“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

19, డిసెంబర్ 2021, ఆదివారం

'శ్రీ మాలినీ విజయోత్తర తంత్రము' ఈ బుక్ విడుదలైంది



'పంచవటి పబ్లికేషన్స్' నుండి మా సరిక్రొత్త పుస్తకం, 'శ్రీ మాలినీ  విజయోత్తర తంత్రము' 'ఈ బుక్' రూపంలో నేడు విడుదలైంది. దీనిలో 23 అధ్యాయములు, 1275 శ్లోకములు ఉన్నాయి. నా వివరణతో కూడిన ఈ పుస్తకం 408 పేజీలను కలిగి ఉన్నది.

ఈ పుస్తకాన్ని గురించి కొద్ది మాటలలో చెప్పడం చాలా కష్టం. ప్రాచీనమైన సిద్ధయోగీశ్వరీ మతమును, దాని రహస్య తంత్రసాధనా మార్గాలను వివరించే ఈ గ్రంధం శివాగమము (శైవ తంత్రము) లలో ఒకటి.

కాశ్మీరశైవం గురించి తెలిసినవారికి అభినవగుప్తాచార్యులవారు సుపరిచితులే. ఈయన 10 వ శతాబ్దంలో కాశ్మీర్ లో నివసించారు. ఆది శంకరాచార్యుల వారితో సమానమైన మేధాసంపత్తి, తపశ్శక్తులను కలిగిన మహనీయుడాయన. ఆయన వ్రాసిన అనేక గ్రంధాలలో 'తంత్రాలోకము', 'తంత్రసారము'  అనేవి నేటికీ ప్రపంచస్థాయిలో అత్యుత్తమ శైవతంత్ర గ్రంధములుగా చూడబడుతున్నాయి. ఎంతోమంది యూరోపియనులు, అమెరికన్లు ఈ గ్రంధాలను చదివి, శివభక్తులుగా మారి, కాశ్మీరశైవాన్ని అనుసరిస్తున్నారు. అలాంటి శక్తివంతములైన గ్రంధాలవి.

తాను ఈ రెండు గ్రంధములనూ వ్రాయడానికి ప్రేరణ 'మాలినీ విజయోత్తర తంత్రము' అనే ప్రాచీన గ్రంథమని  అభినవగుప్తులవారు చెప్పినారు. మన అదృష్టవశాత్తూ ఈ గ్రంధము నేటికీ బ్రతికి ఉన్నది. సంస్కృతంలో మనకు లభిస్తున్నది. శివాద్వైతము, పరమేశ్వరాద్వైతము అనబడే శైవతంత్రము యొక్క సిద్ధాంతమును ఎంతో చక్కగా వివరించడమేగాక, ఎన్నో ప్రాణాయామ, ధారణావిధానములను, ధ్యానసాధనా రహస్యాలను సులభమైన భాషలో వివరించింది ఈ గ్రంధం. 'విజ్ఞానభైరవ తంత్రం' లో చెప్పబడిన 112 ధ్యాన విధానములకు 'మాలినీ విజయోత్తర తంత్ర'మే  మాతృక.

షడధ్వములనబడే వర్ణ, మంత్ర, పద, కళా, తత్త్వ, భువనముల వివరము, వాటి ధ్యానవిధానములు ఈ గ్రంధపు ప్రత్యేకతలు. లలితా సహస్రనామములను  పారాయణ చేసేవారికి 'షడధ్వాతీత రూపిణీ' అనే నామం సుపరిచితమే కదా ! ఈ షడధ్వములే శైవతంత్రము యొక్క సాధనలు.

శైవసిద్ధాంతములో చెప్పబడిన పృధివి నుండి శివతత్త్వము వరకూ గల ముప్పై ఆరు తత్త్వముల పైన చేయవలసిన అనేక ధ్యానములతో బాటు, అమానుష సిద్ధుల సాధన, ఇంకా, స్వప్నసిద్ధి, వాక్సిద్ధి, పరకాయప్రవేశ సాధన, గ్రామార్వణ సాధన, ఛాయాపురుష సాధన, లోకాకర్షక సాధన, రోగనిర్మూలనా సాధన, ఉచ్చాటనాది కామ్యప్రయోగములలో ఈ తంత్రమును ఏవిధంగా ఉపయోగించాలి? మొదలైన చిన్న చిన్న సాధనల వివరం కూడా దీనిలో ఇవ్వబడింది.

మా సంస్థనుండి, నా వివరణతో వస్తున్న మరొక్క అతి విలువైన, ప్రాచీనమైన తంత్రగ్రంధం ఇది. నేను అనుసరించిన, అనుసరిస్తున్న, బోధిస్తున్న మార్గంలోని సాధనలలో చాలావరకూ ఈ తంత్రంలో మీకు లభిస్తాయి. తంత్రసాధకులకు ఈ గ్రంధం ఒక అమూల్యమైన నిధి లాంటిదని చెప్పడం  అతిశయోక్తి కాబోదు.

ఈ పుస్తకాన్ని వ్రాయడంలో అనుక్షణం నాకు తోడుగా నిలచిన నా శ్రీమతి సరళాదేవికి, సంస్కృత శ్లోకములను  తెలుగులో వ్రాయడం, ప్రూఫ్ రీడింగ్,  టైప్ సెట్టింగ్ మొదలైన పనులను ఎంతో ఓపికగా చేస్తూ, ఈ పుస్తకం వెలుగు చూడటానికి నాతో బాటు కలసి నిరంతరం పనిచేసిన నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీ లలిత లకు, కవర్ పేజీ డిజైన్ చేసిన నా శిష్యుడు ప్రవీణ్ కు, పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ సభ్యులందరికీ ఆశీస్సులు, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకం కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది.