“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

17, సెప్టెంబర్ 2019, మంగళవారం

సెప్టెంబర్ 2019 పౌర్ణమి ప్రభావం ఇలా చూపించింది

మనుషుల పైన చంద్రుని ప్రభావం తప్పకుండా ఉంటుందనే విషయం గత పదేళ్లుగా నా పోస్టులు చదువుతున్న వాళ్లకు స్పష్టంగా తెలిసే ఉంటుంది. అందులోనూ, పౌర్ణమి అమావాస్య ప్రభావాలు ఎలా ఉంటాయో అనేక ఉదాహరణల ద్వారా నేను వ్రాసిన గత పోస్టులలో ఇంకా స్పష్టంగా మీరు చూడవచ్చు.

ఈ నెల పౌర్ణమి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా ప్రభావాలు చూపించింది. వీటిల్లో, మన తెలుగు రాష్ట్రాలలో జరిగిన రెండు ముఖ్యమైన చెడు సంఘటనలు - గోదావరిలో లాంచీ మునిగి జనం చనిపోవడం, ఉరివేసుకుని కోడెల శివప్రసాద్ మరణించడం.

వీటికీ చంద్రుని స్థితిగతులకూ ఏమిటి సంబంధం? అని అనకండి. ఒక్కసారి నా గత పోస్టులు చదవండి. సంబంధం ఏమిటో అర్ధమౌతుంది. లాంచీ విషయం ప్రస్తుతం పక్కన ఉంచి, కోడెల ఉదంతం పరిశీలిద్దాం.

మానసికంగా కృంగిపోయి ఉన్నవారు ఇలాంటి సమయాలలో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ విషయం గతంలో ఉదయకిరణ్ విషయంలో గాని, జియాఖాన్ విషయంలో గాని, ఇంకా కొంతమంది మామూలు మనుషుల ఆత్మహత్యల విషయాలలో గాని, స్పష్టంగా నేను విశ్లేషించాను. కావలసినవారు ఆ పోస్టులు వెతికి చదవవచ్చు. వీరందరూ కూడా పౌర్ణమి అమావాస్య సమయాలలోనే ఆయా అఘాయిత్యాలకు పాల్పడ్డారు.

పౌర్ణమి అమావాస్య సమయాలలో పిచ్చివాళ్లకు పిచ్చి ఎక్కువౌతుందనేది ప్రపంచవ్యాప్తంగా రుజువైన వాస్తవం. అలాగే, మానసిక రోగులు కూడా, సమత్వాన్ని ఇంకా ఎక్కువగా కోల్పోయి ఈ సమయాలలో విపరీతంగా ప్రవర్తిస్తారనేది కూడా రుజువైన వాస్తవమే. ముఖ్యంగా ఆడవాళ్ళ ప్రవర్తనలో చాలా స్పష్టమైన ఊగిసలాటలను ఈ సమయాల్లో గమనించవచ్చు. ఎందుకంటే వాళ్ళు cycle based జీవులు. ఆడవారి మీద చంద్రుని ప్రభావం చాలా  అధికంగా ఉంటుంది.

అదలా ఉంచితే, డిప్రెషన్ లో ఉన్నవార్లు ఈ సమయంలో ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తారనేది కూడా ఎన్నోసార్లు రుజువైంది. కనుక, అలాంటి స్థితిలో ఉన్నవారిని కుటుంబ సభ్యులు ఒంటరిగా వదలిపెట్టి ఉండకూడదని, వాళ్లకు మానసికంగా ఆసరా ఇస్తూ, 24 గంటలూ వెన్నంటి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలని, ఉదయకిరణ్ జాతకవిశ్లేషణలో నేను వ్రాశాను. ఇప్పుడు మళ్ళీ కోడెల విషయంలో కూడా ఇటువంటి డిప్రెషనే ఈ దుర్ఘటనకు కారణమైంది.

రాజులైనా, రాజ్యం ఏలినవారైనా, మహా ధనికులైనా, ఎవరూ కర్మకు అతీతులు కారు. సమయం వచ్చినపుడు ఈ ప్రపంచంలో ఎవరి కర్మను వారు అనుభవించక తప్పదు. ఆయా కర్మఫలితాలు, సూర్యచంద్రుల గతులను బట్టి మనుషులకు కలుగుతూ ఉంటాయి. డబ్బున్నవాడు పెద్ద ఆస్పత్రి లో పోతే, డబ్బు లేనివాడు వాడి ఇంట్లోనే పోతాడు. అంతే తేడా ! అయితే, డబ్బూ అధికారమూ ఎంతో ఎక్కువగా చూసినవాళ్లు చివరిలో ఇలా దుర్మరణం పాలు కావడం చేసుకున్న కర్మ  కాక మరేమిటి?

తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తన చివరిరోజులలో చాలా మానసిక క్షోభను అనుభవించాడు. తనవారు, తన అనుచరులు, తన నీడలు అనుకున్నవారి నుండి ఆయనకు చివరి క్షణాలలో ఎలాంటి ఆసరా కూడా దక్కలేదు. చివరి రోజులలో ఆయన పడిన క్షోభ ఈరోజున తెలుగుదేశం పార్టీ లీడర్లను ఇలా వెంటాడుతోందా? అందుకే తెలుగుదేశం నాయకులు చాలామంది రోడ్డు ప్రమాదాల లోనో, ఇతర కారణాల వల్లనో దుర్మరణం పాలౌతున్నారా? వారికి మానసికంగా శాంతి లేకుండా పోతున్నది ఇందుకేనా? ఉసురంటే ఇదేనా? ఏమో? మనకు తెలీదు. కాలమే నిర్ణయించాలి.