“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, నవంబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 62 (నా కోరికలు తీరడం నాకిష్టం లేదు)

పన్నెండేళ్ల నుంచీ చెప్పిందే చెబుతూ, రాసిందే రాస్తూ, పట్టువదలని విక్రమార్కుడిలాగా నా భావజాలమేంటో చెబుతూనే ఉన్నాను. అయినా, ఈరోజుకు కూడా, నేనేం చెబుతున్నానో అర్ధం చేసుకోకుండా నాకేదో బోధించాలని చూచే మూర్ఖశిఖామణులు ఉంటూనే ఉంటారు. ఇది నా ఖర్మ అయితే, అది వాళ్ళ ఖర్మ.

నిన్న ఒక ఆగంతకుని నుండి మెయిలొచ్చింది, 'గురూజీ. మీ బ్లాగు పోస్టులు చదివాను. మీతో అర్జంటుగా మాట్లాడాలి. మీ ఫోన్ నంబర్ ఇస్తారా?' అని.

'నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను. వాట్సాప్ కాల్ మాట్లాడను. మీరు మామూలు కాల్ చేస్తానంటే నా ఫోన్ నంబర్ ఇస్తాను, అప్పుడు మనం ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు' అని మెయిలిచ్చాను. అతను చెయ్యడని నాకు తెలుసు.

అనుకున్నట్లే ఇలా రిప్లై వచ్చింది.

'సారీ అండి. మీరు ఇండియాలో ఉన్నారనుకున్నాను. మామూలు కాల్ చేస్తే నాకు బోలెడంత మోగుతుంది. అందుకని మెయిలే చేస్తున్నాను' అంటూ తను చెప్పాలనుకున్నది మెయిల్లో రాసుకొచ్చాడు.

మెయిల్లోనే మా సంభాషణ జరిగింది.

'మీ బ్లాగు పోస్టులు చదువుతున్నాను. మీకు జ్ఞానం ఉందిగానీ పరిపూర్ణజ్ఞానం లేదు. మా గురువుగారిని అనుసరిస్తే మీకు పరిపూర్ణమైన జ్ఞానం వొస్తుంది' అనేది ఆ మెయిలు సారాంశం.

'నేను పరిపూర్ణజ్ఞానినని చెప్పినట్లు నాకెప్పుడూ గుర్తులేదు. అంతటి పరిపూర్ణజ్ఞానంటూ ప్రస్తుతం ఈ భూమ్మీద ఒకడున్నాడని కూడా నాకు నమ్మకం లేదు. ఇంతకీ మీ గురువెవరు?' అడిగాను.

'ఫలానా' అంటూ ఒక పాపులర్ గురువు పేరు చెప్పాడతను.

నవ్వీనవ్వీ దగ్గుతో నాకు కొరపోయింది.

కాలక్షేపం అంటూ లేకుండా అమెరికాలో ఊరకే ఉన్నానేమో, 'భలే మంచి చౌకబేరమూ' అనిపించింది.  బాగా ఆడుకుందామనుకున్నా.

'మీ గురువుగారు నాకంటే ఏ విధంగా ఎక్కువో ముందు చెప్పండి. ఆ తరువాత నేను మీతో చేరతానో లేదో చెబుతా' అన్నాను.

అతను వెంటనే హర్టయ్యాడు.

'ఏంటి? ఏమనుకుంటున్నారు మా గురువుగారంటే? మా సంస్థ చిన్నాచితకది కాదు. మా గురువుగారి దగ్గర ఇన్ని వేలకోట్లున్నాయి, మీ దగ్గరెన్ని ఉన్నాయి?' అన్నాడు.

'ఓహో ! కోట్లుండటం గురుత్వానికి, జ్ఞానానికి చిహ్నమా?' అనుకొని,' రెడ్ లైట్ క్వీన్ రేష్మాబేగం దగ్గర కూడా కోట్లున్నాయి. మనిద్దరం ఆమె ఆశ్రమంలో చేరదామా మరి?' అడిగాను.

ఇంకా తీవ్రంగా హర్టయ్యాడు. 

'అదేంటండి అలా మాట్లాడతారు? మా గురువుగారిని రెడ్ లైట్ అంటారా?' అన్నాడు.

'రెడ్ లైట్ చూపించేవాడే గురువౌతాడు. మీరు చేసే ప్రతిపనికీ గ్రీన్ లైట్ చూపిస్తే వాడూ మీలాంటి  మామూలు మనిషే. వాడికీ మీకూ తేడా ఏముంటుంది?' అన్నాను.

ఇలా కాదనుకున్నాడో ఏమో, మాటమార్చాడు.

'మా సాధనలలో ఒక్కదానిని చేసి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది' అన్నాడు.

'అదేంటో చెప్పండి వింటాను' అన్నాను.

'తెల్లవారు జామున 3 గంటలకి నిద్రలేవండి. ఒక కోరికను మనసులో అనుకోండి. వారంలో మీ కోరిక తీరకపోతే అప్పుడు చెప్పండి' అన్నాడు రోషంగా.

పొద్దున్నే ఈ పిచ్చోడెక్కడ దొరికాడ్రా దేవుడా? అనుకున్నా.

'అంత పొద్దున్నే లేవడమెందుకు? కోరికలు కోరుకోవడమెందుకు?' అన్నాను.

'లేకపోతే ఎలా తీరుతాయి మీ కోరికలు?' అన్నాడు.

'వీడికి నిజంగా పిచ్చే' అని నాకు ఖాయమైపోయింది. కొద్దోగొప్పో పిచ్చి లేనిదే ఆధ్యాత్మికం ఛాయలకు ఎవరూ రారని మా ఫ్రెండ్ శ్రీకాంత్ అంటూ ఉండేవాడు గతంలో. అది నిజమైనందుకు సంతోషం కలిగింది.

'నా కోరికలు తీరడం నాకిష్టం లేదు' అన్నాను.

ఖంగుతిన్నాడు పిచ్చోడు.

'అదేంటి?' అని సందేహం వెలిబుచ్చాడు.

'అవును కోరికలన్నీ తీరిపోతే ఆ తరువాత ఇంకేముంటుంది?  అంతా శున్యమేగా? అందికని, నా కోరికలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి.  అప్పుడే జీవితంలో ఆనందం ఉంటుంది. ఇదే నా ఫిలాసపీ. అందుకే, కోరికలను తీర్చుకోవద్దని, ఇంకా ఇంకా పెంచుకోమని మాత్రమే నేను నా శిష్యులకు బోధిస్తూ ఉంటాను. కనుక మీ సాధన నాకు పూలిష్ గా కనిపిస్తున్నది. తెల్లవారుజామున మూడింటికి నిద్రలేవడమేంట్రా పిచ్చోడా? నేనూ లేవను, నువ్వూ లేవకు. అది మనిద్దరి ఆరోగ్యానికి మంచిది కాదు' అన్నాను.

రిప్లై రాలేదు. ఇక రాదని కూడా నాకర్ధమైపోయింది. అందుకని నేనే ఇలా మెయిలిచ్చాను.

'చూడు గుర్నాధం ! అన్ని వేలకోట్లు బ్లాక్ మనీ వెనకేసిన మీ గురువుగారికి కూడా ఇంకా కోరికలు మిగిలున్నాయి చూడు. అదే ఆయన ఖర్మని నామాటగా ఆయనకు చెప్పు. అయినా ఆ కోట్లన్నీ ఎలా వొచ్చాయి ఆయనకు? ఏమైనా కష్టపడి సంపాదించాడా? డొనేషన్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్సే కదా అంతా. అంత బిజినెస్ ప్లాన్లు నాకు లేవని ఆయనతో చెప్పు. ఇంకోమాట. అంత పొద్దున్నే లేచి కలలు కంటూ కూచోవద్దని కూడా చెప్పు, ఆ కలలేవో హాయిగా పడుకొని కనమను. ఇంట్లోవాళ్లకు బాధ తప్పుతుంది. ఎందుకంటే, ఆయన లేచాడని వాళ్ళు కూడా లేచి కాఫీనీళ్ళు ఆయన మొహాన పొయ్యాలి కదా ! వాళ్ళ నిద్ర ఎందుకు చెడగొట్టడం? ఇకపోతే, ఇలాంటి చెత్త సలహాలు ఇస్తూ మళ్ళీ నాకు మెయిల్ చెయ్యకు. నీ మెయిల్ ఐడీ బ్లాక్ చేస్తున్నాను. 

చివరగా ఒక సలహా. మీ గురువుగారిని వచ్చి నాదగ్గర కొన్నాళ్ళుండి నేను చెప్పేది నేర్చుకోమని చెప్పు, బాగుపడతాడు. నీకంత ధైర్యం లేదని నాకు తెలుసు. కానీ నిజాన్ని చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. ఉంటా మరి, చెత్తమెయిల్స్ చెయ్యకు' అని చెప్పి అతన్ని బ్లాక్ చేసేశాను.

అదీ సంగతి.

వెనకటికి కొంతమంది గుడ్డోళ్లు చేరి, కళ్ళున్నవాళ్లకు దారిచూపిస్తాం రమ్మన్నారట  

కలికాలమంటే ఇదేనేమో ?