“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

7, సెప్టెంబర్ 2019, శనివారం

చంద్రయాన్ - 2 ఎందుకు విఫలమైంది? జ్యోతిష్య కారణాలు

ఈ పోస్టు రాద్దామని కూచోగానే కర్ణపిశాచి నవ్వు వినిపించింది. 

'ఏంటీ చాలా రోజులనించీ కనిపించడం వినిపించడం మానేశావ్? - అడిగా కాస్త కోపంగా.

'నువ్వీ మధ్యన controversial posts ఏవీ వ్రాయడం లేదు కదా? ఉన్నట్టుండి చాలా మంచివాడివై పోయావ్. అందుకని' - అందది.

'హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే పనుల్లో ఉండి వ్రాతలు తగ్గించాలే. టైం సరిపోవడం లేదు. జర పరేశాన్లున్న. అదట్లుంచు గాని, ఏంది భై గట్ల సకిలించినవ్? ' - అడిగా.

'నీ విమర్శకులు ఈ టైటిల్ చూడగానే ఏమనుకుంటారో అర్ధమై అలా నవ్వాలే. గింజుకోకు' - అందది.

'ఏమనుకుంటారు?' - తెలిసినా తెలీనట్టు అడిగా.

'ఏమనుకుంటారా? అన్నీ అయిపోయాక జ్యోతిష్యం భలే  చెప్తారు గురువుగారు. ముందు మాత్రం ఏవీ చెప్పరు అనుకుంటారు' అంది.

'పోన్లే అనుకోనీ. వాళ్ళ ఆలోచనలు ఆపడానికి నేనెవర్ని? అదీగాక, శుభమా అని మనవాళ్ళు ఒక పెద్దపని పెట్టుకుంటే, ఇది చివర్లో ఫెయిల్ అవుతుంది అని శకునపక్షిలా చెప్పడానికి నాకేం పని? నేను చెప్పినా ఎవరు వింటారు? ఆపుతారు?' అన్నాను.

'అంటే, నీకు ముందే తెలుసా?' - అడిగింది

'సుబ్బరంగా తెలుసు. అందుకే అందరూ నిన్న రాత్రి టీవీల ముందు కూచుని జాగారం చేస్తే, నేనుమాత్రం హాయిగా నిద్రపోయి పొద్దున్నే లేచా. ఎలా తెలుసో కావాలంటే నీక్కూడా చెప్తా విను చాలా సింపుల్' - అని చెప్పడం సాగించా.

'చెప్పు చెప్పు' అందది నా పక్కనే మంచం మీద కూచొని ల్యాప్ టాప్ లోకి తొంగి చూస్తూ.

చంద్రయాన్ రాకెట్, 22-7-2019 మధ్యాన్నం 2.43 కి శ్రీహరి కోట నుంచి లాంచ్ చెయ్యబడింది. ఆ సమయానికి వేసిన గ్రహచక్రమూ ఆయా గ్రహాల స్థితులూ పక్కనే చూడవచ్చు.

వక్ర గురువుతో కూడిన వృశ్చికలగ్నం ఉదయిస్తోంది. అంటే, గురుబలం సరిగా లేదని అర్ధం. కానీ గురువు ఈ లగ్నానికి మంచివాడు గనుక లాంచ్ వరకూ బాగానే జరిగింది. మొదటి సారి లాంచ్ వాయిదా పడి రెండో సారి జరిగిందని గుర్తుంటే, గురువు ఎందుకు వక్రించి లగ్నంలో ఉన్నాడో అర్ధమౌతుంది.

ప్రయాణాలకు చరలగ్నం ఉండాలి. కానీ ఇక్కడ ముహూర్తం ఎవరు పెట్టారో గాని, స్థిరలగ్నం పెట్టారు. ఇదొక దోషం. మిడిమిడిజ్ఞానపు జ్యోతిష్కులు, పురోహితులు ఇలాగే చేస్తుంటారు. గురువు లగ్నంలో ఉంటె లక్షదోషాలు పరిహరిస్తాడు, సూర్యుడు ఏకాదశంలో ఉంటె కోటిదోషాలు పోతాయి అని శ్లోకాలు వల్లిస్తారు. ఇవన్నీ నాటకాలు. అలా ఏమీ జరగదు. ఏ దోషమూ అంత తేలికగా పోదు. ఈ విషయం ఇక్కడ కూడా రుజువైంది కదా !

దూర ప్రయాణాలను నవమం సూచిస్తుంది. నవమంలో మూడు గ్రహాలున్నాయి. అవి సూర్యుడు బుధుడు నీచ కుజుడు. వీరిలో బుధుడు అస్తంగతుడయ్యాడు. కుజుడు నీచస్థితిలో ఉండి దూరప్రాంతంలో (చివరి నిముషంలో) అపజయాన్ని సూచిస్తున్నాడు. బుధుడు కమ్యూనికేషన్ కు సూచకుడు. అతని అస్తంగత్వం, చివరి నిముషంలో కమ్యూనికేషన్ విఫలం అవుతుంది అని సూచిస్తోంది. అదేగా జరిగింది మరి !

లాంచ్ సమయంలో శని - శని - రాహు - సూర్య - బుధదశ నడుస్తున్నది.  ఇది ఖచ్చితమైన శపితయోగ దశ. సూక్ష్మదశా ప్రాణదశానాదులైన సూర్య బుధులు నవమంలో ఉండగా బుధుడు అస్తంగతుడై, కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ వల్ల మిషన్ విఫలం అవుతుంది అని ఖచ్చితంగా సూచిస్తున్నారు.

లగ్నాధిపతి కుజుడు నవమంలో నీచలో ఉండటం, పెట్టుకున్న పని దూరప్రయాణ తీరంలో ఫెయిల్ అవుతుంది అని చూపిస్తున్నది. దశమాధిపతి సూర్యుడు, అష్టమాదిపతి బుదునితో కలసి పనిలో ఫెయిల్యూర్ ని సూచిస్తున్నాడు.  

నిన్న శని - శని - గురు - గురు - రాహు దశ నడుస్తున్నది. ఇది శపితయోగం, గురుచండాల యోగం కలసిన పరమ దరిద్రమైన దశ. ఈ సమయంలో లాండర్ చంద్రునిమీద దిగబోయింది. ఇంతగాక ఇంకేం జరుగుతుంది మరి?

ఇది అర్ధం కావడానికి పెద్ద జ్యోతిష్య పాండిత్యం అక్కర్లేదు. ఈ శాస్త్రం కొద్దిగా తెలిసినా ఇది అర్ధమౌతుంది. మరి ముహూర్తం పెట్టిన ఘనాపాటిలకు ఎందుకు తెలియలేదో మరి?

'రాకెట్ లాంచ్ కి కూడా ముహూర్తం పెడతారా?' - అని సందేహపడకండి. మనదేశంలో అలాంటివి కూడా జరుగుతాయి. కాకపోతే, ఎవరు పెడతారో ఎవరికీ తెలియనివ్వరు అంతే. అంతేకాదు, రాకెట్ పార్ట్లు కొన్ని రహస్యంగా తెచ్చి, తిరుమలలో స్వామి పాదాలకు తాకించి మరీ తీసుకుపోతారని వినికిడి. మరి స్వామి అనుగ్రహం ఏమైందో ఇప్పుడు? లేదా ఇలా విఫలం అవడమే స్వామి అనుగ్రహం అని సరిపెట్టుకోవాలా?

ఇంకోటి ఏంటంటే, ద్వారకా శంకరాచార్య కూడా, తన వేదిక్ మాధ్స్ పరిజ్ఞానంతో  ISRO వాళ్లకు సహాయం చేశాడు. ఆయన అందులో దిట్ట ఇందులో దిట్ట అని కొందరు నెట్లో ఊదరగొట్టారు. మరి ఇప్పుడేమైంది వేదిక్ మాత్స్? చెప్పండి ! అయినా, భూమికి చంద్రుడికి మధ్యన ఎన్ని యోజనాల దూరం ఉందొ పురాణాలు చూసి మనం తెలుసుకోవలసిన పని లేనేలేదు. శంకరాచార్య గారిని అడగవలసిన పని అసలే లేదు. సైన్స్ ప్రకారం ఆ దూరం ఎంతో ఇప్పుడు మనకు ఖచ్చితంగా తెలుసు. దానికి ఆయన సహాయం తీసుకోవలసిన పని ఇస్రో కు ఏముంది?

పైగా ఇంకొకటి. అసలే మన దేశానికి శత్రుపీడ చాలా ఎక్కువగా ఉంది. అన్ని దేశాలూ మనల్ని చూచి ఏడుస్తున్నాయి. అలాంటప్పుడు చైనా లాగా, సైలెంట్ గా మన పని మనం చేసుకోవాలి గాని, పెద్ద టాంటాం చెయ్యడమూ, అందర్నీ పిలిచి షో చెయ్యడమూ అవసరమా? మన విజయమే మన గురించి మాట్లాడాలి గాని, మనం డప్పు కొట్టుకోవలసిన పని లేదు. 

ఇప్పుడేమైంది? మోడీగారు పెద్ద మనసుతో ఇస్రో చైర్మన్ ని ఓదార్చారు. 'మళ్ళీ ప్రయత్నించండి నేనున్నాను. ధైర్యాన్ని కోల్పోకండి' అని చెప్పారు. అది బాగానే ఉంది. కానీ జరిగింది వైఫల్యమే కదా ! ఎవరెన్ని చెప్పినా, ఇస్రో ఫెయిల్ ఐన మాట వాస్తవం. దాన్ని మనం ఏ విధంగానూ కప్పి పుచ్చలేం.

దిష్టి (దృష్టి) అనేది వాస్తవమే. మనల్ని చూచి ఎన్ని దేశాలు ఏడుస్తున్నాయో గుర్తుంటే ఇంత అనవసరపు పబ్లిసిటీ ఇచ్చుకునే వాళ్ళం కాము. ఇలా ఫెయిల్ అయ్యేవాళ్ళమూ కాము.

ఈసారైనా మరింత జాగ్రత్తగా ప్రయత్నిస్తారని ఆశిస్తూ, ఇంతవరకైనా సాధించినందుకు ఇస్రో కు మన శుభాకాంక్షలు తెలియజేద్దాం.

జై భారత్ !