“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, డిసెంబర్ 2021, శుక్రవారం

ఆశ్రమస్థలాన్ని సేకరించాం !




మీకందరికీ ఒక శుభవార్త !

పదేళ్లక్రితం నేను చెప్పిన మాట నేడు నిజమైంది. దాదాపుగా ఏడాది నుంచీ మేము చేస్తున్న ప్రయత్నం నేటికి సఫలమైంది. మా మొదటి ఆశ్రమస్థలం వచ్చేసింది ! ఎక్కడో మారుమూల అడవిలో కాదు. ప్రకాశం జిల్లాకేంద్రమైన ఒంగోలు సిటీకి దగ్గరగా !

కలకత్తా - చెన్నై హైవే కు జస్ట్ పది కిలోమీటర్ల దూరంలో, ఒంగోలు పట్టణానికీ, మేదరమెట్ల అనే ఊరికీ చాలా దగ్గరలో, అంటే జస్ట్ అరగంట ప్రయాణదూరంలో, ప్రశాంతమైన పల్లెటూరి పొలాల మధ్యలో, ఐదెకరాల స్థలాన్ని కొనడమూ, రిజిస్ట్రేషన్ చేయించడమూ  జరిగిపోయాయి.        

ఈ రోజున ఆశ్రమస్థలం రిజిస్ట్రేషన్ జరిగింది.

మా మొదటి ఆశ్రమం సాకారం కాబోతున్న ఈ స్థలం,

  • హైదరాబాద్ నుండి రావాలంటే, నార్కట్ పల్లి, అద్దంకి హైవే మీదుగా, 5 గంటల కారు ప్రయాణ దూరంలోను,
  • గన్నవరం (విజయవాడ) ఎయిర్ పోర్ట్ నుండి రెండున్నర గంటల ప్రయాణ దూరంలోను, - 
  • గుంటూరు నుండి - NH 16 మీద గంటన్నర దూరంలోను,
  • చిలకలూరిపేట నుండి NH 16 మీద ఒక గంట ప్రయాణదూరంలోను,
  • మా జిల్లెళ్ళమూడి ఆశ్రమం నుండి - బాపట్ల చీరాలల మీదుగా గంటన్నర ప్రయాణ దూరంలోను,
  • చెన్నై నుండి NH 16 మీదుగా, అయిదున్నర గంటల ప్రయాణ దూరం లోను,
  • బెంగుళూరు నుండి, 9 గంటల ప్రయాణంలోను,
  • తిరుపతి నుండి అయిదున్నర గంటల ప్రయాణ దూరంలోను,
  • ఒంగోలు సిటీ నుండి కేవలం అరగంట దూరంలోను, 
  • దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరికి ఒకటిన్నర కి. మీ దూరంలోను, రెండో వైపున్న పల్లెటూరికి 2 కిమీ దూరంలోను ఉన్నది.
  • గుండ్లకమ్మ రిజర్వాయర్ కు కేవలం 25 నిముషాల దూరంలో ఉన్నది.
నిజానికి, ఆశ్రమస్థలం కోసం మా ప్రయత్నం, అయిదేళ్ల క్రితమే మొదలైంది. అప్పట్లో, హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉందామన్న ప్రయత్నంతో, వికారాబాద్ పరిసర ప్రాంతాలలోను, శ్రీశైలం రూట్ లోను పొలాల కోసం వెదకడం జరిగింది. నా శిష్యులందరూ వీకెండ్స్ లో కార్లేసుకుని తెగ తిరిగారు. కొన్ని కారణాల వల్ల, అప్పట్లో మా ప్రయత్నాలు సఫలం కాలేదు. శ్రీశైలంలో కూడా ప్రయత్నం చేశాము. బురదతో నల్లబడి పోయి ఉన్న లోకంలో, ఒక స్వచ్ఛమైన ప్రయత్నం ఎలా సఫలమౌతుంది? ఎక్కడ చూచినా రాజకీయాలే, పైరవీలే, కులాలే, అవినీతే. చివరకు విసుగొచ్చి, తాత్కాలికంగా, జిల్లెళ్ళమూడిలో ఒక ఇంటిని కొనుగోలు చేయడం జరిగింది. అది ప్రస్తుతం, మా సభ్యుల సాధనామందిరంగా ఉపయోగపడుతున్నది. పంచవటి సభ్యులు ఎవరైనా అక్కడికెళ్లి, ఎన్నాళ్లయినా ఉంటూ, ప్రశాంతంగా సాధన చేసుకునే వీలును కల్పిస్తున్నది.

అంతమాత్రం చేత, మాదైన స్వంత ఆశ్రమం కోసం  మా సంకల్పమూ, మా ప్రయత్నమూ ఆగిపోలేదు. గత ఏడాదిగా మళ్ళీ ముమ్మరంగా వెదుకులాటను సాగించాము. తెలంగాణా, ఆఁధ్రాలలో ఎన్నోచోట్ల ప్రయత్నించినప్పటికీ, ప్రతిచోటా విశ్వరూపం దాల్చిన రియల్ ఎస్టేట్ దందాల వల్ల, ఒక మంచి ఉద్దేశ్యంతో మొదలుపెట్టాలనుకున్న మా ఆశ్రమానికి స్థలసేకరణ గగనమై కూచుంది. కానీ చివరకు, నా జన్మస్థలమైన ప్రకాశంజిల్లాలోనే ఇది సాకారమైంది. చీకటిశక్తులు ఎంతగా ఆపాలని చూచినా, వెలుగు ఆగదు కదా !

నేను పుట్టినది ప్రకాశం జిల్లాలోనే. పెరిగినది గుంటూరు జిల్లాలో, ఉద్యోగం వెలగబెట్టినది రాయలసీమలో మరియు గుంటూరులో, చివరకు రిటైర్ అవుతున్నది హైదరాబాద్ లో. కానీ పుట్టిన గడ్డ ప్రకాశంజిల్లాలోనే, మా మొదటి స్వతంత్ర ఆశ్రమం సాకారమైంది. స్వతంత్ర ఆశ్రమం అని ఎందుకంటున్నానంటే, జిల్లెళ్ళమూడిలో మాకొక ఇల్లున్నప్పటికీ, అది అమ్మ ఊరు, అమ్మ ఆశ్రమం. ఇప్పుడు ఒంగోలు దగ్గర వస్తున్నది మాదైన ఆశ్రమం.

తెలిసినవాళ్ళూ, ప్రక్కనున్న పల్లెటూర్లలోని వాళ్ళూ అందరూ అడుగుతున్నారు.  'ఆశ్రమమంటే ఎలా ఉంటుంది? గుడీ, బడీ, ఆస్పత్రీ, పూజలూ, పండుగలూ, పబ్బాలూ, దీక్షలూ, తిరణాలలూ, కొలుపులూ ఉంటాయా?' అని. వారందరికీ ఒకటే సమాధానం.  మా ఆశ్రమంలో ఇవేవీ ఉండవు. నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది.

మా ఆశ్రమం, మీరు చూస్తున్న వ్యాపార ఆశ్రమాలలాగా ఉండదు. నిజమైన ఆశ్రమంలా ఉంటుంది. కృత్రిమత్వమూ, రాజకీయాలూ, డబ్బు కోసం కొట్లాటలూ, పలుకుబడి కోసం పరుగులూ, అవినీతి డబ్బులూ, రాజకీయులతో సంబంధాలూ, గుళ్ళు కట్టి దేవుడి విగ్రహాలు పెట్టి వ్యాపారం  చెయ్యడాలూ, దీక్షలనీ, హోమాలనీ, ప్రత్యేకపూజలనీ నాటకాలాడటాలూ, ఇంకా అలాంటి చిల్లరపనులూ, కక్కుర్తిపనులూ భూతద్దంతో వెతికినా మీకిక్కడ కనిపించవు.
  • మాది గ్రీన్ ఆశ్రమం.  అంటే, కాంక్రీట్ బిల్డింగ్స్ ఉండవు. కుటీరాలే  ఉంటాయి. 
  • మా మట్టితో మేమే ఇటుకలను చేసుకుని, ఇనుము వాడకుండా, సిమెంట్ వాడకుండా, ప్లాస్టిక్ వాడకుండా, సాధ్యమైనంతగా ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ తో, మా కుటీరాలను మేమే కట్టుకుంటాం.
  • ప్లానింగ్, డిజైనింగ్, ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ అంతా సాధ్యమైనంత వరకూ మేమే చేసుకుంటాం.
  • చెక్క వాడకాన్ని కూడా సాధ్యమైనంత తగ్గించి, వెదురు కర్రలను, బద్దలను, కుటీరాల నిర్మాణంలో వాడబోతున్నాం.
  • కుటీరాలలో, మంచాలు, కుర్చీలు, టేబుల్స్ మొదలైన అనవసర వస్తువులు  లేకుండా, మట్టిఅరుగులు కట్టుకుని వాటినే మంచాలుగా, కుర్చీలుగా వాడుతాం.
  • AC లు వాడకుండా, కుటీరాల ఎత్తును సరిగ్గా డిజైన్ చేయడంతో, క్రాస్ వెంటిలేషన్ ప్రక్రియతో, కుటీరాల లోపలి వాతావరణం చల్లగా ఉండేలాగా   ప్లాన్ చేస్తాం.
  • కుటీరాలను రెండు అంతస్తులతో, డుప్లెక్స్ ఇళ్ళలాగా నిర్మించి, వెదురు కర్రల మెట్లు, వెదురు కర్రలతో ఫస్ట్ ఫ్లోర్ డిజైన్ చేస్తాం.
  • ఆశ్రమంలో ఏ మూల నుంచి చూచినా పచ్చనిచెట్లు, పండ్లచెట్లు, కూరగాయల, పూలమొక్కలు కనిపించేలా, కళ్ళకు మనసుకు ఆహ్లాదకరంగా ఉండేలా డిజైన్ చేస్తాం.
  • భూసంరక్షణ, జలసంరక్షణ చేస్తూ, సోలార్ విద్యుత్తును వాడుతూ ప్రకృతితో మమేకమై, శబ్దకాలుష్యానికి దూరంగా  బ్రతుకుతాం.
  • పదీ ఇరవైసెంట్ల విస్తీర్ణంలో 15 అడుగుల లోతులో పెద్దగొయ్యిని తవ్వి, వాననీటిని అందులో నిలువ చేయడం ద్వారా, ఆశ్రమంలో ఒక కొలనును నిర్మిస్తాం. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు ఈ నీటిని వాడుతాం.
  • ఆరుబయట వేపచెట్లక్రింద ఎక్కువసేపు ఉంటూ, అక్కడే భోజనాలు చేస్తూ, అక్కడే నులకమంచాలు వేసుకుని పడుకుంటూ, పూలమొక్కలను, పండ్ల చెట్లను, కూరగాయల మొక్కలను  పెంచుకుంటూ, నేలసాగు చేసుకుంటూ ఉంటాం.
  • స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, యోగాభ్యాసమూ, మావైన మంత్ర సాధనలూ, ధ్యానసాధనలూ, మార్షల్ ఆర్ట్స్ అభ్యాసాలూ చేసుకుంటూ, సహజమైన సాత్వికాహారం తింటూ, నిరాడంబరములైన ఆనందపు జీవితాలను గడపబోతున్నాం.
క్రొత్త సంవత్సరంలో, పాండిచ్చేరి లోని ఆరోవిల్ కు వెళ్లి, రెండు వారాలక్కడ ఉండి,  అక్కడ విదేశీయులు స్వదేశీ దేశవాళీ ప్రకృతి జీవితాలను ఎలా గడుపుతున్నారో అధ్యయనం చేసి, అవే పద్ధతులను మా ఆశ్రమంలో అమలు చేయబోతున్నాం.

మా ఆశ్రమంలో కులమతాలకు విలువ లేదు. డబ్బుకు, అహంభావానికి, కపటానికీ, మోసానికి చోటు లేదు. స్వచ్ఛమైన మనసులూ, ప్రకృతితో మమేకమయ్యే జీవితాలూ, కుళ్ళూ కుత్సితాలకు అతీతంగా, ప్రేమించే హృదయాలతో, చిన్నపిల్లల్లాంటి మనస్తత్వాలతో, నిజమైన ఆనందాన్ని ఆస్వాదిస్తూ, అతి నిరాడంబరంగా జీవితం గడిపే వాళ్లకే మా ఆశ్రమం స్వాగతం పలుకుతుంది.

నేనిన్నాళ్ళూ ఏదైతే నా ఉపన్యాసాలలో చెబుతున్నానో, ఏదైతే నా బ్లాగ్ లోనూ, పుస్తకాల లోనూ వ్రాస్తున్నానో, అదంతా మా ఆశ్రమంలో ప్రాక్టికల్ గా సాకారం కాబోతోంది. అసలైన యోగసాధన, అసలైన ధ్యానసాధన, అసలైన తంత్రసాధన మా ఆశ్రమంలో  జరుగుతుంది.

ఇక్కడ టీవీలుండవు, న్యూస్ పేపర్ల వాసన సోకదు. మొబైల్ వాడకం, రోజు మొత్తంమీద ఒక గంట కంటే ఎక్కువసేపు ఒప్పుకోము. పోసుకోలు మాటలుండవు, సినిమాలూ రాజకీయాలూ వంటి చెత్తకబుర్లు వినపడనే వినపడవు. కన్స్యూమరిజం మా ఆశ్రమానికి ఆమడదూరంలో ఉంటుంది. వ్యాపారభక్తీ, కుహనా ఆధ్యాత్మికతల నీడలు కూడా మా ఆశ్రమానికి సోకవు.

"ఈ రకంగా, నేచురల్ లివింగ్ ను అనుసరిస్తూ చాలామంది ఇప్పుడు ఫార్మ్ హౌసులు కట్టుకుని ఉంటున్నారు కదా? వాటికీ మీకూ తేడా ఏమిటి?", అని అనుమానం వచ్చిందా మీకు? చెప్తా వినండి.

ఫామ్ హౌస్ ఊరికి దూరంగా ఉంటుంది నిజమే. అక్కడ మొక్కలుంటాయి, చెట్లుంటాయి, ప్రకృతిజీవనం ఉంటుంది. ఇదంతా నిజమే. కానీ అక్కడుండే మనుషులు ఎలా బ్రతుకుతారు? జీవితంలో వారికేమీ ఉన్నతమైన ఆదర్శాలు ఉండవు. సిటీలో బ్రతికినట్లే అక్కడా బ్రతుకుతారు. అదే టీవీ, అదే మొబైల్, అదే వాగుడు, అదే త్రాగుడు, అదే తిండి, అవే కోపతాపాలు, అవే అసూయాద్వేషాలు, అవే అహంకారాలు, అవే తాపత్రయాలు, అదే డబ్బుయావ, అవే పైరవీలు, అదే చెత్తమైండ్,  అదే చెత్త లైఫ్ స్టైల్. కాకపోతే సిటీ లైఫ్ కి దూరంగా ఉంటారంతే, దానివల్ల ఏమిటి ఉపయోగం? ఏమీ లేదని నేనంటాను.

క్రొత్తసీసాలో పాతసారా. అంతే ! బయటి సీసా నిస్సందేహంగా క్రొత్తదే. కానీ లోపలున్నది మాత్రం కంపు కొడుతున్న పాతసారాయే. బైటకు నేచురలే. లోపల మాత్రం అంతా అన్ నాచురల్. ఎందుకది? అలాంటి సూడో లైఫ్ వల్ల ఉపయోగమేంటి? అలాంటి జీవితం గడపడానికి ఫామ్ హౌస్ అయితే ఏంటి? సిటీలో ఉంటే ఏంటి? ఎక్కడైనా ఒకటే. మా ఆలోచన అది కాదు.

మా ఆశ్రమంలో మేం ప్లాన్ చేస్తున్న ప్రకృతి ఆధారిత జీవనం, దానికదే ఒక పరమావధి కాదు. ఉన్నతమైన జీవితానికి అదొక ఆసరా మాత్రమే. ఇక్కడ పునాదిగా అంతరిక సాధనామయమైన జీవితం ఉంటుంది . బయటనుంచి నేచురల్ లైఫ్ దానికి తోడౌతుంది. అదే మాకూ, మిగతా వారికి తేడా !

నన్ననుసరించే ఇండియా శిష్యులకూ, అమెరికా శిష్యులకూ ఈ ఆశ్రమం సొంతిల్లు కాబోతోంది. వారిలో కొంతమంది, అమెరికాను వదలిపెట్టి ఇక్కడికొచ్చి సెటిల్ కావడానికి ప్లాన్ చేస్తున్నారు. 40 ఏళ్లపాటు, లోకానికీ బయటివారికీ ఏమాత్రం తెలియకుండా, లోకం మధ్యలోనే ఉంటూ చేసిన సాధనద్వారా నేను అవగతం చేసుకున్న అనేక సాధనా రహస్యాలను వారికి నేర్పించి, రహస్య యోగసాధనా క్రమంలో వారిని చెయ్యి పట్టి నడిపించబోతున్నాను

ప్రతి రెండు మూడు నెలలకు ఆశ్రమంలో జరిగే స్పిరిట్యువల్ రిట్రీట్స్ లో, శాంతినికేతన్ తరహాలో, చెట్ల క్రింద తరగతులు పెట్టి, యోగం, రకరకాల ధ్యానవిధానాలు, జ్యోతిష్య శాస్త్రం, హోమియోపతి విజ్ఞానం, తంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, మార్షల్ ఆర్ట్స్ లను నా శిష్యులకు ప్రాక్టికల్ గా నేర్పించబోతున్నాను. ఇన్నేళ్ళుగా నమ్మకంగా నన్ననుసరిస్తున్న వారిని, నా సాధనామార్గంలో నడిపించి,  ఆయావిద్యలలో వారిని ఉద్దండులను చేయబోతున్నాను. అసలైన జీవితమంటే ఏమిటో వారికి రుచి చూపించబోతున్నాను.

2022 నుంచి పంచవటి చరిత్రలో నూతనాధ్యాయం మొదలు కాబోతున్నది. ఒక ఆధ్యాత్మిక మౌనవిప్లవం ఆంధ్రప్రదేశ్ లో సాకారం కాబోతున్నది. అక్కడనుంచి ఇది ప్రపంచవ్యాప్తమౌతుంది. 2022 లో ఇది జరుగుతుందని, పదేళ్లక్రితం పంచవటి సభ్యులతో, నా శిష్యులతో అన్నాను. వారిలో కొందరు నన్ను నమ్మారు, కొందరు నమ్మలేదు. కొందరు ఎగతాళి చేశారు. కొందరు చాటుగా నవ్వుకున్నారు. కొందరు బాహాటంగా విమర్శించారు. నా దారి నచ్చని  కొంతమంది నన్ను వదలి వెళ్లిపోయారు. నచ్చిన చాలామంది నన్నంటిపెట్టుకుని నాతోనే ఉన్నారు. నేను వేటినీ పట్టించు కోలేదు. నా దారిలో నేను నడుస్తున్నాను. నాతో నడిచేవాళ్ళను నడిపిస్తున్నాను.

అయితే, ఇప్పటివరకూ, మా కుటుంబసభ్యులకు తప్ప ఎవరికీ తెలియని ఒక విషయాన్ని ఇప్పుడు చెబుతా వినండి. ఇది జరుగుతుందని నలభై ఏళ్ళక్రితం, అంటే, 1980 లోనే, మా కజిన్స్ తో, మా బంధువులతో అన్నాను. ముందుముందు నా శిష్యులొస్తారని, ఆశ్రమం వస్తుందని, మేమంతా అందులో ఉంటామని, సాధనామయములైన జీవితాన్ని గడుపుతామని అన్నాను. అప్పట్లో వాళ్ళు కూడా నా మాటలను  నమ్మలేదు. లేతవయసు ఉడుకు  రక్తంలో ఏదేదో వాగుతున్నానని అనుకున్నారు. ఎగతాళిగా నవ్వారు.  40 ఏళ్ల తర్వాత, నేడు నా మాటలు నిజమౌతున్నాయి. ఇప్పుడు నేను చెబుతున్న మాటలు కూడా ముందు ముందు నిజాలు కావడం  మీరు చూస్తారు.

ఈ ప్రయాణంలో నాతో నడుస్తున్నవారు నిజంగా అదృష్టవంతులు. ఈ పనిలో  పాలు పంచుకుంటున్నవారు ధన్యజీవులు. వారి జీవితాలు సార్ధకాలౌతాయి. ఆధ్యాత్మిక లోకంలో ఉత్త మాటలను చాలామంది చెబుతారు, కానీ, నా దారిలో నాతో కలసి  నడిచేవారు, ఫలితాలను వారి కళ్ళతో చూస్తారు. ఫలాలను వారి చేతులతో అందుకుంటారు.

మా ఆశ్రమ పురోగతిని ఎప్పటికప్పుడు, నా బ్లాగ్ లో, మా వెబ్ సైట్స్ లో, మా యూ ట్యూబ్ చానల్స్ లో ఇకనుంచీ వీక్షించండి మరి !