“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, జూన్ 2022, బుధవారం

హిందూమతంలో 3 కోట్లు, 33 కోట్లమంది దేవతలున్నారా? అసలు నిజమేంటి?

తెలిసీతెలియక, మిడిమిడి జ్ఞానంతో, హిందూమతాన్ని విమర్శించే అల్పబుద్ధులు తరచుగా చేసే ఆరోపణ ఒకటుంది. 

'మీ హిందూమతంలో 3 కోట్లమంది దేవతలున్నారటగా? 33 కోట్లమంది దేవతలున్నారటగా?' అనేదే ఆ ఆరోపణ.

అసలీ మాట ఎలా వచ్చిందో చెప్తా వినండి.

ఈ ఆరోపణకు ఎక్కడా ఆధారాలు లేవు. ఇది వాస్తవం కాదు. కానీ వేదంలో 33 మంది దేవతలు చెప్పబడ్డారు. వారు ఎవరికళ్ళకైనా ఎదురుగా కనిపించే ప్రకృతిశక్తులే గాని, ఇతరమతాలలో లాగా రకరకాల పేర్లతో కనిపించే కల్పిత దేవుళ్ళు కారు.

వీరు వ్యక్తులు కారు, ప్రకృతి శక్తులు.

ఎవరా వేదంలో చెప్పబడిన 33 మంది దేవతలు? 'వసురుద్రాదిత్యుల'నే మాటను గుర్తుంచుకుంటే ఈ 33 మంది దేవతలూ గుర్తుంటారు. వీరికి విశ్వేదేవతలని పేరు. అంటే విశ్వంలో ఉన్న దేవతలని, విశ్వాన్ని నడిపిస్తున్న దేవతాశక్తులని అర్థం.

శుక్లయజుర్వేదమునకు చెందిన శతపధ బ్రాహ్మణం (4.5.7.2) ఇలా అంటున్నది.

| అష్టౌ వసవః | ఏకాదశ రుద్రా | ద్వాదశాదిత్యా: ఇమే ఏవ ద్యావా పృథివీ త్రయస్త్రింశౌ త్రయస్త్రింశాద్వై దేవాః  ||    

అష్టవసువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశాదిత్యులు, ద్యులోకము (ఆకాశము), పృధివి (భూమి) కలసి ముప్పది ముగ్గురు దేవతలుగా ఉన్నారు.

అష్టవసువులు - 8 మంది.
ఏకాదశ రుద్రులు - 11 మంది.
ద్వాదశాదిత్యులు - 12 మంది
ద్యులోకము, పృధివి - 2
 
మొత్తం - 33 మంది దేవతలు. వీరికి వివరణ, ఉపనిషత్తులలో మనకు గోచరిస్తుంది.

శుక్ల యజుర్వేదమునకు చెందిన బృహదారణ్యక ఉపనిషత్ (3. 9. 2) లో యాజ్ఞవల్క్య ఋషి ఇలా చెప్పినారు.

| అష్టౌ వసవః | ఏకాదశ రుద్రా | ద్వాదశాదిత్యా: త ఏకత్రింశదైన్ద్రశ్చైవ ప్రజాపతిశ్చ త్రయస్త్రింశావితి ||

అష్టవసువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశాదిత్యులు ఈ ముప్పది ఒక్కరు, ఇంద్రుడు, ప్రజాపతులతో కలసి, మొత్తం ముప్పది ముగ్గురు దేవతలు అవుతారు.

శతపధబ్రాహ్మణంలో ఆకాశము, భూమి అని చెప్పబడినవి, బృహదారణ్యక ఉపనిషత్తులో ఇంద్రుడు, ప్రజాపతి యని చెప్పబడ్డారు. ఆకాశమంటే స్వర్గము. దానికి అధిపతి ఇంద్రుడు. భూమికి అధిపతి (భూమిపైన ఉన్న ప్రజలకు లేదా జీవులకు అధిపతి) ప్రజాపతి. కనుక, ఈ రెండు ప్రమాణములలో భేదం లేదు.

ఇప్పుడు, వీరంతా ఎవరో విడివిడిగా చూద్దాం.

అష్టవసువులు ఎవరు?

శ్లో || ధరో ధ్రువశ్చ సోమశ్చ అహశ్చైవానిలో2నలః
ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవౌష్టౌ ప్రకీర్తితాః   (మహాభారతం ఆదిపర్వం 66.18)

ధర (భూమి), ధ్రువ (ధ్రువనక్షత్రము లేదా నక్షత్రములు), సోమ (చంద్రుడు), అహ (పగలు), అనిల (వాయువు), అనల (అగ్ని), ప్రత్యూష (ఉషస్సు), ప్రభాస (సూర్యుడు). 

బృహదారణ్యక ఉపనిషత్ (3. 9. 3) లో యాజ్ఞవల్క్య ఋషి ఇలా చెప్పినారు.

శ్లో || కతమే వసవా ఇతి | అగ్నిశ్చ పృధ్వీచ వాయుశ్చాన్తరిక్షం చాదిత్యశ్చ ద్యౌశ్చ చంద్రమాశ్చ నక్షత్రాణిచ ఏతే వసవః ఏతేషు హీదం సర్వం హితమితి తస్మాద్ వసవ ఇతి ||

వసువులెవరు? అగ్ని, పృధివి, వాయువు, అంతరిక్షము, ఆదిత్యుడు, ద్యులోకము, చంద్రుడు, నక్షత్రములు ఇవి వసువులు. వీటిలోనే అన్నీ నిలచియున్నాయి గనుక, నివసిస్తున్నాయి గనుక, ఇవి వసువులనబడతాయి.

'వీటిలోనే అన్నీ నిలచియున్నాయి' అంటే అర్థమేంటి? సృష్టి మొత్తం వీటిలోనే ఇమిడియుంది, నిలచియుంది, మనుగడను సాగిస్తున్నది. ఏ మతంవారైనా,  ఏ కులంవారైనా, ఏ దేశంవారైనా, దేవుడిని నమ్మేవారైనా, నమ్మని నాస్తికులైనా అందరూ వేదంలో చెప్పబడిన ఈ దేవతల పరిధిలోనే ఉన్నారు. వీటినెవ్వరూ కాదనలేరు. వసించడానికి ఆధారములు గనుక ఇవి 'వసువులు' అనబడతాయి. వీటిని దేవతాస్వరూపాలుగా దర్శించింది వేదం.

మనల్ని కనినవారిని, పెంచి పోషిస్తున్నవారిని, ఆదరిస్తున్నవారిని  కృతజ్ఞతాపూర్వకంగా దేవతలుగా భావించడం మానవధర్మం ! 

మేలుచేస్తున్నవారిని కూడా లెక్కచెయ్యకుండా, ఉంటున్న దేశానికి, తింటున్న తిండికి, త్రాగుతున్న నీటికి, పీలుస్తున్న గాలికి, విశ్వాసంగా లేకుండా, ఎక్కడో కనిపించని కల్పితదేవుడిని నానా పేర్లతో పూజించడము, డబ్బులకోసం మతాలు మారడము, అలా మారనివారిని, పూజించనివారిని చంపడము, విధ్వంసం సృష్టించడం రాక్షసధర్మం అవుతుంది. మనలో ఎవరు మానవులో, ఎవరు రాక్షసులో, మీరే ఆలోచించండి మరి ! 

కనుక, వసువులను దాటి ఈ సృష్టిలో ఎవరూ లేరు.


ఏకాదశ రుద్రులు

బృహదారణ్యక ఉపనిషత్ (3. 9. 4) లో యాజ్ఞవల్క్య ఋషి ఇలా చెప్పినారు.

|| కతమే రుద్రా ఇతి | దశేమే పురుషే ప్రాణాః ఆత్మా ఏకాదశః తే యదస్మాత్ శరీరాన్ మర్త్యాద్ ఉత్క్రామంత్యతా రోదయంతి తద్యద్రోదయంతి తస్మాద్ రుద్ర ఇతి || 

రుద్రులెవరు? పురుషుని దశప్రాణములు, పదకొండవదియైన ఆత్మ కలసి, దేహమును వదలిపోయేటప్పుడు రోదింపజేస్తాయి గనుక రుద్రులనబడతాయి.

'రుద్రుడు' అనే మాటకు రోదింపజేసేవాడు అని అర్ధం. లయకారకుడే రుద్రుడు. అంటే, మరణాన్ని కొనితెచ్చేవాడు. నాశనం చేసేవాడు అని అర్ధాలు. నిత్యమూ జరుగుతున్న సృష్టి స్థితి లయములలోని లయమును చేసే శక్తికే 'రుద్రా' అని పేరు. ఇది బ్రహ్మముయొక్క లయప్రధానమైన శక్తి.

మనిషిలోని అయిదు జ్ఞానేంద్రియములను, అయిదు కర్మేంద్రియములను, పది వాయువులు నడిపిస్తున్నాయి. పదకొండవది మనస్సు. దీనినే ఇక్కడ ఆత్మ అని పిలిచారు. మనిషిని ఇవి విడచిపోయే సమయంలో మిక్కిలి బాధను కలిగిస్తాయి. ఏడిపిస్తాయి. కనుక ఇది 'రుద్రులు' అనబడతాయి. ఈ ప్రక్రియకు మీ మతంతో మీ కులంతో సంబంధం లేదు. మీరు వీటిని నమ్మినా నమ్మకపోయినా వీటి అదుపులోనే మీ బ్రతుకు ఉంటుంది.

బ్రతుకులోనూ, చావులోనూ ఈ పదకొండు శక్తులూ మిమ్మల్ని ఏడిపిస్తూనే ఉంటాయి. రోదింపజేస్తూనే ఉంటాయి.

కనుక, రుద్రులను దాటి ఈ సృష్టిలో ఎవరూ లేరు.

ద్వాదశాదిత్యులు

బృహదారణ్యక ఉపనిషత్ (3. 9. 5) లో యాజ్ఞవల్క్య ఋషి ఇలా చెప్పినారు.

కతమ ఆదిత్యా ఇతి | ద్వాదశ వై మాసా: సంవత్సరస్య ఏత ఆదిత్యా: ఏతే హీదం సర్వం ఆదదానా యాన్తి | తే యదిదం సర్వం ఆదదానా యన్తి | తస్మాద్ ఆదిత్యా ఇతి || 

ఆదిత్యులెవరు? సంవత్సరంలో పన్నెండు నెలలున్నాయి. ఒక్కొక్క నెలలో సూర్యుని శక్తి ఒక్కొక్కవిధంగా ఉంటుంది. కనుక పన్నెండుమంది సూర్యులౌతారు. సర్వమునూ అవి హరిస్తాయి. అన్నింటినీ హరిస్తాయి గనుక ఆదిత్యులని అంటాము.

ప్రతిరోజూ కనిపిస్తున్న సూర్యోదయమును చూచి 'ఆహా ఎంత మనోహరంగా ఉంది సూర్యోదయం' అనుకుంటాం. కానీ ప్రతి సూర్యోదయంతో, నీ జీవితంలో ఒకరోజు తగ్గిపోతుందన్న సత్యాన్ని గుర్తించు. సూర్యుడు ప్రాణుల జీవితాలను పోషించడమే కాదు, హరిస్తున్నాడు కూడా. పన్నెండు నెలలలో పన్నెండు విధములుగా సూర్యుని శక్తి ఉంటుంది.  డిసెంబర్ లో సూర్యుడు వేరు. మే నెలలో సూర్యుడు వేరు. ఇది అందరికీ తెలుసు. ప్రాణుల జీవితాలను పోషిస్తూ, వారి ఆయుస్సును హరిస్తున్నవారే పన్నెండుమంది ఆదిత్యులు. వీరికి మీ మతంతో మీ కులంతో పని లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితాలను వీరు హరిస్తూనే ఉంటారు. వీరిని నమ్మనంత మాత్రాన మీరు ఇక్కడే ఎల్లకాలం ఉండరు. కనుక ప్రతివారూ ఈ ద్వాదశాదిత్యుల అదుపులోనే ఉన్నారు. ఇది సత్యం.

కనుక, ఆదిత్యులను దాటి ఈ సృష్టిలో ఎవరూ లేరు.

అశ్వినీ దేవతలెవరు?

ద్యులోకమంటే శూన్యాకాశము లేదా స్వర్గము. పృధివి అంటే భూమి. ఇంద్రుడు, ప్రజాపతి వీటికి అధిపతులు. మలివేదకాలంలో ఈ పాత్రలు అశ్వినీదేవతలకు ఇవ్వబడినాయి. అశ్వినీ దేవతలంటే, దేవవైద్యులు. సృష్టిలో ఉన్న దేవతలకు గాని, ప్రాణులకు గాని ఏ రోగమొచ్చినా తగ్గించగల మహత్త్వశక్తి ఉన్నవారే అశ్వినీదేవతలు. వైద్యులద్వారా పనిచేసేది వీరి శక్తియే. ఆకాశము, భూమి వీరికి సూచికలు. ఆకాశం నుండి క్రిందకు ప్రసరించే సూర్య, చంద్ర, నక్షత్ర కాంతులు వీరిలో ఒక దేవతయైతే, ప్రాణులకు ఆహారము, నీరు ఇచ్చి పోషించే భూమి రెండవ దేవత.

కనుక, భూమినీ శూన్యాకాశమునూ (భూమ్యాకాశాలనూ, అశ్వినీదేవతలనూ) దాటి ఈ సృష్టిలో ఎవరూ లేరు.

ఈ విధంగా, వాస్తవములైన, సత్యములైన, ముప్పైముగ్గురు దేవతలు వేదంలో చెప్పబడినారు. అంతేగాని, 3 కోట్లు, 33 కోట్లు ఎక్కడా లేరు. వీళ్ళు, పాషండమతాలు కల్పించిన కల్పిత దేవతలు కూడా కారు.

'త్రయస్త్రింశత్కోటి' అనే పదం మనకు ఉపనిషత్తులలో కొన్నిచోట్ల కన్పిస్తుంది. కానీ ఇక్కడ 'కోటి' అంటే, మనమనుకునే నూరులక్షలు కాదు. సంస్కృత భాషలో ఒక పదానికి నూరు అర్ధాలుంటాయి. ఆ సందర్భాన్ని బట్టి ఆ అర్ధాన్ని తీసుకోవాలి గాని విపరీతార్ధాన్ని తీసుకోకూడదు. సందర్భానికి సరిపోయే సరియైన అర్ధాన్ని గ్రహించాలంటే సంస్కృతభాషా పరిజ్ఞానం ఉండాలి. మామూలు గ్రామ్యభాషాపదాలనే సరిగ్గా పలకలేని పల్లెటూరి బైతులకు వేదంలోని సంస్కృత పదాల అర్ధాలెలా తెలుస్తాయి?

'కోటి' అంటే గుంపు అని ఇక్కడ అర్ధం. 'త్రయస్త్రింశత్కోటి' అంటే, ముప్పది మూడు దేవతల సమూహము, గుంపు అని అర్ధమేగాని,  'ముప్పది మూడు కోట్లమంది దేవతలు' అని అర్ధం కాదు.  సంస్కృత వ్యాకరణం తెలిస్తే ఇవన్నీ అర్ధమౌతాయి. తెలిసీ తెలియకుండా వాగుతుంటే మీ తెలివితక్కువతనమే బయటపడుతుంది.

అయితే, జ్ఞానులతో ఇలాంటి వితండవాదాలు పెట్టుకునేవారు వేదకాలంలో కూడా ఉండేవారు. కొత్తేమీ కాదు. పాషండులు, వితండులు, మూర్ఖశిఖామణులు సృష్టి మొదటినుంచీ ఉన్నారు. 

బృహదారణ్యక ఉపనిషత్తులో శాకల్యుడనే వాడు, యాజ్ఞవల్క్యమహర్షితో వాదన పెట్టుకునే ఘట్టం వర్ణింపబడినది. అందులో శాకల్యుడు 'దేవతలెంతమంది?' అని మహర్షిని ప్రశ్నిస్తాడు. దానికి మహర్షి, వెయ్యి ముప్పైముగ్గురని, వందా ముప్పై ముగ్గురని, ముప్పై ముగ్గురని, ఆరుగురని, ముగ్గురని, ఒకటిన్నర అని, ఒక్కడే దైవమని, వీరందరూ ఒకే బ్రహ్మము యొక్క విభూతులని, చాలా ఓపికగా అతనికి వివరిస్తూ వస్తాడు. అదంతా బృహదారణ్యక ఉపనిషత్తులో మనం చూడవచ్చు.

ఆయా మంత్రముల, శ్లోకముల రిఫరెన్సులు పైన ఇచ్చాను. చూడండి, ఉపనిషత్తులను చదవండి. సత్యాలను గ్రహించండి.

విశ్వశక్తులే వేదంలో చెప్పబడిన 33 మంది దేవతలు. వీరంతా ఒకే బ్రహ్మము యొక్క వివిధరూపములు, మరియు శక్తులు, విభూతులు (manifestations, energies and glories). అంతేగాని వేర్వేరు మానవరూపములు కారు.

దేవత అంటే తేజోవంతమైన శక్తిస్వరూపమని అర్ధం. హిందూమతంలో నేడు మనకు కనిపించే దేవతలందరూ ఒకే పరబ్రహ్మముయొక్క వివిధరూపములే. 'ఏకం సత్ విప్రా బహుధా వదంతి' అనే ఋగ్వేదవాక్యమే దీనికి ప్రమాణం. ఒకే భగవంతుని శక్తి సృష్టిలో అణువణువునా  ఎన్నో రూపాలలో ఉంటూ, ప్రాణులను పోషిస్తున్నది. అది సృష్టికి అతీతంగానూ ఉన్నది.  సృష్టిలో నిండి కూడా ఉన్నది.

సృష్టిని చేసిందీ అదే, సృష్టిగా మారిందీ అదే. సృష్టీ అదే. ఈ అత్యుత్తమమైన భావన ఒక్క హిందూమతంలోనే మనకు గోచరిస్తుంది.

సృష్టిలో దైవమే ఉన్నది గనుక, అందరినీ అన్నింటినీ గౌరవభావంతో మనం చూస్తాం. అన్నింటిలో ఉన్న ఏకైక బ్రహ్మమునే మనం ఆరాధిస్తాం. సర్వే సర్వత్రా నిండియున్న దైవమునే మనం  పూజిస్తాం. రాయిలో రప్పలో చెట్లలో కొండలలో నదులలో భూమిలో ఆకాశంలో అంతటా నిండియున్న బ్రహ్మమునే హిందువు పూజిస్తాడు. అంతేగాని, హిందువులు రాళ్లను రప్పలను పూజించరు. వాళ్లకు మూడుకోట్లమంది, ముప్పైమూడు కోట్లమంది దేవతలూ లేరు. వాళ్ళ మతం పాషండమతాలలాగా తెలివిలేని మూర్ఖపుమతం కాదు.

ఇప్పటివరకూ భూమిపైన పుట్టిన ఏ మనిషైనా, ఏ ప్రాణి అయినా, ప్రవక్తలైనా, చివరకు అవతారపురుషులైనా సరే, అందరూ కూడా, వసురుద్రాదిత్య, ఇంద్ర, ప్రజాపతులనే ఈ 33 దేవతల అధీనంలో బ్రతికినవారే. వీటికి అతీతంగా ఎవరూ లేరు. ఉండరు కూడా. వీరు మన కనుల ఎదురుగా కనిపిస్తున్న ప్రత్యక్ష దేవతలు. ఇతరమతాలలో చెప్పబడిన కల్పిత దేవతలు కారు.

ఇప్పుడు చెప్పండి, హిందూమతంలో ఎంతమంది దేవతలున్నారు? 

విషయాన్ని సరిగ్గా బుర్రపెట్టి అర్ధం చేసుకోండి. అప్పుడు హిందూమతం ఎంత ఉన్నతమైనదో అర్ధం అవుతుంది. తెలిసీ తెలియకుండా వాగే పాషండమతాలలో ఎంత విషం ఉందో అర్ధమౌతుంది.

(త్వరలో రాబోతున్న In Defence of Hinduism అనే పుస్తకం నుండి ఒక భాగం, మచ్చుకు మీకోసం----)