“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

20, ఏప్రిల్ 2014, ఆదివారం

జ్యోతిష్య శాస్త్రం-పరిహార క్రియలు (రెమెడీలు)

జ్యోతిష్యశాస్త్రం ఒక అద్భుతమైన శాస్త్రం.మనిషికి తెలిసిన అన్ని విద్యలలోకి ఇదే గొప్పదని నేనంటాను.నేనలా అనడానికి అనేక కారణాలున్నాయి.

ఎందుకంటే మనిషికి తెలిసిన ఏ శాస్త్రమూ అతని భవిష్యత్ రూట్ మ్యాప్ ఎలా ఉంటుందో చెప్పలేదు.అతని గతం ఏమిటో చెప్పలేదు.గత జన్మలేమిటో చెప్పలేదు.గతంలో ఏ చెడుకర్మ చేసుకోవడం వల్ల ఈజన్మ ఇలా అఘోరిస్తున్నదో చెప్పలేదు.ఆ కర్మ ఫలితాలు పోవాలంటే,ప్రస్తుత జీవితం బాగుపడాలంటే ఏమి చెయ్యాలో చెప్పలేదు.అసలు మనిషనేవాడు ప్రప్రధమంగా తెలుసుకోవలసిన విషయాలు ఇవే.

వీటిని ఒదిలేసి మనిషి అనేక ఇతర విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. అనేక అనవసర విషయాల వెంట పరుగెత్తుతూ ఉంటాడు.ఆ క్రమంలో జీవితం వృధా చేసుకుంటూ ఉంటాడు.ఇది ప్రపంచవ్యాప్తంగా అనేకమంది జీవితాలలో జరుగుతూ ఉంటుంది.

ఇకపోతే,జ్యోతిష్యాన్ని నమ్మేవారూ రెమేడీలు చేద్దామని అనుకునేవారూ కూడా చాలామంది సరియైన మార్గాన్ని అనుసరించలేరు.దానికి కారణం ఏమంటే వారి పూర్వకర్మ ఆ పనిని అంత సులభంగా చెయ్యనివ్వదు.అలా చెయ్యలేకపోవడానికి విచిత్రమైన లాజిక్కులు వారికుంటాయి.అనేక కారణాలతో పూర్వకర్మ వారి చేతులను విచిత్రంగా కట్టివేస్తుంది.

జనులలో కర్మ తొలగకపోవడానికి ప్రధానంగా ఈ క్రింది కారణాలుంటాయి:
  • జ్యోతిష్యం బూటకం అనే నిరాధార నమ్మకం ముఖ్యమైనది.చాలామంది ఈ నమ్మకాన్ని కులపరంగా,అంటే బ్రాహ్మణులంటే ఉన్న ద్వేషం కారణంగా ఏర్పరచుకుంటారు.ఈ ద్వేషం కారణంగా ఒక గొప్ప సైన్స్ యొక్క సహాయాన్ని వారు అందుకోలేక పోతున్నారన్నది వారికి తోచదు.అలా తోచకుండా వారి పూర్వకర్మ అడ్డుపడుతుంది. ఎక్కువమందిలో ఈ కారణం బలంగా పనిచేస్తుంది.
  • ఇంకొంతమంది,జ్యోతిష్యవిద్యనూ డబ్బుతో కొనవచ్చన్న భ్రమలో ఉంటారు.ఇలాంటివారికీ సరియైన రెమేడీలు అందవు.
  • ఇంకొంతమంది ఈ శాస్త్రం అంటే చులకన భావంతో ఉంటారు.ఆ చులకన భావమే వారికి అడ్డుగోడ అవుతుంది.
  • జ్యోతిష్యం నమ్మేవారిలో కూడా అనేకులు సరియైన రెమేడీలు చెయ్యలేరు.దానికి మళ్ళీ రకరకాల కారణాలుంటాయి.
అవేమిటంటే--
  • జ్యోతిష్యశాస్త్రాన్ని తేలికగా చులకనగా తీసుకోవడం.
  • ఏదో సరదాగా అడిగితే జ్యోతిష్కుడు ఏదో ఒకటి చెబుతాడులే కాసేపు కాలక్షేపానికి పనికొస్తుంది చూద్దాం అనే నిర్లక్ష్య ధోరణి.
  • విషయాన్ని కేజువల్ గా తీసుకోవడం.
  • 'రెమేడీలు చెప్పండి చేస్తాం' అని సరదాగా అడగడం.
  • పరీక్షించడానికి ప్రశ్నించడం.
  • జాతకం చెప్పించుకోడానికి వచ్చి,జ్యోతిష్కుడు జాతకాన్ని పరిశీలిస్తున్నపుడు,మౌనంగా శ్రద్ధగా ఉండకుండా అనవసరమైన సంభాషణలు చెయ్యడం.
  • ఎగతాళి మాటలు మాట్లాడటం.
  • ఇతర జ్యోతిష్కులను మనముందు తిట్టడం(ఇలాంటివారు ఇతరులవద్ద మనల్ని కూడా విమర్శిస్తారన్న సంగతి గ్రహించాలి)
  • అనవసరమైన వాగుడు.
  • మనసులో ఒకటి ఉంచుకుని డొంకతిరుగుడుగా ఇంకొకటి అడగటం.
ఇటువంటి చర్యలవల్ల,సరియైన ఫలితాలు రాకపోగా,రెమేడీలు పనిచెయ్యని స్థితి కూడా కల్పించబడుతుంది.ఇలాంటి ధోరణులు అడిగేవారిలో కనిపించినప్పుడు వారి పూర్వపాపకర్మ బలంగా ఉన్నదని,అటువంటి వారికి జ్యోతిష్యం చెప్పడం వల్ల ఫలితం లేదనీ జ్యోతిష్కుడు గ్రహించాలి.ఇటువంటి సూచనలు తాంత్రిక జ్యోతిష్యమైన కేరళశాస్త్రంలో ఇవ్వబడ్డాయి. 

జ్యోతిష్యం అంతా గణితం అని కొందరు భ్రమలో ఉంటారు.అది నిజం కాదు.జ్యోతిష్యం అంటే ఉత్త గణితమే కాదు.దానిని మించి ఇంకా చాలా ఉంటుంది.జ్యోతిష్యంలో స్ఫురణశక్తి(Intution) అనేదానికి చాలా ముఖ్యమైన స్థానం ఉన్నది.ఈ స్ఫురణశక్తి అనేది ఉపాసనాబలం వల్లనే వస్తుంది.ప్రతి జ్యోతిష్యవిద్యార్ధికీ శాస్త్రవేత్తకూ మంత్రోపాసనా,నియమయుతమైన జీవితమూ తప్పనిసరిగా ఉండాలి.అప్పుడే అతనిలో స్ఫురణశక్తి మేలుకొంటుంది.

అంతేగాక జ్యోతిష్కునిలో ఇతరుల బాధలను చూచి స్పందించే గుణమూ ఉండాలి.డబ్బుకోసం అతను జ్యోతిష్యాన్ని చెప్పరాదు.డబ్బు తీసుకోవచ్చు కాని దురాశతో అదే ధ్యేయంగా మాత్రం జ్యోతిష్యవిద్యను దుర్వినియోగం చెయ్యకూడదు.అలా చేస్తే,కొన్నాళ్ళకు అతని విద్య మొత్తం మాయం అవుతుంది.అంతేగాక అతనిదగ్గర రెమేడీలు చెప్పించుకున్నవారి పాపఖర్మను అతను అనుభవించవలసి వస్తుంది.అందుకే జ్యోతిష్కులలో చాలామంది జీవితాలు చివరకు దుర్భరంగా ముగుస్తాయి.

ఏతావాతా నేను చెప్పేదేమంటే,జ్యోతిష్యం చెప్పేవారికీ,అడిగేవారికీ కూడా దాని సీరియస్ నెస్ అనేది అర్ధం కావడంలేదు.ఒకవ్యక్తి గతంలో అనేక పాపాలు చేసి ఉంటాడు.దాని ఫలితంగా ఇప్పుడు అనేక బాధలు పడుతూ ఉంటాడు.ఆ బాధలు ఆరోగ్యపరంగా ఉండవచ్చు, వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఉండవచ్చు,కుటుంబపరంగా ఉండవచ్చు, సంతానపరంగా ఉండవచ్చు. లేదా ఇంకా ఎన్నో రకాలుగా ఉండవచ్చు.అందరూ బాగున్నారు నేనెందుకు ఇలా ఉన్నాను?నా జీవితం ఒక్కటే ఎందుకు ఇలా ఉన్నది? అని అనుకోవచ్చు.

దానికి కారణం ఒక్కటే.గతంలో నీవు చేసిన పాపమే ఇప్పుడు నిన్ను వెంటాడుతున్నది.నిన్ను బాధ పెడుతున్నది.ఆ పాపం పోవాలంటే, జాతకానుసారంగా సరియైన రెమేడీలు చేసుకోవాలి.అవేమిటో తెలుసుకోవాలంటే,వినయపూర్వకంగా ఒక నిజమైన జ్యోతిష్కుని కలిసి సంప్రదించి ఆ విషయాలు చర్చించి తెలుసుకోవాలి.ఆ తరువాత ఆ రేమేడీలను శ్రద్ధగా ఆచరించాలి.అంతేకాదు ఇంతకుముందు నీవు చేసిన తప్పులను ఇప్పుడు చెయ్యకుండా ఉండాలి.అప్పుడే గతకర్మ తొలగుతుంది. ప్రస్తుతజీవితంలో కూడా ఆశించిన మార్పు కనబడుతుంది.

చాలామంది నన్ను రెమేడీలు అడుగుతూ ఉంటారు.అందరికీ నేను వాటిని చెప్పను.వారి జాతకాల్లో నిజాయితీ,మంచికర్మా కనిపిస్తేనే ఆ రేమెడీలను నేను సూచిస్తాను.కానీ అలా చెప్పించుకున్న వారిలో కూడా చాలామంది వాటిని చెయ్యలేక మధ్యలో వదిలివేయ్యడం నేను గమనించాను.వారి పూర్వకర్మ బలవత్తరంగా ఉన్నపుడు వారు రెమేడీలు చెయ్యలేరు.ఇది సత్యం.

కానీ అలాంటప్పుడే మనిషి ఇంకా పట్టుదలతో ప్రయత్నించాలి.కాని చాలామంది ఇక్కడే జారిపోతుంటారు.ఇంకొంతమంది,వారు అడిగిన రెమేడీలు చెప్పలేదని జ్యోతిష్కులను తిడుతూ ఉంటారు.అలా తిట్టడంవల్ల వారి పాపకర్మ ఇంకా పెరుగుతుందని వారు గ్రహించలేరు.నన్ను కూడా చాలామంది తిడుతూ మెయిల్స్ ఇస్తూ ఉంటారు.అలాంటివారిని చూచి నేను నవ్వుకొని ఊరుకుంటాను.

అలా ఉక్రోషంతో తిట్టడంవల్ల వారి కర్మబరువును వారు ఇంకా పెంచుకుంటున్నారు.వారి కర్మ తీరడానికి ఇంకా ఎన్నోఏళ్ళు పట్టవచ్చు. లేదా ఈజన్మలో అది తీరకపోవచ్చు.ముందు జన్మలో మాత్రమె వారు అనుకున్నవి జరిగే పరిస్తితులుంటాయి.కొంతమంది జాతకాలను బాగుచేయ్యలేం.అంతటి చెడుకర్మ వారికుంటుంది.అదంతా వారివారి జాతక చక్రాలలో ప్రతిఫలిస్తూనే ఉంటుంది.

కొందరు జ్యోతిష్కులు కూడా ఈ శాస్త్రాన్ని సరదాగా తీసుకుంటూ ఉంటారు.ఇది పూర్తిగా తప్పు భావన.జ్యోతిష్య శాస్త్రం ఒక అక్కల్ట్ విద్య.అంటే ఒక మార్మికమైన శాస్త్రం.ఇది దైవికమైన శక్తులతో ఆట.దీనిని సరదాగా తీసుకున్నవారికి మాడు పగలడం ఖాయం.ఈ విషయం వెంటనే తెలియకపోయినా కొన్నేళ్ళతర్వాత అయినా తెలుస్తుంది.దీనిని సరదాగా ఆషామాషీగా తీసుకుని ఎవరికీ బడితే వారికి ఎక్కడబడితే అక్కడ సమయం సందర్భం లేకుండా రెమేడీలు చెప్పడం జాతక విశ్లేషణలు చెయ్యడం చేసినవారు ఎంత ఘోరంగా వారి జీవితాలలో దెబ్బలు తిన్నారో నేను స్వయంగా చూచాను.

ఇంకొంతమంది పురోహితులూ జ్యోతిష్కులూ మహా దురహంకారులుగా ఉంటారు.ఇలాంటివారిని నేను చాలామందిని చూచాను.'మేము ప్రతిరోజూ సహస్ర గాయత్రి చేస్తాం.గొప్ప ఉపాసనాపరులం.ఫలానా మంత్రాన్ని ఇప్పటికి అక్షరలక్షలు జపం చేశాం.మేమేది చెబితే అదే జరగటం ఖాయం' అన్న దురహంకారంతో ఉన్నవారిని నేను చూచాను.

ఇలాంటివారిని చూస్తే నాకు జాలి కలుగుతుంది.సహస్రగాయత్రి కాదు రోజుకు లక్షగాయత్రి చేసినా ఏమీ ఉపయోగం ఉండదు.దానిని చేసేవిధంగా చెయ్యాలి.అంతేగాని చెయ్యకూడని విధంగా చేస్తే ఎన్ని లక్షలు కోట్లు జపం చేసినా అంతా వృధా అవుతుంది.ఈ సత్యం చాలామందికి తెలియదు.రాయి యుగాల తరబడి గంగానదిలో పడి ఉంటుంది కాని ఒక్క నీటిబొట్టును కూడా అది లోపలికి పీల్చుకోలేదు.వీరంతా ఆ రాళ్ళ వంటివారు.

జ్యోతిష్యాన్ని చెప్పేవారూ చెప్పించుకునే వారూ కూడా విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి.సరదాగా అడగడం,ఆషామాషీగా తీసుకోవడం, కాలక్షేపానికి ఈ విద్యను చర్చించడం వాడటం పనికిరాదు.ఇది కర్మతో చెలగాటం అన్న విషయాన్ని ఉభయులూ గుర్తిస్తే చాలా మంచిది.