“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, జూన్ 2022, మంగళవారం

మా ఆశ్రమం మొదలైంది - 4 (ముందు మానవత్వం - తరువాతే దైవత్వం)

ఆశ్రమం ప్రారంభ ఈవెంట్స్ ఫోటోలు చూశారు కదా ! అందుకే అదంతా మళ్ళీ వివరించను. ఎందుకంటే, నూరు మాటలకంటే ఒక ఫోటో ఎక్కువ చెబుతుంది కాబట్టి ! కాకపోతే కొన్ని విషయాలు చెబుతాను. చెప్పకపోతే ఇవి అర్ధం కావు కాబట్టి.

నలభై ఏళ్ళనుంచీ నేనెప్పుడూ చెప్పే మాట ఒకటుంది. అదేంటో తెలుసా?

'మానవత్వమే లేనివాడికి దైవత్వం ఎలా వస్తుంది?' అనేదే ఆ మాట.

ఆధ్యాత్మికమార్గంలో మొట్టమొదట ఉండవలసిన లక్షణం - మానవత్వం. మనిషిని మనిషిగా చూచి, మానవత్వంతో స్పందించలేనివాడికి దైవత్వం ఎన్ని జన్మలెత్తినా రాదని నేనంటాను. ఇది నామాట మాత్రమే కాదు. మహనీయులందరి మాటా ఇదే.

మా ఆశ్రమం పనిని ఒక దీక్షగా స్వీకరించి నలభై రోజులనుంచీ ఆశ్రమం దగ్గర్లోని దొడ్డవరం గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని సతీసమేతంగా ఉంటూ, ఏసీ లేకుండా, కరెంట్ మాటమాటకీ పోతుంటే, దోమలతో కుట్టించుకుంటూ, నానాబాధలూ పడుతూ కూడా, అవేమీ పట్టించుకోకుండా 'వన్ మ్యాన్ ఆర్మీ'గా పనిచేసి, ఆశ్రమానికి ఒక రూపురేఖలు తెచ్చిన ఘనుడు 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ (ఇండియా)'సెక్రటరీ శ్రీరామమూర్తి. తననూ, తన శ్రీమతినీ ఈ సందర్భంగా సత్కరించుకున్నాం. అది మా ప్రేమ మాత్రమే కాదు మా బాధ్యత కూడా.

అదే సమయంలో, మూర్తికి చేదోడు వాదోడుగా ఉంటూ, పనులలో ఎంతో సహాయం చేసిన వారిని కూడా ఈ సందర్భంలో సత్కరించాం. మనకు సహాయం చేసిన వారిని మనం ఎన్నటికీ మరచిపోకూడదు.

వాళ్ళు పనివారే కావచ్చు. డబ్బులకు పని చేసి ఉండవచ్చు. కానీ, ఆ పరిధిని దాటి ముందుకొచ్చి, మానవత్వంతో మాటసాయంతో, చెరువు త్రవ్వకంలోగాని, ఫెన్సింగ్ వెయ్యడంలోగాని, గేటు పెట్టడంలో గాని, పొలం లెవెలింగ్ చెయ్యడంలోగాని, ఇతర ఎన్నో పనులలో, మూర్తికి ఎంతో చేదోడువాదోడుగా ఉన్న హరిబాబు, రామారావు అనబడే స్థానికులను కూడా యధాశక్తిగా సత్కరించుకున్నాం. వారు మొహమాటపడ్డారు. కానీ వారిని సత్కరించుకోకపోతే అది మా ఆత్మను బాధపెడుతుంది.

అదేవిధంగా, దొడ్డవరం స్థానికుడైన వెంకటసుబ్బయ్యను కూడా కృతజ్ఞతాపూర్వకంగా సత్కరించుకున్నాం. మారుమూల పల్లెలో కమ్మవారి కుటుంబంలో పుట్టి, చదువుకుని ఒక సాఫ్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ కూడా, మన సనాతనధర్మం మీద ప్రేమతో, సంస్కృతంలో పీ.హెచ్.డీ చేస్తూ, యోగశాస్త్రానికీ, వేదంలోని అతిరుద్రానికీ గల సంబంధం పైన రీసెర్చి చేస్తున్న ఉత్తముడీయన. దొడ్డవరం గ్రామంలో మూర్తికి ఈయన ఎంతో సాయం చేశారు.  నా బ్లాగును చదివి మా సంస్థపట్ల ఆకర్షితుడైన ఈయన, వారి గ్రామం ప్రక్కనే మా ఆశ్రమం వస్తున్నదని తెలుసుకుని, వెదుక్కుంటూ వచ్చి మూర్తిని పరిచయం చేసుకుని చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అందుకని, ఈయనను కూడా సత్కరించుకున్నాం. ఎంతోమంది నేటి బ్రాహ్మణులలో లేని ఉత్తమసంస్కారం ఈయనలో ఉన్నది.

అంతేనా?

నేషనల్ హైవే మీద ఉన్న పంతులుగారి హోటల్ నుండి మాకు టిఫిన్లు, భోజనాలు తెచ్చి పెట్టే ఆటోడ్రైవర్ పేరు సుభాని. ట్రెడిషనల్ ముస్లిం వేషంలోనే ఉన్నాడు. ఆటోలో టిఫిన్లు తెచ్చి, దించి వెళ్లిపోబోయాడు. ఎందుకంటే మేం తినడానికి ఇంకా ఆలస్యం ఉంది కాబట్టి. పోబోతున్న అతన్ని ఆపి, 'ముందుగా ఈయనకు టీ ఇవ్వండి' అని ఇప్పించాను. టిఫిన్ తినమంటే, 'ఇప్పుడే తినను, అర్జన్టుగా పని మీద వెళ్ళాలి' అన్నాడు. టిఫిన్ ప్యాక్ చేసి ఇచ్చి, దారిలో తినమని అతనికి చెప్పాము. మొదట్లో ఇదేదో హిందూసంస్థ అనుకుంటూ కొంచం అదొకవిధంగా చూస్తున్న అతను, ఈ స్నేహపూర్వకచర్యతో మెత్తబడి, మాతో కలిసిపోయాడు. 'ముందుముందు మన ప్రయాణం ఎంతో దూరం ఉంది' అని అతనితో అన్నాను.

చాలాసార్లు ఇదే జరుగుతూ ఉంటుంది. ఎన్నో ఫంక్షన్స్ లో, చిన్నాపెద్దా ఎన్నో సహాయాలు చేసినవాళ్ళుంటారు. వాళ్ళు డబ్బులకే పనిచేసి ఉండవచ్చు. కానీ వారిని మనం మరచిపోకూడదు. తిండిదగ్గర అసలు మరచిపోకూడదు. 'వాళ్ళూ మనలాంటి మనుషులే, వాళ్లకూ ఆకలి ఉంటుంది' అన్న స్పృహ కార్యక్రమనిర్వాహకులతో ఉండాలి. గొప్పగొప్ప నీతులు మాట్లాడుకునే మీటింగులలో కూడా ఇలాంటి చిన్నచిన్న విషయాలను మర్చిపోతూ ఉంటారు. అక్కడే ఫెయిలౌతారు. ఈ మానవత్వకోణం లేనివారికి ఆధ్యాత్మికమనేది ఎన్ని జన్మలెత్తినా అందదని నేనంటాను.

ఆధ్యాత్మికమనేది నీ మాటలలో మాత్రమే కాదు. నిత్యజీవితంలో  నువ్వు చేసే చిన్నచిన్న పనులలో కూడా ప్రతిఫలించాలనేదే నేను బోధించే సాధనామార్గంలో ముఖ్యమైన బోధన.

మానవత్వమే లేనివారికి దైవత్వం ఎలా అందుతుంది మరి?

(ఇంకా ఉంది)