అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

21, జనవరి 2016, గురువారం

Zindagi Khwaab Hai - Mukesh




జిందగీ ఖ్వాబ్ హై ఖ్వాబ్ మే ఝూట్ క్యా
ఇక్ భలా సచ్ హై క్యా
జిందగీ ఖ్వాబ్ హై .... 

ముఖేష్ మధురంగా ఆలపించిన ఈ గీతం "జాగ్తే రహో" అనే సినిమా లోనిది. ఈ సినిమా 1956 లో వచ్చింది.దీనిని రాజ్ కపూర్ నిర్మించాడు.ఇలాంటి పాటలను తన సినిమాలలో పెట్టడం ఆయనకున్న మంచి టేస్ట్ ను ప్రతిబింబిస్తుంది.


ఈ పాటలో రాజ్ కపూర్, మోతీలాల్ రాజవంశీ నటించారు. మోతీలాల్ చాలా మంచి సహజనటుడు.మన తెలుగు వాళ్ళ సంగతి అలా ఉంచితే, నేటి హిందీ వాళ్ళకే ఆయనెవరో తెలియదు.చాలా గొప్పగా బ్రతికిన ఈయన 1965 లో చాలా పేదరికంలో చనిపోయాడు.ఈ పాటలో మోతీలాల్ నటన చూచి తీరాలి.అంత గొప్పగా నటించాడు.

దీనికి సాహిత్యాన్ని ఇచ్చింది శైలేంద్ర అయితే సంగీతాన్ని సమకూర్చింది సలీల్ చౌధురీ. ఇద్దరూ వారివారి రంగాలలో ఉద్దండులే.అందుకే ఈ గీతం ఇప్పటికి కూడా మనకు గుర్తుండిపోయింది.

పాత కాలంలోని పాటలలో గొప్పదైన తాత్విక చింతన ఉట్టిపడుతూ ఉండేది.అయితే ఇది త్రాగుబోతు చెప్పే తాత్వికత. ఒక్కొక్కసారి వాళ్ళనుంచి కూడా గొప్పదైన తత్త్వం జాలువారుతుంది. ఈ పాట కూడా అలాంటిదే.

కొన్ని వేదాంత సాంప్రదాయాలు చెప్పేటట్లు ప్రపంచం అనేది స్వప్నం అయితే ఇక స్వప్నంలో నిజం అబద్దం ఏముంటాయి? మొత్తం కలే అయినప్పుడు ఈ ప్రపంచంలో ఏది సత్యమో ఏది అసత్యమో ఎలా చెప్పగలం? అని కవి ఈ గీతంలో మనల్ని ప్రశ్నిస్తాడు.

జహర్ నే మారా జహర్ తో ముర్దే మే ఫిర్ జాన్ ఆగయీ...

అనే పాదం చాలా అద్భుతమైన తాత్త్వికార్ధాన్ని కలిగి ఉన్నది. హృదయంలోని బాధ అనే విషాన్ని మధువు అనే విషం హరించిందట.అప్పుడు నిర్జీవ శరీరంలో మళ్ళీ జీవం పుట్టుకొచ్చిందని కవి ఒక అద్భుతమైన భావాన్ని మన కళ్ళముందు చూపిస్తాడు.ఈ పాట అంతా యోగులకూ సూఫీలకూ చెందిన తాత్విక భావ సమాహారం.అందుకే ఇది నాకు ఇంతగా నచ్చింది.

ఇలాంటి సాహిత్యాన్ని వ్రాసేవారూ ఇప్పుడు లేరు.తీసేవారూ లేరు.చూసేవారూ లేరు.ఇప్పుడున్నది "సర్వభ్రష్టత్వం" మాత్రమే.

శైలేంద్ర వ్రాసిన గీతాలన్నీ చాలా బాగుంటాయి. మనల్ని ఆలోచింపచేస్తాయి.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Jagte Raho (1956)
Lyrics:-Shailendra
Music:--Salil Chowdhury
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------------
Zindagi khaab hai khaab me zhoot kya
Ik bhala sach hai kya
Zindagi khaab hai khaab me zhoot kya
Ik bhala sach hai kya
Sab sach hai
Zindagi khaab hai

[Dil ne ham se jo kaha-ham ne vaisa hee kiya]-2
fir kabhee pursat se sochenge
buraa tha ya bhala

Zindagi khaab hai khaab me zhoot kya
Ik bhala sach hai kya
Zindagi khaab hai

[Ek khatra mai ka jab - pattar ke hoton par pada]-2
Uske seene me bhi dil dhadka
Ye usne bhee kaha
Kya

Zindagi khaab hai khaab me zhoot kya
Ik bhala sach hai kya
Zindagi khaab hai

Ek pyalee bharke maine Gam ke maare dilko dee-2
Zahar ne maara zahar to
Murde me fir jaan aa gayee...

[Zindagi khaab hai khaab me zhoot kya
Ik bhala sach hai kya
Zindagi khaab hai]-2

Meaning:---

This world is but a dream
In a dream, what is falsehood and what is truth?
This world is but a dream

Whatever my heart suggested
I did the same
Later, I will leisurely ponder
If my actions are right or wrong

This world is but a dream
In a dream, what is falsehood and what is truth?
This world is but a dream

A danger of wine
When fell on the lips of a stone
In the depths of its bosom too
there throbbed a heart, which said,
What?

This world is but a dream
In a dream, what is falsehood and what is truth?
This world is but a dream

I filled a cup with wine
and offered it to my wounded heart
poison killed the poison
and new life sprang up in the corpse

This world is but a dream
In a dream, what is falsehood and what is truth?
This world is but a dream
This world is but a dream....

తెలుగు స్వేచ్చానువాదం

ఈ ప్రపంచం ఒక స్వప్నం
ఇందులో అబద్దం ఏమిటి?
పరమసత్యం ఏమిటి?
ఈ ప్రపంచం ఒక స్వప్నం
అంతే...

నా హృదయం ఏం చెప్పిందో
దానినే నేను చేశాను
ఆ తర్వాత నిదానంగా ఆలోచిస్తాను
అది తప్పా ఒప్పా అని

ఈ ప్రపంచం ఒక స్వప్నం
ఇందులో అబద్దం ఏమిటి?
పరమసత్యం ఏమిటి?
ఈ ప్రపంచం ఒక స్వప్నం
అంతే...

మధువు యొక్క ఒక ప్రమాదం
రాతి నోటిలో పడింది
ఆ రాయి ఎదలో కూడా
ఒక హృదయపు స్పందన కదలాడింది
అప్పుడది చెప్పింది
ఏమని?

ఈ ప్రపంచం ఒక స్వప్నం
ఇందులో అబద్దం ఏమిటి?
పరమసత్యం ఏమిటి?
ఈ ప్రపంచం ఒక స్వప్నం
అంతే...

నేనొక గిన్నెలో మధువును నింపి
గాయపడిన నా హృదయానికి ఇచ్చాను
ఈ విషం ఆ విషాన్ని అంతం చేసింది
శవంలో జీవం మళ్ళీ తొంగి చూచింది

ఈ ప్రపంచం ఒక స్వప్నం
ఇందులో అబద్దం ఏమిటి?
పరమసత్యం ఏమిటి?
ఈ ప్రపంచం ఒక స్వప్నం
అంతే...
read more " Zindagi Khwaab Hai - Mukesh "

12, జనవరి 2016, మంగళవారం

త్వరలో రాబోతున్న కాలసర్పయోగం - గురుచండాల యోగాలు

అనంత కాలగమనంలో గ్రహాల పరిభ్రమణంలో అనేక గ్రహయోగాలు కలుగుతూ కొన్నాళ్ళ తర్వాత విడిపోతూ ఉంటాయి. ఆయా సమయాలలో దేశాలకూ,వ్యక్తులకూ కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి.ఇది నిజమే.భూమ్మీద జరిగే సంఘటనలకూ గ్రహయోగాలకూ గల ఈ సంబంధాన్ని అతి ప్రాచీనకాలంలోనే గుర్తించారు.

ఈ నేపధ్యంలో మనకు త్వరలో కొన్ని యోగాలు రాశిచక్రంలో కలగబోతున్నాయి.వాటిలో గురుచండాల యోగం,కాలసర్ప యోగం అనేవి ఉన్నాయని టీవీ జ్యోతిష్కులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.చాలామంది నిజంగానే భయపడుతున్నారని నా దృష్టికి వచ్చింది.కొంతమంది మహిళలు నాకు ఫోన్ చేసి ఏం చెయ్యాలని అడుగుతున్నారు. ఆ భయాలు అర్ధం లేనివనీ, టీవీలు చూచి అనవసరంగా అలా వణికిపోవద్దనీ చెప్పడమే ఈ పోస్ట్ ఉద్దేశ్యం.

జనవరి 30 న రాహుకేతువులు రాశిమారుతున్నారు.అప్పుడు రాహువు సింహరాశిలోకి ప్రవేశించి గురువుతో కలుస్తాడు. అప్పటినుంచీ ఆగస్టు 12 న గురువు కన్యారాశిలో ప్రవేశించే వరకూ ఉన్న 7 నెలల కాలం గురుచండాల యోగం పరిధిలో ఉంటుంది.

ఈ సమయంలో దొంగ గురువుల బండారాలు బయట పడతాయి.దొంగశిష్యులు దొంగ గురువుల దగ్గరకు చేరతారు. అంతేగాని నిజమైన గురువులకు మాత్రం ఏమీకాదు.వారికి మంచే జరుగుతుంది.అంతేగాక ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద స్కాములు బయటపడే సూచన ఈ సమయంలో ఉన్నది. ఈ సమయంలో ముస్లిం ఉగ్రవాదం బాగా పెచ్చుమీరి కొన్ని దేశాలమధ్యన యుద్ధవాతావరణానికి దారితీసే ప్రమాదమూ ఉన్నది.అంతేగాని వ్యక్తిగత జీవితాలలో మీరు అతిగా భయపడుతున్నంత భయంకర ఫలితాలు ఏమీ ఉండవు.

ఇప్పుడు గర్భవతులుగా ఉండి ఆ సమయంలో డెలివరీ అయ్యే కొంతమంది స్త్రీలు బాగా భయపడుతున్నట్లు నా దృష్టికి వచ్చింది.ఇంతకు ముందు అయితే, ఈ గ్రహాలూ ఈ యోగాలూ పెద్దగా జనానికి తెలిసేవి కావు.ఇప్పుడు టీవీల పుణ్యమా అని పల్లెటూళ్ళో చదువురాని వారికి కూడా గ్రహయోగాలు తెలుస్తున్నాయి.తెలిస్తే తప్పులేదు.అనవసరంగా ప్రతిదానికీ భయపడటమే తప్పు.ఈ యోగాల బూచిని చూపించి జనాన్ని భయపెడుతున్నారు కుహనా జ్యోతిష్కులు.మంచికంటే చెడు ఎక్కువగా ప్రచారం కాబడుతున్నది.అదే అసలైన పొరపాటు.

ఒక పదిమంది జాతకాలలో గురుచండాల యోగం ఉంటే అందరికీ అది ఒకే ఫలితాన్నివ్వదు. వారి వారి పూర్వకర్మ బేలెన్స్ ను బట్టి అది ఈ జన్మలో ఈ సమయంలో ఇచ్చే ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి.యోగాలవల్ల అందరికీ ఒకే రకమైన ఫలితాలు ఉండవు.

టీవీలు,జ్యోతిష్య బ్లాగులు బాగా చూసే కొందరు మహిళలు, రాబోతున్న ఈ రెండుయోగాల గురించి ఎక్కువగా తెలుసుకుని అనవసరంగా భయాందోళనలకు గురౌతున్నారు. కొందరైతే -ఇలాంటి సమయంలో మనం పిల్లని కనడం ఎందుకు? అబార్షన్ చేయించుకుందామని ప్లాన్ చేసుకుని - ఏం చెయ్యమంటారని నన్ను అడుగుతున్నారు.ఒకామె అయితే - ఏకంగా సూయిసైడ్ చేసుకుందామని అనుకున్నాను - అని ఫోన్లో నాకే చెప్పింది. స్త్రీలలో ఇంత అమాయకులు ఉండబట్టే నకిలీ గురువులు నకిలీ జ్యోతిష్కులు సమాజంలో విచ్చలవిడిగా చెలామణీ అవుతున్నారు.

మరీ అంత జ్యోతిష్యపిచ్చి పనికిరాదు.ఏదైనా సరే వాస్తవిక దృక్పధం ఉండాలి.

పొరపాటున కూడా అబార్షన్ జోలికి పోవద్దని స్త్రీలకు నా సూచన. ఎందుకంటే అబార్షన్ అనేది మహా ఘోరమైన పాపం. అమాయకంగా ఊపిరి పోసుకుంటున్న ఒక చిన్నిప్రాణిని,అలా చెయ్యడం ద్వారా మీ చేతులతో మీరు హత్య చేస్తున్నారు.మీకు ఘోరమైన హత్యాదోషం చుట్టుకుంటుంది.దానిని కడుక్కోవడం మీ వల్ల కాదు.ఈ లోకపు కోర్టుల దృష్టిలో అది నేరం అయినా కాకపోయినా పైవాడి దృష్టిలో అది మహా ఘోరమైన పాపం. దానివల్ల ఆ కుటుంబానికి చాలా దారుణమైన పాపఖర్మ అంటుకుని,కాలక్రమంలో ఆ కుటుంబం అనేక దురదృష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.అబార్షన్ చేయించుకున్నవారూ చేసిన డాక్టర్లూ కూడా ఆ తదుపరి చాలా చెడుకర్మను ఎదుర్కొంటారు.

కేవలం అబార్షన్లు మాత్రమె చేసే ఒక లేడీ డాక్టరు ఫేమిలీ మొత్తం మూడే మూడేళ్ళలో సర్వనాశనం అయిన సంఘటన నేను కళ్ళారా చూశాను.జాగ్రత్తగా గమనిస్తే ఆ లింకులు అర్ధమౌతాయి.ఆ తర్వాత మీరు ఏ విధమైన రెమెడీలు చేసినా ఆ పాపం పోదు.తరతరాలకు ఆ పాపం వెంటాడుతుంది. ఈ విషయాన్ని స్పష్టంగా గమనించండి.

ఇంకో విషయం ఏమంటే - ఈ విధంగా భయాందోళనకు గురవ్వడం వల్ల,మీ భయం కడుపులో ఉన్న పిండం మీద పడుతుంది.పుట్టిన తర్వాత ఆ పిల్లలకు కూడా అనవసరమైన భయాలు, చీటికీ మాటికీ ఆందోళన పడటం, చిన్నప్పుడే B.P, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. పొట్టలో ఉన్న పిల్లను కనీసం ఆ 9 నెలలైనా ప్రశాంతంగా ఉండనివ్వండి.మీ టీవీల గోలను,టీవీ జ్యోతిష్కుల ఊదరను, వారు పెడుతున్న భయాలను ఆ పొట్టలోని బిడ్డ దగ్గరకు చేరనివ్వకండి.

రాబోతున్న ఈ యోగాలకు రెమెడీలు ఏం చెయ్యాలని చాలామంది నన్ను అడుగుతున్నారు.

ముందు మీరు భయపడకుండా ప్రశాంతంగా ఉండటమే అతి ముఖ్యమైన రెమెడీ.మీరు చేస్తున్న రకరకాల నూనెల దీపారాధనలకూ,రకరకాల పిండ్లు కలిపి చేస్తున్న ఏవేవో జిమ్మిక్కులకూ,గుళ్ళూ గోపురాలూ తిరిగినంత మాత్రానా,ప్రదక్షిణాలు చేసినంత మాత్రానా - గ్రహాలు ఏమాత్రం లొంగవన్న వాస్తవాన్ని ముందుగా గమనించండి.

స్వచ్చమైన జీవితాన్ని గడపడం,చేతనైనంతలో ఇతరులకు సాయం చెయ్యడం,దైవాన్ని ప్రార్దించడాలే అత్యుత్తమైన రెమేడీలు.దైవానుగ్రహం ఉంటే గ్రహయోగాలు ఏమీ చెయ్యవు.

జీవితంలో బాగా రాణించిన వ్యక్తుల జీవితాలలో కాలసర్పయోగం ఉండటం గమనించండి.ఉదాహరణకు జవహర్ లాల్ నెహ్రూ జాతకంలో కాలసర్పయోగం లాంటిది ఉన్నది. గురుచండాల యోగం కూడా అంతే. అనేకమంది రాజకీయ నాయకుల జాతకాలలో,సమాజంలో రాణిస్తున్న అనేకమంది కుహనా గురువుల జాతకాలలో ఈ యోగం ఉంటుంది.కాబట్టి వీటి గురించి బాధపడవద్దు. భయపడవద్దు.శిశువుల డెలివరీలకు జ్యోతిష్య ముహూర్తాలు పెట్టుకునే పని చెయ్యవద్దు.ఇలాంటి పిచ్చి పనులతో మీరు కర్మను ఓడించలేరు.కర్మను మార్చలేరు.మీకు ఒకటి తెలిస్తే, కర్మకు వంద ఉపాయాలు తెలుసు. గుర్తుంచుకోండి.

మంచి జీవితాలు గడుపుతూ, దైవాన్ని నిష్కల్మషమైన హృదయంతో ప్రార్ధిస్తూ ఉంటే, ఆ బిడ్డ పుట్టిన సమయానికి జాతకంలో ఉన్న చెడు దోషాలను కూడా మంచి స్థానాలలో ఉంచేపని దైవం చూసుకుంటుంది.అది జ్యోతిష్కుల వల్ల జరిగే పని కాదు. జ్యోతిష్కులు రాశిచక్రం వరకూ మంచి ముహూర్తాలు పెట్టవచ్చు. సూక్ష్మచక్రాలలో ఏం జరుగుతుందో వారు చూడలేరు.అది వారి అధీనంలో ఉండదు.కనుక కర్మఫలం ఎలా ఉందో అలాగే జరుగుతుంది.టీవీ రెమెడీలతో అది మారదని గ్రహించండి.

ఇకపోతే కాలసర్పయోగం గురించి.

రాబోతున్నది కాలసర్పయోగం కాదు.కొంతమంది రివర్స్ కాలసర్పయోగం అని అంటూ ఉంటారు.నిజానికి అలాంటి రివర్స్ యోగం ప్రామాణిక గ్రంధాలలో ఎక్కడా చెప్పబడి లేదు.కానీ అలాంటి ఒక గ్రహస్థితి త్వరలో రాశిచక్రంలో రాబోతున్నది.దాని ఫలితాలు అసలైన కాలసర్ప యోగమంత భయంకరంగా ఏమీ ఉండవు.కొద్దో గొప్పో ఉంటే అవి దేశాల మీద ఉంటాయి.కనుక భయం లేదు.

అనవసర భయాలు పెట్టుకుని ఆరోగ్యాలూ మనసులూ పాడు చేసుకోకండి. ప్రశాంతంగా ఉండి మీమీ ఇష్టదైవాలను మనస్పూర్తిగా ధ్యానించండి.ఎవరికీ హాని చేసే పనులు చెయ్యకండి.నిజంగా ఆపదలో అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంతలో సహాయం చెయ్యండి.దీనిని మించిన రెమెడీ ఇంకేమీ లేదు.ఈ వాస్తవాన్ని గ్రహించి టీవీ జ్యోతిష్కులకు దూరంగా ఉండండి.

గ్రహాలను సృష్టించింది దైవమే.ఆ దైవాన్ని సక్రమంగా పట్టుకుంటే గ్రహాల నుంచి,గ్రహదోషాల నుంచి ఆ దైవమే మనల్ని కాపాడుతుంది. ఇది అసలైన నిజం.గమనించండి.
read more " త్వరలో రాబోతున్న కాలసర్పయోగం - గురుచండాల యోగాలు "

7, జనవరి 2016, గురువారం

నేటి గతం...

చిన్నప్పటినుంచీ - నాలో నేనుగా ఉన్న క్షణాలలో - నన్ను నేను మరచిపోయి ప్రకృతిలో ఒక భాగంగా మిగిలిన సమయాలలో - అకస్మాత్తుగా సహజంగా spontaneous గా నాలో కలిగిన అనుభవాలను ఈ కవితలలో అక్షరబద్ధం గావించే ప్రయత్నం చేశాను.అంతేగాక - పడిన బాధలనూ,ఎదురైన వంచనలనూ, గురైన మోసాలనూ,దిగమ్రింగిన అవమానాలనూ కూడా కలగా పులగంగా వ్రాసే ప్రయత్నం చేశాను.

అనుభవం ఎన్నటికీ పూర్తిగా అక్షరంగా మారదు.కానీ నావంతుగా కొంత ప్రయత్నం చేశాను.ఇవన్నీ అంతరికానుభవాలు. అందుకోగలిగిన వారికే ఇవి అర్ధమౌతాయి.అలాంటి వారికోసమే ఈ గతస్మృతుల కవితావల్లరి.
------------------------------------
ఏ లోకపువో తెలియక
వినిపించిన శబ్దాలు
గుర్తొచ్చీ రాకుండా
విసిగించిన స్వప్నాలు

మాసిపోని గతకాలపు  మాయలు
జ్ఞాపకాల కలల మేని ఛాయలు
వర్తమానపు ఏకాంతసౌధం లోకి
మౌనంగా అడుగేసిన గతకాలపు నీరెండ

సూర్యుని కిరణాలపైన
ఏనాటివో గాలి ఊసులు
సుతారంగా జారి దిగిన
అర్దమవని మౌనభాషలు

గాలీ నీరూ ఎండా వానా
చెప్పాయి ఏవేవో మాటలు
అర్ధం చేసుకునే ప్రయత్నంలో
ఎదురొచ్చాయి గతపు బాటలు

తెలియని గమ్యపు పిలుపులు
తెలిసీ తెలియని అడుగులు
దిగంతాల అంచులలో
దేన్నో వెదికిన చూపులు

కొత్త కొత్త మనుషులు
అవే అవే పాత్రలు
మరపురాక మరువలేక
రోదించిన వేదనలు
--------------------------

మంత్రసాధనలు ఇచ్చిన
మరపురాని అనుభవాలు
అలుపులేక అరిగిపోక
అరుదెంచిన జ్ఞాపకాలు

నడకలలో పాదాలకు
గుచ్చుకున్న కోసురాళ్ళు
దాహాలను తీర్చలేక
దైన్యంగా రాతిగుళ్ళు

దారీ తెన్నూ తెలియక
తిరిగిన తొలి జ్ఞాపకాలు
ప్రతిచోటా వెంటాడిన
ఎన్నెన్నో వ్యాపకాలు

మంత్రకట్టు మాయ నెరిగి
నవ్వుకున్న వైనాలు
మనసు గుట్టు లోయలలో
రివ్వుమన్న యానాలు
--------------------------

చెరువుగట్టు స్నేహంలో
తెరచుకున్న లోకాలు
ఒంటరి రోజులు నేర్పిన
ఓపలేని పరవశాలు

మండువేసవుల రోజుల
మహామౌన స్థావరాలు
చలిరాతురు లందించిన
తొలిజన్మల జ్ఞాపకాలు

తొలకరి ముసురులు తెచ్చిన
తీపి వేదనల జల్లులు
ఒంటరిగా నడయాడిన
అంతులేని పంటచేలు

మల్లియలై మదిదోచిన
చెలియ మేని సుగంధాలు
వెల్లువలై ఉబికొచ్చిన
గతకాలపు అనుభవాలు

అన్నీ గుర్తుకు తెచ్చిన
అందమైన పరిసరాలు
ఆప్తులెవరు కానరాక
విలపించిన వత్సరాలు
-----------------------------

చెదరిన గుండెకు తోడై
దరిచేరిన ప్రియురాలు
ఎడబాటును తలచితలచి
ఎగసిపడిన హృదయాలు

ఎవరూ పలకని శూన్యం
దారే తెలియని దైన్యం
మాకు మేము దీపాలం
మాటరాని శోకాలం


అనుకోకుండా ముగిసిన
ఆరోజుల బంధాలు
అనుకోడానికి మిగలని
నేటి ఓటి బంధుత్వాలు

వెల్లడైన వాస్తవాలు
అర్ధమైన మానసాలు
కళ్ళు తెరుచుకున్న రోజు
కనిపించిన కల్మషాలు
------------------------------

ఏం చెయ్యాలో ఎరుగక
తెగ ఏడ్చిన నిశిరాత్రులు
ఎలా కడగాలో తెలియక
వగ మిగిలిన మసిపాత్రలు

ఎన్నో జన్మల నుంచి
ఎగిరొచ్చిన వలపు విరులు
ఎవరికి చెప్పాలో తోచక
దిగమింగిన తలపు తెరలు

మందు లేని రోజులలో
మనసుకైన గాయాలు
విందులేవి లేకుండా
గడచినట్టి ప్రాయాలు

ఉప్పొంగిన ఆవేశం
ఓదార్చిన ఆకాశం
కన్నీరార్పిన ఆకలి
చెయ్యందించిన జాబిలి
---------------------------------

ధ్యానమిదని నేర్పించిన
చీకటి చుక్కల రాత్రులు
మౌనం విలువను తెలిపిన
ఒంటరి రోజుల యాత్రలు

ఒకరోజున స్పందించిన
తెలతెల్లని మేఘాలు
ఒక్కసారి స్తంభించిన
వెయ్యి కాలగమనాలు

ఏకాంతపు పరుగులలో
ఎగిరొచ్చిన అతీతాలు
అప్పటికపుడే మెరిసిన
అంతులేని అనుభవాలు

నన్ను ఒదిలి అడుగేసిన
ఇంకొక నేను
అన్ని మరచి నిలిచి ఉన్న
నాలో నేను
----------------------------

బరువునంత కడిగింది
మాటరాని చెరువు
మదిని తట్టి లేపింది
మనిషి కాని చెట్టు

ఆనందం నేర్పించిన
అంతులేని ఆకాశం
ఒంటరితనమే తానొక
అందమైన అవకాశం

మహామంత్రమై ఎగసిన
చెరువు నీటి గలగలలు
నీటిగాలిలో సోకిన
చెలియ మేని మిలమిలలు

చిరుగాలికి కదలాడిన
ఆకాశపు చిరుగంటలు
ఆ శబ్దంలో మెరిసిన
ఓంకారపు వింత ధ్వనులు

మనసు లయం అందించిన
సాయంకాలపు సంజెలు
వయసు పరుగు లాపించిన
ప్రాణమధన విద్యలు

భయమేలని ఓదార్చిన
చీకటిలో మర్రిచెట్టు
అర్ధరాత్రి అద్భుతాన
విడిపోయిన కనికట్టు

ప్రత్యాహారం నేర్పిన
పల్లెటూరి చెరువు గట్టు
మనసు మాయమైపోగా
జారిన లోకపు పట్టు

కృత్రిమ ధ్యానాల తోటి
కుదరనట్టి ఏకాగ్రత
స్వచ్చమైన ప్రకృతి ఒడి
అందించిన తాదాత్మ్యత

చీకటి రాత్రులు పలికిన
కీచురాళ్ళ శబ్దాలు
ఒంటరైన చెరువు నీరు
చూపించిన చిత్రాలు

మినుకు మినుకుమని మెరిసిన
చీకటిలో చిరు వెలుగులు
తేలియాడుతూ తాకిన
మధురమైన రాగాలు

నిశీధిలో ఎదురొచ్చిన
ఒక ఒంటరి యువతీ
ఈ లోకపు ధ్యాస లేని
ఏవో చూపుల పడతి

దేని కోసమో తెలియని
నిర్లిప్తపు ఎదురుచూపు
ఎదుట మనిషి నిలుచున్నా
గుర్తించని చింతతోపు

ఆత్మలతో ప్రయోగాలు
ఆ లోకపు అనుభవాలు
చీకటింట నడయాడిన
చీర చెంగు రెపరెపలు

అనుభవాలు పంచుకున్న
అశరీరుల ఆక్రందన
విసుగుపుట్టి చాలించిన
విగత జీవ విశ్లేషణ

కుప్ప నూర్చినట్టి చేలు
అస్తమించు వెలుగుతెరలు
అనంత లోకాల నుంచి
అలలు అలలుగా పిలుపులు
-----------------------------

ముసురున మునిగిన రోజులు
ఎదురొచ్చిన పాతగతం
చీకటి రాత్రుల మెరుపులు
కనుల ముందు చివరి నిజం

సడి చెయ్యని నడిరాతిరి
పెనుగాలై దరిచేరింది
భయమే భయపడి భయపడి
వీపు వెనుక దాక్కుంది

చుక్కల పందిరి క్రింద
చుట్టూ చీకటి ముసుగు
మధ్యలోన మాటలేని
మౌనంగా ఒక చూపు

నిశ్శబ్దపు పగటిపూట
నిర్ణిద్రపు మౌనంలో
సుదూరాల దిగంతాల
ఎలుగెత్తిన పొలికేక

మధ్యాహ్నపు మౌనంలో
మలిగిపోని చైతన్యం
నిద్రించే లోకంలో
నిద్రించని నిర్దుష్టం

ఉందోలేదో తెలియని
ఉట్టిమీది లోకంలో
ఉన్నా లేనట్టున్న
ఉలుకులేని ఒక్క ఉనికి

మౌన సముద్రపు అడుగున
ఒక శబ్దపు నాట్యం
గందరగోళపు మడుగున
నిశ్శబ్దపు లాస్యం

చలనంలో అచలత్వం
శబ్దంలో నిశ్శబ్దం
మాట చాటునే మౌనం
నిత్యం నడిచే ధ్యానం
----------------------------

ఉదయాన్నే ఉత్సాహం
మధ్యాహ్నపు ఏకాంతం
సాయంత్రపు వైరాగ్యం
రాత్రి మౌన చైతన్యం

మాటల ఎల్లలు దాటిన
మత్తుకళ్ళ చిన్నదాన్ని
మనసు అందిపుచ్చుకోని
మౌనపు జత కట్టింది

మనసు పడిన చిన్నదాని
సహవాసపు సంయోగం
మరపురాని అనుభవాలు
అందించిన ఉపదేశం

నిశిరాత్రుల మౌనంలో
వర్షపు చినుకుల శబ్దం
నిద్రను దూరం చేస్తూ
నన్నే నాకందించింది

ఎటూ ఎవరూలేని ఏకాంతం
సృష్టినే శూన్యంగా మార్చి
ఎప్పటినుంచో ఉన్న నేనును
నా ఎదుటే నిలిపింది
-----------------------------

ప్రయత్నాలెన్ని చేసినా కానిది
ప్రయాసలెన్ని పడినా రానిది
ప్రతిక్షణం నేనున్నానంటూ
ఒక్క క్షణంలో నాకందింది

ఎందఱో పిలిచినా పలకనిది
ఎందరు చేయిసాచినా దక్కనిది
ఒక్కడినే ఉన్న నా మదిలో
ఒక్కసారిగా తానై ఉబికింది

ఎన్నో చదవడమెందుకు
ఎచటో వెదకడమెందుకు
నీతోనే ఉన్నానని
తనే ఎదుట నిలిచింది

అన్ని ప్రశ్నలాగిపోయి
మనసు పొరలు జారిపోయి
చెప్పలేని దేదో ఒకటి
చెంతకు నను చేర్చుకుంది
-----------------------------

త్యాగధనుల చెంత నిలిచి
నేర్చుకున్న పాఠాలు
తిరుగుబోతు స్నేహితులే
నేర్పించిన వేదాలు

గురువర్యులు గావించిన
అద్వితీయ ఆత్మబోధ 
జీవితమంతా వదలక
వెంటాడే దివ్యగాథ

జీవితమంటే నేర్పిన
మహనీయుని వాక్కులు
వేదాలను వదలిపెట్టి
ఎగిరొచ్చిన ఋక్కులు

ప్రేమలేని లోకంలో
ప్రేమకొరకు వెదుకులాట
మరువలేని మనుషులకై
పాడినట్టి లాలిపాట

మనసును గమనించలేని
పిచ్చి మొద్దు మనసులు
మనిషిని గుర్తించలేని
మహా పెద్దమనుషులు

ప్రేమ ముసుగు వేసుకున్న
పచ్చి స్వార్ధ పిశాచాలు
ఆశల వలలో చిక్కిన
ఆధ్యాత్మిక నమూనాలు

లోకం మెప్పును కోరే
సాంప్రదాయ వేషాలు
కోరికలను దాటలేని
చాపక్రింద మోసాలు

పిల్లవాడిననుకున్న
పెద్దవారి దర్పాలు
హద్దులేని ప్రశ్నలతో
సర్దుకున్న సర్పాలు

ఇల్లు చక్క దిద్దలేని
ఇరు సంధ్యల వందనాలు
మనసులోన మార్పు తేని
గ్రంధపఠన బంధనాలు
----------------------------- 

ఆడవారి సావాసాలు
అడ్డదారి సాహసాలు
ఆధ్యాత్మిక ప్రహసనాలు
అందించిన అనుభవాలు

సాధనలో శాంతి కోరి
ఆహుతైన జీవితాలు
బ్రతుకంతా పణమైనా
అందరాని విజయాలు

పతివ్రతల జీవితాల
పరారైన ఔన్నత్యం
పతితల బ్రతుకుల మాటున
పరమ హృదయ వైశాల్యం

ఔన్నత్యపు తెరచాటున

నిమ్నత్వపు నీచత్వం
నేలబారు నడకలలో
నింగి వెలుగు నిత్యత్వం

అర్దమవని చాదస్తం
అచ్చిరాని వైదీకం
అసలు సిసలు వైరాగ్యం
అందించిన ఆనందం

నచ్చని పూజల తంతులు
పచ్చిక బయళ్ళ రాత్రులు
వెచ్చని నెచ్చెలి కౌగిలి
మెచ్చిన వేల్పుల లోగిలి

ఆలయాల గదులలోన
కానరాని దివ్యత్వం
ప్రతి ఊహకు స్పందించిన
ప్రకృతిమాత నవ్యత్వం
-----------------------------

పుస్తకాలు చదివి చదివి
నమ్మినట్టి రోజులు
అనుభవాల గీటురాయి
నవ్వుకున్న నవ్వులు

చీకాకును రప్పించిన
అల్పత్వపు బ్రతుకు వెతలు
చిన్ని చిన్ని మాటలలో
చిగురించిన వెలుగు లతలు

ఏనాడూ బోధపడని
జీవితాల ప్రహసనాలు
ఎందుకోసమో తెలియక
బ్రతుకొక్కటి బుగ్గిపాలు

బ్రతుకు మీద ఆశ చచ్చి
సిద్ధపడిన క్షణాలు
ముద్దు మాటలే నేర్పిన
ముఖ్యమైన నిజాలు

ప్రేయసి కౌగిలి నేర్పిన
అచ్చమైన శరణాగతి
తంతులన్ని వదిలించిన
అసలు సిసలు పై తరగతి

విలయ విలువ బోధించని
తొలి గురువుల సమూహాలు
చెలియ కలువ నేర్పించిన
హృదయ లయల సరాగాలు 
-----------------------------

బ్రతుకులనే నడిపించే

స్వార్ధపు సందర్శనాలు
మెతుకులు కూడా దొరకని
రోజుల నీ దర్శనాలు

కరగినట్టి మది ఆశలు
తరిగినట్టి తుది శ్వాసలు
మలిగిన ఒక హృదయంలో
వడలినట్టి కడచూపులు

నమ్మకాల సుడుల మధ్య
మునిగిందొక జీవితం
జన్మరహస్యం తెలియక
ముగిసిందొక జీవితం

ఆశల బంధాల మధ్య
నలిగిందొక జీవితం
ఆకలిదప్పుల బరిలో
ఆవిరొక్క జీవితం

అంతులేని పయనంలో
నావ ఒక్క జీవితం
ఎంత మింగినా తీరని
ఆకలొక్క జీవితం

సొంతవారి చేర్పు కోరి
వెదికిందొక జీవితం
పంతపు పట్టింపులలో
ముగిసిందొక జీవితం
--------------------------------

కనులముందు కదలాడిన
ఒక్కనాటి పాపాలు
ఆశలుడిగి మసిబారిన
లెక్కలేని దీపాలు

కపట ప్రేమలలో చిక్కి
కరిగిందొక కాలం
అన్నీ తెలిసే నాటికి
ఆవిరైందొక ప్రాణం

చేజారిన మధుపాత్రలు
చేయివిడిన మదవతులు
చెంత నిలిచినా కూడా
చేరలేని అభాగినులు

భయపు బరువుతో కొందరు
పొగరు మరుగునే కొందరు
స్వార్ధ పరులు ఇంకొందరు
దరికి రారు వీరెవ్వరు
-----------------------------

నువ్వు కోరుకున్నవారు
ఈ రోజున మిగిలిలేరు
నిన్ను కోరుకున్నవారు
ఏనాడో మలిగినారు

అన్నీ తెలిసే నాటికి
దేనిపైనా ఆశుండదు
అన్నీ అమరేనాటికి
ఆకలంటూ అసలుండదు

ఆశించినవన్నీ అందిన
అందమైన ఒక రోజున
ఎందుకివన్నీ అంటూ
నీ మనసే అడుగుతుంది

ఎందుకిలా జీవితాన్ని
వృధగా గడిపావంటూ
చరమాంకంలో నిన్ను
నీ ఆత్మే కడుగుతుంది

అన్నీ ఉన్నా ఏమీ లేకుండా
ఏదీ లేకున్నా ఏమీ కాకుండా
ఉండే విద్య తెలిసినపుడు
జీవితంలో భయమేముంటుంది?
--------------------------------

ఎన్నిలోకాలు తిరిగినా
నీలోకే నువ్వు తిరిగి రావాలి
ఎన్ని యుగాలు గడచినా
ఇక్కడే ఇంకొక జన్మనెత్తాలి

ఎన్నిసార్లు ఆడమన్నా
ఆడుతాను ఈ ఆటని
ఎన్నిసార్లు పాడమన్నా
పాడుతాను ఈ పాటని

చావే తావైనప్పుడు
చావంటే భయమెందుకు?
నీవే తానైనప్పుడు
నావై తేలడమెందుకు?

ఓటమి నెరుగని వాడికి
ఆటంటే భయమెందుకు?
నాటకమే తనదైనప్పుడు
నటనంటే విసుగెందుకు?

బంధమే లేనప్పుడు
మోక్షాన్ని కోరడమెందుకు?
అంతమే తానైనప్పుడు
అన్యంగా మారడమెందుకు?
--------------------------------
read more " నేటి గతం... "

6, జనవరి 2016, బుధవారం

ఈ పచ్చని పల్లెచేలు...

ఈ కాలపు పిల్లలు కోల్పోతున్నవి ఎన్నో ఉన్నాయి.వారికి పుట్టుకతోనే మొబైలూ,కంప్యూటరూ, అంతర్జాలమూ, మేసేజిలూ, సమాచార బదిలీలూ తెలిసి ఉండవచ్చు.కానీ ఇవేవీ తెలియని పాత తరాల పల్లెటూళ్ళలో ఎంత అందమైన జీవితం ఉండేదో వారికి తెలియదు.

డబ్బూ,భవనాలూ,హంగులూ,కార్లూ,హోటళ్ళ చుట్టూ షికార్లూ ఇవేవీ తెలియకపోయినా ఎంత ఆనందంగా ఆనాటి జీవితాలు గడిచేవో వారు ఊహించలేరు.గుడిసెలలో,మట్టిమిద్దెలలో, కుగ్రామాలలో ఉన్నా,ఆరోజుల ఆత్మీయతలు, అనుబంధాలు ఎంత మధురంగా ఉండేవో,గంజినీళ్ళు మాత్రమే త్రాగినా ఆ జీవితాలు ఎంత తృప్తిగా గడిచేవో  ఈనాటి తరానికి అర్ధం కాదు.

అందుకే - ఆనాటి పల్లెటూళ్ళ జీవితాలను గుర్తు తెచ్చుకుంటూ, ఆరోజులలోకి ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయి వ్రాస్తున్న ఈ కవిత.
-----------------------------------

ఈ పచ్చని పల్లెచేలు
ఈ గాలుల పరిమళాలు
ముసినవ్వుల గడ్డిపూలు
గలగలమను నీటివాలు

పల్లెపడుచు సోయగాలు
మచ్చలేని మానసాలు
నశ్వరమౌ లోకంలో
భగవంతుని చేతివ్రాలు

మిద్దె ఇళ్ళ సౌందర్యం
మనసులలో ఐశ్వర్యం
మంచితనపు మల్లెపూలు
మరపురాని మురిపాలు

సద్దులేని సంతసాలు
ముద్దులొలుకు జీవితాలు
గతితప్పిన లోకానికి
అందరాని సుదూరాలు

అమ్మచేతి చిరుముద్దలు
కమ్మనైన తొలిప్రేమలు
చెట్టుపుట్ట స్నేహాలు
మట్టిమనసు మోహాలు

తొలియవ్వన పరిమళాలు
నిదురించని జ్ఞాపకాలు
వెన్నెల రాత్రుల మాటున
వెంటాడే అనుభవాలు

మట్టివాసనలు మోసే
మధురమైన చల్లగాలి
మనసు విప్పి చెప్పలేక
ఒదిగిపోవు చెలి కౌగిలి

చెలిచూపుల విరితూపులు
అరవిరిసిన మరుమాలలు
కల్మషమెరుగని వలపులు
కలల తేలియాడు తలపులు

మాయమర్మమెరుగనట్టి
మరపురాని వదనాలు
చెట్లనీడలను మెట్టిన
స్వర్గతుల్య సదనాలు

పట్నవాస మసిసోకని
పల్లెవాటు జీవితాలు
ప్రకృతిమాత లాలనలో
పరవశించు పావురాలు

నాగరికతలే ఎరుగని
నాణ్యమైన మనసులు
సోమరితనమే తెలియని
స్వచ్చమైన మనుషులు

భూమిమీద స్వర్గమంటె
ఎక్కడనో లేదంటా
గతకాలపు పల్లెటూళ్ళ
ముంగిటనే ఉందంటా...
read more " ఈ పచ్చని పల్లెచేలు... "

5, జనవరి 2016, మంగళవారం

నిన్న రాత్రి...

నిన్న రాత్రి
నిశీధసమయంలో
నీ తలపే నన్ను తట్టి లేపింది
సుదూర గగనపు
శూన్యలోకాలనుంచి
నీ పిలుపే నన్ను పట్టి కుదిపింది

జన్మజన్మాంతర బంధమేదో
నన్నెందుకు మరచావని
నన్ను నిలువదీసింది
కాలానికి ఎదురు వెళ్లి
లోకాలను అధిగమించి
తనను చేరుకోడానికి
తత్క్షణమే రమ్మంది

మనసు పొరల లోతులలో
తన్ను మరచి నిద్రించే
జ్ఞాపకమొక్కటి నేడు
ఒళ్ళు విరుచుకుంటోంది
నీకోసం నేనింకా
వేచే ఉన్నానంటూ
యుగయుగాల నా నెచ్చెలి
మనసులోన మెరిసింది

జనన మరణ చక్రానికి
ఆవల వెలిగే ఆర్ణవంలో
యుగయుగాలుగా నాకై
వేచి ఉన్న ఆత్మ ఒకటి
నన్ను మరచి ఈ మాయలో
ఏం చేస్తున్నావంటూ
మౌనంగా ప్రశ్నించింది

ఆకలి దప్పులకతీతంగా
చీకటి తప్పులకు సుదూరంగా
నిత్యం వెలిగే లోకం నుంచి
కాలపు గోడలను చీల్చుతూ
చాచిన నా నేస్తపు ప్రేమహస్తం
నా గుండెను సుతారంగా తాకింది

మనది కాని దేశంలో
మనది కాని వేషంలో
మానవ నిమ్నత్వాల మాటున
అక్కడేం చేస్తున్నావంటూ
అతీత పధాలలో నడచే
అలౌకిక జీవమొకటి
నా చెవిలో గునిసింది

పిశాచాల పందిరిలో
ప్రేమసుమం కోసం వెదకే
నీ ప్రయత్నం వృధా అంటూ
ఏదో లోకపు అంచులనుండి 
ఎప్పుడూ వినని స్వరం ఒకటి
మృదుమధురంగా నాలో పలికింది

నీ ఇంటిని నీవు మరచి
నీ ఒంటికి బానిసవై
నువ్వు పడే అగచాట్లను
నీ ప్రేయసినైన నేను
నింగిమెట్లపై నిలబడి
నిత్యం వీక్షిస్తున్నానంటూ
నిర్మలస్వరమొక్కటి
నాలో వినవచ్చింది

నిశీధ నగరపు నివాసాన్ని
విషాద పంకపు వినోదాన్ని
అసాధ్యమైనా సరే అధిగమించి
నిద్దుర వదలిన పొద్దులలో
హద్దుల నెరుగని ఒద్దికలో
నిత్యనివాసం కోసం
నాతో రమ్మంటూ పిలిచింది

లోకాలన్నీ చెరిగి మలిగినా
కాలమనేదే లేకుండా అరిగినా
శోక తాపాలేవీ అంటని తావులో
మనిద్దరం ఒక్కరుగా కరగి
మరపులేని మౌనంలో మునిగి
మహస్సులో నిలుద్దాం రమ్మంది

నిన్న రాత్రి
నిశీధసమయంలో
నీ తలపే నన్ను తట్టి లేపింది
సుదూర గగనపు
శూన్యలోకాలనుంచి
నీ పిలుపే నన్ను పట్టి కుదిపింది....
read more " నిన్న రాత్రి... "

2, జనవరి 2016, శనివారం

Cheluveye Ninna Nodalu - Dr.Raj Kumar



చెలువెయే నిన్న నోడలు...

అంటూ డా|| రాజ్ కుమార్ పాడిన ఈ పాట కన్నడ మధురగీతాలలో ఒకటి.ఈ పాట 'హోసబెళకు' అనే కన్నడ రొమాంటిక్ చిత్రం లోనిది. ఈ పాట మధ్యలో జానకి,రాజ్ కుమార్ అన్నటువంటి సరిగమల హమ్మింగ్ వస్తుంది.దానిని ట్రాక్ లో అలాగే ఉంచాను.ఈ పాటకు అదే అసలైన అందం. రాజ్ కుమార్ తన మధుర స్వరంలో దీనిని ఎంతో మధురంగా ఆలపించాడు.

నూతన సంవత్సరంలో మొదటిపోస్ట్ గా నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని ఒక్కసారి వినండి మరి.

Movie:--Hosabelaku (1982)
Lyrics:--Chi.Udaya Sankar
Music:--M.Ranga Rao
Singers:--Dr.Raj Kumar, S.Janaki
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------------

(Cheluveye ninna noDalu maathugaLu baradavanu
Bareyutha hosa kavitheya haaDuva noDi andavanu )... (2)
Cheluveye ninna noDalu

Nee naguthire hoovu araLuvudu
Nee naDedare latheyu baLukuvudooo...

pani sari sani
mapa nisa nida
gapa ga mapa
(ga ma pa sa ) ... (3)

Nee naguthire hoovu araLuvudu
Nee naDedare latheyu baLukuvudooo
(Premageethe haaDidaaga ) (2)
Kogile kooDa naachuvudu


Cheluveye ninna noDalu maathugaLu baradavanu
Bareyutha hosa kavitheya haaDuva noDi andavanoo
Cheluveye ninna noDalooo...


Ee santhasa yendu heege irali
Ee sambhramaaa sukhava thumbutha barali

pani sari sani
mapa nisa nida
gapa ga mapa
(ga ma pa sa ) ... (3)

Ee santhasa yendu heege irali
Ee sambhrama sukhava thumbutha barali
(Indu banda hosa vasantha ) (2)
KanasugaLa nana saagisali...

Cheluveye ninna noDalu maathugaLu baradavanu
Bareyutha hosa kavitheya haaDuva noDi andavanu
Cheluveye ninna noDalu...

Meaning

O Darling !
Your looks produce
a torrent of words in my mind
Your beauty is creating
new poetry in me

When you smile
flowers blossom
when you walk
creepers feel bad
On listening to our love song
even the cuckoo dances

Let this joy stay eternal
let this celebration bring comfort to us
from today,new spring comes to life
Let us travel together in our dreams

O Darling !
Your looks produce
a torrent of words in my mind
Your beauty is creating
new poetry in me

తెలుగు స్వేచ్చానువాదం

ఓ చెలియా !
నిన్ను చూస్తుంటే
నాలో పదాలు ఉప్పొంగుతున్నాయి
నీ అందాన్ని చూస్తుంటే
నాలో కొత్త కొత్త కవితలు పుట్టుకొస్తున్నాయి

నువ్వు నవ్వితే
పూలు వికసిస్తున్నాయి
నువ్వు నడిస్తే
లతలు చిన్నబోతున్నాయి
మన ప్రేమగీతం వింటూ
కోకిల కూడా సంతోషంతో నాట్యం చేస్తోంది

ఈ సంతోషం కలకాలం నిలవాలి
ఈ పండుగ మనకు ఆనందాన్ని తేవాలి
ఈరోజునుంచి కొత్త వసంతం మొదలౌతున్నది
పద ! మన కలల లోకంలో విహరిద్దాం

ఓ చెలియా !
నిన్ను చూస్తుంటే
నాలో పదాలు ఉప్పొంగుతున్నాయి
నీ అందాన్ని చూస్తుంటే
నాలో కొత్త కొత్త కవితలు పుట్టుకొస్తున్నాయి
read more " Cheluveye Ninna Nodalu - Dr.Raj Kumar "