“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

26, నవంబర్ 2018, సోమవారం

నాందేడ్ యాత్ర - 11 (ఇంతదూరం వచ్చి షిర్డీ వెళ్ళలేదా?)

హోటల్ కు చేరి ఫ్రెష్ అయ్యి నిద్రకు ఉపక్రమించాను. ఈ రోజు నైట్ డ్యూటీ లేదు. హాయిగా తెల్లవార్లూ నిద్రపట్టింది. ఇంకో విచిత్రమేమంటే, రూమ్ లోని లైట్ ఏమీ ఇబ్బంది పెట్టకుండా చక్కగా వెలుగుతోంది.

పొద్దున్నే లేచి తయారై, టిఫిన్ చేసి, బ్యాగ్ సర్దుకుని, స్టేషన్ కు చేరాను. వచ్చిన పని అయిపొయింది గనుక, 9.30 కి దేవగిరి ఎక్స్ ప్రెస్ ఎక్కాలి. ఇది ముంబాయ్ నుంచి నాందేడ్ మీదుగా సికింద్రాబాద్ వస్తుంది. నాందేడ్ లో చాలామంది దిగిపోయారు. ఏసీ కోచ్ ఖాళీగా ఉంది. కోచ్ మొత్తం మీద పదిమంది కూడా లేరు. నేను ఫలానా అని చెప్పగానే, టీటీఈ, ' మీ ఇష్టం వచ్చిన చోట కూచోండి సార్. ఏమైనా కావాలంటే చెప్పండి' అన్నాడు. సరేనని ఒక సైడ్ బెర్తులో  సెటిలయ్యాను.

నాకు ఎదురుమూలగా ఇంకో బెర్తులో ఒక పెద్దామె కూచుని ఉంది. నాకప్పుడప్పుడూ కనిపించే కర్ణపిశాచికి ముసలిరూపంలా ఉందామె. ఆమె చేతులో 'సాయి సచ్చరిత్ర' పుస్తకం ఉంది. ఆమె ఆ పుస్తకాన్ని చదువుతూ మధ్యలో నావైపు ఒకసారి చూచి మళ్ళీ పుస్తకంలో తలదూర్చింది. నేను నా బెర్తుమీద నడుం వాల్చాను.

'ఏంటో ఈ ఖర్మ ! పిశాచాలకూ మనుషులకూ పోలికలు !' అనుకుంటూ విండో లోనుంచి బయటకు చూడసాగాను.

ట్రెయిన్ కదిలింది.

కాసేపయ్యాక నాకేదో ఫోన్ కాల్ వచ్చింది. అందులో మాట్లాడి ఫోన్ జేబులో పెట్టుకోగానే, ఆ పెద్దామె పలకరించింది. నేను తెలుగులో మాట్లాడటం ఆమె విన్నది.

'మీరు తెలుగువారా?'

'అవును' అన్నాను.

'హైద్రాబాదా? అడిగింది.

'హైదరాబాద్ కూడా మా ఊరేగాని, నేనుండేది గుంటూరులో' అన్నాను.

'షిర్డీ వెళ్లి వస్తున్నారా?' అడిగింది.

ఆ ఒక్క మాటతోనే నాకు విషయం అర్ధమైంది. 'సికింద్రాబాదు వరకూ ఈ ముసిల్దాని సుత్తి వినాలి గామోసు దేవుడా' అని భయపడుతూ 'కాదు' అన్నాను సాధ్యమైనంత కూల్ గా.

'అయ్యో !' అంది ఆమె నిట్టూరుస్తూ.

నాకు విషయం అర్ధమైనా అర్ధం కానట్లు - 'ఏమైందండీ? మీకేమైనా హెల్త్ ప్రాబ్లమా?' అడిగాను.

'ఈ వయసులో లేకుండా ఎలా ఉంటాయండి. బీపీ ఉంది. షుగర్ ఉంది. కాళ్ళ నొప్పులున్నాయి.' అంటూ ఆమె -' నేను అయ్యో అన్నది అందుకు కాదు. మీరు ఇంతదూరం వచ్చికూడా షిర్డీ చూడకుండా వెళుతున్నందుకు' అన్నది.

'ఓ అదా ! దానికేముంది లెండి. పరవాలేదు' అన్నాను.

'నేను ఏడాదికి కనీసం నాలుగుసార్లు షిర్డీ వెళ్లి వస్తుంటాను' అందామె.

'అవునా' అన్నాను.

'మీరెన్ని సార్లు వెళ్ళారు షిర్డీ ఇప్పటికి?' అంది తను.

'ఇదేమైనా దోశెలు తినే పోటీనా? నేను పాతిక దోశెలు తిన్నాను. నువ్వెన్ని తిన్నావు అనగడానికి?' అని మనసులో అనుకుని - 'ఇంతవరకూ ఒక్కసారి కూడా పోలేదు' అన్నాను నీరసంగా.

'ఓరి నీచుడా !' అన్నట్లు ఆమె ఒక చూపు చూచింది.

నేనదేమీ పట్టించుకోకుండా, 'ఎందుకండీ ఏడాదిలో అన్నిసార్లు వెళతారు మీరు?' అడిగాను.

'మీకు సాయిబాబా గురించి తెలీదన్న మాట ! ఆయన చాలా మహిమలు చేసే దేవుడు. నా జీవితంలో చాలా మహిమలు చేశాడు.' అందామె.

'దొరికిపోయాన్రా దేవుడో' అని మనసులో అనుకున్నాను. ఇక హైదరాబాద్ వచ్చేవరకూ ఆమె జీవితంలో సాయిబాబా చేసిన మహిమలను చెబుతూ రిలాక్స్ కూడా అవనివ్వదేమో అనుకున్నాను. చాలామంది ఇంతే. ఆయన మహిమలు చేశాడు గనక, తమ కోరికలు అప్పనంగా తీరుస్తాడని వీళ్ళు అనుకుంటారు గనుక, ఆయన్ను పూజిస్తారు. ఇలాంటి మనుషులను చూస్తె నాకు చాలా జాలేస్తూ ఉంటుంది.

ఈమెకు బ్రేక్ వెయ్యాలని - 'అన్ని మహిమలు మీ జీవితంలో జరిగితే మరి మీకెందుకు ఇన్ని రోగాలున్నాయి? వాటిని బాబా తగ్గించలేదా?' అడిగాను సూటిగానే అయినా సున్నితంగా.

'కర్మ అనుభవించక తప్పదు కదా' అందామె సర్దుకుంటూ.

'అబ్బో! పుస్తకాలు బాగానే చదివావు తల్లీ' అనుకుంటూ - 'కర్మ తప్పనప్పుడు ఇక దేవుడెందుకు?' అన్నాను నేనూ వాదనలోకి దిగుతూ.

ఆమె పూర్తి ఫైట్ కి రెడీ అయింది. పుస్తకం మూసి పక్కన పెట్టి నిటారుగా కూచుంది.

'బాబా పిలవందే ఎవరూ షిర్డీ రాలేరు.'అంది.

'అవునా. ప్రతిసారీ బాబా కనిపించి షిర్డీ రమ్మని పిలిస్తేనే మీరు వెళుతున్నారా?' అడిగాను అమాయకంగా.

'కాదు. వెళదామని నాకు అనిపిస్తుంది. నా మనసులో బాబా ప్రవేశించి అలా అనిపిస్తాడు' అన్నది ఆమె.

'మరి నా మనసులోకి ఆయన ప్రవేశించడం లేదు. నన్ను పిలవడం లేదు. అందుకే నేనూ పోవడం లేదేమో?' అన్నాను నవ్వుతూ.

'మీకు టైం ఇంకా రాలేదు' అందామె.

'మనకు టైం రాలేదు కాబట్టే ఇక్కడున్నామండి' అన్నాను నవ్వాపుకుంటూ.

ఆ మాట ఆమెకు అర్ధమైందో కాలేదో నేను పట్టించుకోలేదు. ఇలా కాదని మాట మార్చి - 'ఈ పుస్తకం చదవండి. షిర్డీ ఎంత గొప్పదో తెలుస్తుంది' అందామె.

'నాకు చదువు పెద్దగా రాదండి. అందులోను, ఆ దేవుడి పుస్తకాలలో ఉండే పెద్దపెద్ద మాటలు నాకసలు అర్ధం కావు.' అన్నాను ఒక పల్లెటూరి బైతులా నటిస్తూ.

'అయ్యో!' అందామె మళ్ళీ బాధపడుతూ. అది ఆమె ఊతపదమేమో అనిపించింది.

ఆ పుస్తకాన్ని చేతులోకి తీసుకుంటూ - 'ఇక్కడ చూడండి బాబా చేసిన అద్భుతం ఎంత బాగుందో!' అంటూ ఏదో చదవబోయింది ఆమె.

'ఏమండి ! మీరు ఏమనుకోకపోతే నేను కాసేపు నిద్రపోతాను. బాగా అలసటగా ఉంది.' అన్నాను.

'అయ్యో ! అవునా ! సరే పడుకోండి.' అందామె మళ్ళీ బాధపడుతూ.

నేను ఆవులిస్తూ - 'పరలోకమునందున్న మా తండ్రీ! ఈ నిద్రను మాకు కలిగించినందుకు నీకు వందనములు' అంటూ నామీద క్రాస్ మార్క్ వేసుకుంటూ, కళ్ళుమూసుకుని, కొంచం ఓరగా ఆమె వైపు చూచాను. 

ఆమె బిత్తరపోయి, నోరెళ్ళబెట్టింది.

ఆమె ఏదో అనేలోపు - 'ఏంటి సార్ ! మీరూ హైదరాబాద్ వస్తున్నారా? వర్క్ అయిపోయిందా?' అంటూ మా కొలీగ్ ఆఫీసర్ ఒకాయన వచ్చి పలకరించాడు.

ఆమె అయోమయంగా చూసింది.

'రక్షించావు బాబూ' అని అనుకుంటూ, నా బ్యాగ్ తీసుకుని - 'మీరూ ఇదే కోచ్ లో ఉన్నారా? పదండి మీ బెర్త్ దగ్గరికి వెళదాం.' అని లేచాను.

'అన్ని బెర్తులూ ఖాళీనే. రండి' అని అతను తన బెర్త్ దగ్గరికి దారి తీశాడు.

బిత్తరపోయి చూస్తున్న భక్తురాలిని చూసి లోలోపల జాలిపడుతూ అతని వెనుకే నడిచాను.

(ఇంకా ఉంది)