“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

23, జూన్ 2015, మంగళవారం

ఆరోగ్యవంతమైన జీవితానికి అసలైన సూత్రాలు

ఒక విషయం నేను చెబితే చదువరులకు ఆశ్చర్యం కలుగుతుంది.

గత ముప్ఫై ఏళ్ళలో,ఒక్కసారి తప్ప,నేను ఎప్పుడూ ఆస్పత్రి ఛాయలకు పోలేదు.ఇంగ్లీషుమందులు మింగలేదు.ఇక ఇంజక్షన్ అంటే ఏమిటో, చిన్నప్పుడు టీకాలు వేయించినప్పుడు తప్ప, నాకు ఇప్పటివరకూ తెలీదు. నాకిప్పుడు 52 ఏళ్ళు వచ్చాయి.కళ్ళకు సైట్ అనేది ఇంతవరకూ నాకు లేదు. బీపీ,షుగరూ ఇతరత్రా రోగాలేవీ నాకు లేవు.శరీరశ్రమ చేసినాకూడా అలుపనేది అంత త్వరగా నాకు రాదు.

అయితే,నేనేమీ సూపర్ మ్యాన్ ని కాను.అందరిలాంటి మామూలు మనిషినే. పైగా,ప్రకృతికి వ్యతిరేకంగా రాత్రింబగళ్ళు పనిచేసే ఉద్యోగం నాది.ఒకచోట తిండి,ఒకచోట నీళ్ళు ఉండవు.వేళకు భోజనం ఉండదు,ఇలాంటి పరిస్థితులలో చేసే ఉద్యోగం నాది.

మరి ఇదెలా సాధ్యం?

మితమైన సాత్వికాహారం,యోగాభ్యాసం,ధ్యానం,పరిమితమైన హోమియో ఔషధాల వాడకం,దురలవాట్లకు దూరంగా ఉండటం,నవ్వుతూ ఉండటాల వల్ల ఇది సాధ్యమైంది.

చాలామంది అనుకుంటారు--యోగా అనేది సర్వరోగ నివారిణి అని.

గత రెండు రోజులుగా ప్రచారం కూడా అలాగే జరుగుతోంది.నిన్నెవరో రాజకీయ నాయకుడు -- యోగా అనేది సర్వరోగ నివారిణి -- అని ఒక స్టేజీ మీద నుంచి చెప్పాడు.నాకు చచ్చే నవ్వొచ్చింది.ఆయన్ను చూస్తే, యోగా అనేదాన్ని ఎప్పుడూ చేసిన పాపాన పోలేదని తెలుస్తూనే ఉన్నది.

అది నిజం కాదు.

యోగా- అనేది నిన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. చక్కని ఫిట్ నెస్ ను ఇస్తుంది.కానీ -- నీకు వంశపారంపర్యంగా జీన్స్ లో వచ్చే రోగాలను అది తగ్గించగలదా? అంటే - గలదు, లేదు అని రెండు జవాబులు వస్తాయి.

సామాన్యంగా అందరూ కాసేపు చేసే యోగా ఆ పనిని చెయ్యలేదు.అది నీకు ఫిట్ నెస్ మాత్రమే ఇవ్వగలదు.వంశపారంపర్య రోగాలను అది తగ్గించలేదు.

కానీ, హైయ్యర్ యోగా అనేది ఆ పనిని చెయ్యగలదు.అయితే దానిని చెయ్యాలంటే, దానికి బోలెడంత ఓపిక కావాలి.శ్రద్ధ కావాలి.రోజూ ఉదయం మూడుగంటలు సాయంత్రం మూడుగంటలు హైయ్యర్ యోగాను చెయ్యగలిగితే,అప్పుడు నీ శరీరాన్ని అది సమూలంగా మార్చిపారేస్తుంది.నీలో ఉన్న ఎలాంటి దీర్ఘ రోగాన్నైనా సరే అది నయం చెయ్యగలుగుతుంది.కానీ అంత ఓపిక మనకెక్కడుంది?అంత తీరిక మనకెక్కడుంది?అంత శ్రద్ధ మనకెక్కడిది?రోజుకు ఆరుగంటలపాటు యోగాభ్యాసం చేస్తూ కూచుంటే మనల్ని పోషించేవాళ్ళెవరు?ఈ జీవన పోరాటంలో అది సాధ్యమేనా?సాధ్యం కాదు.

కనుక ఆహారనియమం,యోగాభ్యాసంతో బాటు,హోమియో ఔషధాలను మితంగా వాడుకుంటే,ఆ పని సులభంగా జరుగుతుంది. 

వంశపారంపర్య దీర్ఘరోగులలో గనుక మనం గమనిస్తే, యోగాభ్యాసంవల్ల,వాళ్ళ బాధ కంట్రోల్లో ఉంటుంది.మినిమం స్టేజ్ లో ఉంటుంది.కానీ పూర్తిగా తగ్గదు. అలా అది పూర్తిగా తగ్గాలంటే,దానిని సమూలంగా కూకటివేళ్ళతో పెకలించగల హోమియో ఔషధాలవల్లే ఆ పని జరుగుతుంది.లేదా హయ్యర్ యోగాతో జరుగుతుంది.

ఏమిటి హోమియో ఔషధాల ప్రత్యేకత? అని మీకు అనుమానం రావచ్చు. మామూలు అల్లోపతి మందులు ఆ పనిని ఎందుకు చెయ్యలేవు? అని కూడా అనుమానం రావచ్చు.

ఈ రెంటికీ చాలా తేడా ఉన్నది.

హోమియోపతి మందులు పొటెన్సీ ఔషధాలు గనుక,దేహంతో చాలా సూక్ష్మ స్థాయిలలోకి వెళ్లి పని చేస్తాయి.ఇంగ్లీషు మందులు ఆ పనిని చెయ్యలేవు.

ఈ రెంటికీ అసలైన భేదం ఇంకొకటి ఉన్నది.

ఇంగ్లీషు మందులు శరీరం చెయ్యవలసిన పనిని అవి చేసి, శరీరానికి బద్ధకాన్ని పెంచుతాయి.అందుకని శరీరం వాటిమీద ఆధారపడి పోయే పరిస్థితి తలెత్తుతుంది.ఒక మందుల కట్టను ఎక్కడికి పోయినా మోసుకు పోవలసిన ఖర్మ పడుతుంది.తిండి తిన్న వెంటనే ఆ కట్టను తెరిచి ఆ మందులు ప్రతిరోజూ మింగవలసిన గతి పడుతుంది.ఒక్కరోజు అవి వేసుకోకపోతే కుప్పకూలిపోయే పరిస్థితికి మిమ్మల్ని ఆ మందులు తీసుకెళతాయి.

హోమియో ఔషధాలు పనిచేసే తీరు అలా ఉండదు.

అవి శరీరపు రోగనిరోధక శక్తిని ఉత్తెజపరుస్తాయి.శరీరం తన పనిని తాను మునుపటిలా చేసుకునేటట్లు చేస్తాయి.తన రోగాన్ని తానే నయం చేసుకునే స్థాయికి ప్రాణశక్తిని ఉద్ధరిస్తాయి.కనుక వాటిని అదేపనిగా ప్రతిరోజూ వాడవలసిన పని ఉండదు.

ఇంగ్లీషు మందుల వాడకంలో -- అనవసరమైన కెమికల్స్ క్రమేణా దేహంలో పోగుపడుతూ ఉంటాయి.కొన్నాళ్ళ తర్వాత రోగం ఒక అవయవం నుంచి ఇంకొక అవయవం మీదకు ప్రాకుతూ పోతుంది.ముదురుతూ పోతుంది. అందుకే సైడ్ ఎఫెక్ట్ లనేవి ఆ విధానంలో తప్పకుండా కలుగుతాయి.

కానీ హోమియోపతిలో అలాంటి పరిస్థితి ఉండదు.ఇందులో హానికర రసాయనాలు ఏమీ ఉండవు.అవి శరీరంలో పోగుపడవు.రోగం అన్ని అవయవాలకూ ప్రాకదు.ముదరదు.ఉత్తేజితమైన ప్రాణశక్తి వల్ల రోగం కూకటి వేళ్ళతో పెకలింపబడుతుంది.

యోగాద్వారా కూడా ఈ అద్భుతాన్ని సాధించవచ్చు.కానీ మామూలుగా అందరూ చేసే అరగంట యోగా వల్ల ఈ అద్భుతం జరగదు.హయ్యర్ యోగా మాత్రమే ఈ పనిని చెయ్యగలదు.

ఒక అరగంటలో ఎన్ని ఆసనాలు వెయ్యగలరు? అవి కూడా ఎంత సరిగ్గా తప్పులు లేకుండా చెయ్యగలరు? ఆసనాలనేవి అసలైన యోగాభ్యాసంలో ఎంత భాగం గనుక?

యోగాలో ఆసనాలతో పాటు,షట్కర్మలు,ముద్రలు,క్రియలు,బంధాలు, ప్రాణాయామ సాధనలు,ధారణాభ్యాసాలు,మంత్రజపం మొదలైన కొన్ని వందల టెక్నిక్స్ ఉన్నాయి.అవన్నీ కలసినదే హయ్యర్ యోగా. దానిని ప్రతిరోజూ కనీసం మూడుగంటలపాటు చేస్తే అప్పుడు ఈ అద్భుతం జరుగుతుంది. దేహంలోని రోగాలన్నీ మటుమాయం అవుతాయి.శరీరం వజ్రకాయం అవుతుంది.అంతేగాని పైపైన ఒక పది ఆసనాలు సూర్యనమస్కారాలు చేస్తే ఈ అద్భుతం జరగదు.

వంశపారంపర్య వ్యాధులు లేని మనిషి ఈ రోజున ప్రపంచంలో ఎక్కడా లేడు. పరిపూర్ణ ఆరోగ్యవంతుడూ ఎక్కడా లేడు.కనుక ఈ రోగాలు పోయి, మనిషి ఆరోగ్యంగా బ్రతకాలంటే,ఒక్కటే మార్గం -- ఆహారనియమం,యోగాభ్యాసం, మితంగా హోమియో ఔషధాల వాడకం,దురలవాట్లకు దూరంగా ఉండటం.

ఇది తప్ప -- ప్రపంచమంతా గాలించినా సరే -- దీనికి వేరే మార్గం ఇంకేమీ లేదు.

ఈ రోజువారీ షెడ్యూల్ ను క్రమం తప్పకుండా పాటించగలిగితే,అరవైలో కూడా ఇరవైలాగా హుషారుగా ఉండవచ్చు.జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందంగా జీవించవచ్చు.నేను పుస్తకపరిజ్ఞానంతో ఈ మాటను చెప్పడం లేదు.అనుభవంతో చెబుతున్నాను.నేను చెబుతున్నవాటిని నా జీవితంలో ఆచరించి, ఫలితాలను పొంది, ఈ మాటను చెబుతున్నాను.

అయితే, ఈ మార్గం అందరికీ నచ్చదు. అన్నీ మానుకొని అలా బ్రతకకపోతే ఏం?అనేవారు చాలామంది ఉన్నారు.ఈ రకంగా నోరు కట్టేసుకుని వెయ్యేళ్ళు బ్రతకడం కంటే అన్నీ తింటూ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఒక నెల బ్రతికినా చాలు అనుకునేవారూ అనేవారూ చాలామంది ఉన్నారు.నా స్నేహితులే చాలామంది ఈ మాటను పది పదిహేనేళ్ళ క్రితం కూడా అనేవారు. ఇప్పుడు వారందరూ రకరకాల రోగాలతో గుప్పెళ్ళు గుప్పెళ్ళు మందులు మింగుతున్నారు.అది వారి ఖర్మ.

అలాంటి వారికి జీవితం అంటే -- ప్రతిరోజూ సాయంత్రానికి త్రాగడం, ఇష్టం వచ్చిన మాంసాలు తెగతినడం,సాధ్యమైనంత మంది అమ్మాయిలతో తిరగడం, షాపింగులు చెయ్యడం,బ్యూటీ ప్రాడక్ట్స్ ఎడాపెడా కొనేసి వాడటం,హోటళ్ళలో పడి నానాచెత్తా తినడం,ప్రతిదానికీ ఉద్రేకపడిపోతూ జీవితాన్ని గడుపుతూ అదొక ఘనమైన ఎంజాయ్ మెంట్ అనే భ్రమలో ఉండటం,ఏదైనా రోగం వస్తే కార్పోరేట్ ఆస్పత్రిలో చేరి బెడ్ మీద పడుకొని శరీరాన్ని వాళ్లకు అప్పజెప్పడం--ఇవన్నీ చెయ్యడానికి కావలసింది బోలెడంత డబ్బు గనుక--పొద్దున్న లేచిన దగ్గరనుంచీ రాత్రి పడుకునే వరకూ పరుగులు పెడుతూ, డబ్బు డబ్బు డబ్బు  అని కలవరిస్తూ దానికోసమే బ్రతకడం -- ఇంతే.

అసలైన జీవితం ఇది కాదు.

చక్కని ఆరోగ్యంతో,ప్రశాంతమైన మనస్సుతో,పరిపూర్ణ ప్రజ్ఞతో,ఉల్లాసకరమైన జీవితాన్ని గడుపుతూ,చేతనైనంతలో సాటి మనిషికి సాయం చేస్తూ,అన్ని టెన్షన్ల మధ్య ఉన్నాకూడా,ఏ టెన్షనూ లేకుండా,నిశ్చలంగా,నిబ్బరంగా ఉంటూ,అత్యాశ లేకుండా,జెలసీ లేకుండా,కోపతాపాలు దరిచేరకుండా, ప్రతిదానికీ క్రుంగిపోకుండా,తన మనస్సును తన కంట్రోల్ లో ఉంచుకుని గడిపేదే అసలైన జీవితం.

అప్పుడే మనిషికి అసలైన ఆనందం అంటే ఏమిటో అర్ధమౌతుంది.అయితే ఈ ఆనందం ఊరకే అనుకున్నంత మాత్రాన లభ్యంకాదు.'ఈ ఆనందం నాకూ కావాలి'- అని తలచుకున్నంత మాత్రాన అది రాదు.

ఈ ఆనందం సొంతం కావాలంటే మన దినచర్య మారాలి.

మన ప్రయారిటీస్ మారాలి.

మన ఆలోచనా విధానం మారాలి.

మన అలవాట్లు మారాలి.మన పద్ధతులు మారాలి.

వెరసి మన జీవన విధానమే మారాలి.

డబ్బుకోసం,బయట వస్తువులకోసం,అవిచ్చే సోకాల్డ్ సుఖాలకోసం మన ఉరుకులు పరుగులు తగ్గాలి.ఇతరులతో మనల్ని పోల్చుకుని మనం పడే టెన్షన్లు మాయం కావాలి.వస్తువులలో ఆనందం ఉన్నదనే భ్రమ మనల్ని వదలాలి.బయట ప్రపంచంలో కొత్త కొత్త సుఖాల కోసం అన్వేషణ ఆగిపోవాలి.

మినిమం సౌకర్యాలతో - మేగ్జిమం ఆనందంతో బ్రతికే కళను మనం నేర్చుకోవాలి.

ప్రకృతితో,దైవంతో మమేకమైన జీవితాన్ని మనం గడపగలగాలి.అప్పుడే మంచి ఆయుస్సుతో,మంచి ఆరోగ్యంతో,మంచి మనస్సుతో మనం ప్రశాంతంగా జీవించగలుగుతాం.మనం ఆనందంగా ఉండటమే గాక,మన చుట్టూ ఉన్నవారిని కూడా ఆనందంగా ఉంచగలుగుతాం.మన పిల్లలని కూడా చక్కగా పెంచగలుగుతాం.వారికి కూడా మన వారసత్వాన్ని అందించగలుగుతాం.

అలా ఉండగలిగితే -- అంతకంటే జీవితంలో కావలసింది ఇంకేముంటుంది?

ఆనందం కోసమేగా మనిషి అన్వేషణ.

కాదంటారా?