'బయట ఎక్కడ చూసినా అందరూ మా మతంలోకి మారు, మా కల్ట్ లోకి మారు అని ఒకటే ఊదరగొడుతున్నారు' అంది గతంలో ఒక శిష్యురాలు.
'అవును. నక్సులైట్లు మీ ఇంటికి కూడా వచ్చారా?' అడిగాను.
'నక్సులైట్లా? వాళ్లెవరు?' అడిగింది.
అంటే, అలా ఇళ్ళంబడి తిరిగి మారమని పోరుపెట్టేవాళ్ళని నేనలా పిలుస్తాను. హోమియోలో నక్సువామికా అని ఒక మందుంది. ఆ పేషంట్లకు కాస్త అతి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటివాళ్ళను నేను అలా పిలుస్తూ ఉంటాను' అన్నాను.
'చాలామంది తగిలారు' అన్నది.
'మరి మారకుండా ఇంకా ఇలాగే ఉన్నావే/' అడిగాను.
'పెద్దలమార్గం అని కొంతమంది వచ్చారు. తర్వాత పిల్లలమార్గం అని ఇంకొంతమంది వచ్చారు' అన్నది.
'ఏం? యువకులమార్గం, ముసలోళ్ళమార్గం రాలేదా?' అడిగాను.
'లేదు. సహజమార్గం వాళ్ళొచ్చారు. ఆ తర్వాత బెమ్మకుమారీలు, సాయిబాబీలు, దేవకన్యలు వచ్చారు. నల్లముసుగులేమో అలా రాకపోయినా స్నేహంగా ఉంటూ మతం మార్చాలని చూశారు. ఇస్ ఖానులు కూడా ట్రై చేశారు. నేనెవ్వరికీ పడలేదు. ఎందుకో వాళ్లెవరూ నాకు నచ్చలేదు. పడినట్లైతే ఎక్కడ తేలేదాన్నో?' అన్నది.
'అది నీ అదృష్టం. పడితే, ఎక్కడ తేలేదానివో నీకే కాదు ఎవరికీ తెలీదు. నిజం చెప్పాలంటే ఇక తేలడం ఉండదు. మునిగి-'పోవడమే' అన్నాను.
'మీరు కూడా అంతేనా?' అన్నది సూటిగా.
'నేనేమైనా నిన్ను మారు మారు అని చెప్పానా ఎప్పుడైనా? అడిగాను.
'లేదు. అందుకే ధైర్యంగా అడుగుతున్నాను' అన్నది.
'దేనిగానూ మారవద్దు, అసలు మారవలసిన పనే లేదు' అనే నేను చెబుతాను. నువ్వు దేనిగానూ మారవలసిన పని లేదు. నువ్వు నువ్వుగా ఉంటే చాలు' అన్నాను.
'అందరూ అలాగే ఉన్నారు కదా? తేడా ఏముంది?' అన్నది.
'అందరూ అలా లేరు. అందరూ తమ సహజస్థితినుండి మారిపోయే ఉన్నారు. అలా మారినవాళ్ళని నక్సులైట్లు మళ్ళీ మారుస్తున్నారు. అంటే, ఇప్పటికే కల్తీ అయిన నూనెలో ఇంకా కల్తీని కలుపుతున్నారు. అదేమో మడ్డినూనెగా మారుతున్నది. ఆ మడ్డి అంతా వదిలించుకొని నువ్వు నువ్వుగా మారమని మాత్రమే నేను చెబుతున్నాను. కానీ అది నువ్వనుకుంటున్న 'మారడం' కాదు. ఇప్పటికే మారి, అంటించుకున్నదాన్ని వదిలించుకోవడం' అన్నాను.
'యిప్పుడు నేనేం చెయ్యాలి?' అడిగింది.
'ఏమీ చెయ్యద్దు. ఊరకే మాతో కలసి ఉండు. నీలో ఉన్న మురికి అంతా అదే వదిలిపోవడం నువ్వే చూస్తావు' అన్నాను.
'అదెలా జరుగుతుంది?' అడిగింది.
'ఎలా జరిగితే నీకెందుకు? చెప్పినట్లు ఉండు. జరగనప్పుడు అడుగు' అన్నాను.