అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

30, సెప్టెంబర్ 2025, మంగళవారం

పదకొండో అవతారం

పొద్దున్నే ఫ్రెండ్ ఫోన్ చేశాడు.

'ఈ వార్త విన్నావా?' అన్నాడు సంభ్రమంగా.

'ఏంటది?' అన్నాను.

'ఈ ఏడాది అమ్మవారికి పదకొండో అవతారం వచ్చింది' అన్నాడు.

'ఏం? పది సరిపోలేదా?' అన్నాను నిరాసక్తంగా.

'అవును. ఈ ఏడాది పదకొండు తిథులొచ్చాయి. అందుకే పదకొండు అవతారాలు' అన్నాడు.

'బాగుంది నీ అవతారం' అన్నాను.

'నువ్విలాంటివేవీ చెయ్యవు కదా. నీకు తెలీదులే' అన్నాడు.

'అసలు అమ్మవారంటే ఏంటో తెలిస్తే ఇన్ని అవతారాలతో పనుండదు' అన్నాను.

'అదేంటి?' అన్నాడు.

'పోనీ నీ అవతారమేంటో తెలుసుకున్నా, ఇన్ని అవతారాలతో పనుండదు' అన్నాను.

'ఇదీ అర్ధం కాలేదు' అన్నాడు.

'ఫోన్ పెట్టేసి నీ వ్యాపారం నువ్వు చేసుకో' అన్నాను.

'నాకేం వ్యాపారం లేదు' అన్నాడు.

'పోనీ ఇంకొకరి వ్యాపారంలో సమిధవై పో' అన్నాను.

ఫ్రెండ్ ఫోన్ పెట్టేశాడు.

నవరాత్రులు మళ్ళీ నవ్వుతున్నాయి.

read more " పదకొండో అవతారం "

29, సెప్టెంబర్ 2025, సోమవారం

మైకుకు మోక్షం

నిన్న రాత్రి ఏదో పనుండి ప్రక్క పల్లెకెళ్ళాను

ఆ టైములో కూడా,  ఒక గుడిపైన మైకు జోరుగా మ్రోగుతోంది.

ఏవో జానపద భక్తిగీతాలు పెద్ద సౌండుతో వినవస్తున్నాయి

గుడిలో ఒక్క పురుగు లేదు.

అమ్మవారు అయోమయంగా చూస్తోంది.

'నవరాత్రుల మైకు' అన్నది ప్రక్కనున్న శిష్యురాలు

'నాల్రోజుల్లో దానికి మోక్షం గ్యారంటీ' అన్నాను ఏడుస్తున్న ప్రశాంతతను చూస్తూ.

read more " మైకుకు మోక్షం "

22, సెప్టెంబర్ 2025, సోమవారం

నవ్వుతున్న నవరాత్రులు

ప్రక్కఊరినుండి అప్పుడపుడు కొంతమంది ఏదో పనిమీద ఆశ్రమానికి వస్తూ ఉంటారు. వారిలో ఒకతను ఈ మధ్యన ఇలా అడిగాడు.

'ప్రతి ఏడాది మా గుడిలో నవరాత్రులు చేస్తాము. మీరూ ఆశ్రమంలో చేస్తారా?'

'రాత్రులను మనం చేసేదేముంది? అవే వచ్చిపోతుంటాయి' అన్నాను.

షాకయ్యాడు.

'అంటే, అమ్మవారికి ప్రత్యేకపూజలు ఏవీ చెయ్యరా?' అడిగాడు అనుమానంగా.

'ప్రత్యేకంగా చేసేది పూజ ఎలా అవుతుంది?' అన్నాను.

అయోమయంగా చూచాడు.

'మరి నైవేద్యాలు?' భయంగా అడిగాడు.

'కాలానికి మనం అవుతున్నాంగా ప్రతిరోజూ - నైవేద్యం' అన్నాను.

కాసేపు మాటరాలేదు.

'మరి మైకులు భజనలు ఉండవా?' అన్నాడు.

'అమ్మవారికి చెవుడు లేదు. ఆమెకు భజనపరులు నచ్చరు' అన్నాను.

అతను లేచి వెళ్ళిపోయాడు.

నవరాత్రులు నవ్వుతున్నాయి.

read more " నవ్వుతున్న నవరాత్రులు "

18, సెప్టెంబర్ 2025, గురువారం

కోట్లాదిదేశభక్తుల వేలాది సంవత్సరాల కలల ప్రతిరూపం - నరేంద్రమోదీ గారు

146 కోట్ల ప్రజలు. అంతకంటే ఎక్కువ సమస్యలు. 

దేశంనిండా దేశద్రోహులు. నల్లడబ్బు, అవినీతికంపు. సొంతదేశాన్ని బలహీనపరచి విదేశాలకు అమ్మేయాలని ప్రయత్నించే రాజకీయశక్తులు. వాటికి విదేశీసహాయాలు, వీరిని గుడ్డిగా నమ్మే పిచ్చిజనాలు, సరిహద్దు గొడవలు, దేశద్రోహపార్టీలు, వర్గవిభేదాలు, కులవిభేదాలు,  అవకాశవాదాలు, మతమార్పిడులు, జిహాద్ లు, కమ్యూనిష్టు విషప్రచారాలు, టెర్రరిస్టుల దాడులు, కుట్రలు, కుతంత్రాలతో రకరకాలుగా చీల్చబడుతూ సర్వనాశనం దిశగా శరవేగంగా పోతున్న దేశం.

ఇలాంటిస్థితిలో దేశపగ్గాలు చేపట్టారు మోదీగారు.

ఆయనకు కుటుంబం లేదు. 

ఒకప్పుడు ఉండేది, దేశంకోసం కుటుంబాన్ని వదులుకున్నారు. 

ఆయనకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు.

కోట్లకు కోట్లు నల్లధనం లేదు.

ఆయన తినేది చాలా తక్కువ. అదికూడా పూర్తి శాకాహారం.

నిద్రపోయేది రోజుకు 3 గంటలు. 

దేశంకోసం కష్టపడేది 21 గంటలు.

ఏడాదిలో ఎక్కువరోజులు ఉపవాసదీక్షలు. నేలమీద నిద్రిస్తారు.

విలాసాలు లేవు. సరదాలు లేవు. ఇతర వ్యాపకాలు లేవు.

క్రమశిక్షణతో కూడిన జీవితం.

ఉన్నతమైన ఆదర్శాలతో కూడిన ఆలోచనావిధానం.

75 ఏళ్ల వయసులో కూడా అలసిపోని దేహం.

చెరిగిపోని చిరునవ్వు.

తను ఏ దేశంకోసం పాటుపడుతున్నాడో, అదేదేశంలో దాదాపు సగంమంది తనను వ్యతిరేకించినా, ఆ వ్యతిరేకతకు మతపిచ్చి తప్ప ఏ ఇతరకారణమూ లేకపోయినా, చెదరని సంకల్పశక్తి. 

వారికి కూడా అభివృద్ధి ఫలాలను, ఫలితాలను సమానంగా అందించే ఉదారత్వం.

అదీ నరేంద్రమోదీగారు !

పదేళ్లు తిరిగాయి.

ఒకప్పుడు అన్నిదేశాల దగ్గరా అప్పులు చేసిన దేశం, ఈనాడు అన్ని అప్పులూ తీర్చేసింది. చిన్నదేశాలను ఆదుకునే స్థితికి ఎదిగింది. 

నేడు మనదేశం అన్ని రంగాలలో ముందుకు పోతూ,  అగ్రరాజ్యాల బెదిరింపులకు లొంగకుండా, వాటికే షరతులు విధిస్తూ, వాటితో సమానంగా అంతర్జాతీయ వేదికలపైన నిలబడిందంటే - నరేంద్రమోదీ గారు మాత్రమే కారణం !

'సన్యాసి రాజ్యపాలన చేస్తాడు' అని వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాసింది ఈయన గురించే.

మోదీగారు కాషాయవస్త్రాలు కట్టుకోనక్కరలేదు. కానీ, ఆయన ఏ పీఠాధిపతికీ, ఏ స్వామీజీకి తక్కువ కాదు. నిజానికి వాళ్లలో చాలామంది ఈయన కాలిగోటికి కూడా ఏమాత్రమూ సరిపోరు.

కారణం?

వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు హాయిగా చేసుకుంటున్నారు. 

ఈయ దేశంకోసం పాటుపడుతున్నాడు.

ఎవరు ఎక్కువ?

దేశం బాగుంటే కదా మతం, ధర్మం బాగుండేది?

చట్టం సరిగ్గా ఉంటేకదా మఠాధిపతులైనా, మతాధిపతులైనా, నిర్భయంగా తిరగగలిగేది?

మోదీగారు ఒక రాజర్షి.

జనకమహారాజు గురించి మనం చదివాము. శివాజీ మహారాజు గురించి చదివాము. గురు గోవింద్ సింగ్ గురించి చదివాము. ఇప్ప్పుడు మోదీగారిలో వారందరినీ చూస్తున్నాము.

ఇటువంటి రాజర్షి, ఇటువంటి కర్మయోగి మన ప్రధానమంత్రిగా ఉండటం కోట్లాది భారతీయుల పుణ్యఫలం.

ఎంతమంది దేశభక్తుల ఎన్నివేల ఏళ్ల ప్రార్ధనల ఫలితమో ఈనాడు ఈ రాజర్షి మన దేశసారధి అయ్యాడు.

ఈయనకు నిన్న 75 ఏళ్ళు నిండాయి.

ఇంకా 25 ఏళ్ళు, నిండునూరేళ్ళు, ఈయన ఇదేవిధంగా జీవించాలని, దేశాన్ని మున్ముందుకు నడిపించాలని,  మన దేశపు పూర్వవైభవాన్ని మళ్ళీ ఆవిష్కరించాలని, పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను.

మనదేశంలో వేలాదిసంవత్సరాలుగా పుట్టిన అందరు మహనీయుల ఆశీస్సులూ ఈయనపైన ఉండుగాక !

పరమేశ్వరుని కటాక్షం ఈయనపైన పరిపూర్ణంగా ఉండుగాక ! 

జై మోదీజీ ! జై భరతమాత ! జై హింద్ !

read more " కోట్లాదిదేశభక్తుల వేలాది సంవత్సరాల కలల ప్రతిరూపం - నరేంద్రమోదీ గారు "

15, సెప్టెంబర్ 2025, సోమవారం

దీపపు కుదురు

అయితే,

ఎర్రజెండా మొండి మనుషులు

లేకపోతే, 

తురకబాబా మూఢభక్తులు


కాకపోతే,

కొలుపులు, బలుపులు, బలులు

ఇంకా చాలకపోతే,

కోరికల భజనలు, దీక్షలు, పూజలు


అదీకాదంటే,

పిరమిడ్లు, సమాధుల దొడ్లు, సూక్ష్మలోక ప్రయాణాలు


ఇదీ ఒంగోలు చుట్టుప్రక్కల గోల . . . 


మనుషుల అజ్ఞానం ఎంత దట్టంగా ఉందంటే

చిమ్మచీకటి కూడా దీనిని చూచి సిగ్గుపడుతోంది


చెవిటివాడికి శంఖం ఊదటం ఎలాగో 

వీరికి అసలైన ఆధ్యాత్మికత నేర్పడం అలాగ


అందుకే,

ఒంగోలు బుక్ ఎగ్జిబిషన్లో మా బుక్ స్టాల్

ఇదే మొదటిసారి,

ఇదే చివరిసారి కూడా


ఎడారిలో చిరుదీపం వెలుగుతోంది

దాని వెలుగు చాలా దూరానికి ప్రసరిస్తోంది

కానీ కుదురుదగ్గర మాత్రం

చీకటిగానే ఉంది.


ఏ దీపమైనా ఇంతేనేమో?

read more " దీపపు కుదురు "

8, సెప్టెంబర్ 2025, సోమవారం

ఏడవ రిట్రీట్ విశేషాలు

 



ఏడవ ఆధ్యాత్మిక సాధనాసమ్మేళనం ఈనెల 5 వ తేదీ నుండి 7 వ తేదీ వరకు పంచవటి ఆశ్రమప్రాంగణంలో జరిగింది.

ఊకదంపుడు ఉపన్యాసాలకు, సోదికబుర్లకు పూర్తివ్యతిరేకదిశలో సాగుతున్న మా నడక, ఉత్త థియరీని వదలిపెట్టి, ఆచరణాత్మకమైన ఆధ్యాత్మికమార్గంలో శరవేగంతో ముందుకు పోతోంది.

సాధనామార్గంలో పురోగమిస్తున్న శిష్యులకు ఆశీస్సులనందిస్తూ, ఉన్నతస్థాయికి చెందిన ఒక ధ్యానవిధానంలో వీరికి దీక్షనిచ్చాను. అందుకున్నవారు అదృష్టవంతులు.  వీరిలో ఒక 13 ఏళ్ల చిన్నపిల్ల కూడా ఉన్నది. ఇంత చిన్నవయసులో ఇటువంటి దీక్షను పొందటం ఈమె అదృష్టం. ఏమంటే, అసలైన హిందూమతం ఇదే. అసలైన సనాతన ధర్మమార్గం ఇదే. కోట్లాదిమందికి 83 వచ్చినా ఇది దొరకదు. అలాంటిది 13 ఏళ్ల వయసులో ఇది లభించడం అదృష్టం కాకపోతే మరేమిటి?

నిజానికి, సాధన మొదలుపెట్టవలసింది ఈ వయసులోనే. దైవకటాక్షంతో లభించిన ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోమని వారికి గుర్తుచేస్తున్నాను.

మూడురోజులపాటు బయటప్రపంచాన్ని మర్చిపోయి ఆశ్రమంలోని  ప్రశాంతవాతావరణంలో సాధనలో సమయాన్ని గడిపిన శిష్యులందరూ తిరిగి వారివారి ఇళ్లకు ఈ రోజు ఉదయానికి చేరుకున్నారు.

తిరిగి డిసెంబర్ లో జరుగబోయే సాధనాసమ్మేళనంలో కలుసుకుందామనిన సంకల్పంతో ఈ రిట్రీట్ విజయవంతంగా ముగిసింది.

మనుషులనేవారు కనిపించడం అరుదైపోయిన ఈ రొచ్చుప్రపంచంలో, కనీసం కొంతమందినైనా నిజమైన మనుషులను తయారు చేయగలుగుతున్నానన్న సంతృప్తిని నాకు మిగిల్చింది.

read more " ఏడవ రిట్రీట్ విశేషాలు "