“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

15, జనవరి 2021, శుక్రవారం

Master CVV జాతక విశ్లేషణ - 3 ( భౌతిక నిత్యత్వం అసలు అవసరమా? )

సుఖం కోసం వెదుకులాట అనేది ఈ భూమిమీద జీవం పుట్టినప్పటినుంచీ మొదలైంది. ప్రతిజీవీ దుఃఖాన్ని తప్పించుకుని సుఖంగా బ్రతకాలని అనుకుంటుంది. సుఖం దొరికాక అది శాశ్వతంగా అలాగే ఉండిపోవాలనుకుంటుంది. కానీ ఈ లోకంలో అది సాధ్యం కానిపని. కారణం? శాశ్వత సుఖమనేదానికి భూమిపైన ఉన్న ప్రకృతి అమరిక సహకరించదు. మనిషి తయారు కాబడిన తీరూ, అతని దేహపు తీరూ, అతని మనస్సు యొక్క నిర్మాణమూ దానిని నిలబెట్టే పరిస్థితిలో లేవు.

ఆడామగా అనే తేడా పెట్టడంలోనే జీవక్రియల పరంగాను, దేహధర్మాల పరంగాను, వారివారి పనులేమిటి? అన్నవాటిని ప్రకృతి చాలావరకూ నిర్ణయించేసింది. మగవాడు వేటాడో ఇంకేదో పనిచేసో సంపాదించి తీసుకురావడం, ఆడది ఇంట్లో ఉండి ఇల్లు చక్కబెట్టుకుని వండిపెట్టడం అనేవి ఆటవికకాలం నుంచీ ఉన్నాయి. ఆ తరువాత శారీరకంగా కలవడం పిల్లలని కనడం అనేది ప్రకృతిలో అంతర్భాగంగా ఉంది. ఆ  రకంగా ఆ కుటుంబం లేదా వంశం పెరుగుతూ వచ్చేది.

ఆలోచన లేని ఆటవికదశలో మానవుడు ఉన్నంతలో తిండి, బట్ట, గూడు దొరికితే అదే సుఖం అనుకున్నాడు.  ఆ తరువాత పక్కవాడిమీద ఆధిపత్యం చెలాయిస్తే అదే సుఖమనుకున్నాడు. ఆ తర్వాత ఎక్కువమంది ఆడవాళ్ళని భార్యలుగా చేర్చుకుంటే సుఖం అనుకున్నాడు. ఆ విధంగా గుంపులు మొదలయ్యాయి. బలం ఉన్నవాడు నాయకుడుగా, బలం లేనివాడు అనుచరుడుగా ఉండిపోవడం మొదలైంది. గూడెములు, జనపదాలు, నగరాలు, రాజ్యాలు మొదలయ్యాయి. యుద్ధాలు మొదలయ్యాయి. దోపిడీ మొదలైంది. దాచుకోవడం మొదలైంది. అసమానతలు మొదలయ్యాయి. నాగరికత పెరుగుతూ వచ్చింది.

ఎన్ని జరిగినా మనిషికి శాశ్వత సుఖమనేది అందటం లేదు. ఎన్ని సంపాదించినా, ఎంత దోచుకున్నా, ఎంత దాచుకున్నా, ఎన్ని అనుభవించినా శాశ్వతసుఖమనేది మిగలడంలేదు.  ఈ పరిస్థితిలోనుంచి ఆలోచన పుట్టింది. తత్త్వచింతన పుట్టింది. అనుభవిస్తే కలిగే ఆనందం తాత్కాలికం. అనుభవించకుండా నిగ్రహించుకుంటే కలిగే ఆనందం దానికంటే గొప్పదన్న విషయం తెలిసింది. తానొక్కడే అనుభవిస్తే కలిగే ఆనందం కంటే తనకున్నదాన్ని నలుగురితో పంచుకుంటే కలిగే ఆనందం విశాలమైనదన్న స్పృహ ఏర్పడింది. దౌర్జన్యంగా దోచుకుంటే కలిగే ఆనందం కంటే ప్రేమతో జయిస్త్తే కలిగే ఆనందం ఉత్తమమైనదన్న విషయం అర్ధమౌతూ వచ్చింది.

దీనిలోనుంచి తపస్సు మొదలైంది. యోగం మొదలైంది.  సాధన మొదలైంది.

దేవుడికి ఎవరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ఎన్ని మతాలు ఏర్పడినా, ఈ ప్రాసెస్ మాత్రం అన్నిచోట్లా ఇదే విధంగా ఉన్నది. మొదట్లో గాలినీ నీళ్ళనూ ఎండనూ చలినీ భూమినీ ఆకాశాన్నీ అగ్నిని పూజించిన మనిషి, తర్వాత్తర్వాత వీటిని సృష్టించినవాడో, అదో, ఏదో ఒకటి ఉండాలనుకుని దానికి తన భాషను బట్టి పేర్లు పెట్టుకుని ఆకారాలు కల్పించి పూజించడం మొదలుపెట్టాడు.  దాని కరుణ ఉంటె అన్నీ కలసి వస్తాయన్న  భ్రమను పెంచుకున్నాడు. దేవుడికి తాను పెట్టిన పేరును, తాను ఊహించిన రూపాన్ని ఇతరుల మీద రుద్దుతూ, వాళ్ళు వినకపోతే వాళ్ళను చంపుతూ వచ్చాడు. ఇలా చేస్తే తాను చనిపోయాక స్వర్గానికి పోతానని, మిగతా వాళ్ళందరూ నరకానికి పోతారని భ్రమలు పెంచుకున్నాడు. 

కొన్నాళ్ళు ఇలా గడిచాక, చనిపోయాక స్వర్గం వస్తే  ఉపయోగమేముంది, ఇప్పుడే ఇక్కడే రావాలన్న భావన మొదలైంది. వెరసి, ఆనందం కోసం బయట వెదికితే ఉపయోగం లేదు. లోపల వెదకాలి అన్న విషయం అర్ధమైంది. బయట లోకంలో ఆనందాన్ని వెదికేది సైన్స్ అయింది. లోపల వెదికేది ఆధ్యాత్మికత అయింది. ఈ క్రమంలో ఆధ్యాత్మికులు భౌతికాన్ని వదిలిపెట్టి తమలోలోపలకు వెళ్లడం ఎక్కువైంది.  సమాజానికి దూరంగా పోయి తపస్సులో ఉండటం మొదలైంది.

ఈ పోకడ బాగా ముదిరిన తర్వాత వారిలో  కొందరిలో ఇంకొక ఆలోచన మొదలైంది. అదేంటంటే, లోపల తాము పొందిన ఆనందాన్ని బయటకు ఎందుకు తేకూడదు? భూమిని వదిలి పైపైకి లోలోపల పోయి స్వర్గాన్ని అందుకున్నాం సరే. ఆ స్వర్గాన్ని ఇదే భూమిపైకి ఎందుకు దించకూడదు? అనే ప్రయత్నాలు మొదలయ్యాయి. సమాజాన్ని వదిలిపెట్టి కొండల్లో అడవులలో ఉంటూ తపస్సు చేసి పొందినదాన్ని సమాజంలోకి ఎందుకు తేకూడదు? తనకు తెలిసినదానిని నలుగురికీ ఎందుకు చెప్పకూడదు? వారికెందుకు దారి చూపకూడదు? అనిన ప్రయత్నాలు మొదలయ్యాయి.

బొందితో స్వర్గం కాదు, బొందిలోకే స్వర్గాన్ని దించాలన్న ఊహ  కలిగింది. దీనికి మార్గం నశించిపోయే ఈ శరీరాన్ని దైవత్వంతో నింపి నశింపు లేనిదానిగా శాశ్వతమైనదానిగా చెయ్యాలన్న భావన బలపడుతూ వచ్చింది. ఒక్కరైనా అలా చెయ్యగలిగితే, మిగతా అందరూ చెయ్యడానికి దారి ఏర్పడుతుంది.  అప్పుడు భూమి అంతా అలాంటి దివ్యమానవులతో నిండిపోతుంది. స్వర్గంగా మారుతుంది.

ఆ స్వర్గంలో ఉండే లక్షణాలేమిటి? ప్రస్తుతం మానవుడిని బాధపెడుతున్నవేవీ దానిలో ఉండకూడదు.  ఏమిటవి?

మొదటిది ఆకలి. ఆకలి ఉండటం వల్లనే మనిషి ఇన్ని పనులు చేస్తున్నాడు. చదువుకుంటున్నాడు. ఉద్యోగాలు చేస్తున్నాడు. వ్యాపారాలు చేస్తున్నాడు. యుద్ధాలు చేస్తున్నాడు. దోచుకుంటున్నాడు. మంచి, చెడు ఎన్నెన్నో పనులను చేస్తున్నాడు. ఆకలే లేకపోతే? మన జీవితం ఎంత హాయిగా ఉంటుంది? ఈ పోటీ ఉండదు. ఈ  ఉరుకులు పరుగులు ఉండవు. ఎక్కడెక్కడికో పోయి ఉద్యోగాలు చేయాల్సిన పని ఉండదు. భూమికోసం యుద్ధాలుండవు. ఆ భూమిపైన పంటలు పండించడం, దానికోసం నీళ్లయుద్దాలు ఏవీ ఉండవు. ఆ తర్వాత ఆ పంటలు దాచిపెట్టడం, దానితో వ్యాపారం చెయ్యడం ఇవేవీ ఉండవు. గొప్పా బీదా తారతమ్యాలుండవు. దొంగతనాలు దోపిడీలు ఉండవు. అసమానతలేవీ ఉండవు. ఏ గొడవా ఉండదు. ఆకలిలో భాగమే దప్పిక. అదికూడా లేకపోతే మనిషి జీవితం ఇంకా ఎంతో హాయిగా ఉంటుంది.

రెండవది రోగం. చిన్నాపెద్దా ఎన్నో రోగాలు మనకు కాలక్రమంలో వస్తుంటాయి. వాటికోసం మందులు కనుక్కోవాలి. రీసెర్చి చెయ్యాలి. ఒక రోగానికి మందు కనుక్కుంటే ఇంకొక రోగం పుట్ట్టుకొస్తుంది. ఆ మందులను కొనుక్కోవాలంటే డబ్బులుండాలి. దానికోసం మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి. ఇదంతా పెద్ద విషవలయం. మనిషి జీవితాన్ని రోగమనే దొంగ దోచుకుంటోంది. కనుక ఇది లేకుండా పోవాలి.

మూడవది ముసలితనం. ఇదొస్తున్నదంటే ప్రతివాడికీ పెద్ద చింత మొదలౌతుంది. దానిని రాకుండా చేసుకోడానికి మందులు మాకులు మ్రింగడం, ఇంకా ఎన్నెన్నో తంటాలు పడాలి. అయినా అది రాకుండా ఉండదు. దానితో అనేక శారీరక మానసిక బాధలు వస్తాయి. ఇంకొకరిపైన ఆధారపడవలసి వస్తుంది.  మాటలు పడవలసి వస్తుంది. మంచాన పడవలసి వస్తుంది. కనుక ఇదికూడా లేకుండా పోవాలి.

నాలుగవది చావు. దీనిని కూడా ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. ఆ తర్వాత ఏమౌతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అందరూ ఊహించి చెప్పేవారే గాని, చూచి చెప్పినవారు లేరు. కనుక దీనిని కూడా జయించాలి.

ఇవన్నీ భౌతికమైనవి. వీటిని జయిస్తే సరిపోదు. ఇవన్నీ లేకపోయినా మనిషిని నిరంతరం బాధపెట్టేది ఇంకొకటుంది. అదే మనసు. దానికున్న బాధలు అన్నీ ఇన్నీ కావు.

దానికీ ఆకలి దప్పికలున్నాయి. ఆశే దాని ఆకలి. దానికీ రోగం ఉంది. కోపం తాపం మొదలైన మానసికరోగాలే అవి. దానికీ ముసలితనం ఉంది. శక్తి తగ్గిపోయి క్షీణించడమే దాని ముసలితనం. దానికీ చావుంది. భౌతికమైన చావు తర్వాత అదేమైతున్నదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కనుక ఇవన్నీ లేకుండా పోవాలి. అంటే మనసుని కూడా జయించాలి.

ఈ గమ్యాలను సాధించిననాడు మనిషికి ఆకలి, దప్పిక, రోగం, ముసలితనం, మరణం, ఆశ, కోరిక, భయం, అసూయ, కోపం, గర్వం, స్వార్ధం ఇవేవీ ఉండవు. అంటే మనిషి దేవతగా మారుతాడు. ఈ స్థితిని పొందాలని భౌతికశాశ్వతసాధనా వాదులు భావించారు. ప్రయత్నించారు. వారిలో రామలింగయోగి, అరవిందులు, సీవీవీగారు ఉన్నారు. సాధనైతే మొదలుపెట్టారు, సాహిత్యం రాశారు, అనుచరులు కూడారు, కుంపట్లు పెట్టారుగాని, ఈ గమ్యాలను వీరుగాని, వీరి అనుచరులు గాని ఎవరూ అందుకోలేకపోయారు. వీరేకాదు ఈ భూమిమీద ఎవరూ ఇప్పటిదాకా ఈ గమ్యాలను అందుకోలేకపోయారు.

అది జరుగుతుందన్న ఆశతో వారి భక్తులు బ్రతుకుతున్నారు. నేనూ కాదనడం లేదు. జరగదని అనడం లేదు. కానీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. సరియైన దారిలో ప్రయత్నం చెయ్యమనే నేనూ చెబుతున్నాను. ఎందుకంటే నా మార్గమూ అదే. నాదేకాదు ఏ ధ్యానిదైనా, యోగిదైనా అంతిమగమ్యం అదే, అవి వారికి తెలిసినా తెలియకపోయినా !

అయితే ఈ క్రమంలో కొన్ని ప్రశ్నలు ఎదురౌతాయి. ఈ ప్రశ్నలు నేను సంధిస్తున్నానని, వీటికి జవాబులు నాకు తెలియవనుకోకండి. తెలుసు. ఆయా మహనీయుల ఘనశిష్యులలో కొంత ఆలోచన రేకెత్తిద్దామన్న సదుద్దేశ్యంతోనే నేనీ ప్రశ్నలు సంధిస్తున్నాను. ఆలోచించండి. మీకు జవాబులు దొరికితే మంచిదే, దొరకకపోతే అప్పుడు నన్నడగండి. చెబుతాను.

ప్రస్తుతం ఒక్క  ప్రశ్నకు మాత్రం జవాబు చెబుతాను. ఇది మీలో ఒకాయన అడిగినదే. గత రెండుపోస్టులు చదివిన సీవీవీ గారి శిష్యుడొకాయన నిన్న రాత్రి ఈ విధంగా మెయిల్ ఇచ్చాడు.

'మీరు రాస్తున్నది బాగానే ఉంది. కానీ మీరు మా లైను కాదు కదా? మా విధానం మీకెలా తెలుసు? నేను ఈ సాధన గత 30 ఏళ్ళనుంచీ చేస్తున్నాను. మాకే ఇంకా కొన్ని కొన్ని అర్ధం కావడం లేదు. మీకెలా తెలిశాయి?'

ఇంత బిజీలో కూడా ఆయనకు ఇలా జవాబిచ్చాను.

'ఒకటి సరిగ్గా తెలిస్తే అన్నీ తెలుస్తాయి. అసలిన్ని యోగాలు ఇన్ని మార్గాలు లేవు. ఉన్నదొకటే దారి. దారి సరిగ్గా తెలిస్తే అన్నీ తెలుస్తాయి. మీ ప్రశ్నలోనే మీ జవాబుంది. 30 ఏళ్లుగా అందులో ఉన్నా మీకు తెలియలేదు. 30 నిముషాలలో నాకు  తెలియకూడదని రూలు లేదుగా? అదెట్లా జరిగిందో ఇది కూడా  అట్లాగే జరిగింది. దానికేది కారణమో దీనికీ అదే కారణం'.

సరే ఇప్పుడు నా ప్రశ్నలు వినండి మరి !

------------------------------------------------

1. మీరనుకున్నట్లుగా ఎటర్నిటీ లేదా ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ లేదా భౌతిక అమరత్వం వచ్చిందనే అనుకుందాం. అది అందరికీ వస్తుందా లేక కొందరికే వస్తుందా?

అందరికీ వచ్చేపనైతే అప్పుడందరూ ఏమౌతారు? భూమ్మీద పనులన్నీ అప్పుడు  స్తంభించి పోతాయి కదా ! ఆకలిదప్పికలు, రోగాలు, ముసలితనం, చావు, శారీరక, మానసిక, ప్రాణిక సమస్యలేవీ లేనప్పుడు మనిషి ఎలా బ్రతకాలి? ఏం చెయ్యాలి? వాడికెలా తోస్తుంది? చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, ప్రేమలు, పెళ్లిళ్లు ఏవీ ఉండవు. వాటి అవసరమూ ఉండదు. అప్పుడు మనిషి జీవితం ఎంత దుర్భరం అవుతుందో ఆలోచించారా? కొన్నాళ్ళకు ఆ జీవితం మొహంమొత్తుతుంది. అప్పుడు చావుకోసం మనిషి ప్రయత్నాలు మొదలుపెడతాడు. దానికొసం రీసెర్చి చేస్తాడు. ఆకలికోసం, దప్పిక కోసం, రోగం కోసం, ముసలితనం కోసం రీసెర్చి చేస్తాడు. ఎలా చనిపోవాలా అని మార్గాలు వెదుకుతాడు. సీనంతా అప్పుడు రివర్స్ అవుతుంది. ఇందుకా మీ సాధన?

అలాకాకుండా కొందరికే వచ్చేపనైతే, అప్పుడు మిగిలినవాళ్లంతా ఏమౌతారు? సపోజ్ ఒక పదిమందికి భౌతిక అమరత్వం  వచ్చిందని అనుకుందాం. వాళ్ళు చావరు. మిగతా 750 కోట్లమంది చనిపోతారు. వాళ్ళ గతేంటి? వాళ్ళు మళ్ళీ పుడతారా? వాళ్లంతా పుట్టి పోతూ ఉంటే, వీళ్ళుమాత్రం గుండ్రాళ్లలాగా ఇక్కడే ఉంటారా? పైగా, ఆ పుట్టేది ఎవరికి పుడతారు? మామూలు మనుషులకు పుడతారా లేక అమరులకు కూడా పుడతారా? ఇంకో విధంగా  చెప్పాలంటే అమరులకు సెక్స్  ఉంటుందా ఉండదా?

కరోనా లాంటి ఏ ఎపిడెమికో వచ్చి మిగతా వాళ్లంతా పోయి ఈ పదిమంది మిగిలితే అప్పుడేమౌతుంది? ఈ పదిమంది ఈసురోమంటూ ఏడుస్తూ ఇంత భూమ్మీదా ఏం చేస్తారు? చెయ్యడానికి ఏముంది గనుక? ఆ చనిపోయినవాళ్లు మళ్ళీ పుట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే అమరులకు సెక్స్ తో అవసరం లేదు గనుక. ఆ చనిపోయినవాళ్ల జీవులన్నీ ఏమౌతాయప్పుడు? ఈ మిగిలిన పదిమందీ ఏమౌతారప్పుడు? చావురాదు. చెయ్యటానికి ఏమీ లేదు. ఎంతకాలం అలా? ఆ పరిస్థితి అమరత్వమా నరకమా?

పోనీ, అలా ఉండీ ఉండీ, చివరకు అందరూ అమరులైపోయారనుకుందాం. అప్పుడు భూమి మీద ఇన్నికోట్లమంది ఉండి ఏం  చేస్తారు? ఊరకే రాళ్లు రప్పలలాగా ఉంటూ ఉంటారా? లేక వాళ్లకు పనేమైనా ఉంటుందా? పనికి ప్రేరకాలైన  ఆకలిదప్పికలే లేనప్పుడు ఇక వాళ్లకేం పని ఉంటుంది? ఉన్నా వాళ్లేందుకు చేస్తారు? చెయ్యవలసిన అవసరం ఏముంటుంది? ఊరకే జొంబీ ల్లాగా భూమ్మీద తిరుగుతూ ఉంటారా? అది స్వర్గం అవుతుందా నరకం అవుతుందా?

2. ఇలా అమరులైనవారికి పిల్లలు పుడతారా పుట్టరా?

ఒకవేళ పుడతారని అనుకుంటే - అలా పుట్టేవాళ్ళు మామూలు మనుషులుగా పుడతారా, లేక, అమరులుగా పుడతారా? అలా ఎంతమంది పుడతారు? ఒకవేళ అమరులుగా పుడుతూ ఉంటె, కొన్నాళ్ళకు భూమ్మీద  నిలబడటానికే చోటు లేకుండా పోతుంది. ఎందుకంటే అందరూ పుడుతూనే ఉంటారు గాని, ఎవ్వరూ చావరు గనుక. అప్పుడు  భూమినిండా మనుషులే ఉంటారు బెల్లానికి పట్టిన చీమలలాగా. ఆ తర్వాత పుట్టేవాళ్ళు ఎక్కడికి పోవాలి?

ఒకవేళ మామూలు మనుషులుగా పుడితే, వాళ్ళు మళ్ళీ సాధనతో అమరులు కావాలా? ఒకవేళ ఆ జన్మలో కాలేకపోతే మళ్ళీ మళ్ళీ అలా పుడుతూ ఉంటారా?  అంటే, అమరులకు ఆకలిదప్పికలుండవు గాని  పిల్లల్ని కనేపని ఉంటుందా? అదేం అమరత్వం? ఇదే అమరత్వమైతే, అలాంటి అమరత్వం అసలెందుకు? అందులో ఏం ఆనందం ఉందసలు?

లేదా, ఏ విధమైన ఆశా, అవసరమూ, స్పందనా లేకుండా రాళ్ళలా పడుండేపనైతే కూడా అసలా అమరత్వమెందుకు? అంగారకుడు మొదలైన గ్రహాలలో రాళ్ళూ రప్పలూ మాత్రమే ఉన్నాయి. భూమ్మీద కూడా అలాంటి మనుషులే వుంటారన్నమాట ! ఇలాంటి అమరత్వం కోసం ఇంత కష్టపడి ప్రయత్నం చెయ్యాలా? అవసరమా అసలు?

3. ప్రతి మతంలోనూ వారి ప్రవక్తో, దేవుడో ఆకాశం నుంచి ఊడిపడి భూమిని స్వర్గం చేస్తాడని నమ్మకాలున్నాయి. క్రైస్తవులేమో జీసస్ రెండవ రాకడ అంటారు. రెండువేల  ఏళ్ళనుంచి ఈ అబద్దాన్ని చెబుతూ  ఊదరగొడుతూనే ఉన్నారుగాని ఆ జీసస్ అడ్రస్ ఎక్కడా  కనిపించడం లేదు. షియా ముస్లిములేమో పన్నెండో ఇమామ్  వస్తున్నాడని వెయ్యేళ్ళనుంచీ ఎదురు చూస్తూనే ఉన్నారుగాని ఆయన వస్తున్న జాడా జవాబు ఏమీ కనిపించడం లేదు. ఈ ఎదురు చూస్తున్నవాళ్లంతా  చనిపోతున్నారుగాని వాళ్ళేమీ రావడం లేదు. బౌద్ధులేమో మైత్రేయబుద్ధుడు వస్తాడంటారు. జిడ్డు కృష్ణమూర్తిని మైత్రేయ అన్నారు ఆయన భక్తులు. ఆయనేమో ఒకప్రక్కన భక్తి వద్దంటాడు. ఇంకోపక్క ఆయన భక్తులు ఆయన్నే మైత్రేయ అంటారు. ఈలోపల ఓషో భక్తులొచ్చి ఈయనే మైత్రేయ అంటున్నారు. షీలానడిగితే ఇంకో రకంగా చెబుతోంది. హిందువులేమో కల్కి అవతారం గుర్రమెక్కి వస్తుంది అంటారు. గుర్రాలకాలం పోయి వందలఏళ్ళు అవుతోంది. ఆయనెప్పుడొస్తాడో, గుర్రంతో కత్తితో వచ్చి ఈ రాకెట్ యుగంలో ఇప్పుడేం చేస్తాడో ఎవడికీ తెలీదు. ఈలోపల ఎవడు పడితే వాడు నేనే కల్కి అవతారమంటూ మత్తుమందు కలిపిన తీర్ధం పోస్తూ ఎవడి బిజినెస్ వాడు చేసుకుంటున్నాడు.

ఆ ప్రవక్తో దేవుడో దిగి వచ్చినపుడు ఈ చచ్చిన పీనుగులని మళ్ళీ బ్రతికిస్తాడని మూర్ఖంగా నమ్ముతూ చనిపోయినవాళ్లను పాతేస్తారు గాని దహనం చెయ్యరు. ఇది జరగదన్న సంగతి వాళ్లకు అర్ధం కాదు. కానీ ఈ లోపల వేలాది ఏళ్లుగా పాతిపెట్టిన పీనుగులతో భూగోళం మొత్తం ఒక శవాల కుప్ప అవుతోంది. సమాధులతో నిండి పోతోంది.

ఇప్పుడు లేటెస్ట్ గా రామలింగయోగీ, అరవిందులూ, సీవీవీ గారూ మళ్ళీ వస్తారని వారివారి భక్తులు ఎదురుచూస్తూ ప్రార్ధనలు చేస్తున్నారు. నా ప్రశ్నేంటంటే జీససూ, ఇమామూ, మైత్రేయా, కల్కీ, రామలింగమూ, అరవిందులూ, సీవీవీగారూ అందరూ కలసి  ఒకేసారి కట్టగట్టుకుని వస్తారా లేక విడివిడిగా వస్తారా? గ్రూప్ ఫోటోనా సింగిల్ ఫోటోనా అన్నది నా ప్రశ్న? లేదా, పాతమతాలు చెబుతున్న అబద్దాలనే మీరూ ఇంకో కొత్తరకంగా చెబుతున్నారా? కొత్త సీసాలో పాతసారానా? ఇప్పటిదాకా పాతవాళ్లే రాలేదు. ఇప్పుడు కొత్తగా ఈ ముగ్గురూనా?

అలా వచ్చినపుడు ఎవరి భక్తుల్ని మాత్రమే వాళ్ళు  ఉద్ధరించి స్వర్గాన్ని వారికిస్తారా లేక అందరినీ కరుణిస్తారా? ఒకవేళ వాళ్ళలా కరుణించినా ఈ కరుడుగట్టిన భక్తులు దానిని ఒప్పుకుంటారా? మా ప్రవక్త వేషంలోనే మాకు కనిపించమని గోల చేస్తారా?

అసలు వీళ్ళందరూ ఒకటేనా లేక వేర్వేరా? ఒకడే అయి, ఒకడే వస్తే, వాడు ఏ రూపంలో వస్తాడు? అందరికీ ఒకే రూపంలో  కనిపిస్తాడా లేక ఎవరికి వారి ప్రవక్తలాగా  కనిపిస్తాడా? బ్రతికున్నపుడు వీళ్లందరి ఫిలాసఫీలూ వేర్వేరు కదా? మరి చనిపోయాక అందరూ ఒకే ఆత్మగా ఒకే శక్తిగా ఎలా అవుతారు? ఏం జరగబోతోందసలు?

అసలివన్నీ నిజాలేనా లేక అందరూ నిద్దట్లో కలలు కంటూ కలవరిస్తున్నారా? చీకటిలోనుంచి వెలుగులోకి పోతున్నామని భ్రమపడుతూ ఇంకా కటిక చీకట్లోకి పోతున్నారా?  

(ఇంకా ఉంది)