“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, మార్చి 2019, ఆదివారం

సంగీతం ఆధ్యాత్మికతకు వ్యతిరేకమా?

ఈ మధ్యన నా బ్లాగులో ఎక్కువగా పాటల్ని పోస్ట్ చేస్తున్నాను. అవి చూచి కొందరు నాకు మెయిల్స్ ఇస్తున్నారు. వాటిలో భాష వేరైనా, వాటి సారాంశం మాత్రం ఒకలాగానే ఉంటున్నది.

'మీ బ్లాగ్ పేరు తెలుగుయోగి అని పెట్టారు. అంటే ఆధ్యాత్మికం కదా? కానీ మీరు అన్నిరకాల పాటలూ పాడుతున్నారు. ఈ మధ్యన మీ బ్లాగులో పాటలే కనిపిస్తున్నాయి. ఇది ఆధ్యాత్మికం అంటారా?'

ఈ ప్రశ్నకు ఒక్కొక్కరికి విడివిడిగా జవాబు ఇవ్వడం కుదరదు గనుక బ్లాగు ముఖంగా సమాధానం ఇస్తున్నాను.

ఆధ్యాత్మికం అంటే మీకున్న అభిప్రాయాలు సరియైనవి కావు. ముందుగా వాటిని మార్చుకోవాల్సిన అవసరం మీకున్నది. లోకం అనుకుంటున్న ఆధ్యాత్మిక మార్గానికి నా మార్గం చాలా భిన్నమైనది. నా మార్గం చాలా ప్రాచీనమైనది. అసలైనది. నేటి నకిలీ ఆధ్యాత్మిక వ్యవస్థకు పూర్తిగా భిన్నమైనది. ఈ విషయం నా శిష్యులకు బాగా తెలుసు.

బాహ్యవైరాగ్యంతో, బాహ్యసన్యాసంతో, పూజలతో తంతులతో కూడిన మార్గాన్ని నేను బోధించను. అది సరియైనది కాదని నా గట్టివిశ్వాసం. నా శిష్యులు తమ జీవితంలో దేనినీ వదలవలసిన పనిలేదు. ఏ పూజలూ చెయ్యవలసిన పని లేదు. జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తూ అసలైన ఆధ్యాత్మికతను అందుకోవచ్చని నేనెప్పుడూ చెబుతాను. అది ఎలా? అంటే, నా మార్గంలో అడుగుపెడితేనే అది అర్ధమౌతుంది. బయటనుంచి చూస్తుంటే ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా అది మీకర్ధం కాదు. నా బ్లాగ్ ఒక కలగూర గంప. దీనిని పైపైన చదివితే నా మార్గం మీకర్ధం కాదు. పైపెచ్చు, ఇంకాఇంకా సందేహాలూ అనుమానాలే మీకు కలుగుతాయి.

సాంప్రదాయ ఆధ్యాత్మికమార్గంలో కూడా సంగీతానికి, కీర్తనలకు, భక్తిగానానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. భక్తికవులూ, భక్తియోగులూ, గానసాధకులూ, సంగీతఋషులూ ఎందఱో మన దేశంలో ఉన్నారు. నిజానికి సంగీతం అనేది దైవాన్ని సూటిగా చేర్చే ఒక అద్భుతమైన మార్గం. అయితే ఇక్కడ మీకొక సందేహం రావచ్చు.

సాంప్రదాయ కీర్తనలు మంచివే, అవి దైవంతో తన్మయత్వాన్నిస్తాయి. కానీ మీరు అవి పాడటం లేదు కదా. మీరు సినిమా మాటలు పాడుతున్నారు. ఇదెలా ఆధ్యాత్మికత అవుతుంది? అని మీకు అనుబంధ ప్రశ్న రావచ్చు. మీరు అడగకముందే దానికి జవాబు ఇస్తున్నాను.

సాంప్రదాయ సంగీతం అంతా అత్యుత్తమమైనదేమీ కాదు. ఉదాహరణకు, జయదేవుని అష్టపదులని సంస్కృతం ముసుగు తొలగించి మన భాషలో అర్ధం చేసుకుంటే ఆ పదాలలో ఉన్నంత అసభ్యత ఇంకెక్కడా ఉండదు. కానీ మడి కట్టుకున్న సాంప్రదాయ వాదులందరూ ఎంతో తన్మయత్వంతో ఆ కీర్తనలు పాడుతూ ఉండటం మనం చూడవచ్చు.

దీనికి భిన్నంగా, నేను పాడుతున్న పాటల్నిమీరు జాగ్రత్తగా గమనిస్తే, అవి హిందీ అయినా, తెలుగైనా, వాటిలో ఒక ఉదాత్తమైన ప్రేమభావం మాత్రమె మీకు కనిపిస్తుంది. చెత్త పాటల్ని నేను పాడను. ఈ లోకపు వెర్రి వేషాలనుండి, చెత్త భావనలనుండి, నిమ్నత్వాలనుండి మీ మనసులను పైకిలేపి ఒక అతీతమైన మధురభావలోకానికి నా పాటలు మిమ్మల్ని చేరుస్తాయి. వాటిల్లో చాలా సినిమాలను నేను ఇప్పటివరకూ చూడలేదు. ఇకముందు చూడను కూడా ! నాకు పాటలోని ఉదాత్తమైన భావమూ, మధురమైన రాగమే ముఖ్యం. అంతేగాని అది సినిమాపాటా లేక త్యాగరాజ కీర్తనా అనేది ముఖ్యం కాదు. అది సినిమాపాట అని చిన్నచూపు చూడకండి. వాటిల్లో కూడా ఎంతో అద్భుతమైన సున్నితమైన భావాలను పలికించే పాటలు ఎన్నో ఉన్నాయి. వాటినే నేను పాడుతున్నాను.

కనుక నేను పాడుతున్న సినిమా పాటల వల్ల నా బ్లాగుకున్న ఆధ్యాత్మిక ఇమేజికిగాని, గురువుగా నాకున్న ఇమేజికి గాని, ఏమీ భంగం వాటిల్లదని అర్ధం చేసుకోండి. ఒకవేళ ఇంతమాత్రానికే జారిపోయే శిష్యులూ అభిమానులూ స్నేహితులూ ఉంటె అలాంటి మనుషులు నాకక్కర్లేదు. అలాంటి నిలకడలేని మనుషులు నాతో నడవలేరు. నా మార్గం చాలా కష్టమైనది మరియు ఉన్నతమైనది. కనుక అల్పమనస్కులు ఈ దారిలో నడవలేరు. అలాంటివాళ్ళు జారిపోవడమే నాకూ వారికీ మంచిది.

నేను క్వాంటిటీ కంటే క్వాలిటీ కే ప్రాధాన్యత నిస్తాను. ఊరకే చుట్టూ చేరి సోదిమాటలు మాట్లాడుతూ భజన చేసే వందమంది కంటే, నన్ను సరిగా అర్ధం చేసుకుని మౌనంగా అనుసరించే ఒక్క మనిషి నాకు చాలు. అలాంటివారినే నేను ఇష్టపడతాను.

నేను పాడే పాటలు, సాహిత్యపరంగానూ, సంగీతపరంగానూ ఉన్నతమైనవే అయి ఉంటాయని గమనించండి. వాటివల్ల నాకుగాని మీకుగాని, ఆధ్యాత్మిక జీవితానికి ఇంకా మేలే జరుగుతుంది గాని భంగం ఏమీ వాటిల్లదు.

నిజమైన శ్రీవిద్యోపాసన వల్ల, సంగీతమూ, సాహిత్యమూ, ఇంకా ఎన్నో కళలూ విద్యలూ అలవోకగా సిద్ధిస్తాయి. నా బ్లాగులో మీరు చూస్తున్నది అదే.

ఈ నా జవాబుతో మీమీ సందేహాలు తీరాయని తలుస్తున్నాను.