“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, జూన్ 2015, బుధవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు-11

భోజనం చేశాక రమ్మని అక్కయ్య అన్నారు కదా.మళ్ళీ అప్పారావన్నయ్య దగ్గర కూచుంటే రాత్రి పది అయిపోతుంది.అప్పుడొచ్చి అక్కయ్యను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇప్పుడే అక్కయ్యను కలిసి ఆ తర్వాత అప్పారావన్నయ్య దగ్గరకు వెడదాం.అక్కడనుంచి సరాసరి గుంటూరుకు బయలుదేరవచ్చు. ఎంత రాత్రి అయినా ఇబ్బంది ఉండదు.' అని సలహా ఇచ్చింది మా శ్రీమతి.

'సరే అలాగే చేద్దాం.'--అంటూ వెనక్కు తిరిగి అక్కయ్య దగ్గరకు వచ్చాము.

అక్కయ్య పూజామందిరంలో ఉన్న అమ్మ విగ్రహానికి నమస్కరించి, అక్కయ్యకు నమస్కరించి లేచాము.అమ్మ విగ్రహానికి ఉన్న చీరను తీసి మా శ్రీమతికి కట్టుకోమని ఇచ్చింది వసుంధరక్కయ్య.

తను సంచీలో ఆ చీరను పెట్టుకోబోతుంటే - "డ్రస్సు మీదే పైపైన చీరను చుట్టుకోమ్మా.అమ్మ ఎదురుగా కట్టుకుంటే అమ్మకు తృప్తిగా ఉంటుంది.అమ్మ శరీరంతో ఉన్నరోజుల్లో కూడా అమ్మచేత బట్టలు పెట్టించుకున్నవాళ్ళు ఆ బట్టలను కట్టుకుని అమ్మ ఎదుటకు వస్తే అమ్మకు తృప్తిగా ఉండేది." అన్నారు అక్కయ్య.

పంజాబీడ్రస్సు మీదే ఆ చీరను చుట్టబెట్టుకుని అమ్మ విగ్రహం ఎదురుగా సాగిలబడి నమస్కారం చేసింది మా శ్రీమతి.

తృప్తిగా చూచింది అక్కయ్య.

అక్కయ్య దగ్గర సెలవు తీసుకుని అప్పారవన్నయ్య ఉండే అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ వద్దకు బయలుదేరాము.ఆ కుగ్రామంలో రెండు కాంప్లెక్స్ లను సింపుల్ గా కట్టించారు అప్పారవన్నయ్య.వాటిలో అమ్మ భక్తులు ఉంటుంటారు.అందులో ఒక దానికి 'శ్రీవిద్యానిలయం' అని పేరు పెట్టారు.

మేము వెళ్ళే సరికి ఆరుబయట కుర్చీలు వేసుకుని అప్పారావన్నయ్య కూచుని ఉన్నారు.నన్నునేను మళ్ళీ ఇంకొకసారి పరిచయం చేసుకుని, భార్యాపిల్లలను పరిచయం చేసి కూర్చున్న తర్వాత,'శ్రీవిద్యారహస్యం' పుస్తకాన్ని ఆయనకు ఇచ్చాను.

నాకు తెలుగువ్యాకరణం రాదనీ, సంస్కృతం అసలే రాదనీ, అయినా కూడా అమ్మ కటాక్షంతో 1500 తెలుగు పద్యాలూ, 27 సంస్కృత శ్లోకాలూ ఆశువుగా నా  నోట పలికాయనీ గ్రంధ పరిచయం చేసి పుస్తకం చదవమని ఆయనకు ఇచ్చాను.

ఆయన కొంచం విచిత్రంగా చూచారు.

'శ్రీవిద్యారహస్యం' పేరు బాగున్నది.ఇందులో ఏం వ్రాశారు? ఎలా వ్రాశారు?"- అని అడిగారు.

'మీరు పుస్తకం చదవండన్నయ్యా అర్ధమౌతుంది.శుద్ధమైన శ్రీవిద్యోపాసనను దానిలో వివరించాను' అన్నాను.

'ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే--ఈ విషయం మీద అమ్మ ఒక మాట అన్నారు--శ్రీవిద్య అంటే అందరూ అనుకునే అమ్మవారి పూజ కాదు.అది బ్రహ్మోపాసన.'-- అని అమ్మే ఒకసారి అన్నారు.మీరు మరి ఎలా వ్రాశారో అని అడిగాను' అన్నారు.

'నేను వ్రాసినది కూడా అదే అన్నయ్యా.శ్రీవిద్యోపాసన అంటే బ్రహ్మోపాసనయే అన్న విషయాన్నే ఈ పుస్తకంలో వ్రాశాను.అమ్మ మాటల్ని కూడా సందర్భానుసారంగా అక్కడక్కడా ఉటంకించాను' అన్నాను.

'ఏ ఏ సందర్భాలలో అమ్మ వాక్యాలను వ్రాశారు?' అని ఆయన ప్రశ్నించారు.

'శాస్త్రం అనుభవాన్నివ్వదు నాన్నా.అనుభవం శాస్త్రాన్నిస్తుంది' అనే అమ్మ మాటను ఒకచోట ఉటంకించాను." అన్నాను.

ఆయన ఆనందంగా నవ్వారు.

'అవును.ఇది నాకు ప్రత్యక్ష అనుభవమే.అమ్మ నాకు అనేక దివ్యానుభవాలను ఇచ్చింది.వాటిని నా పుస్తకంలో వ్రాశాను కూడా. మీకిచ్చానా? చదివారా?' అడిగారు.

'ఇచ్చారు.చదివాను' అని నేనన్నాను.

ఆయన చెప్పడం మొదలుపెట్టారు.

'ఏదైనా అమ్మ మనకు ఇవ్వవలసిందే.అమ్మ అనుగ్రహం ఉంటే అన్ని అనుభవాలూ అలవోకగా అందుతాయి.నేను మొదటిసారి అమ్మ దగ్గరకు అనేక సందేహాలతో వచ్చాను.ఇవన్నీ దాదాపు ఏభై ఏళ్ళక్రితం జరిగిన సంగతులు.అవధూతేంద్ర సరస్వతీ స్వామివారని ఉండేవారు.మీరు విన్నారా?"

'నా చిన్నప్పుడు విన్నానన్నయ్యా.తెలుసు.' అన్నాను.

'ఆ! వారితో కలసి మొదటిసారి అమ్మను దర్శించాను.మీరు అమ్మను దర్శించుకున్నారా? ' అడిగారు.

'నేను 12 లేదా 13 ఏళ్ళ వయసులో ఉన్నపుడు కొద్ది నిముషాల పాటు అమ్మను ఇక్కడే దర్శించుకోగలిగాను.మా అమ్మావాళ్ళతో కలసి ఇక్కడకు వచ్చాను.' అన్నాను.

'అలాగా. సరే. అయితే, నాకా రోజుల్లో ఆధ్యాత్మికపరంగా అనేక సందేహాలుండేవి.అవధూతేంద్రస్వామిని జవాబులు అడిగాను.ఆయనేమో అమ్మ దగ్గరకు తీసుకొచ్చారు.

'అమ్మా.ఈయనకు ఏవో సందేహాలున్నాయట.అందుకని మీ దగ్గరకు తీసుకొచ్చాను.'అని అమ్మతో చెప్పారు.అమ్మ అలా కూర్చున్నారు.మేం నేలమీద అమ్మ ఎదురుగా కూచున్నాం.

"తీసుకొచ్చినది అవధూత.సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఎదురుగా కూర్చుని ఉన్నది సాక్షాత్తూ జగజ్జనని.ఆహా ఏం అదృష్టంరా నీది?"- అని మనస్సులో అనుకుంటూ అమ్మను ఇలా అడిగాను.

'అమ్మా! --"అంతా అదే"-- అని అంటారు కదా? 'సర్వం ఖల్విదం బ్రహ్మా..' అని ఉపనిషత్తులు కూడా అంటున్నాయి.'అంతా అదే' అనేది  మనం అనుకోవడమా? లేక  మనకు అనిపించడమా?--అని అమ్మను అడిగాను.

దానికి అమ్మ వెంటనే --' అనిపించడమే నాన్నా' అని జవాబిచ్చారు.

'మరి నాకు అనిపించడం లేదు కదమ్మా ! అది నిజమే అయితే అనిపించాలి కదా?ఎందుకని నాకు అనిపించడం లేదు?భేదం ఎందుకు నాకు కనిపిస్తున్నది?అంతా అదే ఎలా అవుతుంది? ఈ పుస్తకమూ,నేను కట్టుకున్న పంచా ఒకటేనా? కాదుకదా? వేర్వేరు కదా? అలాంటప్పుడు అంతా అదే ఎలా అవుతుంది?'-- అని అడిగాను.

అమ్మ కాసేపు మౌనంగా ఉన్నది.

'ఈ సంభాషణంతా మేడమీద అమ్మగదిలో జరిగింది.అక్కడే అమ్మ వేసుకునే గాజులన్నీ ఒక గూట్లో ఉంటాయి.చూచారా?' అడిగారు అన్నయ్య.

'చూచాము' అన్నాను.

'వసుంధరక్కయ్యను పిలిచి -- వాటిలోంచి ఒక గాజును తెచ్చిమ్మని -- అమ్మ చెప్పింది.అక్కయ్య ఒక గాజును తెచ్చి అమ్మ చేతికి ఇచ్చింది.

దానికి మాకు చూపిస్తూ --' ఇదేంటి నాన్నా? ' అనడిగింది అమ్మ.

'గాజు కదమ్మా' అన్నాను నేను.

'కాదు నాన్నా.బంగారం కదా?' అన్నది అమ్మ.

మాకు క్షణం పాటు మతిపోయింది.

నిజమేకదా ! అది బంగారు గాజే.నిజానికి అది బంగారమే.

'గాజు అనేది మన భ్రమేగా నాన్నా.నిజానికి అది బంగారమేగా?' అన్నది అమ్మ.

చేతులు జోడించి --'నిజమే అమ్మా.బంగారమే.' అన్నాను.

అమ్మ మళ్ళీ ఒక్క క్షణంపాటు మౌనంగా ఉన్నది.

నావైపు ప్రసన్నంగా చూస్తూ  ఈ సారి ఇలా అన్నది.

'బంగారం కాదు నాన్నా. మట్టే కదా'

మాకు దిమ్మ తిరిగిపోయింది.

'సమలోష్టాశ్మ కాంచన:...' ఎవరైతే బంగారాన్నీ మట్టినీ సమంగా చూస్తాడో వాడే నిజమైన జ్ఞాని అని భగవద్గీత అనడం లేదా?

అంతేగా!!

నిజానికి బంగారంకూడా చివరకు మట్టిలో కలిసేదేగా? అది ఒచ్చింది కూడా మట్టిలో నుంచే కదా.కనుక నిజానికి అది మట్టే.

'అవునమ్మా.మట్టే' -- అన్నాను అలాగే చేతులు జోడించి.

'మీరింతవరకూ వస్తారు నాన్నా.కానీ నాకేమనిపిస్తుందో తెలుసా? ఇది మట్టి కూడా కాదు--" అదే" అనిపిస్తుంది.--అన్నది అమ్మ.

వింటున్న మాకు నోట మాట రాలేదు.

'అంతా అదే'-- అంటే ఇదా? ఈ విధంగానా??

గాజు అనేది మన భ్రమే.బంగారం అనేది కూడా భ్రమే.చివరకు అంతా మట్టే.కానీ ఆ మట్టి కూడా ఏదో ఒక మూలతత్త్వం లోనుంచి వచ్చిందే.కనుక మట్టి కూడా పరమసత్యం కాదు.ఏదైతే ఎప్పటికీ నిలిచి ఉన్నదో అదే శాశ్వత సత్యం.అన్నీ దానిలోనుంచి వచ్చినవే.అంతిమంగా అందులో కరిగిపోయేవే. కనుక నిజానికి ఉన్నది 'అదేగా' ??

'అమ్మ ఇలా అన్నదని నేను కొందరు పెద్దపెద్ద పీఠాధిపతులతో అంటే,వాళ్ళు ఆశ్చర్యంతో --'ఎంత బాగా చెప్పింది అమ్మ?' అంటూ చేతులు జోడించి అమ్మను స్మరించి నమస్కారం చేశారు.' అన్నారు అప్పారావన్నయ్య.

గాజు స్థూలశరీరం.
బంగారం సూక్ష్మశరీరం.
మట్టి కారణశరీరం.
'అది' మహాకారణం.

నామరూపాలే భ్రాంతి.అదే మాయ.నామరూపాలను దాటితే ఏమున్నది?అంతా ఒక్కటేగా! ఆ ఒక్కదాన్ని నిరంతరం చూస్తూ ఉండటమే బ్రహ్మభావన. నామరూపాదులలో పడి కొట్టుకుపోవడం మాయ.

అత్యున్నతమైన వేదాంతాన్ని ఎంత సులభంగా చెప్పింది అమ్మ !!! అమ్మ చెప్పే మాటలన్నీ వేద ప్రమాణాలతో సరిపోతూ ఉండేవి.కానీ అమ్మ వేదాలు చదవలేదు.ఉపనిషత్తులు చదవలేదు.అయినా కూడా అమ్మ మాటలలో అవే ప్రతిఫలిస్తూ ఉండేవి.

ఈ సందర్భంగా అమ్మ చెప్పిన ఇంకొక మాట గుర్తుకు వస్తున్నది. 

ఎవరో ఒకరు అమ్మను ఇలా అడిగారు.

'అమ్మా? మీరు ఏమీ చదువుకోలేదు కదా. మరి మీరు చెప్పే ప్రతి మాటా శృతి(వేద) ప్రమాణాలతో సరిపోతూ ఎలా ఉంటున్నది? ఏమిటి దీని రహస్యం?'

ఈ ప్రశ్నను అమ్మ ఒక చిన్నమాటతో తేల్చేశారు.

'నావి శ్రుతులు కావు నాన్నా.స్మృతులు.' అన్నారు అమ్మ.

అప్పారావన్నయ్య ఈ మాట చెబుతుంటే, వింటున్న నాకు ఆనందం ఆగలేదు.కళ్ళలో ఆనంద బాష్పాలు గిర్రున తిరిగాయి.

'అన్నయ్యా !! అబ్బ!!! ఎంత అద్భుతమైన మాట చెప్పింది అమ్మ !!!' అన్నాను చేతులు జోడించి.

'అవును.స్మృతి అంటే జ్ఞాపకమేగా? అంటే అమ్మ చెప్పినవన్నీ అమ్మ అనుభవాలే.అమ్మ జ్ఞాపకాలే.వాటిలోనుంచే అమ్మ చెప్పేది.అవన్నీ వేదాలలో ఉన్న శ్లోకాలతో మంత్రాలతో సరిపోతూ ఉండేవి.'అన్నారు అప్పారావన్నయ్య.

(ఇంకా ఉంది)