“Self service is the best service”

31, డిసెంబర్ 2015, గురువారం

నడక

మార్గమేమో సరళం
మనసేమో సంక్లిష్టం
ఎలా సాధ్యమౌతుంది?
నడక

ఆకలేమో అల్పం
ఆశేమో అనంతం
ఎలా కుదురుతుంది?
పడక

ప్రస్తుతం వెలితి
ప్రయాణం భీతి
ఎప్పటికి దక్కేను?
ప్రమోదం

వీడని అహం
వదలని ఇహం
ఎందుకాగుతుంది?
వినోదం

చుక్కలపై దృష్టి
లోలోపల నిత్యసృష్టి
ఎలా అందుతుంది?
ఆకాశం

ఫలసాయం ఆమోదం
వ్యవసాయం అతిహేయం
ఎలా తీరుతుంది?
ఆక్రోశం

త్రికరణం వెక్కిరిస్తుంది
ప్రతి ఋణం తీరనంటుంది
ఎలా దక్కుతుంది?
ముక్తి

అనుభవం ఆగనంటుంది
అనుదినం కరగిపోతుంది
ఎలా తగ్గుతుంది?
అనురక్తి

చేతితో వందనం
మనసులో బంధనం
ఎలా కలుగుతుంది?
మోక్షం

తలుపు తడుతున్న నేస్తం
గడియ తియ్యలేని హస్తం
ఎలా తెరుచుకుంటుంది?
గవాక్షం

మోముపై దరహాసం
మనసంతా మోసం
ఎప్పటికి కలుగుతుంది?
శాంతి

చీకటంటే వ్యామోహం
వెలుగుకై ఆరాటం
ఎలా వదులుతుంది?
భ్రాంతి