విజయవాడలోని దుర్గమ్మతల్లి మూలవిగ్రహం మహిషాసురమర్దినీ రూపంలోనే ఉంటుంది. మైసూరు చాముండీహిల్స్ లో ఉన్న అమ్మవారు ఈమెయే. అమ్మతల్లులుగా మన దేశంలోని పల్లెపట్టులలో పూజించబడేవారు నిజానికి సప్తమాతృకలే. వీరిలో కాళి, చాముండిల గ్రామీణనామమే అంకమ్మతల్లి. ఆ ఊరిలో ప్రవేశిస్తున్నపుడే, అంకమ్మతల్లి గుడి కనిపించింది. చాలా ఆనందం కలిగింది. ఈ విధంగా, ఆశ్రమస్థలంకోసం ఎక్కడెక్కడో తిరిగి, చివరకు మా ఆరాధ్యదేవత కాళికాదేవి పాదాలచెంతకే చేరాం మేము.

తాంత్రికబౌద్ధం

ఏడవ శతాబ్ద సమయంలో  తాంత్రికబౌద్ధం పరిఢవిల్లిన కాలంలో ధరణికోట మొదలైన బౌద్ధక్షేత్రాలు  తాంత్రికబౌద్ధానికి పట్టుకొమ్మలుగా ఉన్నాయి. చైనా వాడైన హ్యూయన్ సాంగ్ కూడా, ప్రాణాలకు తెగించి, మంచుకొండలలో ప్రయాణించి, చైనానుండి ఆంధ్రాలో ఉన్న ధరణికోటకొచ్చి ఆయా మంత్రసాధనలు నేర్చుకుని వెళ్ళాడు.

తాంత్రికబౌద్ధంలో తారాదేవి, మరీచి, లలిత, ఛిన్నముండ మొదలైన దేవతలున్నారు. వీరందరూ కాళికాదేవికి మారురూపాలే. ఈ ప్రభావంతోనే, దక్షిణాదిన పల్లెలలో అమ్మ తల్లులు వెలిశారు. ఆ విధంగా మలి వేదకాలపు శక్తి ఆరాధన, కాలగమనంలో కనుమరుగై, బౌద్ధతంత్రాలలో మళ్ళీ మొలకలెత్తి, మధ్యయుగాలలో పునరుజ్జీవింపబడిన హిందూమతంలో  రకరకాల దేవీరూపాలుగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ విషయాలు సామాన్యజనానికి తెలియవు. సామాన్యులకే కాదు, హిందువులమని చెప్పుకునే కోట్లాదిమందికి కూడా, హిందూమతం యొక్క పరిణామక్రమమూ, పతనోధ్ధానాలూ  ఏవీ తెలియవు. గుడికెళ్ళి మొక్కుకోవడం తప్ప వారికేమీ తెలియదు. వారికి వారి మతం యొక్క గొప్పదనం తెలిదు కాబట్టే, మతమార్పిడులు జరుగుతున్నాయి. అమాయక హిందువులు, ఎవరేది చెబితే వాటిని నమ్ముతున్నారు. మతాలు మారుతున్నారు. ఇదొక చేదువాస్తవం.

సరే, ఆ విషయాలనలా ఉంచితే, అప్పట్లో ఒంగోలు ప్రాంతమంతా తాంత్రికబౌద్ధం విలసిల్లింది. నేటికీ ఒంగోలు సిటీకి అధిదేవత రాజరాజేశ్వరీదేవియే. అంటే, లలితాదేవి.  నేను వ్రాసిన 'లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక' పుస్తకాన్ని చదివినవారికి, లలితోపాసనా, శక్తి ఆరాధనా రహస్యాలూ, ఆచరణపరంగా కాకపోయినా, కనీసం బౌద్ధికంగా నైనా అర్ధమై ఉంటాయని ఆశిస్తున్నాను.

అదే ఒంగోలు దగ్గరకు, అవే పల్లెటూర్లకు ఇప్పుడు మేమొచ్చి చేరాము. మా ఆశ్రమం ఇక్కడే వస్తున్నది. బయటకు కనిపించని కర్మలింకులు  ఆ విధంగా ఉంటాయి మరి !

బుద్ధునితో నా అనుబంధం

బుద్ధునితో నాకున్న అనుబంధం గురించి 'మ్యూజింగ్స్', 'వెలుగు దారులు' పుస్తకాలలో వ్రాశాను. ఆ అనుబంధం ఇప్పటిది కాదు. అనేక వందల సంవత్సరాల క్రిందటిది. అదే లేకపోతే, "ధమ్మపదం", "మహాస్మృతిప్రస్థానం" అనే నా పుస్తకాలు వెలుగు చూచేవి కావు. అవేకాదు, ముందుముందు ఇంకా ఎన్నో బౌద్ధగ్రంధాలు నా కలం నుండి వెలుగుచూడబోతున్నాయి. 

రెండువేల సంవత్సరాల క్రితం కృష్ణాతీరమంతటా బౌద్ధం విలసిల్లింది. దీనికి తార్కాణంగా కృష్ణానదీ పరీవాహకప్రాంతమంతటా ఉన్న బౌద్ధారామాలు, స్థూపాల శిధిలాలే  నిదర్శనాలు. కృష్ణానదికి ఒక చిన్న పాయలాంటిదైన గుండ్లకమ్మ వాగు తీరమంతటా ఒకప్పుడు బౌద్ధం విలసిల్లింది.

మా ఆశ్రమస్థలం దగ్గర్లో అంటే, రెండు కిలోమీటర్ల దూరంలోనే, వెల్లంపల్లి అనే  ఊరుంది. ఇక్కడ గుండ్లకమ్మ రిజర్వాయర్ ఉంది. ఈ రిజర్వాయర్ దగ్గరనే, 1962 లో జరిగిన త్రవ్వకాలలో ఒక బౌద్ధస్థూపం బయటపడింది. ఇది సాంచీ స్థూపాన్ని పోలి ఉంటుంది. అమరావతి కంటే ఇది ప్రాచీనమైనదని అంటున్నారు.  ఇక్కడనుండి దొనకొండ దగ్గరలో ఉన్న చందవరం బౌద్ధస్థూపానికి దారి ఉంది. ఇవి రెండూ, ప్రాచీనకాలంలో, అంటే రెండువేల ఏళ్ల నాడు, కాశీ, కంచిల మధ్యన ప్రయాణించే పండితులకు విడిది కేంద్రాలుగా ఉండేవి. ఈ రెండు నగరాలూ  ప్రాచీనకాలంలో విద్యా, ఆధ్యాత్మిక కేంద్రాలన్నది మనకు తెలిసినదే కదా !

కనుక, వెల్లంపల్లి బౌద్ధస్తూపం ప్రక్కనే నేడు మా ఆశ్రమం వస్తున్నది. దీని వెనుక కూడా కర్మలింకులు , పూర్వజన్మ సంబంధాలు ఉన్నాయి. వివరించినా, వాటిని అర్ధం చేసుకునే స్థాయి, పాఠకులలో లేనందువల్ల, వాటిని ఇక్కడ వ్రాయడం లేదు. పైగా అటువంటి రహస్యాలను బాహాటంగా చెప్పడం సరి కూడా కాదు. మా ఆశ్రమంలో స్పిరిట్యువల్ రిట్రీట్స్ జరిగినప్పుడు మా శిష్యులకు మాత్రమే వాటిని వివరించి చెప్పడం జరుగుతుంది. వాళ్ళే వాటిని సరియైన రీతిలో అర్ధం చేసుకోగలుగుతారు.

నేను వ్రాసిన మొదటి పుస్తకాలలో ముఖ్యమైనది "తారాస్తోత్రం". ఇది భవతారిణి కాళికాదేవి మీద నేను వ్రాసిన  గొప్ప తంత్రగ్రంథం. రాశిలో చిన్నదేగాని వాసిలో చాలా పెద్దది. తంత్రసాధనలో నాకున్న అనుభవమేంటో తంత్రప్రధానమైన నా పుస్తకాలను చదివినవారు, కొంతకాకపోతే కొంతైనా గ్రహించగలరని భావిస్తాను.

ఈ విధంగా మా  ఆశ్రమస్థలానికి - బౌద్ధమతంతోనూ, శక్తి ఉపాసనతోనూ సూటి సంబంధాలున్నాయి.  అలాంటి ప్రాచీనస్థలం లోనే మా ఆశ్రమం సాకారమౌతున్నది. అవే సాధనలు మళ్ళీ మా ఆశ్రమంలో జరుగబోతున్నాయి. చరిత్ర పునరావృతం కాబోతున్నది.

ఒక స్థలంలో మనం ఉండాలంటే, ఆ స్థలానికి మనకూ కర్మసంబంధాలుండాలి. ఒకచోట తిండి మనం తిని,  అక్కడి నీరు త్రాగాలంటే ఆ స్థలానికి మనకూ ఋణానుబంధం ఉండాలి.  అలాంటిదే ఈ ఆశ్రమస్థలం. మామూలు కళ్ళతో చూచేవారికి ఈ సంబంధాలు అర్ధం కావు. అవి అర్ధం కావాలంటే ఉండవలసిన దృష్టి వేరు. అదున్నపుడు, ఆ లింకులన్నీ స్పష్టంగా అర్ధమౌతాయి.

మా ఆశ్రమం గురించిన మరిన్ని వివరాలను ముందు ముందు పోస్టులలో చూడండి !
read more " మా ఆశ్రమ స్థలమహత్యం "

ఆశ్రమ స్థల సందర్శన ఫోటోలు



















read more " ఆశ్రమ స్థల సందర్శన ఫోటోలు "

24, డిసెంబర్ 2021, శుక్రవారం

ఆశ్రమస్థలాన్ని సేకరించాం !




మీకందరికీ ఒక శుభవార్త !

పదేళ్లక్రితం నేను చెప్పిన మాట నేడు నిజమైంది. దాదాపుగా ఏడాది నుంచీ మేము చేస్తున్న ప్రయత్నం నేటికి సఫలమైంది. మా మొదటి ఆశ్రమస్థలం వచ్చేసింది ! ఎక్కడో మారుమూల అడవిలో కాదు. ప్రకాశం జిల్లాకేంద్రమైన ఒంగోలు సిటీకి దగ్గరగా !

కలకత్తా - చెన్నై హైవే కు జస్ట్ పది కిలోమీటర్ల దూరంలో, ఒంగోలు పట్టణానికీ, మేదరమెట్ల అనే ఊరికీ చాలా దగ్గరలో, అంటే జస్ట్ అరగంట ప్రయాణదూరంలో, ప్రశాంతమైన పల్లెటూరి పొలాల మధ్యలో, ఐదెకరాల స్థలాన్ని కొనడమూ, రిజిస్ట్రేషన్ చేయించడమూ  జరిగిపోయాయి.        

ఈ రోజున ఆశ్రమస్థలం రిజిస్ట్రేషన్ జరిగింది.

మా మొదటి ఆశ్రమం సాకారం కాబోతున్న ఈ స్థలం,

  • హైదరాబాద్ నుండి రావాలంటే, నార్కట్ పల్లి, అద్దంకి హైవే మీదుగా, 5 గంటల కారు ప్రయాణ దూరంలోను,
  • గన్నవరం (విజయవాడ) ఎయిర్ పోర్ట్ నుండి రెండున్నర గంటల ప్రయాణ దూరంలోను, - 
  • గుంటూరు నుండి - NH 16 మీద గంటన్నర దూరంలోను,
  • చిలకలూరిపేట నుండి NH 16 మీద ఒక గంట ప్రయాణదూరంలోను,
  • మా జిల్లెళ్ళమూడి ఆశ్రమం నుండి - బాపట్ల చీరాలల మీదుగా గంటన్నర ప్రయాణ దూరంలోను,
  • చెన్నై నుండి NH 16 మీదుగా, అయిదున్నర గంటల ప్రయాణ దూరం లోను,
  • బెంగుళూరు నుండి, 9 గంటల ప్రయాణంలోను,
  • తిరుపతి నుండి అయిదున్నర గంటల ప్రయాణ దూరంలోను,
  • ఒంగోలు సిటీ నుండి కేవలం అరగంట దూరంలోను, 
  • దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరికి ఒకటిన్నర కి. మీ దూరంలోను, రెండో వైపున్న పల్లెటూరికి 2 కిమీ దూరంలోను ఉన్నది.
  • గుండ్లకమ్మ రిజర్వాయర్ కు కేవలం 25 నిముషాల దూరంలో ఉన్నది.
నిజానికి, ఆశ్రమస్థలం కోసం మా ప్రయత్నం, అయిదేళ్ల క్రితమే మొదలైంది. అప్పట్లో, హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉందామన్న ప్రయత్నంతో, వికారాబాద్ పరిసర ప్రాంతాలలోను, శ్రీశైలం రూట్ లోను పొలాల కోసం వెదకడం జరిగింది. నా శిష్యులందరూ వీకెండ్స్ లో కార్లేసుకుని తెగ తిరిగారు. కొన్ని కారణాల వల్ల, అప్పట్లో మా ప్రయత్నాలు సఫలం కాలేదు. శ్రీశైలంలో కూడా ప్రయత్నం చేశాము. బురదతో నల్లబడి పోయి ఉన్న లోకంలో, ఒక స్వచ్ఛమైన ప్రయత్నం ఎలా సఫలమౌతుంది? ఎక్కడ చూచినా రాజకీయాలే, పైరవీలే, కులాలే, అవినీతే. చివరకు విసుగొచ్చి, తాత్కాలికంగా, జిల్లెళ్ళమూడిలో ఒక ఇంటిని కొనుగోలు చేయడం జరిగింది. అది ప్రస్తుతం, మా సభ్యుల సాధనామందిరంగా ఉపయోగపడుతున్నది. పంచవటి సభ్యులు ఎవరైనా అక్కడికెళ్లి, ఎన్నాళ్లయినా ఉంటూ, ప్రశాంతంగా సాధన చేసుకునే వీలును కల్పిస్తున్నది.

అంతమాత్రం చేత, మాదైన స్వంత ఆశ్రమం కోసం  మా సంకల్పమూ, మా ప్రయత్నమూ ఆగిపోలేదు. గత ఏడాదిగా మళ్ళీ ముమ్మరంగా వెదుకులాటను సాగించాము. తెలంగాణా, ఆఁధ్రాలలో ఎన్నోచోట్ల ప్రయత్నించినప్పటికీ, ప్రతిచోటా విశ్వరూపం దాల్చిన రియల్ ఎస్టేట్ దందాల వల్ల, ఒక మంచి ఉద్దేశ్యంతో మొదలుపెట్టాలనుకున్న మా ఆశ్రమానికి స్థలసేకరణ గగనమై కూచుంది. కానీ చివరకు, నా జన్మస్థలమైన ప్రకాశంజిల్లాలోనే ఇది సాకారమైంది. చీకటిశక్తులు ఎంతగా ఆపాలని చూచినా, వెలుగు ఆగదు కదా !

నేను పుట్టినది ప్రకాశం జిల్లాలోనే. పెరిగినది గుంటూరు జిల్లాలో, ఉద్యోగం వెలగబెట్టినది రాయలసీమలో మరియు గుంటూరులో, చివరకు రిటైర్ అవుతున్నది హైదరాబాద్ లో. కానీ పుట్టిన గడ్డ ప్రకాశంజిల్లాలోనే, మా మొదటి స్వతంత్ర ఆశ్రమం సాకారమైంది. స్వతంత్ర ఆశ్రమం అని ఎందుకంటున్నానంటే, జిల్లెళ్ళమూడిలో మాకొక ఇల్లున్నప్పటికీ, అది అమ్మ ఊరు, అమ్మ ఆశ్రమం. ఇప్పుడు ఒంగోలు దగ్గర వస్తున్నది మాదైన ఆశ్రమం.

తెలిసినవాళ్ళూ, ప్రక్కనున్న పల్లెటూర్లలోని వాళ్ళూ అందరూ అడుగుతున్నారు.  'ఆశ్రమమంటే ఎలా ఉంటుంది? గుడీ, బడీ, ఆస్పత్రీ, పూజలూ, పండుగలూ, పబ్బాలూ, దీక్షలూ, తిరణాలలూ, కొలుపులూ ఉంటాయా?' అని. వారందరికీ ఒకటే సమాధానం.  మా ఆశ్రమంలో ఇవేవీ ఉండవు. నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది.

మా ఆశ్రమం, మీరు చూస్తున్న వ్యాపార ఆశ్రమాలలాగా ఉండదు. నిజమైన ఆశ్రమంలా ఉంటుంది. కృత్రిమత్వమూ, రాజకీయాలూ, డబ్బు కోసం కొట్లాటలూ, పలుకుబడి కోసం పరుగులూ, అవినీతి డబ్బులూ, రాజకీయులతో సంబంధాలూ, గుళ్ళు కట్టి దేవుడి విగ్రహాలు పెట్టి వ్యాపారం  చెయ్యడాలూ, దీక్షలనీ, హోమాలనీ, ప్రత్యేకపూజలనీ నాటకాలాడటాలూ, ఇంకా అలాంటి చిల్లరపనులూ, కక్కుర్తిపనులూ భూతద్దంతో వెతికినా మీకిక్కడ కనిపించవు.
  • మాది గ్రీన్ ఆశ్రమం.  అంటే, కాంక్రీట్ బిల్డింగ్స్ ఉండవు. కుటీరాలే  ఉంటాయి. 
  • మా మట్టితో మేమే ఇటుకలను చేసుకుని, ఇనుము వాడకుండా, సిమెంట్ వాడకుండా, ప్లాస్టిక్ వాడకుండా, సాధ్యమైనంతగా ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ తో, మా కుటీరాలను మేమే కట్టుకుంటాం.
  • ప్లానింగ్, డిజైనింగ్, ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ అంతా సాధ్యమైనంత వరకూ మేమే చేసుకుంటాం.
  • చెక్క వాడకాన్ని కూడా సాధ్యమైనంత తగ్గించి, వెదురు కర్రలను, బద్దలను, కుటీరాల నిర్మాణంలో వాడబోతున్నాం.
  • కుటీరాలలో, మంచాలు, కుర్చీలు, టేబుల్స్ మొదలైన అనవసర వస్తువులు  లేకుండా, మట్టిఅరుగులు కట్టుకుని వాటినే మంచాలుగా, కుర్చీలుగా వాడుతాం.
  • AC లు వాడకుండా, కుటీరాల ఎత్తును సరిగ్గా డిజైన్ చేయడంతో, క్రాస్ వెంటిలేషన్ ప్రక్రియతో, కుటీరాల లోపలి వాతావరణం చల్లగా ఉండేలాగా   ప్లాన్ చేస్తాం.
  • కుటీరాలను రెండు అంతస్తులతో, డుప్లెక్స్ ఇళ్ళలాగా నిర్మించి, వెదురు కర్రల మెట్లు, వెదురు కర్రలతో ఫస్ట్ ఫ్లోర్ డిజైన్ చేస్తాం.
  • ఆశ్రమంలో ఏ మూల నుంచి చూచినా పచ్చనిచెట్లు, పండ్లచెట్లు, కూరగాయల, పూలమొక్కలు కనిపించేలా, కళ్ళకు మనసుకు ఆహ్లాదకరంగా ఉండేలా డిజైన్ చేస్తాం.
  • భూసంరక్షణ, జలసంరక్షణ చేస్తూ, సోలార్ విద్యుత్తును వాడుతూ ప్రకృతితో మమేకమై, శబ్దకాలుష్యానికి దూరంగా  బ్రతుకుతాం.
  • పదీ ఇరవైసెంట్ల విస్తీర్ణంలో 15 అడుగుల లోతులో పెద్దగొయ్యిని తవ్వి, వాననీటిని అందులో నిలువ చేయడం ద్వారా, ఆశ్రమంలో ఒక కొలనును నిర్మిస్తాం. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు ఈ నీటిని వాడుతాం.
  • ఆరుబయట వేపచెట్లక్రింద ఎక్కువసేపు ఉంటూ, అక్కడే భోజనాలు చేస్తూ, అక్కడే నులకమంచాలు వేసుకుని పడుకుంటూ, పూలమొక్కలను, పండ్ల చెట్లను, కూరగాయల మొక్కలను  పెంచుకుంటూ, నేలసాగు చేసుకుంటూ ఉంటాం.
  • స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, యోగాభ్యాసమూ, మావైన మంత్ర సాధనలూ, ధ్యానసాధనలూ, మార్షల్ ఆర్ట్స్ అభ్యాసాలూ చేసుకుంటూ, సహజమైన సాత్వికాహారం తింటూ, నిరాడంబరములైన ఆనందపు జీవితాలను గడపబోతున్నాం.
క్రొత్త సంవత్సరంలో, పాండిచ్చేరి లోని ఆరోవిల్ కు వెళ్లి, రెండు వారాలక్కడ ఉండి,  అక్కడ విదేశీయులు స్వదేశీ దేశవాళీ ప్రకృతి జీవితాలను ఎలా గడుపుతున్నారో అధ్యయనం చేసి, అవే పద్ధతులను మా ఆశ్రమంలో అమలు చేయబోతున్నాం.

మా ఆశ్రమంలో కులమతాలకు విలువ లేదు. డబ్బుకు, అహంభావానికి, కపటానికీ, మోసానికి చోటు లేదు. స్వచ్ఛమైన మనసులూ, ప్రకృతితో మమేకమయ్యే జీవితాలూ, కుళ్ళూ కుత్సితాలకు అతీతంగా, ప్రేమించే హృదయాలతో, చిన్నపిల్లల్లాంటి మనస్తత్వాలతో, నిజమైన ఆనందాన్ని ఆస్వాదిస్తూ, అతి నిరాడంబరంగా జీవితం గడిపే వాళ్లకే మా ఆశ్రమం స్వాగతం పలుకుతుంది.

నేనిన్నాళ్ళూ ఏదైతే నా ఉపన్యాసాలలో చెబుతున్నానో, ఏదైతే నా బ్లాగ్ లోనూ, పుస్తకాల లోనూ వ్రాస్తున్నానో, అదంతా మా ఆశ్రమంలో ప్రాక్టికల్ గా సాకారం కాబోతోంది. అసలైన యోగసాధన, అసలైన ధ్యానసాధన, అసలైన తంత్రసాధన మా ఆశ్రమంలో  జరుగుతుంది.

ఇక్కడ టీవీలుండవు, న్యూస్ పేపర్ల వాసన సోకదు. మొబైల్ వాడకం, రోజు మొత్తంమీద ఒక గంట కంటే ఎక్కువసేపు ఒప్పుకోము. పోసుకోలు మాటలుండవు, సినిమాలూ రాజకీయాలూ వంటి చెత్తకబుర్లు వినపడనే వినపడవు. కన్స్యూమరిజం మా ఆశ్రమానికి ఆమడదూరంలో ఉంటుంది. వ్యాపారభక్తీ, కుహనా ఆధ్యాత్మికతల నీడలు కూడా మా ఆశ్రమానికి సోకవు.

"ఈ రకంగా, నేచురల్ లివింగ్ ను అనుసరిస్తూ చాలామంది ఇప్పుడు ఫార్మ్ హౌసులు కట్టుకుని ఉంటున్నారు కదా? వాటికీ మీకూ తేడా ఏమిటి?", అని అనుమానం వచ్చిందా మీకు? చెప్తా వినండి.

ఫామ్ హౌస్ ఊరికి దూరంగా ఉంటుంది నిజమే. అక్కడ మొక్కలుంటాయి, చెట్లుంటాయి, ప్రకృతిజీవనం ఉంటుంది. ఇదంతా నిజమే. కానీ అక్కడుండే మనుషులు ఎలా బ్రతుకుతారు? జీవితంలో వారికేమీ ఉన్నతమైన ఆదర్శాలు ఉండవు. సిటీలో బ్రతికినట్లే అక్కడా బ్రతుకుతారు. అదే టీవీ, అదే మొబైల్, అదే వాగుడు, అదే త్రాగుడు, అదే తిండి, అవే కోపతాపాలు, అవే అసూయాద్వేషాలు, అవే అహంకారాలు, అవే తాపత్రయాలు, అదే డబ్బుయావ, అవే పైరవీలు, అదే చెత్తమైండ్,  అదే చెత్త లైఫ్ స్టైల్. కాకపోతే సిటీ లైఫ్ కి దూరంగా ఉంటారంతే, దానివల్ల ఏమిటి ఉపయోగం? ఏమీ లేదని నేనంటాను.

క్రొత్తసీసాలో పాతసారా. అంతే ! బయటి సీసా నిస్సందేహంగా క్రొత్తదే. కానీ లోపలున్నది మాత్రం కంపు కొడుతున్న పాతసారాయే. బైటకు నేచురలే. లోపల మాత్రం అంతా అన్ నాచురల్. ఎందుకది? అలాంటి సూడో లైఫ్ వల్ల ఉపయోగమేంటి? అలాంటి జీవితం గడపడానికి ఫామ్ హౌస్ అయితే ఏంటి? సిటీలో ఉంటే ఏంటి? ఎక్కడైనా ఒకటే. మా ఆలోచన అది కాదు.

మా ఆశ్రమంలో మేం ప్లాన్ చేస్తున్న ప్రకృతి ఆధారిత జీవనం, దానికదే ఒక పరమావధి కాదు. ఉన్నతమైన జీవితానికి అదొక ఆసరా మాత్రమే. ఇక్కడ పునాదిగా అంతరిక సాధనామయమైన జీవితం ఉంటుంది . బయటనుంచి నేచురల్ లైఫ్ దానికి తోడౌతుంది. అదే మాకూ, మిగతా వారికి తేడా !

నన్ననుసరించే ఇండియా శిష్యులకూ, అమెరికా శిష్యులకూ ఈ ఆశ్రమం సొంతిల్లు కాబోతోంది. వారిలో కొంతమంది, అమెరికాను వదలిపెట్టి ఇక్కడికొచ్చి సెటిల్ కావడానికి ప్లాన్ చేస్తున్నారు. 40 ఏళ్లపాటు, లోకానికీ బయటివారికీ ఏమాత్రం తెలియకుండా, లోకం మధ్యలోనే ఉంటూ చేసిన సాధనద్వారా నేను అవగతం చేసుకున్న అనేక సాధనా రహస్యాలను వారికి నేర్పించి, రహస్య యోగసాధనా క్రమంలో వారిని చెయ్యి పట్టి నడిపించబోతున్నాను

ప్రతి రెండు మూడు నెలలకు ఆశ్రమంలో జరిగే స్పిరిట్యువల్ రిట్రీట్స్ లో, శాంతినికేతన్ తరహాలో, చెట్ల క్రింద తరగతులు పెట్టి, యోగం, రకరకాల ధ్యానవిధానాలు, జ్యోతిష్య శాస్త్రం, హోమియోపతి విజ్ఞానం, తంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, మార్షల్ ఆర్ట్స్ లను నా శిష్యులకు ప్రాక్టికల్ గా నేర్పించబోతున్నాను. ఇన్నేళ్ళుగా నమ్మకంగా నన్ననుసరిస్తున్న వారిని, నా సాధనామార్గంలో నడిపించి,  ఆయావిద్యలలో వారిని ఉద్దండులను చేయబోతున్నాను. అసలైన జీవితమంటే ఏమిటో వారికి రుచి చూపించబోతున్నాను.

2022 నుంచి పంచవటి చరిత్రలో నూతనాధ్యాయం మొదలు కాబోతున్నది. ఒక ఆధ్యాత్మిక మౌనవిప్లవం ఆంధ్రప్రదేశ్ లో సాకారం కాబోతున్నది. అక్కడనుంచి ఇది ప్రపంచవ్యాప్తమౌతుంది. 2022 లో ఇది జరుగుతుందని, పదేళ్లక్రితం పంచవటి సభ్యులతో, నా శిష్యులతో అన్నాను. వారిలో కొందరు నన్ను నమ్మారు, కొందరు నమ్మలేదు. కొందరు ఎగతాళి చేశారు. కొందరు చాటుగా నవ్వుకున్నారు. కొందరు బాహాటంగా విమర్శించారు. నా దారి నచ్చని  కొంతమంది నన్ను వదలి వెళ్లిపోయారు. నచ్చిన చాలామంది నన్నంటిపెట్టుకుని నాతోనే ఉన్నారు. నేను వేటినీ పట్టించు కోలేదు. నా దారిలో నేను నడుస్తున్నాను. నాతో నడిచేవాళ్ళను నడిపిస్తున్నాను.

అయితే, ఇప్పటివరకూ, మా కుటుంబసభ్యులకు తప్ప ఎవరికీ తెలియని ఒక విషయాన్ని ఇప్పుడు చెబుతా వినండి. ఇది జరుగుతుందని నలభై ఏళ్ళక్రితం, అంటే, 1980 లోనే, మా కజిన్స్ తో, మా బంధువులతో అన్నాను. ముందుముందు నా శిష్యులొస్తారని, ఆశ్రమం వస్తుందని, మేమంతా అందులో ఉంటామని, సాధనామయములైన జీవితాన్ని గడుపుతామని అన్నాను. అప్పట్లో వాళ్ళు కూడా నా మాటలను  నమ్మలేదు. లేతవయసు ఉడుకు  రక్తంలో ఏదేదో వాగుతున్నానని అనుకున్నారు. ఎగతాళిగా నవ్వారు.  40 ఏళ్ల తర్వాత, నేడు నా మాటలు నిజమౌతున్నాయి. ఇప్పుడు నేను చెబుతున్న మాటలు కూడా ముందు ముందు నిజాలు కావడం  మీరు చూస్తారు.

ఈ ప్రయాణంలో నాతో నడుస్తున్నవారు నిజంగా అదృష్టవంతులు. ఈ పనిలో  పాలు పంచుకుంటున్నవారు ధన్యజీవులు. వారి జీవితాలు సార్ధకాలౌతాయి. ఆధ్యాత్మిక లోకంలో ఉత్త మాటలను చాలామంది చెబుతారు, కానీ, నా దారిలో నాతో కలసి  నడిచేవారు, ఫలితాలను వారి కళ్ళతో చూస్తారు. ఫలాలను వారి చేతులతో అందుకుంటారు.

మా ఆశ్రమ పురోగతిని ఎప్పటికప్పుడు, నా బ్లాగ్ లో, మా వెబ్ సైట్స్ లో, మా యూ ట్యూబ్ చానల్స్ లో ఇకనుంచీ వీక్షించండి మరి !

read more " ఆశ్రమస్థలాన్ని సేకరించాం ! "

19, డిసెంబర్ 2021, ఆదివారం

'శ్రీ మాలినీ విజయోత్తర తంత్రము' ఈ బుక్ విడుదలైంది



'పంచవటి పబ్లికేషన్స్' నుండి మా సరిక్రొత్త పుస్తకం, 'శ్రీ మాలినీ  విజయోత్తర తంత్రము' 'ఈ బుక్' రూపంలో నేడు విడుదలైంది. దీనిలో 23 అధ్యాయములు, 1275 శ్లోకములు ఉన్నాయి. నా వివరణతో కూడిన ఈ పుస్తకం 408 పేజీలను కలిగి ఉన్నది.

ఈ పుస్తకాన్ని గురించి కొద్ది మాటలలో చెప్పడం చాలా కష్టం. ప్రాచీనమైన సిద్ధయోగీశ్వరీ మతమును, దాని రహస్య తంత్రసాధనా మార్గాలను వివరించే ఈ గ్రంధం శివాగమము (శైవ తంత్రము) లలో ఒకటి.

కాశ్మీరశైవం గురించి తెలిసినవారికి అభినవగుప్తాచార్యులవారు సుపరిచితులే. ఈయన 10 వ శతాబ్దంలో కాశ్మీర్ లో నివసించారు. ఆది శంకరాచార్యుల వారితో సమానమైన మేధాసంపత్తి, తపశ్శక్తులను కలిగిన మహనీయుడాయన. ఆయన వ్రాసిన అనేక గ్రంధాలలో 'తంత్రాలోకము', 'తంత్రసారము'  అనేవి నేటికీ ప్రపంచస్థాయిలో అత్యుత్తమ శైవతంత్ర గ్రంధములుగా చూడబడుతున్నాయి. ఎంతోమంది యూరోపియనులు, అమెరికన్లు ఈ గ్రంధాలను చదివి, శివభక్తులుగా మారి, కాశ్మీరశైవాన్ని అనుసరిస్తున్నారు. అలాంటి శక్తివంతములైన గ్రంధాలవి.

తాను ఈ రెండు గ్రంధములనూ వ్రాయడానికి ప్రేరణ 'మాలినీ విజయోత్తర తంత్రము' అనే ప్రాచీన గ్రంథమని  అభినవగుప్తులవారు చెప్పినారు. మన అదృష్టవశాత్తూ ఈ గ్రంధము నేటికీ బ్రతికి ఉన్నది. సంస్కృతంలో మనకు లభిస్తున్నది. శివాద్వైతము, పరమేశ్వరాద్వైతము అనబడే శైవతంత్రము యొక్క సిద్ధాంతమును ఎంతో చక్కగా వివరించడమేగాక, ఎన్నో ప్రాణాయామ, ధారణావిధానములను, ధ్యానసాధనా రహస్యాలను సులభమైన భాషలో వివరించింది ఈ గ్రంధం. 'విజ్ఞానభైరవ తంత్రం' లో చెప్పబడిన 112 ధ్యాన విధానములకు 'మాలినీ విజయోత్తర తంత్ర'మే  మాతృక.

షడధ్వములనబడే వర్ణ, మంత్ర, పద, కళా, తత్త్వ, భువనముల వివరము, వాటి ధ్యానవిధానములు ఈ గ్రంధపు ప్రత్యేకతలు. లలితా సహస్రనామములను  పారాయణ చేసేవారికి 'షడధ్వాతీత రూపిణీ' అనే నామం సుపరిచితమే కదా ! ఈ షడధ్వములే శైవతంత్రము యొక్క సాధనలు.

శైవసిద్ధాంతములో చెప్పబడిన పృధివి నుండి శివతత్త్వము వరకూ గల ముప్పై ఆరు తత్త్వముల పైన చేయవలసిన అనేక ధ్యానములతో బాటు, అమానుష సిద్ధుల సాధన, ఇంకా, స్వప్నసిద్ధి, వాక్సిద్ధి, పరకాయప్రవేశ సాధన, గ్రామార్వణ సాధన, ఛాయాపురుష సాధన, లోకాకర్షక సాధన, రోగనిర్మూలనా సాధన, ఉచ్చాటనాది కామ్యప్రయోగములలో ఈ తంత్రమును ఏవిధంగా ఉపయోగించాలి? మొదలైన చిన్న చిన్న సాధనల వివరం కూడా దీనిలో ఇవ్వబడింది.

మా సంస్థనుండి, నా వివరణతో వస్తున్న మరొక్క అతి విలువైన, ప్రాచీనమైన తంత్రగ్రంధం ఇది. నేను అనుసరించిన, అనుసరిస్తున్న, బోధిస్తున్న మార్గంలోని సాధనలలో చాలావరకూ ఈ తంత్రంలో మీకు లభిస్తాయి. తంత్రసాధకులకు ఈ గ్రంధం ఒక అమూల్యమైన నిధి లాంటిదని చెప్పడం  అతిశయోక్తి కాబోదు.

ఈ పుస్తకాన్ని వ్రాయడంలో అనుక్షణం నాకు తోడుగా నిలచిన నా శ్రీమతి సరళాదేవికి, సంస్కృత శ్లోకములను  తెలుగులో వ్రాయడం, ప్రూఫ్ రీడింగ్,  టైప్ సెట్టింగ్ మొదలైన పనులను ఎంతో ఓపికగా చేస్తూ, ఈ పుస్తకం వెలుగు చూడటానికి నాతో బాటు కలసి నిరంతరం పనిచేసిన నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీ లలిత లకు, కవర్ పేజీ డిజైన్ చేసిన నా శిష్యుడు ప్రవీణ్ కు, పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ సభ్యులందరికీ ఆశీస్సులు, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకం కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది.

read more " 'శ్రీ మాలినీ విజయోత్తర తంత్రము' ఈ బుక్ విడుదలైంది "

13, డిసెంబర్ 2021, సోమవారం

యుగపురుషుడు నరేంద్ర మోడీ

13-12-2021 మార్గశిర శుక్ల దశమి సోమవారం - భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు.  ఎందుకంటే, వెయ్యేళ్ళుగా కాశీ విశ్వనాధుని భవ్య మందిరానికి పట్టిన దురవస్థ నేటితో తీరిపోయింది కాబట్టి.

కాలగమనంలో పనికిరాని మనుషులు కోట్లకొద్దీ పురుగులలాగా పుట్టి పోతూ ఉంటారు. కానీ వెయ్యేళ్ళ కొకసారి మాత్రమే పుట్టే కారణజన్ములు కొందరుంటారు. అలాంటివారిలో ఒకరు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు. నేనిలా అనడానికి ఎన్నో కారణాలున్నాయి.

  • 75 ఏళ్లుగా రావణకాష్టంలా మండుతున్న కాశ్మీర్ సమస్యను ఒక కొలిక్కి తెచ్చింది ఆయనే కాబట్టి.
  • వెయ్యేళ్ళుగా కోట్లాది హిందువుల హృదయాలను మెలిపెడుతున్న బాధకు కారణమైన కాశీ విశ్వనాధాలయ దీనావస్థను రూపుమాపింది కూడా ఆయనే కాబట్టి. 
ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో ఉన్నాయి ఆయన చేసిన గొప్ప పనులు. కానీ ఈ రెండు చాలు, భారతజాతి మొత్తం ఆయనకు శిరసు వంచి పాదాభివందనం చేయడానికి. పొద్దున్నే లేవగానే తలచుకుని నమస్కరించడానికి. 

తరతరాలకూ గుర్తుండిపోతారు కొందరు. ఉదయాన్నే, వారిని మనం తలచుకుని భక్తితో చేతులను జోడించి నమస్కరిస్తాము. వారినే ప్రాతఃస్మరణీయులంటారు. అలాంటి వారిలో ఆదిశంకరులు, వివేకానందస్వామి వంటి వారు ప్రముఖులు. నా దృష్టిలో నరేంద్రమోడీగారిని ఆ వరుసలో ఉంచాలి. భారతజాతి ఆయనకంతగా ఋణపడి పోయింది.

'దివ్యకాశీ భవ్యకాశీ' అంటూ శ్రీ నరేంద్రమోదీగారు  రెండేళ్ల క్రితం తలపెట్టిన ప్రాజెక్ట్  మొదటి దశ పూర్తయింది. అంతకు ముందే సంకల్పించిన గంగా ప్రక్షాళన ప్రాజెక్ట్ కూడా పూర్తయింది. నేడు కాశీలో జరిగిన అద్భుతమైన కార్యక్రమంలో కాశీ విశ్వనాధ్ కారిడార్ ను  మోడీగారు జాతికి అంకితం చేశారు.

గంగామాత శుభ్రపడింది. సరాసరి నదినుండి విశ్వనాధాలయానికి వెళ్లే దారి సుగమమైంది. కోట్లాది హిందువుల బాధ మాయమైంది. దేశం పులకరించింది. 

ఈ సందర్భంలో ఆయనిచ్చిన ఉపన్యాసాన్ని మొదటినుండీ చివరివరకూ వినమని అందరినీ నేను కోరుతున్నాను. అలాంటి  అద్భుతమైన ప్రసంగాన్ని మనము కొన్నిసార్లు మాత్రమే వింటాము. గొప్ప గొప్ప స్వామీజీలు కూడా  అలాంటి ప్రసంగం ఇవ్వడాన్ని నేను చూడలేదు. ఆ ఉపన్యాసం వింటే, మోడీగారిలోని దేశభక్తుడు మాత్రమే గాక, ఒక గొప్ప ఉన్నతమైన స్థితిని అందుకున్న కర్మయోగి మనకు దర్శనమిస్తాడు.  ఒక యోగి, ఒక ఆధ్యాత్మికవేత్త మన కళ్ళముందు కనిపిస్తాడు. వినేవారి ఒళ్ళు పులకరించి, కళ్ళు చెమర్చే అద్భుతమైన ఉపన్యాసమది. ప్రేక్షకులలో  ఉన్న 6000 మంది స్వామీజీలలో చాలామంది కళ్ళు తుడుచుకోవడం నేను గమనించాను.

విశ్వనాధాలయాన్ని ముస్లిములు ఎంతగా అపవిత్రం చేశారో, ఎన్నిసార్లు దాన్ని కూలగొట్టారో, ఎంతగా భారతీయుల హృదయాలను గాయపరచారో తెలియాలంటే చరిత్రలోకి తొంగి చూడాలి.

అది క్రీ. శ. 1194 వ సంవత్సరం. ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైన మహమ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ తన తురక మూకలతో కాశీని  ముట్టడించి, భవ్యమైన విశ్వనాధుని ఆలయాన్ని ధ్వంసం చేశాడు. దానికి సపోర్ట్, ఖురాన్లో మహమ్మద్ చెప్పిన మతిలేని హింసాత్మక సూక్తులు. దాని తర్వాత క్రీ. శ 1240 ప్రాంతంలో ఒక గుజరాతీ వైశ్యుడు ఆలయాన్ని మళ్ళీ నిర్మించాడు. మళ్ళీ దానిని 1400-1500 మధ్యకాలంలో సికందర్ లోడీ పాలనాకాలంలో కూలగొట్టారు. అక్బర్ పాలించే సమయంలో 1585 లో రాజా మాన్ సింగ్, రాజా తోడర్ మల్లులు మళ్ళీ దానిని నిర్మించారు.  తరువాత ఔరంగజేబు అనే నీచుడు మన దేశాన్ని 50 ఏళ్లపాటు పాలించాడు. వాడి పాలనాకాలంలో 1669 లో ఆలయాన్ని మళ్ళీ కూలగొట్టి, మసీదును కట్టించాడు. 1780 లో మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్, మసీదును కదిలించకుండా  ప్రక్కనే ఆలయాన్ని కట్టించింది. 1835 లో మహారాజా రంజిత్ సింగ్ , ఈ ఆలయానికి బంగారు పూత పూయించాడు.

ఇస్లాం ను అనుసరించేవారు, వాళ్ళ మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు. కానీ మన దేవాలయాలను ధ్వంసం చేయడానికి వాళ్లెవరు? అలా చేయమని వాళ్ళ ఖురాన్ లో రాసుంటే, ముందా ఖురాన్ సూక్తులను వెంటనే మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. హింసను ప్రబోధించే అలాంటి పుస్తకం మానవాళి మనుగడకే ప్రమాదం. దానిని దైవగ్రంధమనడం హాస్యాస్పదం.

ఈ 75 ఏళ్లలో వచ్చిన నాయకులందరూ, ఎవరు సంపాదనను వారు చూచుకున్నారు గాని, హిందువుల దేవాలయాలు మసీదులుగా అఘోరిస్తున్న విషయాన్నీ పట్టించుకున్న వాళ్ళు లేరు. హిందువుల ఆత్మక్షోభను పట్టించుకున్నవారు లేరు. ఎవరికీ వారు, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడిపారు. వారి పబ్బం వారు గడుపుకుని మెల్లిగా జారుకున్నారు.

బయటనుంచి వచ్చి మన సంస్కృతినీ, మన దేవాలయాలనూ ధ్వంసం చేసిన తురకలకూ, ఈ 75 ఏళ్లలో మన దేశాన్ని పాలించిన నాయకులకూ ఏమిటి తేడా? నా దృష్టిలో అయితే, ఏమీ లేదు. అందరూ స్వార్ధపరులే. భరతమాత ఏడుపును పట్టించుకున్న వారే లేరు.

ఈనాటికి, ప్రధానమంత్రి నరేంద్రమోడీగారి పుణ్యమా అని, కాశీ విశ్వనాధాలయం తన పూర్వ వైభవాన్ని పొందింది. వెయ్యేళ్ళ హిందువుల తపస్సు ఈ  రోజున ఫలించింది.

ఇదొక్కటేనా? ఈ క్రమంలో ఇంకా చాలా జరిగాయి.

ముస్లిముల రాక్షస పాలనాకాలంలో, అసలైన అన్నపూర్ణాదేవి విగ్రహం దొంగలచేత పెకలించబడి, అమ్ముకోబడి, చివరకు సముద్రాలను దాటి కెనడాలో తేలింది. దానిని మళ్ళీ వెనుకకు తెప్పించి, పునః ప్రతిష్ట చేసిన పుణ్యాత్ముడు నరేంద్ర మోడీ గారు.

అంతే కాదు. కాశీ సందుగొందులను వెడల్పు చేసే పనిలో, దాదాపు 1500 మంది కుటుంబాలను వేరే చోట స్థలాలిచ్చి తరలించారు. ఆ ఇళ్ల మధ్యలో, చరిత్ర ప్రసిద్ధి గాంచిన 40 ఆలయాలు బయటపడ్డాయి. మన పురాణాలలో వీటి ప్రస్తావనలున్నాయి. కానీ, కాశీలో ఇవి ఎక్కడా కనిపించడం లేదు. ఏమంటే, ఆక్రమణలకు గురై ఇళ్లలో ఇళ్ళుగా మారిపోయాయి. ఇపుడా 40 ఆలయాలు మళ్ళీ తమ పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి.

ఎంతటి పుణ్యాత్ముడో మోడీగారు?  ఇటువంటి కారణజన్ములు ప్రతితరంలోనూ పుట్టనుగాక పుట్టరు.

'పందికేం తెలుస్తుంది పన్నీటి వాసన?' అన్నట్లు వావీ వరసలూ, నీతీనియమాలూ లేని ఆఫ్ఘన్, ఇరాన్, పాకిస్తాన్ దొంగలగుంపులకు హిందూమతం యొక్క ఔన్నత్యం ఎలా అర్ధమౌతుంది? మన దేవాలయాల గొప్పదనమేంటో, నీతీజాతీ లేని అలాంటి నీచులకెలా అర్ధమౌతుంది?

స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లకు కూడా మన దేవాలయాలను మనం స్వాధీనం చేసుకోలేకపోవడానికి, ధ్వంసం చేయబడిన ఆలయాలను మళ్ళీ కట్టుకోలేకపోవడానికి, సోకాల్డ్  గాంధీ నెహ్రూలూ, ఘనత వహించిన కాపీ రాజ్యాంగ నిర్మాతలూ, మతప్రాతిపదికన దేశాన్ని విడగొట్టికూడా, మన దేవాలయాలను స్వాధీనం చేసుకోకుండా వాటినలాగే వదిలేసిన సోకాల్డ్  నాయకులే కారకులు. ఈ మహాపాపం వారిదే.

యువకునిగా ఉన్నపుడు వైరాగ్యపూరితుడై, ఉన్నతాదర్శప్రేరితుడై, రామకృష్ణా మిషన్ లో బ్రహ్మచారిగా చేరుదామని ప్రయత్నించిన మోడీగారిని ఆపి, 'నీ కార్యరంగం సమాజమే గాని ఆశ్రమం కాదు. దేశానికి నీవు చేయవలసినది చాలా ఉంది. సన్యాసం నీదారి కాదు. వెళ్ళు. భరతమాతకు నీ సేవలందించు' అంటూ వెనుకకు త్రిప్పి పంపిన రామకృష్ణా మిషన్ అధ్యక్షులు శ్రీమత్ స్వామి ఆత్మస్థానందగారి దూరదృష్టి, దివ్యదృష్టి ఫలితాలను ఈనాడు మనం కన్నులారా చూస్తున్నాం. 

మనమే కాదు, రాబోయే వేలాది తరాల భారతీయులందరూ, రాజకీయపార్టీలకు అతీతంగా, నరేంద్రమోడీ గారి ఫోటోను ఇళ్లలో పెట్టుకుని ప్రతిరోజూ పూజించాలి. ఖచ్చితంగా ఆయన కారణజన్ముడే కాదు, భరతమాత ముద్దుబిడ్డా, మన హిందూధర్మాన్ని మళ్ళీ నిలబెట్టిన యుగపురుషుడు కూడా ! ఇలాంటి మనుషులు వెయ్యేళ్లకు ఒక్కరే పుడతారు. ఆయనలో ఒక జనకమహారాజూ, ఒక శంకరుడూ, ఒక వివేకానందుడూ నాకు కనిపిస్తున్నారు.

భారతదేశం ఆయనకు శాశ్వతంగా ఋణపడిపోయింది ! ఇంకొక నూరేళ్ళపాటు ఆయనే మన ప్రధానమంత్రిగా ఉండాలి !

read more " యుగపురుషుడు నరేంద్ర మోడీ "