“What is the use of human life if one is not enlightened while still living?" - Self Quote

13, ఏప్రిల్ 2014, ఆదివారం

మేషమాసం -(April-May) 2014-ఫలితములు

సూర్యుని మేష సంక్రమణం(+పౌర్ణమి ముగింపు) ఏప్రిల్ 15 వ తేదీన మధ్యాహ్నం 1.14 నిముషాలకు హైదరాబాద్ లో జరుగుతుంది.దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

లగ్నాధిపతి చంద్రుడు చతుర్దంలో రాహుగ్రస్తుడవడం వల్ల ప్రజాభిమానం కోల్పోతామేమో అని అనేకమంది గుండెల్లో గుర్రాలు పరిగెత్తుతాయి.అది నిజంగా జరుగుతుంది కూడా.

దానికి తగినట్లే ప్రజాభిప్రాయం చాలా స్పష్టంగా మారిపోతుంది.ప్రజలు అభివృద్ధికే ఓటు వేస్తారు.ఆశపోతు నాయకుల మాయమాటలు నమ్మరు.

సంపూర్ణ చంద్రగ్రహణం మన దేశంలో కనిపించదు గనుక దాని ప్రభావం ఉండదు అని అనుకున్నా కూడా,సూర్యచంద్రులు కేతురాహువుల నోట చిక్కడం వల్ల అదికూడా చతుర్ధ దశమ స్థానాలలో జరగడం వల్ల తప్పకుండా విపరీత పరిణామాలు ఉంటాయి.

ఆ పరిణామాలు ప్రజాజీవితంలోనూ అధికారపరంగానూ ఉంటాయి.కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి.ప్రజలకు మంచిచేసి,అభివృద్ధి చేసేవారినే ప్రజలు ఎన్నుకుంటారు.ప్రజాజీవితంలో అనేక మార్పులు అతివేగంగా చోటుచేసుకుంటాయి.ఊహించని అనేక పరిణామాలు వేగంగా జరిగిపోతాయి.

ఇప్పటికే అధికారంలో ఉండి,అది పోతున్నదే అని బాధపడేవారు కుట్రలు కుతంత్రాలు మొదలుపెడతారు.విధ్వంసాలకు రహస్య వ్యూహరచన చేస్తారు. కాని అవి పెద్దగా ఫలించవు.ఇప్పటికే జరిగిన నష్టాన్ని గ్రహించిన ప్రజల ముందు ఈ కుట్రలు ఏమీ పనిచెయ్యవు.

పార్టీలు ఒకదాని మీద ఒకటి బాగా దుష్ప్రచారం సాగిస్తాయి.దుమ్మెత్తి పోసుకుంటాయి.పరుష పదజాలం వాడబడుతుంది.ప్రజాభిప్రాయం ఆటుపోట్లకు గురౌతుంది.కుహనా మేధావులు కులాన్నీ మతాన్నీ రెచ్చగొట్టే ప్రయత్నాలు గావిస్తారు.

పత్రికలూ మీడియా ఈ రెండూ కూడా ఎన్నికలలో ప్రజాభిప్రాయాన్ని కలిగించడంలోనూ ఉన్న విషయాన్ని ఉన్నట్లు ప్రజలకు వెల్లడించడంలోనూ చాలా చురుకైన పాత్రను పోషిస్తాయి.కొన్ని పత్రికలు నిజాలను దాచిపెట్టి విషప్రచారం కూడా సాగిస్తాయి.

సామాన్యంగా గ్రహణ ఫలితాలు మూడు నెలలలోపు వరకూ ఉంటూనే ఉంటాయి.కనుక నేటినుంచి మూడునెలల లోపు కొందరు ప్రముఖ రాజకీయ వృద్ధనేతల,మరియు ప్రముఖుల మరణం సంభవిస్తుంది.అది ఇంకా త్వరగా కూడా జరగవచ్చు.

మరోపక్క,కల్తీ కుంభకోణాలు కొన్ని బయటపడతాయి.రవాణా రంగంలో ప్రమాదాలు మళ్ళీ జరుగుతాయి.కొన్ని ఉగ్రవాదదాడులూ జరుగుతాయి. ఆడపిల్లల మీద దుశ్చర్యలు జరుగుతూనే ఉంటాయి.

ప్రజాజీవితం లోనూ,అధికార రంగంలోనూ రాబోతున్న పెనుమార్పులను ఈ సూర్య సంక్రమణం+పౌర్ణమి స్పష్టంగా చూపిస్తున్నది.