“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, జూన్ 2022, బుధవారం

మా ఆశ్రమం మొదలైంది - 6 (సత్యాన్వేషణ)

సత్యాన్వేషకులు చాలామంది ఏసీ రూములలో కూచుని సోషల్ మీడియాలో పోస్టులు రాస్తుంటారు. వీడియోలు చేస్తుంటారు. లేదా అమెరికాలో విలాసవంతమైన జీవితాలు గడుపుతూ, అప్పుడప్పుడూ అన్నమాచార్య కీర్తనలు పాడుకుంటూ, అదేదో గొప్ప ఘనకార్యమని భ్రమిస్తూ ఉంటారు. యూట్యూబు వీడియోలు చూసి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు.

కానీ, సత్యాన్వేషణ అనేది సుఖంతో కూడిన జీవితంతో రాదు. త్యాగాలతోనూ, కష్టాలతోనే అది వస్తుంది.

మెహర్ బాబా గారైతే, 'నీ అంతట నువ్వు ఎంతగా బాధల్ని వరిస్తావో అంతగా ఆధ్యాత్మికంగా ఎదుగుతావు' అనేవారు. స్వయానా ఆయన జీవితమంతా అలాగే గడిచింది మరి !

మొన్న శనివారం రాత్రి, ఆశ్రమ ప్రారంభానికి వచ్చిన 42 మందీ, ఆశ్రమస్థలంలోనే ఉన్నాం. పొలంలోని మట్టిలో టార్పాలిన్ పట్టనొకదానిని పరుచుకుని దానిపైనే రాత్రంతా పడుకున్నాం.  కొంతమంది కటికనేలమీద పొలం మట్టిలోనే పడుకున్నారు. ఎటు చూసినా జనసంచారం లేదు. దగ్గరలో ఉన్న పల్లెటూరికి పోవాలంటే 2 కి, మీ నడవాలి. కరెంట్ లేదు. వసతులు లేవు. సభ్యులందరూ ఏసీ రూములలో హాయిగా పడుకునేవారే. కానీ ఇక్కడ కనీసం ఫ్యాన్ కూడా లేదు. అయినా సరే, హాయిగా నీలాకాశం క్రింద గాలికి నిద్రించారు.  అందరికీ హాయిగా మంచి నిద్ర పట్టింది. వాళ్ళ ఇళ్లలో కూడా అంత హాయిగా నిద్రపట్టలేదని నాతో అన్నారు. పాములొస్తాయని, పురుగులు కుడతాయని, దొంగలొచ్చి దోచుకుంటారని ఏ భయమూ లేదు. ఆ కటికచీకట్లో రాత్రంతా హాయిగా నిద్రపోయారు. ఏమౌతుందో అనే ఆలోచనే రాలేదు. సేఫ్టీ గురించి చింతే లేదు. ఆడవాళ్ళందరినీ, దగ్గరలోని పల్లెటూరిలో మేము తీసుకున్న ఇంటికి వెళ్లి అక్కడ నిద్రించమని, పొద్దున్నే లేచి కార్లలో రమ్మని చెప్పాను, కానీ వాళ్ళు కూడా మాతోనే అక్కడే ఉంటామన్నారు. అలాగే ఉన్నారు కూడా.

ఆదివారం జిల్లెళ్ళమూడికి వెళ్ళినపుడు, వసుంధరక్కయ్యతో ఈ విషయాన్నీ చెబితే, ఆమె ఇలా అన్నారు.

'1960 లలో జిల్లెళ్ళమూడిలో కూడా అలాగే ఉండేది. ఏ వసతులూ లేవు. అమ్మ మాతోబాటే నేలమీదే పడుకునేది.  మేము అమ్మ చుట్టూ కటిక పొలాలలో నేలమీదనే పడుకునేవాళ్ళం. అమ్మ దర్శనం కోసం వచ్చిన వాళ్ళు కూడా, అలాగే మట్టిలోనే నిద్రపోయేవారు. మట్టిలోనే కూచునేవారు, ఉండేవారు. అదే మట్టిని వచ్చినవాళ్ళను ప్రసాదంగా ఇచ్చేది అమ్మ'.

'ప్రస్తుతం మా పరిస్థితీ అంతే' అన్నాను.

ఒక ఆశయం కోసం తపించేవాళ్ళు సౌకర్యాలను ఎందుకు పట్టించుకుంటారు? సుఖాలే కావాలంటే హాయిగా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఏసీల క్రింద ఉండవచ్చు కదా? పడుతూ లేస్తూ ఇంతదూరం వచ్చి, బేసిక్ సౌకర్యాలు కూడా లేనిచోట, ఇంత రిస్క్ చేసి అడవిలో ఉంటూ, ఒక మనిషిని ఇంతగా నమ్ముతున్నారంటే, ఇది సత్యాన్వేషణ కాకపోతే మరేమిటి?

జిల్లెళ్ళమూడి నుండి మా ఆశ్రమానికి తిరిగి వచ్చాక, రాత్రిపూట కూర్చొని మాట్లాడుతూ, మా వాళ్ళతో ఇలా చెప్పాను.

'మీ అందరూ అతిత్వరలో ఎన్నో అతీతానుభవాలను పొందబోతున్నారు. ఈరోజు నేను చెబుతున్న ఈ మాటను రికార్డ్ చేసి పెట్టుకోండి. దైవాన్ని మీరు ప్రత్యక్షంగా దర్శిస్తారు. అంతేకాదు, మిమ్మల్ని చూచి, ముందుముందు ఎంతోమంది నేర్చుకుంటారు. మన సాధనామార్గాన్ని గురించి తెలుసుకుంటారు. ధన్యులౌతారు. నన్ను నమ్మి, ఈరోజున మీరు పడుతున్న కష్టం వృధా కాదు. నా మాట నిజం కావడాన్ని అతి త్వరలో మీరు చూస్తారు,  మన ఆశ్రమంలో ముందుముందు ఎంతో సాధన జరుగుతుంది. మీరే చేస్తారు. ఇక్కడికి వచ్చినవాళ్లు ధన్యులౌతారు.'

తనకోసం ఇంతగా తపించేవారికి భగవంతుడు మాత్రం దూరంగా ఎలా ఉండగలడు? ఎంతకాలం ఉండగలడు? 

(ఇంకా ఉంది)