“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, జనవరి 2021, సోమవారం

Master CVV జాతక విశ్లేషణ - 4 ( అసలిదంతా ఎలా మొదలైంది? - బ్లావట్స్కి జాతకం )

కొత్త మతాలను, పంధాలను సృష్టించాలన్న ప్రయత్నాలు చాలా పాతకాలం నుంచీ భూమిపైన ఉన్నాయి.  అయితే, అవి ఆయా ఋషుల, మునుల, సిద్ధుల అనుభవాల ఆధారంగా పుట్టాయి. నమ్మకాల ఆధారంగా కాదు. అవి కూడా నేడు మనం చూస్తున్న మతాలలాగా లేవు. ఇలాంటివి కావు కూడా.

'నేనీ దారిలో నడిచాను. ఈ అనుభవం పొందాను. మీరూ నడవండి. ఇదే అనుభవం మీకూ కలుగుతుంది' అనిన దారిలో పాతకాలపు మతాలు ఉండేవి. అంతేగాని, 'దీనిని నమ్మండి. నమ్మకపోతే మిమ్మల్ని చంపుతాను' అని బెదిరించో, లేదా 'దీనిని నమ్మితే  డబ్బులిస్తాను.  మా మతాన్ని నమ్మితే, ఈ లౌకిక లాభాలు మీకొస్తాయి' అని లంచాలు ఆశచూపో పాతకాలంలో మతాలు వ్యాపించబడలేదు.

'సాధన - దానిద్వారా కలిగిన సిద్ధి' ఇవే పాతకాలపు మతాలకు ప్రాతిపదికలుగా ఉండేవిగాని, బలప్రయోగం, డబ్బు ఆశచూపించడం, లేదా ద్వేషాలు రెచ్చగొట్టడం ఇవి ప్రాతిపదికలుగా ఉండేవి కావు. కనుక, పాతకాలపు మతాలలో అంతర్గతమైన బలం ఉండేది.  నేటి మతాల లాగా అవి వ్యాపారాలు కావు.

ఏ మతానికైనా, ఆ మతాన్ని ప్రారంభించిన వ్యక్తి యొక్క అనుభవమే ఆధారంగా ఉండేది. అయితే, మధ్యయుగాలనుండీ ఒక క్రొత్త పోకడ ప్రబలింది. అదేంటంటే, ఇప్పటిదాకా ఉన్న మతాలన్నింటినీ కలగలిపి సాంబారు చేసి ఒక క్రొత్త మతాన్ని స్థాపించాలన్న ప్రయత్నం. రాజకీయబలం ఉంటే, ఈ పని చెయ్యడం సులభమౌతుంది. నవీనకాలంలో క్రైస్తవమూ, ఇస్లామూ రాజకీయబలంతోనూ, ఆర్ధికబలంతోనూ మాత్రమే ఇన్ని దేశాలలో వ్యాపించాయిగాని వాటికున్న సైద్ధాంతిక బలంతోనూ, ఆధ్యాత్మిక బలంతోనూ కాదు.

మధ్యయుగాలలో అక్బర్ పాదుషా ఇలాంటి ప్రయత్నాన్ని చేశాడు. యూదు, క్రైస్తవ, ఇస్లాం, జొరాష్ట్రియన్, హిందూ, బౌద్ధ మతాలను కలిపి 'దీన్ ఇలాహి' అనే క్రొత్త మతాన్ని ప్రారంభించే ప్రయత్నాలను ఆయన చేశాడు. అప్పటివరకూ రాజు, మతగురువు అనే రెండు పవర్ సెంటర్స్ ఉండేవి. ఏ దేశాన్నైనా రాజ్యాన్నయినా ఇవే నడిపేవి. చాలాసార్లు వీళ్ళిద్దరి మధ్యనా ఘర్షణ ఉండేది. ఈ గొడవంతా లేకుండా చేసి, రెంటినీ ఒకే పవర్ సెంటర్ గా మార్చి 'రాజు+గురువు' అనే ఒకే అధికారకేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలని అక్బర్ ప్రయత్నించాడు. కానీ దానికి కావలసిన ఆధ్యాత్మికశక్తి ఆయనకు లేకపోవడంతో అది ముందుకు సాగలేదు.

ధనాశ చూపో, బెదిరించో వ్యాప్తి చేసే మతాలు కాలగమనంలో నిలబడలేవు. దానిలో నిజమైన తాత్వికతా, ఆధ్యాత్మిక బలమూ ఉంటేనే ఏ మతమైనా కాలప్రభావాన్ని తట్టుకుని కలకాలం నిలబడగలుగుతుంది.

హిందూమతాన్ని అణగద్రొక్కాలని ఎంతోమంది కొన్ని వేల ఏళ్లుగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. వారిలో ఔరంగజేబు వంటి రాక్షసచక్రవర్తులున్నారు. కానీ వారందరూ కాలగర్భంలో కలసిపోయారు. హిందూమతం మాత్రం ఈనాటికీ సజీవంగా నిలిచి ఉంది. ఎందుకంటే, దాని పునాదులు చాలాగట్టివి. నిజమైన ఆధ్యాత్మికత అనే పునాదిపైన అది  నిలబడి ఉన్నది. ఈనాడు తెల్లవాళ్ళ దేశాలలో యోగా, మెడిటేషన్ పేర్లతో హిందూమతం శరవేగంతో వ్యాపిస్తున్నది. చర్చిలన్నీ గొడౌన్లుగా మారుతున్నాయి. కారణమేమిటి? మౌలికమైన స్వచ్ఛతా, ఆధ్యాత్మికబలమూ మాత్రమే ఆ కారణాలు.

నవీనకాలంలో ఇలా క్రొత్త మతాన్ని మొదలుపెడదామన్న ప్రయత్నాన్ని చేసినవారిలో ముఖ్యురాలు హెలెనా బ్లావట్స్కి అనబడే రష్యన్ మహిళ. ఈమెకు ఎలాంటి సాధనా సిద్దీ ఏమీ లేకపోయినప్పటికీ, తనకున్న మేధాశక్తితో, దూకుడుతో, మాటకారితనంతో,  వ్రాసే నేర్పుతో, రాజకీయంగా తనకున్న పలుకుబడితో 'ధియసాఫికల్ సొసైటీ' ని మొదలుపెట్టింది. ఇదికూడా యూదు, క్రైస్తవ, ఇస్లాం, హిందూ, బౌద్ధ మతాల కలగూరగంప  మాత్రమేగాని ఇందులో ఒరిజినాలిటీ ఏమీ లేదు. దీనివెనుక సాధనా బలమూ లేదు.

ఒక క్రొత్త మతాన్ని ప్రారంభించాలంటే, ఏదో ఒక పీ.హెచ్.డీ చేసినట్లుగా, పది పుస్తకాలు చదివి ఒక పుస్తకం వ్రాసి పట్టా  పొందటం కాదు. దానికి సాధనాబలం ఉండాలి. అనుభవజ్ఞానం ఉండాలి. నిజమైన సిద్ధి ఉండాలి. ఇవేవీ లేకుండా, అన్ని మతగ్రంధాలనూ చదివేసి మేధోపరంగా వాటిని అర్ధం చేసుకుని 'ఇదుగో ఇవన్నీ సాంబార్ చేసి నేనొక క్రొత్త మతాన్ని మొదలుపెడుతున్నా' అంటే అది కుదరదు, నిలబడదు. కొంతకాలం క్రొత్తమోజుతో తాటాకుమంటలాగా వెలగవచ్చు గాని స్థిరంగా నిలబడదు, కొనసాగదు. ఒకవేళ కొనసాగినా, నిజమైన జ్ఞానులు అందులోనుంచి ఉద్భవించరు. అంతిమంగా లక్షలాదిమంది దానివల్ల మోసపోవడం జరుగుతుంది. బ్లావట్స్కి మొదలుపెట్టిన మతానికి కూడా  అదే గతి పట్టింది.

హెలెనా బ్లావట్స్కి 12-8-1831 న నేటి ఉక్రెయిన్ లోని ఏకాతెరినోస్లాప్ అనే ఊరిలో రాత్రి 2. 17 కి పుట్టింది. ఆమె జాతకాన్ని ఇక్కడ ఇస్తున్నాను.

అష్టమంలోని బాధకనీచగురువు వల్ల ఈమె ఆధ్యాత్మికంగా ఏమీ సిద్ధిని పొందలేదని చూడటంతోనే తెలుస్తున్నది. ఇది భయంకరమైన గురుదోషం ఉన్న జాతకం. కనుక, తనకు నిజమైన అనుభవమూ శక్తీ లేనప్పటికీ ఉన్నట్లుగా జనాన్ని లోకాన్ని నమ్మించిందని, ఈ క్రమంలో చాలా చెడుకర్మను మూటగట్టుకున్నదని ఈమె జాతకం చాలా స్పష్టంగా   చెబుతున్నది. సత్యసాయిబాబా జాతకంలో కూడా గురువు నీచలోనే ఉండటం గమనార్హం.

పైగా మంత్రస్థానాధిపతి అయిన శుక్రుడు దానికి ద్వాదశంలో, మనస్సును సూచించే చతుర్దంలో నీచస్థితిలో ఉండటం కూడా, 'సరుకులేకుండా సోకుచేసుకున్న చందం' అన్నట్లు ఇదే విషయాన్ని ఇంకా స్పష్టం చేస్తున్నది. ఈమె శిష్యులూ అనుచరులూ ఎలాంటివాళ్ళో చతుర్ధ నీచశుక్రుని యోగం చెబుతున్నది. ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైనా ఇంతే జరుగుతుంది. 'యధా గురు తధా శిష్య:' అనేదే దాని సూత్రం.

ఈమె జాతకంలో 3-9 ఇరుసులో రాహుకేతువులు సూర్య - శనులను సూచిస్తూ సున్నా డిగ్రీలలో రాశిసంధిలో ఉండటం, ఆధ్యాత్మికరంగంలో ఈమె ఒక బలమైన ముద్రను వేస్తుందని, కానీ అదంతా బూటకమని, ఈమెకు నిజమైన  ఆధ్యాత్మిక శక్తి లేదని తెలుపుతున్నది.

ఈమెకు విక్రమస్థానంలో  రాహు, శని, బుధ, కుజులు సన్యాసయోగంలో ఉన్నారు. రాహువు సున్నా డిగ్రీలో ఉన్నాడు. కుజ శనులు 11 వ డిగ్రీ మీద ఖచ్చితమైన కంజంక్షన్ లో ఉన్నారు. ఇది చాలా గట్టి విస్ఫొటనాయోగం. అందుకే ఈమె మాట మాట్లాడితే బాంబు పేల్చినట్లు, కొట్టినట్లు, కరుకుగా, వల్గర్ గా, ఎగతాళిగా మాట్లాడేది. విఫలమైన ఈమె వివాహజీవితం వల్ల ఏర్పడిన కసి, బహుశా దీనికి కారణం కావచ్చు.

ఈమెకు 17 ఏళ్ల వయసున్నపుడు 42 ఏళ్ల నీకిఫర్ బ్లావట్స్కి అనే ఒక గవర్నర్ ను  వివాహం చేసుకుని, కొద్ది వారాల తర్వాత అతన్ని విడచి పారిపోయి, మిగతా జీవితమంతా దేశాలు తిరుగుతూ, ఉపన్యాసాలిస్తూ, పుస్తకాలు రాస్తూ గడిపింది. ఎందుకు అతన్ని వదలి పారిపోయిందో ఎవరికీ తెలియదు. ఈమె వివాహం 7-7-1848 న జరిగింది. అప్పుడామెకు రాహు - శని - బుధదశ నడిచింది. ఇది శపితదశ మనకు  తెలుసు. నా వ్రాతలు చదివేవారికి శపితదశ పరిచయమే. కనుక ఆ సమయంలో జరిగిన పెళ్లి, కొద్దిరోజులకే చెడిపోయింది. విదశానాధుడైన బుధుడు తృతీయంలో శపిత, సన్యాస, దుర్ఘటనా యోగాలలో చిక్కుకుని ఉన్నాడు. ఇన్ని చెడుయోగాలున్నపుడు పెళ్లి పెటాకులవ్వక ఇంకేం జరుగుతుంది?

అలా దేశాలు పట్టుకుని తిరుగుతూ అమెరికా చేరిన ఆమె, 1875 లో కల్నల్ ఆల్కాట్ ను కలుసుకుంది. ఇద్దరూ కలసి, తామేదో ప్రవక్తలైనట్లుగా భావించుకుంటూ థియోసాఫికల్ సొసైటీని స్థాపించారు. జన్మలకు జన్మలు తపస్సు చేసినవారికే ఇక్కడ దిక్కులేదు. ఊరకే దేశాలు పట్టుకుని తిరిగి నాలుగు పుస్తకాలు చదివితే సిద్ధి కలుగుతుందా? ప్రవక్తలైపోతారా? మరీ విడ్డూరం కాకపోతే?

ఈ సమయంలో ఆమెకు రాహు - గురుదశ నడిచింది. ఇది గురుఛండాలదశ. అంటే, ఆధ్యాత్మికంగా ఎటువంటి సిద్ధి లేకపోయినా ఉన్నట్లుగా లోకాన్ని నమ్మింపజేసే ప్రయత్నాలు చేసే దశ. అదేగా మరి జరిగింది? దీనికి తోడుగా అదే సమయంలో కల్నల్ ఆల్కాట్ ఈమెకు తోడయ్యాడు. ఆయా దశలు వచ్చినపుడు మనకు తోడుబోయినవాళ్లు మనల్ని కలవడం, ఆ తర్వాత విడిపోవడం జీవితంలో ఎన్నోసార్లు జరుగుతుంది. ఈమె జీవితంలో కూడా ఇదే జరిగింది.

అయితే బ్లావట్స్కి కంటే ఆల్కాట్ కొంత ఉపయోగకారములైన పనులు చేశాడు. శ్రీలంకలో కొనఊపిరితో ఉన్న బౌద్ధాన్ని పునరుజ్జీవింపజెయ్యడంలో అతను చురుకుగా పనిచేశాడు. ఈనాటికీ సింహళ బౌద్ధులు ఆయన్ని గౌరవిస్తారు. బ్లావట్స్కి, ఆల్కాట్ ఇద్దరూ బౌద్ధమతాన్ని స్వీకరించారు. బ్లావట్స్కి అక్కల్ట్ మీద ఎక్కువ వ్రాస్తే, ఆల్కాట్ బౌద్ధం యొక్క మూలసూత్రాలమీద ఎక్కువగా వ్రాశాడు. ఇందుకనే, బ్లావట్స్కి కి బౌద్ధం అర్ధం కాలేదని మాక్స్ ముల్లర్ అన్నాడు. బుద్ధుడు చెప్పినదాంట్లో రహస్యబోధనలు ఏమీ లేవని, రహస్య బోధనలుంటే అది బౌద్ధం కాదని ఆయనన్నాడు. రహస్యబోధనలంటే - సూక్ష్మశరీరం, లోకాలు, ఆత్మలు, మహాత్ములు, దర్శనాలు, జన్మలు మొదలైన మార్మికవిషయాలు. కనుక ఆమె పుస్తకాలను అప్పట్లోనే మేధావులు ఒప్పుకోలేదు.

బ్లావట్స్కి రచనలలో తాంత్రిక బౌద్ధపు ఆనవాళ్లు దండిగా గోచరిస్తాయి. కానీ థేరావాద బౌద్ధులు టిబెట్లో ఉన్న తాంత్రికబౌద్ధాన్ని ఒప్పుకోరు. అది అసలైన బౌద్ధం కాదని వారి వాదన. ఇందులో నిజం లేకపోలేదు.

1876 నవంబర్ లో ఈమెకు శనిమహర్దశ మొదలైంది. 1877 లో Isis Unveiled అనే పుస్తకాన్నీ, 1878 లో ఈమెకు చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన The Secret Doctrine అనే పుస్తకాన్నీ వ్రాసింది. శని నవమాధిపతి అనీ, నవమంలో కేతువున్నాడనీ, ఆ శని పుస్తకాలను వ్రాయించే తృతీయంలో ఉన్నాడని గమనిస్తే  ఈ ఉద్గ్రంథాలను ఆమె ఎలా వ్రాసిందో, శనిదశ మొదలైన వెంటనే ఎందుకు వ్రాసిందో అర్ధమౌతుంది. 

ఈ గ్రంధాలకు ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. అదేంటంటే - ఈ నాటికైనా సరే, ఎవరికైనా నిద్రపట్టక అల్లాడుతుంటే, ఈ పుస్తకాలలో రెండు పేజీలు చదివితే చాలు, క్రానిక్ ఇన్సోమ్నియా పేషంట్లయినా సరే, కుంభకర్ణుల్లాగా గుర్రు పెడుతూ నిద్రపోతారు. కనీసం మూడ్రోజులదాకా నిద్రే లేవలేరు. అంతటి శక్తి ఈ పుస్తకాలలో దాగుంది. బాబూరావ్ పటేల్, ఈ పుస్తకాలనూ అరవిందుల 'లెక్చర్స్ ఆన్ ది గీతా' పుస్తకాన్నీ నిద్రపట్టని వారికి మందుగా సూచించేవాడు. 

సీవీవీగారి భక్తులేమో బ్లావట్స్కి ఇంగ్లాండ్ లో చనిపోయి ఇండియాలో ఆయన రెండవభార్య అయిన వెంకమ్మగా పుట్టిందని నమ్ముతూ, మనల్ని కూడా నమ్మమంటారు. నమ్మకపోతే అపచారమని బెదిరిస్తారు కూడా. కానీ నేనేమో, ఈమె చనిపోయి, 'హ్యారీ పాటర్' పుస్తకాలు వ్రాసిన జేకే. రౌలింగ్ గా పుట్టిందని నమ్ముతాను. ఎందుకంటే ఆమె పుస్తకాలూ ఈమె పుస్తకాలూ ఒకే రకంగా ఉంటాయి గనుక. సరదాగా అంటున్నాలే నిజం అనుకోకండి ! బెనిఫిట్ ఆఫ్ డౌట్ ను భక్తులకే ఇచ్చేద్దాం.

అలా దేశాలు తిరిగీ తిరిగీ చివరకు వీళ్ళిద్దరూ (బ్లావట్స్కి, ఆల్కాట్) హాయిగా ఇండియాకు వచ్చి స్థిరపడిపోయారు. ఇండియా నేల అంత సారవంతమైనది మరి ! ఎలాంటి విత్తనం వేసినా ఇక్కడ మహావృక్షంగా పెరుగుతుంది. నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి 'నేనే దేవుడి క్రొత్త అవతారాన్ని' అని అరిస్తే, నమ్మేవాళ్ళూ, అనుసరించేవాళ్లూ వేలాదిగా ఈ దేశంలో లభిస్తారు. కానీ మిగతా దేశాలలో, ముఖ్యంగా ఇస్లానిక్ తీవ్రవాద దేశాలలో అయితే వెంటనే వాడిని చంపి అదే కూడలిలో పాతేస్తారు. కనుక మతపరమైన ఏ మోసం చెయ్యాలన్నా దానికి ఇండియా చాలా చక్కని అనువైన ప్రదేశంగా ఉంటూ వచ్చింది. మన దేశంలో అతిప్రాచీనకాలం నుంచీ కుప్పతెప్పలుగా పుట్టిన అనేక మతాలే నా మాటకు రుజువు. ఆ విధంగా మద్రాస్ అడయార్ లో వీరి  సొసైటీ స్థిరపడింది.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, సీవీవీ గారు కూడా మొదట్లో ఈ సొసైటీ సభ్యుడే. అంతేగాక దీని ఇన్నర్ సర్కిల్ మెంబర్ కూడా. దీనినుంచే ఈయన హిమాలయన్ మాస్టర్స్ అని, మహాత్మాస్ అని లేనిపోని పిచ్చి నమ్మకాలను ఎక్కించుకున్నాడు. ఈయన వాడిన భాష, చేసిన సాధన అంతాకూడా థియాసఫీ పంథాలోనే సాగింది. ఆయనమీద థియాసఫీ ముద్రా, బ్లావట్స్కి ముద్రా చాలా గట్టిగా ఉన్నాయన్నది వాస్తవం.

అయితే, బ్లావట్స్కి 8-5-1891 తేదీన న్యుమోనియాతో లండన్లో చనిపోయింది.  అప్పుడామెకు శని - రాహు - శనిదశ జరుగుతున్నది. ఇది భయంకరమైన శపితదశ అన్న విషయం మనకు తెలుసు. తృతీయం ఊపిరితిత్తులకు సూచిక అన్నది అర్ధమైతే తృతీయంలో ఉన్న చెడుయోగాలు అర్ధమైతే, ఆమె రాహు - శనుల శపితదశలో న్యుమోనియాతో ఎందుకు చనిపోయిందో అర్ధమౌతుంది. ఈమెకు బుద్ధిపరంగా సాధనావిధానం అర్ధమైనప్పటికీ ఆచరణలో సాధనాబలం లేనందున, నిజమైన సిద్ధి లేనందున, అయినప్పటికీ లోకాన్ని నమ్మిస్తూ చేసిన ప్రచారం వల్ల, మూటగట్టుకున్న చెడుకర్మ ఆమె మరణానికి ఆ విధంగా  కారణమైంది.

ఈ సందర్భంలో జిల్లెళ్ళమూడి అమ్మగారి వాక్కు ఒకటి గుర్తుకొస్తుంది.

ఒకసారి అమ్మను ఇలా అడిగారు.

'అమ్మా ! ఫలానా వారు మహనీయులమంటూ ప్రచారం చేయించుకుంటూ కాళ్లకు దండాలు పెట్టించుకుంటున్నారమ్మా? వారికేమౌతుంది?'

అమ్మ ఇలా అన్నారు.

'పెట్టినవాడికి కష్టం ఉండదు. పెట్టించుకున్నవాడికి నష్టం తప్పదు'. 

అమ్మ మిగతా మాటలలాగే ఇది కూడా ఎంతో లోతైనమాట ! ఇందులో కర్మసిద్ధాంతమూ, దైవన్యాయమూ, ఆధ్యాత్మికజీవన రహస్యమూ అన్నీ దాగున్నాయి.

ఆ భక్తుడి నమ్మకమే అతడిని రక్షిస్తుంది. కనుక ఆ మహనీయుడిలో శక్తి లేకపోయినప్పటికీ, తన విశ్వాసబలంతోనే ఆ భక్తుడికి కష్టం తప్పుతుంది. కానీ ఈ సోకాల్డ్ మహనీయుడికి తన సంగతేమిటో తనకు తెలుసు. లోకాన్ని ఎంత మోసం చేసినా తన సంగతి తనకు తెలుసును కదా ! కనుక అతడు ఇహానికీ పరానికీ రెంటికీ చెడిపోతాడు. అతడికి నష్టం తప్పదు. నేటి సోకాల్డ్ గురువులూ మహనీయులూ ఇలాంటి వారే.

సీవీవీ గారి సాధన 1910 లో హేలీ తోకచుక్క కనిపించినప్పుడు పుంజుకుందని అంటారుగాని, అంతకుముందే 1900 ప్రాంతాలలోనే ఆయన సాధన చేస్తూ ఉండేవాడనడానికి నిదర్శనాలున్నాయి. అప్పట్లోనే కావేరీతీరంలో ఉన్న ఒక చెట్టుక్రింద కూచుని ఆయన  రాత్రంతా ధ్యానం చేస్తూ ఉండేవాడు. అంతకు 9 ఏళ్ల  ముందే బ్లావట్స్కి చనిపోయింది. సీవీవీగారిని పెళ్ళిచేసుకునే నాటికి వెంకమ్మగారికి 12 ఏళ్ళు, ఈయనకు 38 ఏళ్ళు. ఈ సంఘటన 1906 లో జరిగింది. అంటే 1894 లో వెంకమ్మగారు జన్మించి ఉండాలి. 1891 లో బ్లావట్స్కి చనిపోయింది గనుక 1894 లో వెంకమ్మగా ఆమె మళ్ళీ పుట్టి, తన యోగసాధనను కొనసాగించడానికి, సీవీవీగారి రెండవభార్యగా వచ్చిందని ఆయన భక్తులలో ఒకవర్గంవారు అంటారు. ఇందులో ఎంత నిజముందో మనకు తెలియదు. జ్యోతిష్యశాస్త్ర సహాయం తీసుకుందాం.

సీవీవీగారిది కన్యాలగ్నం బ్లావేట్స్కి గారిది  మిధునలగ్నం. ఇద్దరికీ వివాహజీవితం చెడిపోయింది. ఇద్దరికీ లగ్నాధిపతి బుధుడే అయినప్పటికీ, మిధునలగ్నం వారు  ఉపన్యాసాలివ్వడం, పుస్తకాలు వ్రాయడాలు, దేశాలు తిరగడాలు చేస్తారు. కనుక బ్లావేట్స్కి అలా చేసింది. కన్యాలగ్నం వారు అలిగి ఒకచోట కూచుని  పనిచేస్తూ ఉంటారు. కనుక సీవీవీగారు ధియాసఫీ మీద అలిగి, విడిపోయి, తన సాధన తాను చేసుకున్నాడు. ఇద్దరికీ సప్తమాధిపతి గురువే. బ్లావేట్స్కి కి అష్టమంలో నీచలో ఉన్నాడు. సీవీవీగారికి సప్తమంలో వక్రించి శత్రుస్థానంలోకి వచ్చి ఉన్నాడు. కనుక ఇద్దరికీ  వివాహభావం చెడిపోయింది.

బ్లావేట్స్కిగారి భవిష్యజన్మ తులాలగ్నం అవుతుంది. ఇది సీవీవీగారి కుటుంబస్థానం. సీవీవీగారి  రెండవభార్య  మేషమౌతుంది. ఇది తులకు సమసప్తకమైంది  గనుక బ్లావేట్స్కి సీవీవీగారి రెండవభార్య అయిన వెంకమ్మగారుగా పుట్టి ఉండటానికి అవకాశాలున్నాయి. కానీ బ్లావేట్స్కి  కున్న బహుముఖప్రజ్ఞ వెంకమ్మగారికి లేదు. ఇక్కడ కొంత అనుమానం వచ్చే ఆస్కారం ఉన్నది.   ఏదేమైనప్పటికీ, ఇది సీవీవీగారి భక్తులలో ఒకవర్గం వారి నమ్మకానికి  సంబంధించిన విషయం గనుక  ఎక్కువగా తరచి చూడబోవడం లేదు.

మహాత్మాస్ అనేవాళ్ళు హిమాలయాలలో ఉన్నారని, వారిలో మోరియా, కూతుమి అనే ఇద్దరిని తాను కలుసుకున్నానని వాళ్ళే తనను నడిపిస్తున్నారని బ్లావేట్స్కి అనేది. కల్నల్ ఆల్కాట్ కూడా దీనిని సమర్ధించేవాడు. దానినే అనీబిసెంట్ లెడ్ బీటర్లు కూడా ప్రచారం చేశారు. కానీ దియాసఫీలో చిన్నప్పటినుంచీ నలిగిన జిడ్డు కృష్ణమూర్తి మాత్రం అలాంటి మాస్టర్లు మహాత్మాలు ఎవరూ లేరని అదంతా అబద్దమని కుండబద్దలు కొట్టాడు. అక్కడే  వారితో ఆయన విడిపోయాడు. తన తమ్ముడు నిత్యానంద చనిపోయినప్పుడు ఆ మాస్టర్లు మహాత్మాలు ఎందుకు పలకలేదని, 'నిత్యానందకు ఏమీ కాదు, బ్రతుకుతాడు' అని వాళ్ళు చెప్పినప్పుడు అతనెందుకు చనిపోయాడు? అని ఆయన అడిగాడు. సరియైన సమాధానం ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించాడు. దానికి అనీబెసంట్ నుంచి గాని, ఇంకెవరి నుంచిగాని ఆయనకు సరియైన జవాబులు రాలేదు. ఈ మాస్టర్లు మహత్మలు మామూలప్పుడు ఎన్నో మెసేజిలు ఇస్తూ ఉంటారు, సోది చెబుతూ ఉంటారు. కానీ నిజంగా అవసరం వచ్చినపుడు ఉలకరు పలకరు. ఇదేంటి అని జిడ్డు ప్రశ్నించాడు. అసలు వాళ్లంటూ ఉంటేకదా జవాబు చెప్పడానికి? అందుకని ఆయనకేమీ జవాబు రాలేదు.

సీవీవీగారికి కూడా ఇదే జరిగింది. ఎన్నోసార్లు ఆయన బ్రతుకుతాడని చెప్పినవాళ్లు చనిపోయారు. లేదా రోగాలు తగ్గలేదు. అనుకున్నవి జరగలేదు. ఇదేంటి అని శిష్యులు ప్రశ్నించినపుడు ఆయన MTA ను అడిగేవాడు. ఆ MTA పలికేవాడు కాదు. సీవీవీగారికి ఇదెంటో అర్ధమయ్యేది కాదు. చివరకు తను చనిపోయేరోజున కూడా, చనిపోతానని ఆయన అనుకోలేదు. భౌతిక అమరత్వాన్ని సాధించి తాను ఎల్లకాలం బ్రతుకుతాననే చివరిక్షణం వరకూ ఆయన అనుకున్నాడు. కానీ అది జరగలేదు. యధాప్రకారం MTA ముఖం చాటేశాడు.

ఈ MTA అనేవాడు, అతనికి  ఇంకా పైనుంచి మెసేజిలిచ్చే మహాత్మా అనేవాడు వీళ్ళిద్దరూ బ్రాహ్మణఋషులని సీవీవీ అనేవారు. ఒకవేళ అదే నిజమైతే వారికి మన భారతదేశపు పేర్లుండాలిగాని MTA, One Point, Mahatma ఇలాంటి పేర్లెందుకు ఉంటాయి? కనుక ఇదంతా సీవీవీగారి అంతఃచేతన ఆడించిన మాయ అని అర్ధం కావడం లేదూ? ధియాసఫీలో ఉన్నపుడు నేర్చుకున్న పదజాలాలు, భావజాలాలు, తనవైన బ్రాహ్మణమూలాలతో, తనదైన ప్రత్యేకసాధనతో కలగలసి ఆయనచేత ఈ మాటలన్నీ మాట్లాడించాయి.

బ్లావట్స్కి, ఆల్కాట్ లను ఆయన ఎర్రగొర్రె, తెల్లమేకలన్నాడు. 'దేహంలోనూ హృదయంలోనూ పవిత్రులైన బ్రాహ్మణులకే ఎటర్నిటీ వస్తుందిగాని ఎర్రగొఱ్ఱెలకు తెల్లమేకలకు రాదు' అని ఆయన డైరీలో వ్రాసుకున్నాడు. బ్లావట్స్కి రష్యన్ గనుక ఎర్రగా ఉండేది. ఆమెను ఎర్రగొర్రె అన్నాడు. ఆల్కాట్ అమెరికన్ గనుక తెల్లగా ఉండేవాడు అతన్ని తెల్లమేక అన్నాడు. వారంటే ఆయనకున్న అభిప్రాయమేంటో దీనివల్ల మనం గ్రహించవచ్చు.

కానీ ఆయన చెప్పిన విషయమూ, ఆయన భావమూ నిజమైనదే. మాంసం తింటూ, మద్యపానం, ధూమపానం చేస్తూ ఒక పద్ధతీ పాడూ లేకుండా ఉండేవారి దేహధాతువులు కలుషితములౌతాయి. ఒక వంశంలో ఎన్నో తరాలుగా ఇలా చేస్తూ ఉంటే, వారు తలక్రిందులుగా తపస్సు చేసినా వారికి యోగసిద్ధి లభించదు. ఒకవేళ వారిలోకి దివ్యశక్తి దిగివచ్చి 'వర్కింగ్' మొదలైనా, ఆ ప్రాసెస్ వారికి చాలా బాధాకరంగా ఉంటుంది. వారిలో క్లిన్ చెయ్యవలసిన జన్యుదోషాలు చాలా చాలా ఎక్కువస్థాయిలో ఉంటాయి గనుక, ఆ దివ్యశక్తి వాటిని క్లిన్ చేసే సమయంలో వారికి ప్రాణాలు పోయినంత బాధ కలుగుతుంది.

బ్రాహ్మణ కుటుంబాలలో తరతరాలుగా శుద్ధమైన జీవనం సహజంగా ఉంటుందిగనుక వారికి యోగసాధన తేలికగా వస్తుంది. వారి దేహాలలో వర్కింగ్ జరిగేటప్పుడు వారికి పెద్దగా బాధలుండవు. కొంతమందికి సీవీవీ గారు చెప్పిన 'ఫినామినా' (సూచకక్రియలు) అనేది అసలు కనిపించను కూడా కనిపించదు. మన దేహం, మన హృదయాలు ఎంత శుద్ధంగా ఉంటె సాధన అంత తేలికగా సుఖంగా జరుగుతుంది. ఇది వాస్తవమే. ఒకవేళ వారు కూడా దారితప్పి ఇలాంటి అలవాట్లు నేర్చుకుంటే వారి దేహధాతువులు కూడా దోషభూయిష్టములుగా మారిపోతాయి గనుక బ్రాహ్మణకుటుంబాలలో పుట్టినా సరే, వారికి కూడా యోగసిద్ధి లభించదు.

ఇక్కడేదో నేను కులపక్షపాతినని అనుకోకండి. నేను గుణపక్షపాతిని. మంచితనానికి మానవత్వానికే నేను పెద్దపీట వేస్తానుగాని కులానికి కాదు. కానీ యోగసాధనాపరంగా చూచినప్పుడు బ్రాహ్మణులుగా పుట్టి, శుద్ధమైన జీవితం గడుపుతూ ఉన్నవారికి ఉన్న సౌలభ్యాలను కాదనలేం. దానికి కారణం తరతరాలుగా వారి శుద్ధమైన అలవాట్లు, జీవనవిధానం, నడవడికలే. అందువల్ల వారి జీన్స్ శుద్ధంగా ఉంటాయి. ఇతర కులాలవారైనా సరే, సద్బ్రాహ్మణుల లాగా జీవించడం మొదలుపెడితే వారు కూడా బ్రాహ్మణులే అవుతారు. బ్రాహ్మణత్వం అనేది కులంతో వచ్చినప్పటికీ అదొక జీవనవిధానమనేది సత్యం. ఆ కులంలో పుట్టినప్పటికీ దానిని పోగొట్టుకోవచ్చు. అలా పుట్టకపోయినా దానిని సంపాదించుకోవచ్చు. ఆ విధంగా బ్రతకాలి అంతే !. పుట్టుకతో బ్రాహ్మణులు కాకపోయినా తమ జీవనవిధానం వల్ల రుషులైన వాళ్ళు వేదకాలంలో ఎందరో ఉన్నారు. 

'మీ శిష్యులలో చాలామంది నాన్ బ్రాహ్మిన్సే ఉన్నారేంటి?' అని ఒక కరుడుగట్టిన చాదస్తపు బ్రాహ్మణుడు నన్నడిగాడు.

'వాళ్లందరికీ నేనే బ్రాహ్మణత్వాన్నిచ్చాను. అంతేకాదు ఋషిత్వాన్ని కూడా ఇవ్వబోతున్నాను' అని అతనికి సమాధానం చెప్పాను. నాకు చాలా పొగరని అతననుకున్నాడు. అది సత్యమని నేనంటున్నాను.  

బ్లావట్స్కి  చెయిన్ స్మోకర్ అని అందరికీ తెలుసు. అదీగాక నోరుముయ్యకుండా ఎప్పుడూ పెద్దగొంతుతో వాగుతూనే ఉండేది. తెల్లామె గనుక ఆల్కహాల్ అలవాటు కూడా ఆమెకు ఉండే ఉంటుంది. అమెరికావాడైన కల్నల్ ఆల్కాట్ కు కూడా ఈ అలవాట్లు ఉండే ఉంటాయి. అలాంటివారికి యోగసిద్ధి ఉందని ఎలా నమ్మాలని సీవీవీగారు ప్రశ్నించేవారు. ఇది సరియైన ప్రశ్నే. ఆయన చెప్పినది నిజమే.

ఆయన శిష్యులు చాలామంది 'మీరు మాకు కలలో కనిపించారు. దర్శనాలలో కన్పించారు. ఇలా  చెప్పారు. అలా చెప్పారు' అని ఆయనతో చెప్పేవారు. వారితో ఆయనిలా అన్నారు.

'నేను కన్పించినా, ఇంకెవరు కన్పించి ఏమేమి  చెప్పినా సరే, అవి జరిగితేనే నిజాలని నమ్మండి. జరగకపోతే మాయాశక్తి ఆడుతున్న నాటకమని తెలుసుకోండి'.

ఇదే తర్కాన్ని ఉపయోగించి చూచినప్పుడు MTA చెప్పినవి ఎన్నో జరగలేదు కదా? మరి MTA అనేవాడు నిజమనుకోవాలా? మాయ అనుకోవాలా? ఆయన సీవీవీ గారికిచ్చిన ఒప్పందాలలో ఏదీ నిజం కాలేదు. మరి MTA ఉన్నట్లా లేక అది సీవీవీగారి భ్రమ అనుకోవాలా?

ధియాసఫీ మూలాలేమిటో, దానిని మొదలుపెట్టిన వారెవరో, వారికున్న శక్తి ఏపాటిదో, వారి ఉద్దేశ్యాలేమిటో పైన వివరించాను. అలాంటి మూలాలనుంచి వచ్చిన చెట్టు నిజమైన ఫలాలనెలా కాస్తుంది? వివేకానందస్వామి అమెరికాలో యూరప్లో తన వేదాంత ప్రచారం చేస్తున్న సమయంలో ఆయన్ను ఎదుర్కొని అడ్డంకులు కల్పించి ఆయనపైనే విషప్రచారం చేసినవారిలో ధియాసఫిస్టులు మొదటిస్థానంలో ఉన్నారు. వారు నిజంగా సిద్ధపురుషుల చేతులలో పనిముట్లయితే నవీనకాలపు ఋషి అయిన వివేకానందస్వామిని వారెందుకు గుర్తించలేకపోయారు? ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి ఆయనపైనే బురద చల్లాలని చూచారు? కనుక ఈ మాస్టర్స్, మహాత్మాస్, హిమాలయన్ గురూస్ అనేవాళ్ళందరూ అబద్దమని రుజువు కావడం లేదూ?

యూజీగారు కూడా ఈ ధియోసఫీ మాయలో పడి చాలా ఏళ్ళు ఈతకొట్టి, జిడ్డుతో విభేదించి, చివరకు దానిలోనుంచి బయటపడి, మూడేళ్లపాటు యూరప్లో దిక్కులేకుండా తిరిగి చివరకు శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో కుండలినీ జాగృతిని పొంది, జీవన్ముక్తిని అందుకున్నాడు.

భౌతిక అమరత్వాన్ని తన శిష్యులకు ప్రామిస్ చేసిన రామలింగయోగి తనే ఏమైపోయాడో తెలీకుండా మాయమయ్యాడు. అమరత్వం నవ్వింది.

అదే భౌతిక అమరత్వాన్ని త్తన శిష్యులకు బోధించిన అరవిందయోగి పాండిచ్చేరిలో సమాధి అయ్యాడు. అమరత్వం మళ్ళీ నవ్వింది.

అదే భౌతిక అమరత్వాన్ని తన శిష్యులకు కూడా ప్రామిస్ చేసిన మాస్టర్ సీవీవీ గారు 1922 లో ఒకరోజున చనిపోయారు. అమరత్వం ఈసారి పగలబడి నవ్వింది.

1910 ప్రాంతంలో హిందూపత్రికలో ఆయనిచ్చిన ప్రకటన ఇలా ఉంది 'చావకుండా ఉండాలనుకునేవారు నన్ను సంప్రదించండి'. ఈ ప్రకటనను చూచి ఎందరో ప్రముఖులు ఆయన్ను సంప్రదించారు. ఆయన మార్గంలో యోగసాధన చెయ్యడం మొదలుపెట్టారు. అలా అలా ఆయనకు వెయ్యిమంది శిష్యులు చేరారు. కొన్నేళ్ళకు ఆయన పోయారు. ఆ వెయ్యిమంది శిష్యులూ పోయారు.

హిందూ దినపత్రికలో ఆయనిచ్చిన అమరత్వ సాధనా ప్రకటన మాత్రం మనల్ని వెక్కిరిస్తూ అలాగే ఉండిపోయింది. సీవీవీ గారి శిష్యులు ఆయన్ను ఆయన పద్ధతిని వదిలేసి, వారికి నచ్చినవారిని మాస్టర్లుగా పిలుచుకుంటూ వారికి పూజలు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.

అమరత్వం తన పనిని తాను చూచుకుంటోంది. మనుషులు మాత్రం యధాప్రకారం చనిపోతూనే ఉన్నారు. 

(ఇంకా ఉంది)