“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, డిసెంబర్ 2020, శుక్రవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 39 (దూషణ - భూషణ)




జీవితం చాలా విచిత్రమైనది. జీవనగమనంలో ఎందరో తారసపడుతూ ఉంటారు. కలుస్తూ ఉంటారు. విడిపోతూ ఉంటారు. వారిలో కొందరితో మనకెంతో అనుబంధం ఏర్పడుతుంది. వాళ్ళు ఎంతగానో మనల్ని అభిమానిస్తారు. అర్ధం చేసుకుంటారు. మరికొందరు, మనం చెబుతున్నదాన్ని అర్ధం చేసుకోకపోగా, మనమీద  అకారణశతృత్వాన్ని పెంచుకుంటారు. దూరమౌతారు. ఈ క్రమంలో సహజంగానే కొందరు మెచ్చుకుంటారు. కొందరు తిడతారు. కొందరు సంతోషాన్ని కలిగిస్తే, కొందరు బాధపెడతారు. ఏది ఏమైనా, ఎవరేమన్నా, ముందుగా మనమేంటో మనకు తెలియాలి. కొన్ని సిద్ధాంతాల కోసం మనం ఆచంచలంగా నిలబడాలి. అప్పుడే బాధా ఉండదు. ఒకరు మనల్ని పొగిడినా లేక తిట్టినా మనలో ఏ మార్పూ ఉండదు. ఈ స్థిరత్వం లేకపోతే ఆటుపోట్లకు తట్టుకోలేక ఊగిపోయి మానసికంగా చెదిరిపోతాం. చివరకు మనకంటూ ఒక స్థిరత్వం లేకుండా తయారవుతాం. ఆధ్యాత్మికమార్గంలో నడిచేవారు అలా ఉండకూడదు.

మర్నాడు పొద్దున్నే లేచి యధావిధిగా కార్యక్రమాలన్నీ కానిచ్చి, గోశాలకు వెళ్ళి గోవులు ఎలా ఉన్నాయో చూచి కాసేపు అక్కడే ఉండి వెనక్కు వచ్చాము. వాటి ఆలనాపాలనా తిండీ తిప్పలూ చూసుకుంటూ అక్కడే ఉంటున్న అబ్బాయిని పలకరించి వచ్చాము. అతను వాటిని చాలా చక్కగా చూసుకుంటున్నాడు. వాటికి దోమతెరలు, ఫాన్లు, మంచి తిండి, చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణం అన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. వాటి పాలతో చేసిన పెరుగు మజ్జిగలనే అన్నపూర్ణాలయం (భోజనశాల) లో వాడుతున్నారు. మొత్తం మీద గోశాల చాలా చక్కగా నడుపబడుతున్నది. అక్కడనుంచి అందరం చాలా సంతృప్తితో వెనక్కు వచ్చాము.

ఇంటికి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి, అమ్మ ఆలయానికి వెళదామని లేచాము. ఈలోపల ఫోన్లో ఏదో మెయిల్ వచ్చింది. ఎవడో నన్ను తిడుతూ మెయిల్ ఇచ్చాడు. ఇలాంటివి ఈ పదేళ్ళలో ఎన్నో చూచి ఉండటంతో, 'ఇప్పటిదాకా వినని కొత్త తిట్లు ఏం తిట్టాడా తెలుసుకుందాం' అనుకుంటూ సరదాగా మెయిల్ తెరిచాను.

ఎవడో నార్త్ ఇండియన్, అమెరికాలో ఉంటున్నాడు, ఇంగ్లీషులో తిడుతూ మెయిల్ చేశాడు. ఎందుకయ్యా అంటే, 'ఓషో ప్రియురాలు వివేక్ అనుమానాస్పద మరణం' మీద జ్యోతిష్యపరమైన విశ్లేషణ చేస్తూ నేను వ్రాసిన పోస్ట్ ను నా ఇంగ్లీష్ బ్లాగులో చదివాడు. అందులో ఓషోలోని చీకటికోణాలను బాగా విమర్శించాను. అది అతనికి నచ్చలేదు. ఓషోకి వీరభక్తుడులాగుంది. బాగా హర్టయ్యాడు. కోపం పట్టలేక నన్ను తిడుతూ మెయిల్ ఇచ్చాడు.

అతని మెయిల్లో తార్కికమైన వాదన ఏమీ లేదు. 'ఓషో ముందు నువ్వెంత? అసలు ఓషోని విమర్శించేటంత మొనగాడివా నువ్వు? ఓషో అంత ఇంత. అలాంటివాడు ఇప్పటిదాకా పుట్టలేదు. ప్రపంచానికి నువ్వు చేసింది ఏమిటసలు?' అంటూ ఒక వీరభక్తుడి ధోరణిలో తిట్లపురాణంలాగా సాగింది ఆ మెయిల్. చదివేకొద్దీ చచ్చే నవ్వొచ్చింది. ఓపికగా అతను వ్రాసిన ఒక్కొక్క లైన్ కూ సరైన జవాబులిచ్చి ఆ మెయిల్ క్లోజ్ చేశాను. మూఢభక్తులను ఎవరు మార్చగలరు? నిజాలు చెబితే వాళ్లేందుకు నమ్ముతారు? ఓపెన్ మైండ్ తో చూస్తే అన్నీ అర్ధమౌతాయి. మనసుకు మూతేసుకుంటే ఎలా ఎక్కుతాయి? ఇన్ని నిజాలు బయటపడిన ఈనాటికీ సత్యసాయిబాబాను నమ్ముతున్న మూఢభక్తులు లక్షల్లో ఉన్నారు. మిగతావాళ్ళు కూడా కొద్దోగొప్పో అంతే. అన్నీ అర్ధం కావడానికి టైమ్ పడుతుంది. ఈ లోపల మన టైమ్ అయిపోతుంది. నవ్వొచ్చింది. ఇక ఆ విషయాన్ని మనసులోనుంచి చెరిపేశాను.

ఈ రకంగా రకరకాల పనుల్లో ఉదయమంతా జరిగింది. భోజనశాలలో మధ్యాన్నం భోజనం చేసి ఇంటికి తిరిగి వస్తుండగా, దారిలో అప్పారావన్నయ్య కనిపించారు. ఆయన నన్ను చూస్తూనే మహదానందపడిపోయాడు. కుశల ప్రశ్నలయ్యాయి.

'ఇక్కడకొచ్చి కూడా నన్ను కలవకుండా వెళుతున్నారా?' అంటూ కొంచం నొచ్చుకున్నాడాయన.

'అదేం లేదండీ ! కరోనా కదా. అందర్నీ కలబెట్టడం ఎందుకని మీ దగ్గరికి రాలేదు. అది తప్ప వేరే కారణం ఏమీ లేద'ని చెప్పాను.

మా అల్లుడినీ అమ్మాయినీ ఆయనకు పరిచయం చేశాను. ఇక ఆయన ఆనందాన్ని మా అల్లుడితో చెప్పసాగాడాయన.

'మీ మామగారు వ్రాసిన పుస్తకాలు కొన్ని నేను చదివాను. ఇప్పటికీ చదువుతూ ఉంటాను. మావాళ్ళతో ఆయన భావాలను చర్చిస్తూ ఉంటాను. ఎంతో స్థాయి ఉంటే తప్ప అలాంటి పుస్తకాలు వ్రాయలేరు. ఆయన్ని చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది. 'మనుష్యాణాం సహస్రేషు' అన్నట్లు ఆయనలాంటివాళ్ళు వేలల్లో ఒక్కరుంటారు' అంటూ ఆయన ఆప్యాయతను మాటల్లో కుమ్మరించాడాయన.

వాళ్ళు మౌనంగా వింటున్నారు. నేనూ వింటున్నాను.

'ఆయన క్లాసులకు నేనూ వస్తానంటే మాత్రం వద్దంటాడు. నన్ను మాత్రం రానివ్వడు' అంటూ నిష్టూరంగా నవ్వాడాయన.

ఎనభై దగ్గరలో ఉన్న ఆయన అలా అంటుంటే నాకు బాధనిపించింది.

'మీకెందుకండి? మీకు నా క్లాసులు అవసరం లేదు. అందుకే మిమ్మల్ని రానివ్వను. అంతేగానీ వేరే ఏం లేదు' అన్నాను.

నేను అక్కడకు వెళ్ళిన ప్రతిసారీ, తన సాధన గురించి నాతో చెబుతూ ఉంటాడాయన. ఈసారి తన ఛాతీమీద చేయి ఉంచుకుని 'బాగున్నాను. హాయిగా ఉంది' అన్నాడాయన. ఆయన స్థితి అర్ధమై నాకూ ఆనందం కలిగింది.

ఆయన దగ్గర సెలవు తీసుకుని వెనక్కు వచ్చేశాము. దారిలో నడుస్తూ ఉండగా, నాలో ఆలోచనలు మొదలయ్యాయి.

పొద్దున ఎవడో ముక్కూముఖం తెలీనివాడు నానాతిట్లూ తిడుతూ మెయిల్ చేశాడు. మధ్యాన్నానికి ఎనభైఏళ్ల యోగి ఒకాయన అమితంగా అభిమానిస్తూ మెచ్చుకుంటూ పొగుడుతున్నాడు. ఈ రెంటిలో ఏది నిజం? ఏదబద్దం? మొదటివాడికి నేనెవరో పూర్తిగా తెలీదు. అతనికి ఓషో అంటే కూడా పూరిగా తెలీదు. ఏదో మిడిమిడిజ్ఞానంతో కొన్ని పుస్తకాలు చదివి ఏదో ఊహించుకుంటున్నాడు. అతనికి తెలీని కోణాలు నేను చెబితే తట్టుకోలేక తిడుతున్నాడు. ఇక ఇక్కడ చూస్తే, ఈయనేమో నలభై ఏళ్లనుంచీ యోగసాధనలో ఉన్న వృద్ధుడు. నా భావజాలం చదివి అందులోని సత్యాలు అర్ధమై నన్ను అభిమానిస్తున్నాడు. దేనిని నేను తీసుకోవాలి? దేనిని విడిచిపెట్టాలి?

విచిత్రంగా, ఆ మెయిల్లోని తిట్లు నాలో ఏ చలనాన్నీ తీసుకురాలేదు. ఆఫ్కోర్స్ నవ్వొచ్చింది. జాలికలిగింది. అజ్ఞానంతో అహంకారంతో కూడిన మనస్సు అక్కడ అగుపించింది. దానిపైన జాలి కలిగింది. అంతేగాని నా అహమేమీ దెబ్బతినలేదు. ఇక, ఈ పొగడ్తల వల్ల నేనేమీ ఉబ్బిపోలేదు. ఇంకొక మనిషిలోని జ్ఞానస్థితిని గమనించి అందరిముందూ మెచ్చుకోవాలంటే మనలో విశాలమైన మనస్సుండాలి. ఈయనలో అదుంది. దానిని గమనించి నాకు సంతోషం కలిగింది. వారివారి మనసులున్న స్థితులను చూసి జాలీ సంతోషమూ కలిగాయిగాని, నాలో కోపంగాని, అహం దెబ్బతినిన ఫీలింగ్ కానీ కలగలేదు. లోపల ఏ విధమైన చలనమూ లేదు. నా స్థితిని గమనించి నాకింకా సంతోషం కలిగింది.

వారివారికి అర్ధమైన పరిస్థితిని బట్టి వారు మాట్లాడారు. అది వారి మానసిక అవగాహనకు సంబంధించిన విషయం. దానితో నాకేంటి సంబంధం? నేను నేనే. నేనెంటో నాకు తెలుసు. వారేంటో కూడా తెలుసు. కనుక వారి మాటలు నన్నెందుకు చలింపజేయాలి? నేనెందుకు పొంగిపోవాలి? లేదా క్రుంగిపోవాలి? అవసరం లేదు.

మొదటిది అజ్ఞానపూరిత మనస్సు. హర్టయింది. మరి అజ్ఞానం అహంకారం ఉన్నపుడు హర్టవక ఇంకేమవుతుంది? కనుక దానికది సరైనదే. రెండవది అవగాహనతో కూడిన యౌగిక మనసు. విషయం అర్ధమై దానికానందం కలిగింది. దీనికిదీ సరైనదే. వాళ్ళవరకు వాళ్ళూ కరెక్టే. నా వరకు నేనూ కరెక్టే. వాళ్ళలా వాళ్ళున్నారు. నాలా నేనుండాలి. వాళ్ళ సంగీతానికి నేను నాట్యం చేయకూడదు.

మాటమాటకీ చలించేది అచలమెలా అవుతుంది?

ఈ విధంగా లోలోపల ఆలోచనలు సాగుతున్నాయి. పక్కనున్నవాళ్ళతో మాత్రం అవీ ఇవీ మాట్లాడుకుంటూ  ఇంటికి చేరుకున్నాము.

(ఇంకా ఉంది)