23, మార్చి 2026, సోమవారం

మన హిందూమతం చాలా గొప్పది

'ఫలానా హిందూసంస్థ నుండి మాట్లాడుతున్నాము' అంటూ ఈమధ్య ఒక ఫోన్ కాలొచ్చింది.

పరిచయాలయ్యాక. 'ఎందుకు ఫోన్ చేస్తున్నారు?' అడిగాను.

'మీ కృషి చాలా బాగుంది. మీ వ్రాతలన్నీ మేము చదువుతాము. ముఖ్యంగా, క్రైస్తవాన్ని, ఇస్లాంను మీరు విమర్శించే తీరు బాగుంటుంది' అన్నారు.

'మన హిందూమతాన్ని కూడా విమర్శిస్తూనే ఉంటాను. అది చదవలేదా?' అడిగాను.

'చదువుతున్నాము. అందుకే ఈ ఫోన్. మనల్ని మనమే విమర్శించుకుంటే ఎలా?' అన్నాడాయన.

'ఆత్మవిమర్శ మంచిదేగా?' అడిగాను.

'అది తగ్గించి, ఇతర మతాలను ఎండగట్టడంపైన దృష్టి పెట్టండి. ఇది మా రిక్వెస్ట్' అన్నాడు.

'అది సరే. కానీ మన  హిందువుల పిచ్చిపోకడలను వదిలేస్తానని మాత్రం చెప్పలేను' అన్నాను.

'అది చెయ్యడానికి మతాచార్యులున్నారుగా?' అన్నాడు.

'ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు మన మతాచార్యులు?' అడిగాను.

'అంటే వాళ్ళ పరిమితులు వాళ్ళకుంటాయి కదండీ' అన్నాడు.

'పరిమితులుంటాయి సరే. హిందువులు తప్పులు చేస్తున్నపుడు, 'ఇది తప్పు. వద్దు చెయ్యకండి' అని ఎందుకు చెప్పడం లేదు? హిందూమత మూలాల గురించి, అసలైన హిందూమతం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు?' అడిగాను.

దానికి జవాబు చెప్పకుండా, 'మనమందరం ఐకమత్యంగా ఉండాల్సిన సమయం వచ్చింది' అన్నాడు.

'ఇప్పుడు క్రొత్తగా వచ్చేదేముంది? చరిత్రలో ఇటువంటి కాలాలు చాలాసార్లు వచ్చాయి. చాలాసార్లు మనం ఫెయిలయ్యాం' అన్నాను.

'కనుకనే ఇప్పుడు మనం కలిసుండాలి' అన్నాడు.

'కలిసుండక విడిపోయిందెప్పుడు?' అన్నాను.

'అంటే, అందరూ ఒక్క త్రాటిపైకి రావాలి' అన్నాడు.

ఆయన మాటలు రాజకీయ పడికట్టు పదాలలాగా ధ్వనించాయి.

'ఎక్కడుంది ఆ త్రాడు?' అడిగాను.

 జవాబు లేదు.

'మీరు చెప్పలేకపోయినా, నేను చెబుతున్నాను వినండి. నేనా త్రాటిపైననే ఉన్నాను. లేనివాళ్ళని దానిపైకి రమ్మనే నేనూ చెబుతున్నాను. ఈ క్రమంలోనే మన హిందూమతంలోకి రోజురోజుకూ వచ్చి చేరుతున్న పిచ్చిపోకడలను ఖండిస్తున్నాను' అన్నాను.

'కొంచెం వివరిస్తారా?' అడిగాడు.

'చూడండి. శివుడు, విష్ణువు. అమ్మవారు, ఇతర ప్రామాణిక హిందూదేవతలందరినీ మేము   ఒప్పుకుంటాము. క్రొత్తగా తయారౌతున్నవారిని, చేర్చబడుతున్నవారిని మాత్రం ఒప్పుకోము. పోతే, వైష్ణవులు శైవాన్ని ఒప్పుకుంటారా?' అడిగాను.

'ఒప్పుకోరనుకోండి. దానిని కూడా మేము ప్రయత్నిస్తున్నాము' అన్నాడు.

' మరి శైవులు వైష్ణవాన్ని ఒప్పుకుంటారా?' అడిగాను.

' ఒప్పుకోరు' అన్నాడు.

' అలాగే,  ఏ శాఖైనా మిగతావారిని ఒప్పుకోవు. ఇదంతా తప్పని, దేవతాస్వరూపాలన్నీ ఒకే పరబ్రహ్మము యొక్క  అనేకరూపాలని ఏ ఆచార్యుడు, ఏ గురువు చెబుతున్నారు?' అడిగాను.

' మేమూ ప్రయత్నిస్తున్నాము. ఈ సత్యాన్ని జనంలోకి తీసికెళ్ళడానికి' అన్నాను.

'దానిని అర్ధం అయ్యేటట్లుగా చేయాలంటే, పురాణకధలను వదలిపెట్టి, ఉపనిషత్తులను బోధనాగ్రంధాలుగా తీసుకోవాలి. పురాణాలు పామరజనంకోసం వ్రాయబడినవి. ఉపనిషత్తులు జ్ఞానభాండాగారాలు. సామాన్యజనానికి కూడా వాటిలోని జ్ఞానాన్ని వివరించి చెప్పాలి.' అన్నాను.

' సామాన్యజనం వాటిని అర్ధం చేసుకోవడం కష్టమే. మేమూ ప్రయత్నిస్తున్నాము' అన్నాడు.

'నేనూ అదే చేస్తున్నాను. ఆత్మవిమర్శ లేకపోతే, మనకున్న అతిఉదారత్వానికి, అసలు సత్యమే కొన్నాళ్ళకు మరుగునపడే ప్రమాదముంది మరి' అన్నాను.

'మాకు మీరిచ్చే సలహా?' అడిగాడు చివరకు.

'ఇతరమతాల డొల్లతనాన్ని ఎండగట్టవలసిందే. అదే సమయంలో, మన హిందూమతంలో ఇప్పటికే ఉన్నవీ, క్రొత్తగా చేరుతున్నవీ వెర్రిపోకడలను కూడా ఎండగట్టాలి. తొలగించాలి. ఈ రెండుపనులూ సమాంతరంగా సాగాలి. అప్పుడే అసలైన హిందూమతమెంత గొప్పదో, దానిని అర్ధం చేసుకోలేక, హిందువులమనుకుంటున్నవారు కూడా ఎలా  తప్పుదారిన పోతున్నారో, జనాలకు అర్ధమౌతుంది. దానినే నా పుస్తకాల ద్వారా, మా సంస్థద్వారా నేను చేస్తున్నాను. చాలామందిని ఇప్పటికే జాగృతపరచాను. ఇంకా కొనసాగిస్తున్నాను' అన్నాను.

'ప్రణామాలు' అని ఫోన్ పెట్టేశాడాయన.