“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

1, నవంబర్ 2018, గురువారం

ఈ దీపావళికి టపాసులు కొనకండి

దీపావళికి టపాకాయలు కాల్చడం నేను సరిగ్గా 1978 లో మానేశాను. అంటే నేటికి నలభై ఏళ్ళైంది. అప్పుడు నాకు పదిహేనేళ్ళు కానీ, ఇదంతా పెద్ద వేస్ట్ పనని, దీనివల్ల వాతావరణ కాలుష్యం పెరగడం, లేనివాళ్ళకు శ్వాసకోశ రోగాలు రావడం తప్ప ఇందులో ఏమీ లేదని నాకు అప్పుడే అర్ధమైంది. అందుకే టపాకాయలు కొనుక్కోమని పెద్దవాళ్ళు చెప్పినా వద్దని నేను తిరస్కరించేవాడిని. అప్పటినుంచీ నాకు తెలిసినవాళ్లకు, నా మాట వినేవాళ్లకు అందరికీ ఇదే చెబుతూ వచ్చాను. కొంతమంది అర్ధం చేసుకున్నారు. చాలామంది మాత్రం నన్ను ఎగతాళి చేశారు. ఇంకొందరు నేను పీనాసినని అనుకున్నారు. ఎవరెన్ని రకాలుగా అనుకున్నప్పటికీ నేను మాత్రం నా అవగాహనకే కట్టుబడి ఉన్నాను.

అయితే నేను దీపావళి చేసుకోనా అంటే తప్పకుండా చేస్తాను. ఇల్లంతా ప్రమిదెల దీపాలు వెలిగించి ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తాను. అంతే !అదే నా దీపావళి. నా చిన్నప్పటినుంచీ ఇదే నా అలవాటు.

నేను టపాకాయలు కాల్చడం మానేసిన 40 ఏళ్ళకు ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. ఎక్కువ పొగా, ధ్వనీ, రసాయనాలూ విడుదల చేసే టపాకాయలు తయారు చెయ్యొద్దనీ, వాటిని కాల్చద్దనీ చెప్పింది. కాల్చే సమయం కూడా రాత్రి 8 నుంచి 10 లోపే ఉండాలని చెప్పింది. శివకాశిలో టపాకాయలు తయారుచేసే సంఘం వాళ్ళు వెంటనే    దీన్ని తిరస్కరించారు. ఇది చదివి నాకు యధావిధిగా నవ్వొచ్చింది.

సుప్రీం కోర్టు ఏమనుకుంటోంది? లేదా అక్కడి న్యాయమూర్తులు ఏమనుకుంటున్నారు? వాళ్ళు  ఒక కాగితం మీద సంతకాలు పెడితే ఇక దేశమంతా దానిని వెంటనే అమలు పరుస్తుందని వాళ్ళ ఊహేమో?  వాళ్ళ అజ్ఞానానికి నాకు జాలి కూడా కలిగింది. ఈ దేశంలో న్యాయవ్యవస్థ అంత పెద్ద ఫూల్ ఇంకెవరూ లేరు. దాని మాట ఎవడూ వినడు. ఈ దేశంలో ఎవడిష్టం వాడిది. అంతే ! కనీసం ఆస్త్మాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నవాడు కూడా టపాకాయలు కాల్చడం ఆపడు. వాడి రోగానికి సగం కారణం అవేనన్న స్పృహ కూడా వాడికి ఉండదు.  పక్కవాడు చెప్పినా వినడు. అదంతే ! మనదేశంలో ఉన్నన్ని గొర్రెలు ఇంకెక్కడా ఉండవు మరి !

దీపావళికి మన దేశంలో కాల్చే టపాకాయల కాలుష్యం ఇతర దేశాల వాతావరణాన్ని కూడా తూట్లు  పొడిచేటంత ప్రభావం కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని సేటిలైట్లు కూడా ధృవీకరిస్తున్నాయి. దానికి తోడు వాహనాల పొగా, దుమ్మూ కలసి మనం పీల్చే గాలి మొత్తం ఈ సమయంలో రసాయనిక విషంగా మారుతుంది. దీనికి మొదట బలయ్యేది సిటీలలో ఉన్నవాళ్ళే. ఈ విషయాన్ని పర్యావరణ వేత్తలు ఎప్పటినుండో చెబుతూనే ఉన్నారు. కానీ స్వార్ధం కరుడుగట్టిన మన జనంలో ఎవడు దీనిని వింటాడు? సర్వనాశనం అయ్యేదాకా ఎవరూ వినరు.

బ్రహ్మంగారి కాలజ్ఞానం  చదివి చిన్నప్పుడు నేనిలా అనుకునేవాడిని. ఈయన కొంతం అతిగా  వ్రాశాడేమో? ఈయన చెబుతున్నంత విలయం ఎందుకు జరుగుతుంది? సైన్స్ ఇంత అభివృద్ధి చెందుతున్నది. మనుషుల తెలివి పెరుగుతున్నది. అన్ని ప్రకృతి  విలయాలూ ఘోరాలూ జరిగేదాకా మానవులు చూస్తూ ఊరుకుంటారా? అనుకునేవాడిని. కానీ నా ఊహ తప్పని చాలా త్వరలోనే నాకు అర్ధమైంది. చాలా తెలివైన వాళ్ళమనీ, డబల్ పీ.హెచ్.డీలు చేశామనీ విర్రవీగేవారిలో కూడా చాలా విషయాలలో భయంకరమైన అజ్ఞానం ఉంటుంది. మొండితనం ఉంటుంది.ఇక మామూలు మనుషుల సంగతి చెప్పనే అక్కర్లేదు. వాళ్ళకూ పశువులకూ ఏమీ భేదం ఉండదు. ఈ రెండు దుర్గుణాల వల్లనే మానవజాతి సర్వనాశనం అవుతుంది. మనుషులలో ఉన్న ఈ దుర్గుణాలు  గమనించిన తర్వాత, బ్రహ్మంగారు చాలా తక్కువ వ్రాశారని నాకర్ధమైంది. కనుక మనం విలయం దిశగా ప్రయాణిస్తున్నామన్నది సత్యమే!

మా ఇంటి దగ్గర ఒక కుటుంబం ఉంటుంది. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు. ప్రతి దీపావళికీ ఇండియాకు వస్తారు. డాలర్ పవర్ ఉపయోగించి ఈ బజారునుంచీ ఆ బజారువరకూ దండల టపాకాయలు పెడతారు. అవి ఒక పావుగంటసేపు ఆగకుండా పెద్దధ్వనితో కాలుతూనే ఉంటాయి. దానిని చూడటానికి ఆ బజారు గొర్రెలన్నీ గుమిగూడతాయి. ఇలాంటి కల్చర్  లెస్ ఇడియట్స్ మధ్యన నేనూ ఉంటున్నందుకు నాకు చాలా సిగ్గేస్తూ ఉంటుంది. కానీ ఏం చెయ్యగలం? ఇండియన్ సోసైటీనే అలా ఉంది మరి !  మనకు నచ్చకపోతే ఈ దేశాన్ని వదలి ఎక్కడికైనా పారిపోవడం తప్ప వేరేమార్గం ఏమీ కనిపించడం లేదు ప్రస్తుతానికి !

ఎన్ని చెప్పుకున్నా, చివరకు మనవంతుగా ఈ సొసైటీని బాగు చేసే మానవప్రయత్నం మనం చెయ్యాలి గనుక, పంచవటి సభ్యులను (ఇండియా వారినీ, అమెరికా వారినీ కూడా) ఈ దీపావళికి టపాకాయలు కొనవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చేసేవిధంగా మీరు కూడా దీపావళిని జరుపుకొండి. నిజమైన దీపాలను మీ లోలోపల వెలిగించుకోండి. సార్ధకమైన జీవితాలను గడపండి అని మిమ్మల్ని కోరుతున్నాను.

నన్ను అనుసరించేవారు నా జీవనవిధానాన్ని కూడా అనుసరించాలి మరి ! కనీసం మనం ఒక వందమందిమైనా ఈ విధంగా కాలుష్యాన్ని నివారించడంలో మన పాత్ర పోషిద్దాం. మీకు తెలుసో లేదో ? ప్రతి ఏడాదీ దీపావళి తర్వాత కొన్ని వేలమంది పిల్లలూ పెద్దలూ మన దేశంలో శ్వాసకోశ ఇబ్బందులతో చనిపోతున్నారు. వారి చావులకు కారణం మీరు కాల్చే టపాసులు కూడా ! అర్ధం చేసుకోండి మరి !!

ఇదే - పంచవటి తరఫు నుంచి ఈ చెత్త సొసైటీకి మనమిచ్చే చిరుకానుక !!