“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

9, జూన్ 2015, మంగళవారం

నా జాతకం చూడటమే నీ జాతకంలోని అదృష్టం

నన్ను జాతకపరిశీలన కోసం అడిగేవారిలో కొందరు భలే విచిత్రమైన మనుషులు ఉంటుంటారు.వారి ధోరణి ఎలా ఉంటుందంటే--అసలు మా జాతకం చూడటమే నీ అదృష్టం -- అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు.వారి అజ్ఞానానికి జాలిపడాలో,లేక వారి అహంకారానికి బాధపడాలో నాకర్ధం కాదు.

ఒకాయన తన జాతకాన్ని చూడమని అడిగాడు.ఆయనకేమీ కలసి రావడం లేదు.ఏది చేసినా ఎదురౌతున్నది.బంగారాన్ని పట్టుకున్నా బూడిదగా మారుతున్నది.ఇది చాలక, కుటుంబంలో చెప్పుకోలేని సమస్యలున్నాయి. ఒకవైపు ఆ బాధ,ఇంకోవైపు కాలం కలసిరాక బాధ,ఈ విధంగా ఆయన జీవితం సాగుతున్నది.

"చాలా రోజులనుంచీ నా జాతకాన్ని ఒక ప్రముఖ జ్యోతిష్కునికి చూపిద్దామని అనుకుంటున్నాను.ఇప్పటికి మీరు దొరికారు.నా వివరాలు ఇవి.నా జాతకం చూచి ఏం చెయ్యాలో చెప్పండి."-అంటూ మెయిల్ చేశాడు.

సరే అని,అతని జాతకాన్ని పరిశీలించి నాకు తోచిన కొన్ని రెమేడీలు సూచించాను.ఆయన దగ్గరనుంచి తిరుగు టపాలో మెయిల్ వచ్చింది.

'నా పరిస్థితి అసలే గందరగోళంలో ఉన్నది.మీరేమో దానధర్మాలు చెయ్యమంటున్నారు.నాదగ్గర డబ్బుల్లేవు.అవే ఉంటె మీ దగ్గరకి ఎందుకొస్తాను? అయినా నా జాతకం చూస్తే నా దగ్గర ఎంత డబ్బుందో మీకు తెలియదా? ఆ మాత్రం తెలియకుండా జాతకం ఎలా చూస్తున్నారు?' అంటూ మెయిల్ చేశాడు.

లక్షలు కోట్లు ఖర్చు పెట్టి హోమాలు చెయ్యమని నేను ఎప్పుడూ చెప్పను.ఒక మధ్యతరగతి మనిషి ఖర్చు పెట్టగలిగే లిమిట్ లోనే నేను రేమేడీలు సూచిస్తాను.కాని వాటికి కూడా వాళ్లకు బాధగా ఉంటుంది.అదే దొంగ జ్యోతిష్కుల దగ్గరకు పోయి వాళ్ళు చెప్పే తిక్కతిక్క పనులు చెయ్యడానికి లక్షలు చక్కగా ఖర్చు పెట్టేస్తారు.

సరే అని,డబ్బు ఖర్చు లేకుండా,సేవాపరంగా తను చెయ్యగలిగే రెమేడీలు సూచిస్తూ ఒక మెయిల్ చేశాను.దానికీ తిరుగు టపాలో జవాబు వచ్చింది.

'అయ్యా.నేను ఇల్లు కదలలేను.ఇల్లుదాటి బయటకు పోవడం నాకిష్టం ఉండదు.మీరేమో ఏవేవో అనాధ శరణాలయాలకు,ఆస్పత్రులకు పోయి ఎవరెవరికో ముక్కూ మొహం తెలియనివారికి సేవ చెయ్యమంటున్నారు. అదెలా సాధ్యం? మా ఇంట్లో అన్నీ మా ఆవిడే చూచుకుంటుంది.కనీసం బజారునుంచి కూరగాయలు కూడా నేను తీసుకురాను.అలాంటిది ఈ సేవలూ అవీ నేనెలా చెయ్యగలను?మీకు చేతనైతే, నేను చెయ్యగలిగే రెమేడీలు చెప్పండి.అయినా మీరు చెప్పేవి అసలు రేమేడీలేనా?వాటిని చూస్తుంటే నాకు నవ్వొస్తున్నది.వేరే వాళ్లకు సేవ చేస్తే మన జాతకదోషాలు ఎలా పోతాయి?' - అనే ధోరణిలో ఆ మెయిల్ ఉంటుంది.

ఒక్కొక్కసారి నా ఓపికకు నాకే వింతగా అనిపిస్తుంది.

సర్లే పోనీ అనుకోని--ఫలానా స్తోత్రాలు చదువుకో, ఈ విధంగా జీవితాన్ని గడుపు,ఇలా ఉండు-- అని అతనికి మళ్ళీ మెయిల్ ఇస్తాను.

ఠంచనుగా అతని నుంచి మెయిల్ వస్తుంది.

'ఆ స్తోత్రాలు నాకు నోరు తిరగడం లేదు.వాటి రాగాలు నాకు రావు.ఆన్ లైన్లో వాటిని ఎవరైనా పాడి ఉంటే,ఆ లింక్ నాకు పంపండి.ఇయర్ ఫోన్లో వాటిని వింటాను.'

అంటే - కంప్యూటర్ ముందు కూచుని మెయిల్స్ ఇవ్వడం తప్ప ఈయన ఇంకేమీ చెయ్యలేడని అర్ధమైపోతూనే ఉన్నది.

'బాబూ అలా నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యకూడదు.రెమెడీ అంటే చెప్పినది చెప్పినట్లు చెయ్యాలి'-- అని నేను జవాబిస్తాను.

అతనికి కోపమూ ఉక్రోషమూ కలగలసి వస్తాయి.

'ఏంటి సార్?మొదట్నించీ మిమ్మల్ని గమనిస్తున్నాను.ఒక్కటీ సరిగ్గా చెప్పరు.నేను చెయ్యలేని రెమేడీలు చెప్పడం కాదు,చెయ్యగలిగే రెమేడీలు చెప్పండి.అయినా నేనూ సాటి బ్రాహ్మడినే కదా.ఇలా నన్ను మాటమాటకీ విసిగించి తిప్పిస్తారేంటి?మీకు తెలిస్తే సరియైన రెమేడీలు చెప్పండి.లేకుంటే ఊరుకోండి.అంతేగాని ఇలా హింసించకండి.'

నాకూ విసుగొచ్చి చివరగా ఒక మెయిల్ ఇచ్చాను.

'నాకు తెలిసిన రెమేడీలు ఇవే.ఇవి మీకు నచ్చకపోతే, పోనీ మీకేం రెమేడీలు ఇష్టమో వాటిని మీరే నాకు మెయిల్ చెయ్యండి.వాటినే తిరిగి మీకు ఫార్వార్డ్ చేస్తాను.అంతకంటే నాకేమీ మార్గం కనిపించడం లేదు.'

ఇంకొకాయన ఈ విధంగా మెయిల్ ఇచ్చాడు.

'సచిన్ టెండూల్కర్ జాతకాన్ని మీరు విశ్లేషించిన తీరు చాలా బాగుంది.నా జాతకాన్ని కూడా అలాగే చూచి విశ్లేషించండి.రేపటి లోపు మీనుంచి రిప్లై ఆశించవచ్చా?'

ఈ విధంగా డిమాండ్ చెయ్యడానికి ఏ జన్మలో ఈయనకు నేను బాకీ ఉన్నానో నాకర్ధం కాలేదు.అతని జాతకాన్ని చూస్తే,అది ఒక స్పోర్ట్స్ మాన్ జాతకంగా అనిపించింది.సరే నిదానంగా చూదాంలే అని నేనేమీ రిప్లై ఇవ్వలేదు.అతని నుంచి మూడో రోజున మెయిల్ వచ్చింది.

'డియర్ శర్మగారు.మీ డిలేయింగ్ టాక్టిక్స్ ఆపండి.మీకు చేతనైతే జాతకం చెప్పండి. లేకుంటే 'నో' చెప్పండి.అంతేగాని ఇలాంటి గేమ్స్ ఆడవద్దు.'

అతనికి ఇలా మెయిల్ ఇచ్చాను.

'మీ ముందు చూడవలసిన జాతకాలు చాలా ఉన్నాయి.మీ వెయిటింగ్ లిస్టు నంబర్ 251.నా వీలును బట్టి మీ జాతకాన్ని చూస్తాను.అంతేగాని టైం లిమిట్ పెడితే నావల్లకాదు.ఇలా టైం లిమిట్ పెట్టడానికి మీకేమీ నేను బాకీ లేను.పోనీ మీకంత తొందరగా ఉంటే, మా పంచవటి ట్రస్ట్ బ్యాంక్ నంబర్ ఇస్తాను.దానిలో ఒక రెండు లక్షలు ముందు డిపాజిట్ చెయ్యండి.ఆ తర్వాత మీ జాతకం చూచి వెంటనే రెమేడీలు చెబుతాను.'

అంతే సంగతులు!!

మెరధాన్ కార్ రేస్ లో కారు క్షణంలో మాయమై పోయినట్లు ఆ స్పోర్ట్స్ మాన్ మాయమైపోయి మళ్ళీ కనిపించలేదు.

ఇంకొంతమంది ఉంటారు.వారికి సంతాన దోషాలుంటాయి.పెళ్లి అయ్యి,పదేళ్ళు అవుతున్నా ఇంకా పిల్లలు కలగరు.ఇప్పటికే వారు అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి,నాటువైద్యం,IVF మొదలైన అనేక రకాల పద్ధతులు వాడి కొన్ని లక్షల పైనే ఖర్చుచేసి ఉంటారు.వారి జాతకాలు చూస్తే,ఇద్దరికీ భయంకరమైన సర్పదోషాలు ఉంటాయి.అవి ఇప్పటివి కాకుండా తరతరాలుగా వెంటాడేవి అయ్యి ఉంటాయి.వాటిని తొలగించాలంటే అది మామూలు పని కాదు.

కానీ ఆ విషయం వారికి అర్ధం కాదు.అదేదో చిన్న సింపుల్ విషయం అని వారనుకుంటారు.నేను ఒక్క వారం పాటు వారికి రిప్లై ఇవ్వకపోతే వారికి కోపం వస్తుంది.

'ఏంటి సార్? మీకు వారం క్రితం మా వివరాలు పంపించాము.ఇంతవరకూ మాకు జవాబు లేదు.త్వరగా చూచి మాకు ఏదో ఒకటి చెయ్యండి' అంటూ నిష్టూరంగా మెయిల్స్ పెడతారు.

మొన్నీ మధ్యన ఇలాగే అడిగిన ఒకాయనకు ఇలా మెయిల్ ఇచ్చాను.

'మీ జాతకానికి చాలా తీవ్రమైన కాలసర్ప దోషం ఉన్నది.మీ శ్రీమతికి సంతాన సర్పదోషం ఉన్నది.ఇవి రెండూ ఇప్పటివి కావు.కొన్ని తరాలనుంచీ మిమ్మల్ని వెంటాడుతూ వస్తున్నాయి.దానికి రుజువులుగా ప్రతితరం లోనూ మీ కుటుంబాలలో జరుగుతున్న విషయాలను మీ మెయిల్లో మీరే వ్రాశారు. వాటికి చాలా తీవ్రమైన రెమేడీలు చెయ్యాలి.తేడా వస్తే ఆ ఫలితాలను నేను అనుభవించవలసి వస్తుంది.దానికి తోడుగా మీ దంపతులిద్దరూ వైద్యం తీసుకోవలసి ఉంటుంది.ఇంతా చేస్తే మీరెవరో నాకు తెలీదు.నేనెవరో మీకు తెలీదు.కనుక ముందుగా ఒక పని చెయ్యండి.జాతక దోషాలు పరిశీలించి రెమేడీలు చెయ్యడానికి పదివేలు నా ఎకౌంట్ కు పంపండి.అలాగే మా ట్రస్ట్ ఎకౌంట్ లో ఒక అయిదు లక్షలు జమ చెయ్యండి.రెమేడీలు ఫలించి,మా ట్రీట్మెంట్ మీకు సరిపడి,ఒక ఏడాది,ఏదాదిన్నర లోపు  మీకు సంతానం కలిగితే,మీరు డిపాజిట్ చేసిన డబ్బు వాపసు ఇవ్వబడదు.ఒకవేళ మేము ఫెయిల్ అయితే రెమెడీల ఖర్చులూ మందుల ఖర్చులూ మినహాయించి మీ డబ్బు మీకు వాపస్ ఇస్తాము.ఏ సంగతీ వెంటనే చెప్పనక్కర్లేదు. ఆలోచించుకుని చెప్పండి.'

అంతే సంగతులు !! మళ్ళీ ఆ దంపతుల వద్ద నుంచి మెయిల్ వస్తే ఒట్టు !!

జాతకం చూడమని నాకు మెయిల్ చేసే చాలామంది ఏమనుకుంటారంటే -- వారి జాతకాన్ని చూడటం తప్ప నాకింకేమీ పనీపాటలు లేవని,అసలు వారి జాతకం చూచే భాగ్యం కలగడమే నా జీవితంలోని అతిపెద్ద అదృష్టమనీ అనుకుంటారు.వారి డిమాండ్ చేసే ధోరణి ఆ తీరులో కనబడుతుంది.పోనీ రెమేడీలు చెబితే చెయ్యగలరా అంటే అదీ ఉండదు.వారి ఉద్దేశ్యం ఏమంటే, నేనే ఆ బాధలేవో పడి,ఆ రేమేడీలూ గట్రా చేసేసి,ఏ విభూదో కుంకమో వారికి పార్శిల్ చేసేస్తే,అది వారు పెట్టుకుంటే,వెంటనే ఆ దోషాలన్నీ మాయమై పోతాయి.ఆ తర్వాత వారు కూడా సునాయాసంగా మాయం కావచ్చు అనుకుంటారు.

అలాంటి భయంకరమైన దోషాలకు రెమేడీలు అంత సింపుల్ గా ఉండవు. అలాంటి కేసుల్లో రెమేడీలు చెబితే వాటిని బాధ్యతగా చేసేవారు కూడా అతి తక్కువమంది ఉంటారు. మిగతావారు రెండు రకాలుగా ఉంటారు.

ఒకటి-- మీరు చెప్పిన రెమేడీలు మేము చెయ్యలేము.మేము చెయ్యగలిగే రెమేడీలు మీరు చెప్పండి.అనే రకం మనుషులు ఎక్కువమంది ఉంటారు.

అంటే - వారి దృష్టిలో కొన్ని ఇప్పటికే టీవీలలో చూచిన రెమేడీలు ఉంటాయి. అవి నానోటి వెంట చెప్పించాలని వారి ప్రయత్నం.నేను వాటిని చెప్పను గనుక వారు నిరాశ పడతారు.

రెండు -- నేను చెప్పే రెమేడీలు వారికి నవ్వు పుట్టిస్తాయి.అవి అసలు రెమెడీల లాగే కనిపించవు.ఏవో చిన్నపిల్లల ఆటల్లా వారికవి కనిపిస్తాయి.కాని వాటిని కూడా వారు చేయలేరు.

ఇలాంటివారు ఇప్పటికే ఎందఱో జ్యోతిష్కుల వద్దకు పోయి వారు చెప్పిన రెమేడీలు చేసి ఉంటారు.లేదా వారంతట వారే కొన్ని పుస్తకాలు చదివి, వాటిలోని రెమేడీలు ప్రయత్నించి ఉంటారు.పాతరోగి కొత్త డాక్టర్ కంటే మేలన్నట్లు,నేను చెప్పే రెమేడీలు వారికి నచ్చవు.

రెమేడీలు అడిగే చాలామందిలో ఒక విధమైన బాధ్యతారాహిత్యం కనిపిస్తుంది.

"మేమేం చెయ్యము.ఊరకే మీకు మెయిల్ ఇస్తాము.వెంటనే మమ్మల్ని తరతరాలుగా వెంటాడి పీడిస్తున్న నాగదోషాలూ,కాలసర్పదోషాలూ,సంతాన దోషాలూ,దరిద్రయోగాలూ,వైధవ్యయోగాలూ,వివాహజీవితంలో ఉన్న ఇతర చెడుయోగాలూ అన్నీ ఒక్క క్షణంలో 'హాంఫట్' అన్నట్లుగా మాయమై పోయి, అదృష్టలక్ష్మి మమ్మల్ని వెంటనే వరించాలి.మీకు మెయిలిచ్చిన క్షణంనుంచే మార్పులు కనపడాలి.మా జాతకం సమూలంగా మారిపోవాలి"--అన్న ధోరణి చాలామందిలో కనిపిస్తుంది.

జాతకదోషాలు ఆ విధంగా అంత తేలికగా పోవు.అవి పోవాలంటే హిమాలయ పర్వతాలను ఎక్కినంత శ్రమపడాలి.ఏదో ఒక మెయిల్ ఇస్తే వెంటనే అవి మాయం కావు.అలా అవుతాయి అని ఎవరైనా చెబితే అది అబద్దం మాత్రమే.జాతకం అంటే కర్మతో చెలగాటం.సరిగా రెమేడీలు చెయ్యకపోతే చేతులు కాలిపోతాయి. ఈ సంగతి అర్ధం అయితే, రెమేడీలు అంటే ఏమిటో అర్ధమౌతుంది.

చాలాసార్లు ఏమౌతుందంటే--రెమెడీ అనేది మనం చెయ్యలేనంత కష్టంగానే ఉంటుంది.కానీ మనం చెయ్యడం ప్రారంభించాలి.విల్ పవర్ కూడగట్టుకోవాలి. ఏదో విధంగా ఆ రెమెడీని  చెయ్యాలి.అప్పుడే పూర్వకర్మ అనేది లొంగుతుంది. ఆ రేమేడీ చేసే సమయంలో కూడా అనేక అవాంతరాలు ఎదురౌతాయి. రేమేడీని చెయ్యకుండా రకరకాల పరిస్థితులు మధ్యలో అడ్డుపడి ఆపిస్తాయి. అయినా సరే,అంతకంటే మొండిగా మనమూ ఆ రేమేడీని చెయ్యాలి.అప్పుడే కర్మను జయించగలుగుతాము.మెత్తబడితే ఓడిపోతాము.

రేమేడీ అనేది -- తేలికగా డబ్బులు పారేసి ఎవరిచేతో హోమాలు చేయించడం, లేదా మనకు తీరికగా ఉన్నప్పుడు ఏవో స్తోత్రాలు ఇయర్ ఫోన్లో వినడం,లేదా ఏమీ తోచనప్పుడు వాకింగ్ కు వెళ్ళినట్లు గుడికి వెళ్లి నాలుగు ప్రదక్షిణాలు చెయ్యడం -- ఇలా ఉండవు.ఇలాంటివి అసలైన రెమేడీలు కానేకావు.

నిజమైన రెమెడీ అనేది నీకు కష్టంగానే కనిపిస్తుంది.చెయ్యలేనేమో అనే అనిపిస్తుంది.చెయ్యడం మొదలు పెట్టినా అనేక ఆటంకాలు వస్తాయి.నీ విల్ పవర్ ని అనుక్షణం పరీక్షిస్తాయి.అయినా సరే, ఏటికి ఎదురీదినట్లుగా నీవు మొండిగా వాటిని చెయ్యగలగాలి.అప్పుడే రెమెడీ అనేది ఫలిస్తుంది.

అంతేగాని -- చెబుతున్న మాటలు వినకుండా -- అసలు నా జాతకాన్ని చూడటమే నీ జాతకంలో అదృష్టం -- అని చెబుతున్న వాడినే ఎగతాళి చేస్తే ఆ కర్మ ఎన్నటికీ తీరదు.ఆ జాతకం ఎన్నటికీ మారదు.

కర్మక్షాళనం జరిగే యోగం అడిగేవారి జాతకంలో లేనప్పుడు ఇలాంటి ధోరణులు పుడుతూ ఉంటాయి.ఇది కూడా గ్రహప్రభావమే.జాతకదోషాలే వారిని ఆవహింఛి అలా మాట్లాడిస్తాయి.అలాంటి సందర్భాలలో--వీరి కర్మ తీరేది కాదు--అనే విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకుని--జ్యోతిష్కుడు మౌనం వహించడం మంచిది.