“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, జనవరి 2021, మంగళవారం

మధ్యప్రదేశ్ అడవులలో గడచిన 2020 చివరిరోజులు (గోండియా నుంచి ఇంకా అడవులలోకి)







దుర్గ్, భిలాయ్ కలిసే ఉంటాయి. ఒకవైపు దుర్గ్ సిటీ. ఇంకొక వైపు భిలాయ్ కాలనీ. భిలాయ్ బాగా విశాలంగా విసేసినట్లుగా ఉన్న ఇళ్ళతో ప్లాన్డ్ గా కట్టబడి ఉండి. ఎక్కువగా స్టాఫ్ క్వార్టర్స్ లాంటి ఇళ్ళు కనిపించాయి. ఒకరకమైన స్లీపింగ్ సిటీ లా ఉంది.

దుర్గ్ చుట్టూ ఉన్న రిసామా, మరోదా, బలోద్ మొదలైన ఊర్లు చూసుకుంటూ ఒక రోజంతా తిరిగి రాత్రికి హోటల్ ఖాళీ చేసి, రైలెక్కి రెండు గంటల ప్రయాణం తర్వాత గోండియా లో దిగాను. రాత్రికి గొండియా గెస్ట్ హౌస్ లో బస. అది స్టేషన్ ఎదురుగానే ఉంటుంది. కుక్ ఉన్నాడు. వేళకు భోజనం గట్రా అతనే చూసుకుంటాడు.

దుర్గ్ లో కంటే గొండియాలో చలి ఇంకా ఎక్కువగా ఉంది. మధ్యాన్నం ఒంటిగంటకి కూడా లైట్ స్వెటర్స్ వేసుకుని ఎండలో తిరుగుతున్నారు జనం. ఉదయం పది వరకూ ఎండ లేదు. సాయంత్రం నాలుగుకి చీకటి పడుతున్నట్లుగా అయిపోతున్నది. రాత్రికి చలి బాగా ఎక్కువవుతున్నది.

గోండియాకు రైస్ సిటీ అని పేరుంది. ఇక్కడ వరి బాగా పండుతుంది. ఇక్కడి రైల్వే స్టేషన్ చాలా పాతది. 1888 లో ఇది కట్టబడింది. పాతకాలంలో ఇక్కడ గోండులనే ఆదివాసీలు ఉండేవారు. వారిపేరుమీదనే ఈ ఊరు గోండియా అయింది. 

సహచరులు ఉన్న రూంలో హీటర్ పనిచేయడం లేదు. ఐసు నీళ్లలా ఉన్న నీళ్ళతో గజగజా వణుకుతూ స్నానం చేశామని చెప్పారు. కానీ ఎవరికీ జలుబు చేయలేదు. దానికి కారణం అక్కడి తిండి. ఆవనూనె ప్రభావం. ఒకవేళ తప్పక చేయవలసి వస్తే, చన్నీళ్ళతో హాయిగా ఎలా స్నానం చేయాలో ఆ టెక్నిక్ ని వాళ్ళకు వివరించాను.

యోగసాధనలో మంచి ప్రావీణ్యం ఉంటే, కావలసినంత వేడిని శరీరంలో పుట్టించుకోగలుగుతాము. దానికి ఎన్నో కిటుకులు యోగశాస్త్రంలో ఉన్నాయి. అయితే, వాటికి సాధన అవసరం అవుతుంది. ఒక్కరోజులో అవి సిద్ధించవు. యోగసాధన అలవాటు లేని మామూలు మనుషులు ఏం చేయాలి? ఆ టెక్నిక్స్ వాళ్ళకు చెప్పాను.

నార్త్ ఇండియాలో ఉన్న పాతకాలపు సిటీలు నాకు బాగా నచ్చుతాయి. అక్కడున్న సందుగొందులలో గమ్యం లేకుండా నిదానంగా అలా నడుస్తూ పోతుంటే చాలా బాగుంటుంది. దారిలో కనిపించిన చాయ్ అంగడిలో చాయ్ త్రాగడం, లోకల్స్ మాట్లాడుకునే మాటలు వింటూ ఉండటం బాగుంటుంది. ఒక పనంటూ లేకుండా, vacant mind తో aimless గా తిరగడంలో భలే మజా ఉంటుంది.

మర్నాడు పొద్దున్నే బయలుదేరి తుంసార్, గోబర్ వాహి, డోంగ్రీబుజుర్గ్, తిరోడి ఊర్లలో తిరిగివచ్చాము. దీనికి రెండురోజులు పట్టింది. ఈ ఊర్లన్నీ దట్టమైన అడవులలో ఉన్నాయి. డోంగ్రీబుజుర్గ్ అనేది సరిగ్గా భండారా అడవి మధ్యలో ఉంది. ఇది మహారాష్ట్రలో ఉన్నప్పటికీ, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ సరిహద్దులలో ఉంటుంది. ఇక్కడ MOIL factory ఉంది. ఈ ప్రాంతమంతా మేంగనీస్ ఖనిజం ఎక్కువ. తెల్లని సుద్దలాగా ఉంటుంది. ఇక్కడి నీళ్ళలో కూడా అది ఎక్కువే. కనుకనే ఇక్కడి మనుషులు కూడా అదోలా ఉంటారు. మన అలవాట్లు, రూపురేఖలు, ఆరోగ్యాలు చాలావరకు మనం ఉంటున్న నేలను బట్టి, దానిలో ఉండే పదార్ధాలను బట్టి, మనం త్రాగే నీళ్ళను బట్టి ఉంటాయి.




ఆ అడవి మధ్యలో తపోస్థల్ అనే ఒక కుటీరాన్ని చూచాను. ఎటుచూచినా ఇరవై కి. మీ ఉన్న అడవి మధ్యలో అది ఉంది. అక్కడే ఒక అతిధిగృహం కూడా ఉంది. అంత కీకారణ్యంలో అక్కడ ఎవరుంటారో తెలీలేదు. మనుషులెవరూ కనిపించలేదు. అప్పటికే చీకటి పడిపోవడంతో ఆగడానికి కుదరలేదు.

తిరోది నుంచి మేం వెనక్కు బయలుదేరేసరికి సాయంత్రం ఆరయింది. అడవి కావడంతో అప్పటికే చీకటిపడిపోయి రాత్రి తొమ్మిదో పదో అయినట్లు ఫీలింగ్ వస్తోంది. మా డ్రైవర్ పేరు అభయ్. చిన్న కుర్రాడే కానీ ఆ దారులన్నీ బాగా తెలుసు. ఆ అడవిలో మెలికలు మెలికలున్న దారులలో డ్రైవింగ్ చేసుకుంటూ మూడు గంటలు ఇన్నోవాను తోలి రాత్రి తొమ్మిదికి గొండియా చేర్చాడు. ఎక్కడన్నా కారు బ్రేక్ డౌన్ అయి ఉంటే తెల్లవార్లూ ఆ దట్టమైన అడవిలో భజన చేస్తూ ఉండవలసి వచ్చేది. దురదృష్టవశాత్తూ అలాంటిదేమీ జరగలేదు. రాత్రికి అక్కడే ఉందామంటే సహచరులు ఒప్పుకోరు. అలా జరిగి ఉంటే బాగుండేదని ఎంత కోరుకున్నానో ! కానీ వాళ్ళ అదృష్టాలు బాగున్నాయి. కారు ఎక్కడా ఆగలేదు !

దారిలో అతన్ని ఇలా అడిగాను.

'అభయ్ ! ఇస్ జంగల్ మే క్యా క్యా జాన్వర్ హై?'

అతనిలా అన్నాడు.

'సబ్ హై సర్. షేర్ ( సింహం)  హై , బ్యాగ్ర్ (పులి) హై ఔర్ భాలా (ఎలుగుబంటి) భీ హై'

'కభీ దేఖా కిసీకో?' అడిగాను.

'నహీ దేఖా అభీ తక్. మగర్ కహానియా  బహుత్ సునా. ఈసీ రాస్తా మే ఏక్ బ్యాగ్ర్ కో మేరా దోస్త్ ఔర్ ఏక్ డ్రైవర్ నే దేఖా. ఉస్నే రికార్డ్ కియా. ఏ వీడియో కో దేఖో' అంటూ ఒక వీడియో నాకు పంపించాడు. మీరూ చూడండి ! అదే దారిలో ఉంది పులి !    


అడవిలో అక్కడక్కడా చిన్నచిన్న జననివాసాలున్నాయి. వాటిదగ్గర ఆంజనేయస్వామి గుడులు కనిపించాయి. చీకటి పడితే అక్కడ కరెంటు కూడా లేదు. గుడ్డిదీపాల వెలుతురులో ఎలా ఉంటున్నారో ఆ అడవిలో జనం? కానీ వాళ్ళలో అసంతృప్తి కనిపించలేదు. అమాయకత్వంతో కూడిన ఒకవిధమైన సంతృప్తికరమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. 'మాకిది లేదు' అన్న బాధ వారిలో నాకు కనిపించలేదు. అన్నీ ఉండి కూడా ఇంకా ఏదో లేదని బాధపడే మనుషులు గుర్తొచ్చి నవ్వుకున్నాను.

ఈ అడవిలోకి క్రైస్తవవిషం ఇంకా వ్యాపించలేదు. అందుకే వీళ్ళు  ద్వేషం అనేది తెలీకుండా హాయిగా బ్రతుకుతున్నారని అనిపించింది.

31 రాత్రి గోండియాలో గడిచింది. పెద్దగా న్యూ యియర్ సంబరాలేమీ ఈ ఊర్లో కనిపించలేదు. దగ్గరలో ఏదో ఫంక్షన్ నుంచి ఎవరో కరావొకే సాంగ్స్ పాడుతున్నారు. 'ఏ షామ్ మస్తానీ..' అంటూ కిషోర్ కుమార్ పాట వినిపించింది. తర్వాత కొన్ని రఫీ సాంగ్స్ వినిపించాయి. పిచ్చి జనం ! పిచ్చి గోల ! నవ్వొచ్చింది.

రాత్రి పదికల్లా దుప్పటి ముసుగేసి నిద్రాధ్యానం మొదలుపెట్టాను.

(ఇంకా ఉంది)