“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, జనవరి 2021, మంగళవారం

Master CVV - జాతక విశ్లేషణ - 1 (నిజాలు - భ్రమలు)

మాస్టర్ CVV గా పిలువబడుతున్న శ్రీ కంచుపాటి వెంకాసామిరావు గారు 04.08.1868 తేదీన ఉదయం 10.20  గంటలకు కుంభకోణంలో పుట్టినట్లుగానూ, 12.5.1922 న కుంభకోణంలో మరణించినట్లుగా వారి జీవితచరిత్రలు చెబుతున్నాయి. 'ఎటర్నిటీ' లేదా physical immortality ని సాధిద్దామని ప్రయత్నించిన ఈయన బ్రతికినది కేవలం 53 ఏళ్లు మాత్రమే. వారి జీవితసంఘటనలు, యోగమార్గముల నేపథ్యంలో, వారి జాతకాన్ని విశ్లేషణ చేద్దాం.

ఇప్పటికి ఎందరో వారి శిష్యులు, సోకాల్డ్ 'మాస్టర్లు' జ్యోతిష్యశాస్త్రంలో ఉద్దండులమని చెప్పుకునేవాళ్ళు ఈయన జాతకాన్ని వివరించే ప్రయత్నం చేశారు. వీరిలో ఎక్కువమంది సాయనసిద్దాంతానుసారులు. పురాణకధలతో, థియోసఫీ మాయాపదజాలంతో, ఇంకా ఏవేవో కల్పిత విషయాలతో, కాకమ్మ పిచ్చికమ్మ కబుర్లతో వీరి విశ్లేషణలు సాగినవి.

మాస్టర్ సీవీవీ గారు  తమ యోగమార్గాన్ని సైన్టిఫిక్ యోగా అన్నారు. కానీ వారి శిష్యుల విశ్లేషణలన్నీ వారంటే ఉన్న భక్తికి తార్కాణములుగా మాత్రమే ఉన్నాయి గాని, వాటిలో శాస్త్రీయత పాళ్ళు లోపించినాయి. ఏ మహాపురుషుని నమ్మినవారైనా, వారిని ఏదో దేవుని అవతారమని చెప్పుకోవడం కద్దు. ఎందుకంటే, అలా చెప్పుకోనిదే వారికి తృప్తీ నమ్మకమూ రెండూ కలగవు. కానీ ఇలాంటి భావనల వెనుక సత్యంకంటే డొల్లనమ్మకము, అసత్య ప్రచారములే ఆధారములుగా ఉంటున్నాయి. ఇటువంటి కుహనాభక్తి పూరితములైన నిరాధారపు ప్రచారములను దూరము పెట్టి వీరి జాతకచక్రం ఏమంటున్నదో నిస్పాక్షికమైన దృష్టితో చూద్దాం.

మంత్రస్థానాధిపతి, కర్మకారకుడు అయిన శని తృతీయ ఉపచయస్థానంలో ఉంటూ  నవమాన్ని, రవిబుధులను చూస్తున్నాడు. లగ్నాధిపతి బుధుడు పదకొండులో రవితో కలసి ఉంటూ శనిని చూస్తున్నాడు. శని దృష్టి ద్వాదశంలో ఉన్న రాహువుమీద ఉంది. వీటివల్ల లోతైన యోగసాధన, తపస్సు, దయాహృదయములు గోచరిస్తున్నాయి. చతుర్ధం మనస్సు, ద్వాదశం రహస్యసాధన గనుక, ఈ శపితయోగప్రభావం వల్ల లోకపుబాధలను తనమీద వేసుకొని పరిష్కారం చెయ్యాలని ప్రయత్నించే సాధన కనిపిస్తున్నది. వీరు కనిపెట్టిన భృక్తరహిత తారకరాజయోగం అలాంటిదే.

నవమాధిపతి శుక్రుడు దశమంనుంచి నవమంలోకి వస్తూ శనివీక్షణకు గురౌతున్నాడు. కనుక ఈయనది సన్యాసమార్గం కాదని, అన్ని భోగాల మధ్యన ఉంటూనే చేసే సాధన యని తెలుస్తున్నది.

లాభాధిపతి అయిన పూర్ణచంద్రుడు మంత్రస్థానంలో ఉంటూ శనిదృష్టికి గురవడం లోతైన ఆధ్యాత్మికచింతనకు సూచనగా ఉంది. అదే చంద్రునిపైన ఉన్న సూర్యబుధదృష్టి వల్ల వివాహజీవితంలో చికాకులు, భార్య వల్ల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సప్తమంలో వక్రించి ఉన్న సప్తమాధిపతి గురువు వల్ల భగ్నమైన వివాహజీవితం సూచింపబడుతున్నది. ఈయన మొదటి భార్య గతించగా రెండవ వివాహం చేసుకున్నారు. రెండవభార్య వల్ల ఈయన సాధనలో చాలా చిక్కులు ఎదుర్కొన్నట్లు, మొదట్లో ఆమె చాలా మొండిగా చెప్పినమాట అర్ధం చేసుకోకుండా ఉన్నట్లు తెలుస్తున్నది. దారాకారకుడైన బుధుడు రాశిసంధిలో ఉండటం దీనిని బలపరుస్తున్నది.

ఈయన పౌర్ణమి ఛాయలో జన్మించాడు. కనుక వివాహజీవితం బాగుండదు. ఇది నిజమే అని ఈయన జీవితాన్ని ఈయన డైరీలను చదివితే అర్ధమౌతుంది.

సాంప్రదాయగ్రహమైన గురువు వక్రించి షష్ఠంలోకి వచ్చి శనిని సూచిస్తున్న కేతువుతో కలవడం వల్ల సాంప్రదాయవిరోధియైన ఒక విచిత్రసాంప్రదాయాన్ని అనుసరించడం కనిపిస్తున్నాయి. కేతువుకు ధూమకేతువని పేరుంది. 1910 లో  భూమికి దగ్గరగా వచ్చిన హేలీ తోకచుక్క ప్రభావం వల్లనే ఈయన సాధన పురోగమించిందని  అంటారు. దీనిలోని నిజానిజాలు దేవునికెరుక. దీనిని ఈయన జాతకంలోని గురుకేతు సంయోగం, సంప్రదాయవిరుద్ధమైన ఒక ఖగోళసంఘటనతో ఈయన సాధన ముడిపడినదని రుజువు చేస్తున్నది. కానీ ఇది ఆరవఇంటిలో జరగడం వల్ల, ఇది పూర్వకర్మ ఫలితమే గాని, దీని పరిణామాలు చివరకు సఫలం కావన్న సూచన బలంగా ఉన్నది.

ఈయన యోగం యొక్క ముఖ్యోద్దేశ్యమైన 'ఎటర్నిటీ' లేదా 'భౌతికశరీరంతో శాశ్వతత్వం పొందటం' అనే గమ్యం ఎంతవరకు నెరవేరిందో చూద్దాం.

మృతసంజీవనికి కారకుడు శుక్రుడు. ఈ జాతకంలో వక్రించి ఉన్నాడు. లగ్నాధిపతి బుధుడు బలహీనుడుగా రాశిసంధిలో ఉన్నాడు. దేహస్థిరత్వానికి కారకుడైన కుజుడు కూడా అతిబాల్యావస్థలో బలహీనుడుగా ఉన్నాడు. కుజబుధుల మధ్యన స్నేహపూరిత సంబంధం లేదు. వారికి బలములూ లేవు. అందువల్ల ఈ జాతకంలో మృతసంజీవనీ యోగం లేదు.

కుజుడూ శుక్రుడు కలసి ఉండటం నిత్యయవ్వనానికి సూచిక. కానీ ఈ యోగం బలంగా లేదు. శుక్రుడు వక్రించి కుజుడిని వదిలేసి వృషభంలోకి పోతున్నాడు. ఈ యోగం విడిపోతున్నది.  

అయితే, శని, శుక్ర, రాహు, కేతువులు పరస్పర కేంద్రస్థానాలలో ఉంటూ మిస్టిక్ క్రాస్ ను ఏర్పాటు చేస్తున్నారు. వీరి సాధనలో శని, శుక్రుల రెగులేషన్ చాలా ముఖ్యమైనది. శనంటే స్థిరత్వం. వీరి భాషలో చెప్పాలంటే స్టెబిలిటీ. శుక్రుడంటే భౌతికరూపంతో సుందరంగా ఉన్న సృష్టి లేదా దేహం. రాహుకేతువులంటే కుండలినీ శక్తి. ఈ మిస్టిక్ క్రాస్ అనేది కుండలినీశక్తి జాగృతి ద్వారా భౌతిక దేహానికి స్థిరత్వాన్ని లేదా శాశ్వతత్వాన్ని తెచ్చే ప్రక్రియ. కనుక భౌతికనిత్యత్వ గమ్యపు దారిలో శనిశుక్రులను సాధించడం లేదా రెగులేట్ చేయడం తప్పనిసరి. కనుక వీరి సాధన ఈ దారిలోనే సాగినప్పటికీ, దాని గమ్యాన్ని చేరడంలో మాత్రం ఈయన విఫలమైనాడని చెప్పక తప్పదు. దానికి కారణం శుక్రుని వక్రత్వం. అంటే ఈ సాధనకు దేహప్రకృతి సహకరించకపోవడం. అందుకనే చనిపోతున్న రోజున 'ప్రాణాన్ని దేహం స్వీకరిస్తున్నది కానీ అది నిలబడటం లేద'ని ఆయనన్నాడు. గ్రహాలన్నింటిలోకి శుక్రుడు లొంగడం చాలా కష్టమని కూడా ఆయనన్నాడు.

భౌతిక అమరత్వాన్ని పొందాలని ప్రాచీనకాలంలో ఎందరో ప్రయత్నించినట్లు గాధలున్నప్పటికీ వాటి సాధించినట్లుగా ఆధారాలు మాత్రం లేవు. అలా బ్రతికి ఉన్నవారెవరూ  కనిపించడం లేదు. చిరంజీవులు కూడా ఎక్కడో అడవులలో హిమాలయాలలో ఉన్నారని నమ్మడమేగాని వారిని చూచినవారు లేరు. నవీనకాలంలో అరవిందులు కూడా తమ యోగం ద్వారా దీనిని సాధించాలని ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. అరవిందుల మార్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారని చెప్పబడుతున్న మదర్ మీరా కూడా ఈ గమ్యాన్ని సాధించడంలో విఫలమయ్యారు. పాండిచ్చేరి ఆశ్రమంలోని వీరిద్దరి సమాధి వారి భౌతికనిత్యత్వ గమ్యాన్ని వెక్కిరిస్తూ ఈనాటికీ మనకు కన్పిస్తోంది.

ప్రపంచంలోని అన్ని మతాలలోనూ, వారివారి ప్రవక్తలు, దేవుళ్ళు మళ్ళీ వస్తారని, ఆకాశం నుంచి ఊడిపడతారని నమ్మకాలున్నాయి. కానీ వేలాది ఏళ్ళు గడచినా, ఆ ప్రవక్తలు దేవుళ్ళు దిగివస్తున్న జాడా జవాబూ ఎక్కడా లేదు. కానీ వాళ్ళొస్తారని జనాన్నినమ్మిస్తూ మాయచేస్తూ జరుగుతున్న గ్లోబల్ వ్యాపారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. మతాలన్నీ అవే ! భౌతిక అమరత్వ భావన కూడా ఇలాంటి బూటకమే.  దీనిలో ఎవరూ విజయాన్ని సాధించలేదు. 

ఇదే విధంగా మాస్టర్ సీవీవీ కూడా విఫలమయ్యారు. ఆయన 12.5.1922 తేదీన చనిపోవడమే దీనికి రుజువు. కొందరు శిష్యులు మాత్రం, ఆయన యొక్క సూక్ష్మశరీరానికి నిత్యత్వాన్ని తెచ్చారని సమర్థిస్తారు. ఎవరు చూచారు? కానీ ఆయన వ్రాతలలో ఉన్నది అది కాదు. భౌతికశరీరం రోగం  లేకుండా, కృంగుబాటు లేకుండా, చావు లేకుండా ఉండాలన్నదే ఈయన యోగగమ్యం. దానిని ఆయన సాధించలేదు. అంతేకాదు, ఆయన శిష్యులలో కూడా ఎవరూ సాధించలేదు.

యోగంతో రోగాలు తగ్గించడం పెద్దవిషయం కాదు. యోగసాధనలో కొద్దిగా పురోగమించినవారు ఇలాంటివి చాలా తేలికగా చేయగలుగుతారు. కానీ, మరణించిన వారిని కూడా బ్రతికించారని అనేక కధలను వీరి శిష్యులు చెబుతారు. కానీ ఆ బ్రతికినవారు కొంతకాలానికి మళ్ళీ చనిపోయారని కూడా చెబుతారు. కనుక ఆ బ్రతికించడం ఎందుకు? ఎప్పటికైనా చనిపోవలసినవాడు మరికొద్దికాలం బ్రతికితేనేమి, బ్రతకకపోతేనేమి? అసలా చనిపోయారని చెప్పబడుతున్నవారు నిజంగా చనిపోయారా? లేక కోమా వంటి స్థితిలో ఉండి మళ్ళీ తెలివిలోకి వచ్చారా? అనేది ఎవరూ చెప్పలేరు. నిస్పాక్షికంగా గమనించి రికార్డ్ చేసినవారు ఎవరూ లేనందున, భారతీయులకు సహజమైన మూఢభక్తి శిష్యులలో ఉండటం సహజం అయినందున, ఈ కధలన్నీ నిజాలని మనం నమ్మలేం.

మాస్టర్ సీవీవీ గారు ఇలా వ్రాశారని రికార్డ్ చేయబడి ఉన్నది - 'చనిపోయినవానిని "లేచిరా" అని పిలిస్తే వాడు లేచి రావడం మన యోగమార్గంలో చాలా చిన్నపని'. చెప్పడానికి బాగానే ఉంది. కధలు బాగానే ఉన్నాయి. కానీ రుజువులేవి? ఆ చెప్పినవారే మరణానికి లొంగిపోయారు. వారి శరీరాలు చనిపోయాయి. అలా బ్రతికింపబడ్డారని చెప్పబడినవారూ కొంతకాలానికి చనిపోయారు. ఏమిటిది? ఎందుకిదంతా? ఇవి ఉత్తమాటలా? నిజాలా?  

20-8-1917 న ఇవ్వబడిన పిల్లర్ టెస్ట్ ప్రకారం - 'నశ్వరమైన మానవదేహం చావకుండా ఉండదు. నశిస్తుంది. కానీ, దానికి సరియైన శిక్షణనివ్వడం ద్వారా దానిని నేను చావు లేనిదిగా చేస్తా' నని ఆయనన్నారు. కానీ, అది జరుగలేదు. నిజం కాలేదు.

సీవీవీ గారి సాహిత్యం ప్రకారం, MTA అనే ఒక సిద్ధుని ద్వారా సీవీవీగారికి ఇవ్వబడిన ఒప్పందాలు ఆరున్నాయి. వాటిలో 3, 4, 5  ఒప్పందాల ప్రకారం రక్తమాంసాలతో కూడిన ఈ శరీరం చావకూడదు. ఒకవేళ చనిపోయినా, అవే రక్తమాంసాలతో అదే దేహంతో అచ్చుగుద్దినట్లుగా మళ్ళీ బ్రతికిరావాలి. ఆయనకు గాని, ఆయన శిష్యులకు గాని ఇవి జరుగలేదు కాబట్టి ఈ ఒప్పందాలు నెరవేరలేదని చెప్పక తప్పదు.

అంటే MTA అబద్దాలు చెప్పారా? లేక సీవీవీ అలా అనుకున్నారా? లేదా భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతాయని నమ్ముతూ తరాలు తరాలు మోసపోతూ ఎదురుచూడాలా? అసలు థియోసఫీ చెబుతున్న మాస్టర్లు ఉన్నారా? ఉంటే, వాళ్ళందరూ బూటకమని, వాళ్ళసలు లేనేలేరని, ఇదంతా బ్లావట్స్కీ, లెడ్ బీటర్లు అల్లిన కట్టుకధలని, థియోసఫీలో మునిగితేలిన జిడ్డు కృష్ణమూర్తి ఎందుకన్నాడు?

మాస్టర్ సీవీవీ గారి మీద గ్రహప్రభావం లేదని, వీరి మార్గాన్ని అనుసరించేవారి మీద కూడా ఉండదని వీరి శిష్యులు నమ్ముతారు. ఎందుకంటే ఆయన గ్రహాలకు అతీతమైన హయ్యర్ సోర్స్ నుంచి వచ్చాడని చెబుతారు. ఇది అబద్దం మాత్రమే గాక ఉత్త మూఢనమ్మకం కూడా. అవతారపురుషుల జీవితాలే గ్రహప్రభావం ప్రకారంగా నడిచాయి. వీరి జీవితం కూడా అలాగే నడిచింది. సాక్షాత్తూ ఆయనే ఒకానొక గతజన్మలో తాను క్రీ.శ. 920 ప్రాంతంలో తమిళనాడులో ఉన్న పరాంతకరాజు అనే చోళరాజునని చెప్పాడు.

ఈయన 12.5.1922 తేదీన చనిపోయారు. ఆ సమయంలో ఈయన జాతకంలో శని - రాహు- శనిదశ జరిగింది. ఇది శపితదశ. అదీగాక ఆ సమయంలో శని, రాహు, గురువులు ఈయన లగ్నమైన కన్యలో సంచరించినట్లు చూడవచ్చు. వీరిలో శని, గురువులు వక్రించి ఉంటూ, ఈ లోకం నుంచి తిరోగమించి వెళ్ళవలసిన దృఢకర్మను సూచిస్తున్నారు. లగ్నం మీద సంచరించే శపితయోగం మరణాన్ని కొనితెస్తుంది. ఈయన జీవితంలో కూడా అదే సమయం మరణాన్ని కొనితెచ్చినట్లు మనం చూడవచ్చు. కనుక ఈయనపైన గ్రహప్రభావం ఖచ్చితంగా ఉన్నదని గోచరిస్తున్నది.

ఈయన పుట్టినది కుజ- గురు - శుక్ర దశలో. దశమంలో ద్విస్వభావరాశిలో ఉన్న కుజశుక్రులు, గురువుల కోసం మొదట్లో ఈయన వెదుకులాటనూ, ధియోసఫీతో సంబంధాలనూ, సూచిస్తున్నారు. స్థిరరాశినుంచి వీరిని చూస్తున్న కేతు(శని) గురులవల్ల, భౌతికశరీర నిత్యత్వం కోసం ఈయన ప్రయత్నించింది నిజమేనని, ఈయన జన్మోద్దేశ్యం అదేనని తెలుస్తున్నది. కానీ అందులో ఆయన విజయాన్ని పొందలేదన్నది మాత్రం వాస్తవంగా కన్పిస్తుంది.

ఈయన చనిపోతున్న సమయంలో క్రిందపడి గిలగిలా తన్నుకున్నారని వ్రాసి ఉన్నది. బహుశా హార్ట్ ఎటాక్ కావచ్చు. అదే సమయంలో ఆయన ప్రక్కన ఉన్న శిష్యుడు ఒకాయన 'ఇదేమిటి? ఇన్ని చెప్పిన మీరు ఇలా చనిపోతే ఎలా కుదురుతుంది?' అనిన ధోరణిలో ఎంతో వాదించాడని, చుట్టూ ఉన్నవారు ఎంతగానో ప్రార్ధించారని, రోదించారని తెలుస్తున్నది. దానికి సమాధానంగా ఆయన 'ఇన్నాళ్లు నాతో ఉండి, నా మార్గాన్ని గురించి ఇదా నీవు తెలుసుకున్నది?' అన్నారని మాత్రమే వ్రాసున్నది. కానీ మృత్యువు వారిని తీసుకుపోయినమాట వాస్తవం. ఆయన జవాబు ఆ శిష్యుడిని గానీ, ఆ తరువాత కాలంలో సత్యాన్వేషులైన ఎవరిని గానీ, తృప్తి పరచలేదన్నది కూడా వాస్తవమే.

ఆ శిష్యుడు అడిగినదానిలో తప్పేమీ లేదు. తన జీవితమంతా ఆయన ఏదైతే చెబుతూ వచ్చారో అది జరగనప్పుడు, శిష్యులు అలా ప్రశ్నించడం సహజమే.  దీనికి సమాధానాన్ని మాత్రం ఈనాటికీ సీవీవీ గారి భక్తులు చెప్పలేకపోతున్నారు. కాకుంటే, ఇంకా ఏదో చెయ్యవలసిన పనిని చెయ్యడానికి సూక్ష్మలోకాలకు ఆయన వెళ్లాడని సరిపెట్టుకోవడం తప్ప ఆ శిష్యులు ఇంకేమీ చెయ్యలేరు. అరవిందుల శిష్యులు కూడా ఇదే ధోరణిలో సరిపెట్టుకుని ఊరుకున్నారు. అడిగిన ప్రశ్నలకు సరియైన సంతృప్తికరములైన జవాబులు రానప్పుడు ఏదో ఒకటి ఊహించుకుని  తృప్తిపడటం తప్ప వెర్రిభక్తులు ఇంకేం చెయ్యగలరు?

'ఇక తెరచాటున ఉండు' అన్నట్లుగా MTA చెప్పాడని, మరణించడానికి కొద్దిరోజుల ముందు సీవీవీ గారన్నట్లు రికార్డ్ కాబడి ఉంది. అది సీవీవీ గారు అర్ధం చేసుకోలేకపోయారని, 'MTA ఎందుకిలా చెప్పారు? దీనర్ధం ఏమిటి?' అని ఆలోచించారని కూడా రికార్డ్ అయి ఉన్నది. తెరవెనుకకు పోవడమంటే చనిపోవడమని తర్వాత తరాలవారు అన్వయించుకున్నారు. అసలు MTA అనేవాడు నిజంగా ఉన్నాడా? లేక అది సీవీవీ గారి అంతచ్చేతనేనా? నాకైతే రెండోదే నిజమని అనిపిస్తున్నది. 

ఆయన ముఖ్యశిష్యులూ, ఎన్నో రోగాలను తగ్గించారని, చనిపోయినవారిని కూడా బ్రతికించారని పేరుపడిన వేటూరి ప్రభాకరశాస్త్రిగారు కూడా, తిరుపతి టీటీడీ మ్యూజియానికి శిల్పాలను సేకరించే పనిలో తెగతిరిగి, దానివల్ల కలిగిన అనారోగ్యంతో అర్ధాంతరంగానే మరణించారు. ఆయన పోయినపుడు విశ్వనాధ సత్యనారాయణ గారు 'చివరకు నిన్నే కబళించెనా మృత్యువు మహాత్మా !' అని వాపోయారని రికార్డ్ కాబడింది. ఆకలీ, దప్పికా, కృంగుబాటూ, చావూ లేని యోగమార్గంలో ఎంతో ముందుకు పోయినవారికి, చనిపోయినవారిని బ్రతికించిన వారికి, ఇలా ఎందుకు జరుగుతుంది? అలసట ఎందుకొస్తుంది? క్షీణత ఎలా వస్తుంది? చావు ఎలా వస్తుంది?

అసలు, ఎటర్నిటీ (భౌతిక శరీరానికి నిత్యత్వం) ఎలా వస్తుంది? దీనిగురించి సీవీవీ గారు ఏం చెప్పారు?

"పదేళ్ళపాటు నా సాధనను భక్తి విశ్వాసాలతో ఒక్కరోజు కూడా తప్పకుండా చేస్తూ శరణాగతితో అంతరిక పరిశీలనతో ఉన్నవారికి ఎటర్నిటీ వస్తుంద"ని మాస్టర్ సీవీవీగారన్నట్లు వారి  డైరీలను బట్టి తెలుస్తున్నది. మరి వారి తర్వాత వారి ఘనశిష్యులుగా పేరొందినవారూ, మాస్టర్లుగా పేర్లు పెట్టుకుని పిలిపించుకుంటున్నవాళ్ళూ, పాదనమస్కారాలూ పూజలూ వగైరాలు చేయించుకుంటున్నవాళ్లూ, ఆ విధంగా సాధన చెయ్యలేదా? చెయ్యకపోతే వాళ్ళు మాస్టర్లు ఎలా అయ్యారు? చేస్తే వారికెందుకు ఎటర్నిటీ రావడం లేదు?  వారందరూ ఎందుకు చనిపోతున్నారు? చెబుతున్నదేమిటి? కనిపిస్తున్నదేమిటి? ఎక్కడుంది లోపం?

ఇదంతా కలిపి చూస్తే ఏమనిపిస్తున్నది? భౌతిక అమరత్వమనేది ఇప్పటివరకూ  ఎవరికీ సాధ్యం కాలేదు. ఇకముందు అవుతుందన్న నమ్మకాలు కూడా నిరాధారాలే. కాకమ్మకబుర్లను నమ్మే ఆశపోతు జనాలున్నంతవరకూ ఇలాంటి అందని గమ్యాలూ, అందరాని గమ్యాలూ, లేని గమ్యాలూ చెప్పబడుతూనే ఉంటాయి. నమ్మేవాళ్ళు నమ్ముతూనే ఉంటారు, సత్యం దానికి విరుద్ధంగా ఎదురుగా కనిపిస్తున్నా సరే ! మాయాప్రపంచమంటే ఇదిగాక ఇంకేంటి మరి? అనే అనిపిస్తుంది, మనలో శాస్త్రీయదృక్పధమనేది ఏమాత్రమైనా మిగిలి ఉంటే ! 

(ఇంకా ఉంది)