“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, జనవరి 2021, సోమవారం

Master CVV జాతక విశ్లేషణ - 6 (సృష్టి పరిణామక్రమం - మోక్షం)

1920 ప్రాంతాలలో అనుకుంటా ఒకరోజున మాస్టర్ సీవీవీ గారి భక్తులందరూ కుటుంబాలతో సహా కుంభకోణానికి వచ్చారు. ఆ రోజున ఆయనలోకి బ్రహ్మం ( దేవుడు, దైవం, పరమాత్మ లేదా పరబ్రహ్మము) దిగివస్తుందని ప్రచారం కాబడింది. ఆయనకారోజున బొందితో పరిపూర్ణదివ్యత్వం వచ్చేస్తుందని అందరూ భావించారు. ఆంధ్రా నుంచి కూడా బోలెడుమంది అక్కడికి చేరుకున్నారు. ఆ రోజు వచ్చింది, పోయింది. వాళ్ళు ఎదురుచూచిన అద్భుతం మాత్రం జరగలేదు. బొందితో దివ్యత్వం ఆయనకు రాలేదు. ఈ విషయం శకుంతలమ్మగారు (సీవీవీగారిని చూచిన ఆయన భక్తురాలు) చెప్పిన ఆడియోలో ఉంది వినండి.

దాదాపుగా అదే సమయంలో, అంటే 24-11-1926 న అరవిందులలోకి కృష్ణుని చైతన్యం దిగి వచ్చిందని ఆయనభక్తులు నమ్ముతూ ఈ నాటికీ దానిని 'సిద్ధిదినం' గా పండుగ చేసుకుంటున్నారు. అయితే, అది పరిపూర్ణసిద్ధి కాదని, ఆ దిశగా ఒక ముందడుగు మాత్రమేనని అరవిందులు మెల్లిగా చెప్పారు. భక్తులు చాలా నిరుత్సాహపడ్డారు. ఆ తరువాత అరవిందులు 1950 లో పోయేవరకూ ఇంకా కొన్ని రోజులు ఇలాంటివే వచ్చాయి. అప్పుడు కూడా వీళ్ళు ఆశించిన అద్భుతాలేవీ జరగలేదు. బొందితో దివ్యత్వం ఆయనకూ రాలేదు. కాకుంటే ఆ దిశగా కొన్ని అడుగులు మాత్రం పడ్డాయి.

వీరిద్దరూ భౌతికఅమరత్వ దిశగా  సాధన చేసినప్పటికీ, ఇద్దరిలోకీ అరవిందుల సాధన చాలా పరిపూర్ణమైనదని నేను విశ్వసిస్తాను. సీవీవీగారి విధానమంతా ప్రాణమయకోశంలో మాత్రమే జరుగుతుంది. మానసిక, అతిమానసిక స్థాయిలతో వారికి పరిచయం లేదు. వెంకమ్మగారు తన సూక్ష్మశరీరంలో నిరాకారలోకానికి వెళ్లి, అక్కడున్న తెల్లని దేవతను అడిగినది 'సీవీవీగారు తనను పంపించారని, ఆయనకు అంతులేని ప్రాణశక్తి కావాలని' మాత్రమే. ఇచ్చానని ఆ దేవత అన్నాడట. కనుక, మౌలికంగా వీరి శిష్యులలో ప్రాణమయకోశంలో మాత్రమే సాధన జరుగుతుంది. అంతకంటే ఈ మార్గం ముందుకు పోదు.

దీనికి భిన్నంగా అరవిందుల సాధన పరిపూర్ణమైనది. అది భౌతికం నుంచి సూపర్ మైండ్ వరకూ అనేక స్థాయిలలో జరుగుతుంది. అందుకే తన యోగాన్ని పూర్ణయోగమని అరవిందులన్నారు. సీవీవీగారి భక్తులు కూడా అరవిందుల ఫిలాసఫీతో ప్రభావితులయ్యారు. అరవిందుల 'సావిత్రి' గ్రంధాన్ని కొత్త రామకోటయ్యగారు అనువాదం చెయ్యడమే దీనికి ఉదాహరణ !

నిజాలిలా ఉంటే, ఇక శిష్యులు ఏమేమి కధలు కల్పిస్తున్నారో చూస్తే భలే నవ్వొస్తుంది. మచ్చుకి కొన్ని కధలను చెప్పుకుందాం.

అరవిందులు 1910 లో పాండిచ్చేరికి వచ్చి స్థిరపడ్డారు. ఆయన గురువు విష్ణుబాస్కర్ లీలే అనే ఒక మరాఠీ. సీవీవీగారిని కలవమని అరవిందులకు ఆయన చెప్పారని ఒక కథను ప్రచారం చేస్తున్నారు సీవీవీగారి భక్తులలో ఒక వర్గంవారు. అరవిందుల జీవితాన్ని నేను క్షుణ్ణంగా చదివాను. ఇప్పుడుకాదు, 1990 లోనే అరవిందులపైన, ఆయన పూర్ణయోగంపైనా నేనొక సాధికారిక వ్యాసాన్ని వ్రాశాను. అరవిందుల జీవితంలో, నాకెక్కడా అలాంటి సంఘటన కనిపించలేదు. వారెక్కడ చూచారో మరి? అరవిందులు మాత్రం ఏనాడూ సీవీవీగారిని కలవాలని ప్రయత్నం చెయ్యలేదు.

ఇంతేకాదు. ఇలాంటి అబద్దాలను మరికొన్నింటిని చాలామంది సోకాల్డ్ గురువులు ప్రచారం చేస్తున్నారు. నిజాలు తెలియని అమాయకులు అవే నిజాలని నమ్ముతున్నారు.

ఒక గురువు ఇలా చెబుతున్నాడు.

'రామకృష్ణులు తర్వాతి జన్మలో గాయత్రీపరివార్ శ్రీరామశర్మ ఆచార్యగా పుట్టారు. దేవతలకు ఆహారం లేక అల్లాడుతుంటే హోమాలద్వారా వారికి ఆహారం ఇవ్వడానికి ఆయన ఇలా జన్మ ఎత్తారు'. 

ఇంతకంటే పచ్చిఅబద్దం ఇంకెక్కడా ఉండదు. నేను దీనిని చదివినప్పుడు భలే నవ్వొచ్చింది. బ్రహ్మానందం కామెడీ చూస్తే కూడా అంత నవ్వురాదు !

శ్రీ రామశర్మగారు 1911 లో పుట్టారు. రామకృష్ణులు 1886 లో పోయారు. నూరేళ్ళ తర్వాత మళ్ళీ తాను పుడతానని ఆయనన్నట్లు మహేంద్రనాధ గుప్తాగారు 'గాస్పెల్ ఆఫ్  శ్రీరామకృష్ణ' గ్రంధంలో వ్రాశారు. అంటే 1986 తర్వాత అవుతుంది.  మరి 1911 లో పుట్టిన శ్రీరామశర్మగారు శ్రీరామకృష్ణుల అవతారమెలా అవుతారు? ఒకవేళ శ్రీరామకృష్ణులు మళ్ళీ పుడుతుంటే బేలూర్ మఠం వారికి తెలియకుండా పోతుందా? నిరంతరం ఆయన్ను పూజిస్తున్న ఆయన మహాభక్తులకు, ఆయన కోసం వాళ్ళ జీవితాలనే అర్పించిన మహామహులైన స్వామి బ్రహ్మానంద, స్వామి శివానంద మొదలైన ఆయన ప్రత్యక్షశిష్యులు అప్పటికి బ్రతికే ఉన్నారు. అక్కడిదాకా ఎందుకు? సాక్షాత్తూ శారదామాత అప్పటికి బ్రతికే ఉన్నారు. వారికెవరికీ ఈ విషయం తెలియదా? ఆయన భార్యకే తెలియకుండా ఆయన మరోచోట పుట్టాడా? ఎందుకీ అబద్దాలు?

ఇంకా భయంకరమైన అబద్ధాలను కొంతమంది స్వామీజీలే చెబుతున్నారు.

'ఒకానొక గతజన్మలో రామకృష్ణుడు మా ఆశ్రమానికి వచ్చి, నా దగ్గర ఉపదేశం పొందాడు. నేనే అతనికి కాళీసాధనను నేర్పించాను' అంటూ చెబుతున్నాడు ఒక ప్రబుద్ధానందస్వామి. ఈయన స్పృహలో ఉండి మాట్లాడుతున్నాడో, మరేంటో తెలీదు. రామకృష్ణుల కాలిగోటికి అంటుకున్న మట్టిలో ఒక కణానికి చాలడు ఈ క్షుద్రస్వామి. చెప్పే మాటలు మాత్రం అలా చెబుతున్నాడు !

అవతారపురుషుల గతజన్మలతో సహా అన్నీ మాకు తెలుసంటున్న ఈ ప్రబుద్ధులకు వీరి ప్రస్తుతజన్మలే వీరికి తెలీవు. అదీ విచిత్రం ! వారి ఆశ్రమాలలో ఉన్న గొడవలు, లుకలుకలు, పవర్ ఫైట్స్ ను మాత్రం వీళ్లేమీ తీర్చలేరు. మార్చలేరు. ఏవేవో కాకమ్మకబుర్లు మాత్రం చెబుతూ ఉంటారు ! స్వార్థపరులైన వీళ్ళ భక్తులు విని మోసపోతూ ఉంటారు !

భవిష్యత్తును గురించి అవతార్ మెహర్ బాబా ఏమన్నారో వినండి !

మెహర్ బాబా చెప్పిన వరల్డ్ ప్రిడిక్షన్స్ చాలా జరిగాయి. మన దేశం రెండు దేశాలుగా విడిపోతుందని, మనకు స్వాతంత్రం రావడానికి దాదాపు 30 ఏళ్ల ముందుగా ఆయన ఎప్పుడో అన్నాడు. ఆ తర్వాత 1947 లో దేశం రెండు ముక్కలుగా విడిపోయి స్వతంత్రాన్ని తెచ్చుకుంది. ఒకసారి సింధ్ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నపుడు ఒకచోట నేలమీద పొడుగ్గా గీతను గీస్తూ 'ఇదే రెండు దేశాలకు సరిహద్దు అవుతుంది' అని ఆయనన్నాడు. ప్రస్తుతం మనకూ పాకిస్తాన్ కూ ఉన్న సరిహద్దురేఖ ఆ దగ్గర్లోనే ఏర్పడింది.

అదే విధంగా యూరప్ లో పర్యటిస్తున్న సందర్భంలో- " స్విట్జర్లాండ్ చుట్టూ నేనొక వలయాన్ని గీచాను. యుద్ధం దానిని తాకదు" అని ఆయనన్నాడు. ఆశ్చర్యకరంగా, రెండో ప్రపంచయుద్ధంలో  ఎన్నో దేశాలు పాల్గొన్నప్పటికీ, ఆ దేశం మాత్రం పాల్గొనలేదు. ఈ విధంగా ఆయన చెప్పిన వరల్డ్ ప్రిడిక్షన్స్ చాలా జరుగుతూ వచ్చాయి.

ఆయనిలా అన్నాడు 'నేను పోయిన తర్వాత నూరేళ్ళవరకూ పరిపూర్ణ సిద్ధపురుషుడెవడూ ఈ భూమిపైన పుట్టడు'. ఆయన 1969 లో పోయారు. అంటే 2069 వరకూ అలాంటివాళ్ళు పుట్టరనేగా అర్ధం. మరి ఈ కాకమ్మకబుర్లు చెబుతున్న స్వామీజీలు, సద్గురువులూ,  సిద్ధపురుషులూ వీళ్ళందరూ ఎవరు? మీరే ఆలోచించుకోండి !

మెహర్ బాబా ఇంకా ఇలా అన్నారు - 'నేను మళ్ళీ 700 సంవత్సరాల తర్వాత వస్తాను. అప్పటికి మానవనాగరికత ఒక శిఖరాన్ని అందుకుని, కుప్పకూలి, పతనమై, అతిదీనావస్థలో ఉంటుంది. అలాంటి సమయంలో నేను మళ్ళీ వస్తాను'.

అంటే ఏమిటి? రాబోయే 700 ఏళ్లలో సైన్స్ అనేది ఒక పీక్ స్టేజికి వస్తుంది. నేను గత పోస్ట్ లో వ్రాసినవన్నీ నిజాలవుతాయి. కానీ మళ్ళీ అంతా సర్వనాశనమౌతుంది. సైన్స్ ఎక్కువైపోయిన అట్లాంటిస్ ద్వీపం లాగా మానవజాతి తననుతానే నాశనం చేసుకుంటుంది. దిక్కుతోచని స్థితిలో పడుతుంది.  అలాంటి పరిస్థితిలో ఒక మహాపురుషుని అవతరణ జరుగుతుంది.

భూమి నిన్నగాక మొన్న పుట్టలేదు. భూమి వయసు 4.5 బిలియన్ సంవత్సరాలు. మనకేమో బీసీ 8,000 నుంచి మాత్రమే చరిత్ర లభిస్తున్నది అది కూడా కొద్ది దేశాలలో మాత్రమే. మన సైన్సు గత 300 ఏళ్ల నుంచి మాత్రమే విపరీతంగా పెరిగింది. మరి ఇన్ని బిలియన్ సంవత్సరాలుగా ఏమీ జరగలేదా? ఒక్క మూడొందల ఏళ్లలోనే ఇదంతా జరిగిందా?

నిజమేంటంటే, ఇలాంటి సైన్సూ, ఇలాంటి నాగరికతలూ భూమ్మీద ఎన్నోసార్లు వచ్చాయి. మనిషికున్న స్వార్ధంవల్లా, కోరికలవల్లా, దోపిడీ చేసే బుద్ధి వల్లా  అవన్నీ సర్వనాశనం అయ్యాయి. ఆటవిక జీవితం నుంచి అత్యుత్తమ సైన్స్ వరకూ ఎదగడం, సర్వనాశనం కావడం, మళ్ళీ అడవిమనుషుల లాగా జీవితాలు మొదలవ్వడం ఇలా ఎన్నో సార్లు ఈ భూమిపైన జరిగింది. మధ్యమధ్యలో జలప్రళయాలొచ్చాయి, మంచుతుపాన్ లొచ్చాయి. అంతకు ముందున్న ఆధారాలన్నీ కప్పుపడిపోయాయి. భూమిపైన అనేక దేశాలలో ప్రాంతాలలో ఇప్పటికీ లభిస్తున్న అనేక అంతుచిక్కని వింతలే నా మాటకు రుజువులు ! 

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే భౌతిక అమరత్వం ఎప్పటికీ రాదని చెప్పడానికే. అలా వచ్చేపనైతే ఇన్ని బిలియన్ల సంవత్సరాలలో అది ఎన్నోసార్లు వచ్చి ఉండాలి. కానీ అమరులెవరూ మనమధ్యన లేరు. ఈనాటికీ  మనిషి చనిపోతూనే ఉన్నాడు.

సరే అదంతా అలా ఉంచుదాం. సైన్స్  ఇదే విధంగా పెరిగిపోతూ ఉంటే, ముందు ముందు ఏమౌతుంది? ఇప్పుడున్న సోకాల్డ్ ఆధ్యాత్మికసంస్థలు, ఆయా సాధనామార్గాలు ఏమౌతాయి? మహనీయుల శిష్యులందరూ ఏమౌతారు?

ఏమీకారు. అందరూ ఉంటారు. కాకపోతే పప్పు మాయమౌతుంది. పొట్టు ఎక్కువౌతుంది. ఆధ్యాత్మికలోకంలో భ్రమలు ఎక్కువౌతాయి. దొంగగురువులు ఎక్కువౌతారు. వాళ్ళని నమ్మే స్వార్ధపరులూ ఎక్కువౌతారు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు, పెరిగి పెరిగి ఒక్కసారిగా కుప్పకూలుతుంది. అంతే !

ఆధ్యాత్మికసాధనంటే కళ్ళుమూసుకుని ఏవేవో అనుభవాలను పొందటం కాదు. అనుభవిగా మిగలడం. అది కూడా దాని పైనున్నదానిలో విలీనమై, తానే లేకుండా పోవడం. అంతేగాని, హెడ్ ఫోన్స్ తగిలించుకుని మ్యూజిక్ వింటూ అదే ధ్యానమని భ్రమించడం కాదు. రిలాక్స్ అవుతూ, నిద్రపోతూ, దానినే సమాధి అనుకోవడం కాదు. పగటికలలు కంటూ అవేవో దర్శనాలని, గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలని మాయలో పడిపోవడం కాదు. పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ టైములో రాత్రి వచ్చిన కలలను ఒకరికొకరు చెప్పుకుంటూ వాటి ఆధ్యాత్మిక అర్దాలేమిటి అంటూ చర్చించడం కాదు. ఇదంతా బూటకపు ఆధ్యాత్మికత !

మోక్షం అనే  పదం మనగ్రంధాలలో చాలా  విస్తారంగా వాడబడింది. దానిని మనవాళ్ళు కూడా ఎలా పడితే అలా వాడేస్తూ  ఉంటారు. దానర్ధం ఏంటంటే - పరిపూర్ణ స్వాతంత్య్రమని. అంటే, ఈ భూమికే కాదు, విశ్వంలోని ఏ లోకానికైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు రాక-పోక రెండూ చెయ్యగల సమర్ధత. ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవడం చెయ్యగల సమర్ధత. పరిపూర్ణస్వేచ్ఛతో ఈ విశ్వంలో సంచరిస్తూ ఏ శక్తికీ లోబడకుండా ఉండే స్థితినే మోక్షం అంటారు. మన హిందూమతం యొక్క అంతిమగమ్యం ఇదిగాని, రకరకాల ఆధ్యాత్మిక అనుభవాలు, మత్తుమందు భ్రమలవంటి దర్శనాలు, పగటికలలు, ఈగో ట్రిప్స్, మాయమాటలు, అబద్దాలు - ఇవి కాదు.

సీవీవీగారు కానీ, అరవిందులు కానీ చెబుతున్న భౌతిక అమరత్వం వచ్చిందనే అనుకుందాం. అప్పుడేమౌతుంది? ఏమౌతుందో ఇంతకుముందు పోస్టులలో వివరించాను. ఇంకా కొంచం ఇప్పుడు చెబుతాను.

నీ దేహంపైనా, నీ ఇంద్రియాలపైనా, ప్రాణంపైనా, మనస్సుపైనా, అహంభావం పైనా నీకు పూర్తి అదుపు రావాలి. త్రిగుణాల పట్టునుంచి నువ్వు బయటపడాలి. అవిద్యా, అజ్ఞానమూ నీలో అంతం కావాలి. ఇది జరుగుతూ నీకు సమాధిస్థితిగాని ఇంకేదైనాగాని వస్తే అది సరియైన మార్గం. ఇవేవీ రాకుండా నువ్వెంత ధ్యానం చేసినా, ఎన్ని అనుభవాలు పొందినా అవన్నీ ఉత్త దండగమారి పనులు.  నువ్వు ఆధ్యాత్మికంగా ఏమీ ఎదగడం లేదు. దిగజారుతున్నావని అర్ధం. 

సైన్స్ ద్వారా సమాధి అందుబాటులోకి వస్తే ఏం జరుగుతుంది? నీ ఇంద్రియాలు, నీ ప్రాణం, నీ మనస్సు, నీ బుద్ధి, నీ అహంభావం ఇవేవీ నీ అదుపులో ఉండవు. డబ్బుతో కొనుక్కునే బ్రెయిన్ స్టిములేషన్ మాత్రం ఉంటుంది. డ్రగ్స్ కీ దానికీ ఏమీ భేదం ఉండదు. అప్పుడేమౌతుంది?

ఆ టెక్నాలజీని ఎవరు కంట్రోల్ చేస్తారో, వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు. వాళ్ళు రాజులౌతారు. మిగతావాళ్లంతా బంట్లు అవుతారు. మళ్ళీ పాత కధే ! కుట్రలు, కుతంత్రాలు, విప్లవాలు, యుద్ధాలు, రాజ్యాలు కూలడాలు, అసమానతలు, దొంగతనాలు, దోపిడీలు, రేపులు, హత్యలు, మోసాలు, అన్నీవస్తాయి. దానివల్ల ఉపయోగం ఏముంటుంది?

మనిషిలో దైవికమైన మార్పు రాకుండా, ఊరకే టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మనిషి రాక్షసుడౌతాడు. మనిషి జీవితం నేటికంటే ఇంకా దుర్భరమౌతుంది. కొత్త కొత్త మోసాలు ఎక్కువౌతాయి. మైండ్ తెఫ్ట్, సోల్ తెఫ్ట్, ఈగో కిడ్నాప్ మొదలైన పదాలు సర్వసాధారణమౌతాయి. షడ్వర్గాలు కొత్త రూపాలను ధరిస్తాయి. అంతే తప్ప ఇంకేమీ జరగదు.

ఇలాంటి పరిస్థితి వస్తుందనేనేమో మెహర్ బాబా చెప్పింది? అన్ని మతాల గ్రంధాలూ చెప్పిందికూడా అదేనేమో? ధర్మం క్షీణించడమంటే అదేనేమో?  కనుక అప్పుడు మళ్ళీ ఒక అవతారం రావలసిన  అవసరం ఏర్పడవచ్చు. బహుశా కల్కి అవతారం అదే కావచ్చు. గుర్రం కత్తీ అనేవి సింబాలిక్ గా చెప్పిన విషయాలే కావచ్చు. లేదా, అప్పటికి ఆటంబాంబుల ధాటికి అంతా సర్వనాశనమై మళ్ళీ గుర్రాలు కత్తుల రోజులు రావచ్చు. దానికింకా 700 ఏళ్ళు పడుతుందన్నమాట. ఈ లోపల, తను పెంచుకున్న టెక్నాలజీయే మనిషికి ప్రాణాంతకమవుతుందన్న మాట !

ఇప్పటికే - మొబైల్ గనక కాసేపు లేకపోతే పిచ్చెక్కుతోంది అందరికీ. అంతగా టెక్నాలజీకి మనిషి బానిసైపోయాడు. మనిషి స్వతంత్ర దేశంలో ఉంటూ ఉండవచ్చు. స్వతంత్రంగా బ్రతుకుతూ ఉండవచ్చు. కానీ స్వతంత్రుడు కాడు. టెక్నాలజీ అనే ప్రభువుకు అతడు కట్టుబానిసై పోయాడు. ఇప్పుడే ఇలా ఉంటె, ముందుముందు ఇంకెలా ఉంటుందో మరి !

అసలూ - స్వాతంత్య్రం లేని ఎటర్నిటీ ఎంత నరకంగా ఉంటుందో?     

సపోజ్ స్వర్గమే ఉందనుకుందాం. మనం స్వర్గంలో ఉన్నాం. ఇంద్రసభ జరుగుతోంది. రంభో ఊర్వశో ఇంకో దిక్కుమాలినదో డాన్స్ చేస్తోంది. మన సినిమాలలో అలాంటి డాన్సులు ఇప్పటికే చాలా చూశాము గనుక మనకేమీ గొప్పగా అనిపించదు. మనమేమో అర్జంటుగా బాత్రూం కెళ్ళాలి. డాన్స్ మధ్యలో లేస్తే ఇంద్రుడు ఊరుకోడు. ఏ వజ్రాయుధాన్నో మనపైన వదులుతాడు. అందుకని చచ్చినట్లు బిగపట్టుకుని కూచుంటాం. అది స్వర్గమా? నరకమా? స్వర్గంలో నరకం !

ఇంతలో ఇంకో అప్సరస వచ్చి సురా గాబ్లెట్  అందిస్తుంది.

'ఇది నా బ్రాండ్ కాదు తల్లీ, నాది ఫలానా' అంటాం మనం.

'అది భూలోకంలో దొరుకుతుంది. ఇక్కడ దొరకదు. చచ్చినట్టు త్రాగు' అంటుంది అప్సరస.

'చచ్ఛేగా ఇక్కడకొచ్చింది. చావకపోతే అక్కడే ఉండేవాడిని కదా నా బ్రాండేదో నేను త్రాగుతూ' అంటాం మనం.

కోపంగా చూసి అప్సరస వెళ్ళిపోతుంది.

అది స్వర్గమా నరకమా?

సరే డాన్సయ్యాక బోయనాల కార్యక్రమం మొదలౌతుంది. మనమేమో వెజిటేరియన్ అయిపాయె ! స్వర్గంలో అంతా నాన్ వెజ్జే. ఏం తినాలి? ఎలా తినాలి?

'ఏంటమ్మా ఇది?' అని అక్కడ ఇంచార్జ్ ని అడిగితే,

'బతికినన్నాళ్ళూ ఆ చప్పిడికూడే తిని చచ్చావుగా ! ఇక్కడైనా మాంచి మసాలా మాంసం కూరలు తిని చావు' అంటుంది ఆమె.

అదొక నరకం. చివరకు రెండప్పడాలూ నాలుగు వడియాలూ తిని ఈసురోమంటూ మన డార్మిటరీకి దారితియ్యాలి.

అది స్వర్గమా నరకమా?

పోనీ మనకు స్వర్గమెలాగూ రాదు. మనం చేసిన పాపాలకు మనల్ని నరకంలో ఒక బాండీలో పడేసి కాగుతున్న కల్తీనూనెలో బజ్జీలాగా వేయిస్తున్నారని అనుకుందాం. తట్టుకోలేనప్పుడు ఆ  బాండీ లోనుంచి పాక్కుంటూ బయటకొచ్చి ఒంటికి కాస్త బర్నాలో, కాలెండులా ఆయింట్ మెంటో ఏదో ఒకటి పూసుకునే అవకాశం ఉందనుకుందాం కాసేపు. అది నరకమౌతుందా స్వర్గమౌతుందా? నరకంలో స్వర్గం !

'ఒరేయ్ ! ఆ నూనె ఎన్ని యుగాలనుంచీ వాడుతున్నార్రా మార్చకుండా? ఇప్పటికెన్ని కోటానుకోట్లమందిని వేయించారో అందులో. కంపు కొడుతోంది. కనీసం నూనె మార్చండిరా' అని మనం అడిగామనుకో. 

'అబ్బా ! నూనె మార్చాలా? మా బాబే ! నోర్మూసుకుని దూకు బాండీలోకి' అని యమభటుడు గద్దిస్తే అది నరకంలో మరీ నరకం.  శిక్షకు తోడు అవమానం మరీ నరకం కదా !

'పోన్లే పాపం, ఏదో అడుగుతున్నావు కదా. సరే మారుస్తాలే' అని పాతనూనె తీసేసి, న్యూ బ్రాండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ బాండీలో పోస్తే అది కొంతలో కొంత సుఖం ! 

అంటే ఏమిటి? నరకమైనా స్వర్గమైనా, మనకంటూ స్వాతంత్య్రం ఉంటే అదే స్వర్గం. స్వాతంత్య్రం లేకపోతే ఏదైనా నరకమే. అర్థమైందా? అదే మోక్షమంటే. ఎందుకంటే మన హిందూధర్మంలో అత్యున్నతమైన ఆదర్శమూ గమ్యమూ "స్వాతంత్య్రం" మాత్రమే. దానికే మరోపేరు మోక్షం.

అసలిదే శరీరంతో ఎల్లకాలం ఇక్కడే ఉండాలన్న దురాశ ఎందుకు మీకు? ఒకవేళ అలా ఉంటే, జీవితమెంత బోరు కొడుతుందో అర్థమైందా? ఒక 60, 70  ఏళ్లకే లైఫ్ మహాబోరు కొడుతోంది. రోజూ ఇదేపని, ఇదే గర్ల్ ఫ్రెండ్స్, ఇదే పెళ్ళాం, ఇదే పెళ్లి, ఇదే పిల్లలు, ఇదే గోల, ఇలాగే '10 టు 6' ఉద్యోగం చెయ్యడం, అదే  తిండి, అవే గిన్నెలు కడుక్కోవడం, అవే దిక్కుమాలిన సినిమాలు, అవే షికార్లు, అవే పిక్నిక్కులు, అవే టీవీ ప్రోగ్రాములు, అవే సొల్లుమాటలు, అవే హెచ్చులు, అవే మోసాలు, అదే నాటకపు బ్రతుకు - ఒక్క లైఫే ఇంత విసుగ్గా ఉంటె, ఇదే విధంగా ఎటర్నిటీనా? దానంత పెద్ద నరకం ఇంకెక్కడా ఉండదు.

ఇలాంటి ఎటర్నిటీ కంటే నేను చెప్పిన పరిపూర్ణస్వేచ్ఛతో కూడిన మోక్షం అత్యుత్తమం కాదూ? ఈ శరీరం పోతే ఏమౌతుంది? ఇంకో శరీరం ధరిస్తాను. నా ఇష్టం వచ్చినపుడు ఈ భూమికి వస్తాను. విసుగుపుడితే ఇంకో లోకానికి పోతాను. ఎటువంటి బంధమూ నాకు లేదు. ఎటువంటి బాధా నాకు లేదు. ఏ శక్తీ నన్ను ఆపలేదు. ఏ కర్మకూ నేను బద్ధుడిని కాను. జననము మరణమూ నన్ను బంధించలేవు. అంతా ఆటే. అంతా సరదానే. అలాంటి మోక్షం కావాలిగాని దిక్కుమాలిన ఈ భౌతికదేహంతో ఎటర్నిటీ ఎందుకసలు? దానిలో సుఖమూ లేదు శాంతీ లేదు సంతోషమూ లేదు ఆనందమూ లేదు.

ఇదే దేహంతో ఇదే లోకంలో ఉండాలన్నది భారతీయ వేదాంతభావం కాదు. ఇదసలు మన భారతీయభావనే కాదు. ఇక్కడే ఎల్లకాలం ఉంటూ సుఖాలను అనుభవించాలన్నది పాశ్చాత్య భావన. తెల్లవాళ్ళకే సుఖాలమీద మోజెక్కువ. మనకు అది లేదు.

అరవిందులూ సీవీవీగారూ ఇద్దరూ ఈ పాశ్చాత్య భావనతో ప్రభావితులయ్యారు. అరవిందులేమో ఇంగ్లాండ్ లో చదువుకున్నారు. అక్కడే చాలా ఏళ్లున్నారు. అప్పటి వెస్టర్న్ ఫిలాసఫర్స్ మరియు డార్విన్ పరిణామ సిద్ధాంతం ఆయనకు బాగా తెలుసు. కనుక దానినీ మన యోగాన్నీ కలపాలని ఆయన ప్రయత్నించారు. ఇక సీవీవీగారేమో బ్లావట్స్కి భావాలకు ప్రభావితులయ్యారు. ఆమెదొక సాంబారు. కనుక ఈయనకూడా హిమాలయన్ మాస్టర్స్ అని, లోకాలని, సూక్షశరీరమని, మహిమలని, రోగాలు తగ్గించడమని ఇలా ఏదేదో ప్రయత్నాలు చేశారు.

ఇదంతా పాశ్చాత్య భావమహిమేగాని మన వేదాంత - యోగ - విధానం ఇది కాదు.  మార్పనేది ప్రకృతిలో ఇన్ బిల్ట్ గా ఉన్నది. మనమేమో మార్పులేకుండా శిలావిగ్రహంలాగా ఉండాలంటే అది వికృతం అవుతుందిగాని సుకృతం అవదు. ఈ ప్రకృతీ ఈ భూమీ నాకొద్దు అంటే ఇక్కడనుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడో హాయిగా ఉండాలి. అంతేగాని ప్రకృతిని దైవీకరించాలంటే అది జరిగే పని కాదు.  

కనుక భౌతికఅమరత్వమనేది ఒక భ్రమ. అది  కుదరని పని. పెద్దపెద్ద మాటలు చెప్పవచ్చు. కానీ ఇప్పటివరకూ అది సాధ్యం కాలేదు. ఇక ముందు కూడా కాదు. ఈ నిజాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. మోక్షం కోసం ప్రయత్నించడం మంచిది.

సిద్ధసంప్రదాయ గ్రంధమైన 'సిద్ధసిద్ధాంత పద్ధతి' అనేదానికి నేను వ్రాసిన వ్యాఖ్యానం చదవండి. అసలైన స్వేచ్చంటే ఏమిటో, అసలైన మోక్షమంటే ఏమిటో, అసలైన విముక్తి అంటే ఏమిటో, అసలైన మానవజీవితగమ్యమేమిటో అర్ధమౌతుంది.

'శ్రీవిద్యారహస్యం' పుస్తకంలో 'గుణాతీత జీవన్ముక్తస్థితి' అనే అధ్యాయంలో జీవన్ముక్తుని లక్షణాలను వివరించాను. అవి చదవండి. అర్ధమౌతుంది.

పుట్టాలి, పోవాలి, కానీ ఈ రెండూ మన చేతిలో ఉండాలి. కర్మ చేతిలో మన ఖర్మ ఉండటం కాదు. కర్మకు అతీతులమై మనం ఉండాలి. చేయాలనుకున్నది చేసే స్వాతంత్రమే కాదు, వద్దనుకున్నపుడు ఆగగలిగే స్వతంత్రం కూడా ఉండాలి. మన పుట్టుకా, మన చావూ, మన బ్రతుకూ, మన పునర్జన్మా అన్నీ పూర్తిగా మన అదుపులో ఉండాలి. అదే మోక్షంగాని, ఇదే దేహంతో ఎల్లకాలం ఇక్కడే అఘోరిస్తూ ఉండటం కాదు. అలాంటి ఎటర్నిటీ ఎందుకసలు? 

(అయిపోయింది)