“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, డిసెంబర్ 2020, శుక్రవారం

సరైన నిర్ణయం...

నా ముంగిట్లో నీవు యాచించినప్పుడు

ఎగతాళిగా నవ్వాను

నీ కౌగిట్లో నాకు చోటిచ్చినప్పుడు

వెక్కిరించి వెళ్లాను

ఈరోజు నీకోసం ఎదురుచూస్తున్నా

నీవు తిరిగిచూడటం లేదు

నీ నిర్ణయం సరైనదే...


అన్నీ అనుకూలంగా ఉన్నపుడు

నా గొప్పే అనుకున్నాను

అన్నీ అనుకున్నట్లే జరుగుతున్నపుడు

నా తెలివే అనుకున్నాను

ఈరోజు కాలం చేతిలో దెబ్బలు తింటున్నా

నువ్వున్నావని ఇప్పుడు తెలుస్తోంది

నీ నిర్ణయం సరైనదే...


ఎన్నో మొగ్గల్ని నా చేతులతో చిదిమేశాను

వాటి రోదన నాకు పట్టలేదు

ఎన్నో పువ్వుల్ని ఈ చేతులతో నలిపేశాను

వాటి వేదన నాకు తట్టలేదు

ఇప్పుడు కాలం నా గొంతు నులుముతుంటే

నా క్రౌర్యం నాకర్ధమౌతోంది

నీ నిర్ణయం సరైనదే...


సాయం చెయ్యవలసిన ప్రతిచోటా

సందేహిస్తూ ఆగిపోయాను

గాయం చెయ్యకూడని ప్రతిచోటా

ఘరానాగా ముందుకు దూకాను

ఇప్పుడు నేను చేసినదే నాకు జరుగుతుంటే

నీ ప్రణాలికను అర్ధం చేసుకుంటున్నాను

నీ నిర్ణయం సరైనదే...


చెయ్యవలసినవి వెంటనే చెయ్యకుండా

చెత్తమాటలతో పొద్దుపుచ్చాను

చెయ్యకూడనివి చెంగుచెంగున చేస్తూ

చేటు మూట కట్టుకున్నాను

చెయ్యిదాటిపోయిందని ఇప్పుడు గుర్తించి

చేష్టలు దక్కి నిలుచున్నాను

నీ నిర్ణయం సరైనదే...


ఎన్నో రూపాలలో నాతో ముచ్చటించావు

ఎవరోలే అనుకున్నాను

ఎన్నో పాపాలలో నన్ను హెచ్చరించావు

ఎప్పుడూ వినకున్నాను

అవన్నీ వృధా అని ఇప్పుడు తెలుసుకున్నాను

కానీ సమయం మించిపోయింది

నీ నిర్ణయం సరైనదే...