అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

6, మార్చి 2026, శుక్రవారం

అర్ధముందా అసలు?

సప్త సముద్రాలను దాటానని

చిందులేసినవాడు

చివరకు దోమ చేతిలో చచ్చాడు


ఎన్నో లోకాలను చూశానని

ఎచ్చులేసిన తల్లి

ఎర్రికుక్క చేతిలో చచ్చింది


మనిషి పొగరుకు అర్ధముందా అసలు?


రాజులమంటూ విర్రవీగినవారిని

రంకుపురాణం చంపింది

పోజులెన్నో కొట్టినవాళ్లను

పొల్లుమాట చంపింది


మనిషి పొగరుకు అర్ధముందా అసలు?


ప్రపంచాన్ని గెలిచానన్నవాడు 

పనికిరాని చావు చచ్చాడు

అందరినీ భయపెట్టానన్నవాడు 

అర్ధంలేని చావు చచ్చాడు


మనిషి పొగరుకు అర్ధముందా అసలు?


పెద్దపనులు చేశానన్నవాడు

పెరటిదొడ్లో చచ్చాడు

చంద్రమండలానికెళ్ళానన్నవాడు

చెయ్యెత్తలేని స్థితిలో చచ్చాడు



మనిషి పొగరుకు అర్ధముందా అసలు?


కోట్లు కూడబెట్టినవాడు

కోమాలో చచ్చాడు

మహోపన్యాసకుడు

మాటరానిస్థితిలో చచ్చాడు


మనిషి పొగరుకు అర్ధముందా అసలు?


ఏమి చేసినా ఎన్ని సాధించినా

అహాన్ని నీ తలకెక్కనీకు నేస్తం


నీలాంటివాళ్ళు నీకంటే గొప్పవాళ్ళు

ఎందరో పోయారిక్కడ 


రేపేమి జరుగుతుందో తెలీని బ్రతుకులో

మనిషి పొగరుకు అర్ధముందా అసలు?


నీ అహంకారానికి అర్ధముందా అసలు?