“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

13, జనవరి 2014, సోమవారం

వివేకానందుడు ఏమి చెప్పాడో మాకు తెలియదు.కాని ఆచరిస్తాం!!!

వివేకానందస్వామి 150 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిన్న జరిగాయి. విద్యాలయాలలో,కార్యాలయాలలో,ప్రైవేట్ సంస్థలలో, మైదానాలలో, రోడ్లమీదా కూడా ఆయన ఫోటోలు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చారు.కనీసం ఆయన్ను ఈ రకంగా అయినా తలచుకున్నారు.సంతోషం.

కానీ,ఈ ఉపస్యాసకులు వివేకానంద స్వామి చెప్పినవి చదివారా?ఆయన ఏం చెప్పినారో అసలు వీరికి సరియైన అవగాహన ఉన్నదా?దానిని అర్ధం చేసుకొని ఆచరించే చిత్తశుద్ధి వీరిలో ఉన్నదా?

సమాధానం నిరాశాజనకంగానే వస్తున్నది.

నిన్న వివేకానందుని గురించి చెప్పిన ప్రతి వక్తా,తమతమ అజెండాలను ఆయన పేరుతో చెప్పబోయారు.కానీ వివేకానందుని ఆత్మను ఆవిష్కరించే పనిని వారెవ్వరూ చెయ్యలేదు.బహుశా అది వారి చూపులకు కూడా అందనంత ఎత్తులో ఉండటమే దాని కారణం అవచ్చు.

"వివేకానందుడు ఏ ఒక్క మతానికో చెందిన వ్యక్తి కాదు"-అంటూ ఒకానొక మతమంటే మహాపిచ్చి ఉన్న ఒక పెద్దమనిషి వాక్రుచ్చారు.నిజమే.డబ్బుకోసం మతం మారిన ఆయనకు అంతకంటే అర్ధం కాకపోవడం వింతకాదు. వివేకానందుడు విశ్వజనీనమైన భావములు కలిగిన మహర్షి అన్నది నిజమే. ఆ భావములు ఆయన గురువైన రామకృష్ణుని నుంచి ఆయన అందుకున్నాడన్నది ఈయనకు తెలుసో తెలియదో?ఆ భావములు ఏమిటో నిజంగా తెలిస్తే ఈయన డబ్బుకోసం మతం మార్చుకొని ఉండేవాడే కాదు. ఈయన ఇంట్లోనూ ఆఫీస్ లోనూ విదేశీమతాల ఫోటోలూ బొమ్మలూ సూక్తులూ దర్శనమిస్తాయి.ఇలాంటి వారు వివేకానందుని గురించి చెప్పడం ఈ దేశపు ఖర్మ గాకపోతే ఇంకేమిటి?

'యువత వివేకానందుని స్ఫూర్తిగా తీసుకోవాలి'-అని చాలామంది నడివయస్సు వాళ్ళూ వృద్ధులూ నిన్న వేదికల మీదనుంచి మైకుల్లో ఘోషించారు.వీరంతా నిన్నా మొన్నటి వరకూ యువకులేగా? మరి మీరు యౌవ్వనంలో ఉన్నప్పుడు వివేకానందుని ఆదర్శంగా మీరెందుకు తీసుకోలేదు?అలా తీసుకొని ఉంటే మీ జీవితాలు ఈరోజున ఇలా నైతికంగా కుళ్ళిపోయిన స్థితిలో ఉండేవా?మీరు ఆచరించని వాటిని యువతకు ఉద్బోదించే నైతికత మీకెక్కడిది?ఈ మాటలను యువత అడగలేక పోవచ్చు.కాని వారి మనస్సులలో మెదిలే ప్రశ్న మాత్రం ఇదే.

'నీతులు ఎదుటివాడికోసమే ఉన్నాయి.నాకోసం కాదు' అని ప్రతివాడూ అనుకోబట్టే ఈ దేశం ఇలా తయారైంది.అందులోనూ పాపం పిచ్చి యువత.వాళ్ళు దద్దమ్మలని వీళ్ళు అనుకుంటున్నారు.అసలు యువతను చెడగొడుతున్నదీ చెడగోట్టినదీ పెద్దలే.మళ్ళీ వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చేదీ వీరే.భలే వింత.

ఇళ్లలో తమ సంతానానికి అడ్డమైన అలవాట్లూ నేర్పుతున్నదీ,సరియైన నైతిక విలువలు వారికి నేర్పకుండా చెడగొడుతున్నదీ ఎవరు?అడ్డమైన సినిమాలు తీసి వాటిద్వారా భయంకరమైన విషాన్ని నేటి యువతకు ఎక్కిస్తున్నది ఈ పెద్దలు కారా? పాశ్చాత్య వ్యామోహాలను ఇంటిలో పెంచి పోషిస్తూ ఇంకోపక్క యువత పాడై పోతున్నది అంటూ మొత్తుకుంటున్నదీ వీరే.మనం ఏ విత్తనం వేస్తె అదే మొక్క వస్తుంది.కారకులం మనమేగా?

'వివేకానందుడు మతవాది కాదు.ఆయనొక గొప్ప సంఘ సంస్కర్త'-అంటూ ఇంకొక కుళ్ళిపోయిన కుహనా నాయకుడు వాక్రుచ్చాడు.అసలు మతాన్ని గురించి వివేకానందుడు ఏమి చెప్పాడో ఈయనకు తెలుసా?నిజమైన మతం అంటే ఏమిటో ఒక్క పిసరంత అవగాహన ఉన్నా ఈ వ్యక్తి ఇలా మాట్లాడేవాడే కాదు.అత్యున్నతమైన ఆదర్శముల సమాహారమే అసలైన మతం అని ఈ అక్కుపక్షికి తెలియదు.కానీ వేదికలెక్కి వివేకానందుని గురించి మాట్లాడే ధైర్యం చేస్తాడు.సంఘ సంస్కరణకు మతం ఎలా అడ్డంకి అవుతుంది?అసలైన సంస్కరణలన్నీ నిజమైన మతవాదుల నుంచే వచ్చాయన్న సంగతి ఈయనకు తెలియదు మరి.

అవినీతితో కుళ్ళిపోయిన రాజకీయ నాయకులు వివేకానందుని గురించి మాట్లాడటమూ దానిని మనం వినవలసి రావడమూ ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యాలలో ఒకటి.

నిత్యజీవితంలో విలువలను ఏ మాత్రమూ పాటించని పెద్దలు,యువతను ఉద్బోధిస్తూ వివేకానందుని సూక్తులను(అవి కూడా వారికి నచ్చిన కొన్ని సూక్తులను మాత్రమే) వేదికలనుంచి వక్కాణించడం ఇంకొక వింత.

మతద్వేషమూ కులద్వేషమూ బాగా నిండిన మరికొందరు ఈ రెండూ మచ్చుకైనా లేని వివేకానందుని గురించి ఉపన్యాసాలివ్వడం మూడో వింత.

అందరూ కలసి--'తామున్నది చెప్పడానికి మాత్రమే,ఎదుటి వాడున్నది వినడానికి మాత్రమే.ఆచరణ మాత్రం వారికీ మాకూ ఆ మాటకొస్తే ఎవ్వరికీ అవసరం లేదు'- అనుకోవడం నాలుగో వింత.

చివరగా--ఏదో మొక్కుబడిగా వివేకానందునికి ఒక పూలమాల వేసేసి,ఆయన గురించి తెలిసీ తెలియని వాగుడు వాగేసి,మళ్ళీ ఏడాది వరకూ ఆయన్ను మర్చిపోవడం అతిపెద్ద వింత.

వివేకానందుని గురించి వేదికల మీద మహోపన్యాసాలు ఇచ్చే ఒకాయన నాకు తెలుసు.ఒకసారి ఆయన్ని ఇలా అడిగాను.

'మీరు చాలా చోట్ల వివేకానందుని గురించి ఉపన్యాసాలు ఇస్తారు కదా?ఆయన పుస్తకాలు మీరు ఏమేమి చదివారో కొంచం చెప్తారా?'

ఆయన నాకు అబద్దం చెప్పడని నా విశ్వాసం.ఎందుకంటే ఫలానా పుస్తకాన్ని చదివాను అని ఆయన చెబితే అందులో ఏముందో చెప్పమని నేను అడుగుతాననీ చర్చ మొదలుపెడతాననీ ఆయనకు తెలుసు.

ఆయనిలా అన్నాడు.

'నిజం చెప్పొద్దూ?నేను పెద్దగా వివేకానందుని పుస్తకాలు చదవలేదు.మా అబ్బాయికి పురమాయిస్తాను.వాడు నెట్ లోనుంచి స్వామి కొటేషన్స్ కొన్ని తీసి ప్రింట్ చేసి ఇస్తాడు.వాటిని ఎదురుగా పెట్టుకుని,ఇక నాకు తెలిసిన విషయాలన్నీ వాటికి అల్లి ఉపన్యాసం చెబుతాను.మనం ఏమి చెప్పామన్నది ముఖ్యం కాదు.వినేవారికి వినసొంపుగా ఉండటం ముఖ్యం.పిచ్చిజనం కాసేపు విని చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్ళిపోతారు.నిజం చెప్పాలంటే వివేకానందుడు ఏమి చెప్పాడో వారికీ అవసరం లేదు.నాకూ అవసరం లేదు.ఏదో చెయ్యాలి గాబట్టి చేస్తున్నాం.అంతే' అంటూ నిజాన్ని ఒప్పుకున్నాడు.

కనీసం నిజాన్ని ఒప్పుకున్నందుకు అతన్ని అభినందించాను.అతనితో ఇలా చెప్పాను.

'నీవు చేస్తున్న పనినే వివేకానందుడు చిన్నప్పటినుంచీ వ్యతిరేకించాడు.మీరు ఆయన భావాలకు పూర్తిగా వ్యతిరేకదిశలో పోతున్నారు.ఆయన మీద ఉపన్యాసం చెప్పే అర్హత మీకున్నదని మీరు నిజంగా నమ్ముతున్నారా?'

జవాబు లేదు.

'మొదట వివేకానందుని బాగా చదవండి.ఏవో నాలుగు కొటేషన్స్ బట్టీపట్టి ఉపన్యాసాలివ్వడం కాదు.తన గురుదేవుల లాగానే వివేకానందుడు కూడా ఒక జ్ఞానసముద్రం.ఆయన్ను ముందుగా చక్కగా అర్ధం చేసుకోండి.ఆ తర్వాత ఆ భావాలను జీవితంలో ఆచరించే ప్రయత్నం చెయ్యండి.అలా చెయ్యకుండా ఉత్త మాటలు చెబుతూ ఉంటే ఆయన ఒద్దని చెప్పిన పనినే మీరు చేస్తున్నట్లు లెక్క.ఆయనేం చెప్పాడో మీకే పూర్తిగా తెలీదు.ఇంక మీరు ఇతరులకు ఏమి బోధించగలరు?ఆయన బోధలలో మీకు నచ్చిన ఒకటోరెండో సూక్తులు తీసుకుని ఉపన్యాసం చెబితే ఉపయోగం లేదు.ముందుగా ఆయనను సమగ్రంగా అర్ధం చేసుకోండి.'

'అసలు ఆయన ఏం చెప్పాడో మనకెందుకు?ఎంతో మంది ఎన్నో చెబుతారు. అన్నీ మనం ఆచరిస్తూ కూచోవాలా?ఆ అవసరం ఏముంది? అంటారా?ఉన్నది అని నేనంటాను.ఎందుకంటే,ప్రతివారూ చెప్పినవి మనం వినవలసిన పని లేదు.కాని ఉత్తములైనవారు చెప్పినవి వినాలి.ప్రపంచంలో ఎక్కడ మంచి ఉన్నా స్వీకరించమని వేదం చెప్పింది.మన మధ్యనే పుట్టిన ఒక మహాప్రవక్తను మనం విస్మరిస్తే ఎలా?మనం వేదాన్ని అనుసరిస్తున్నట్లా?లేనట్లా? అందరూ అనుకుంటున్నట్లు వివేకానందుడు మనలాంటి మామూలు మానవుడు కాదు.ఆయన ఒక పరిపూర్ణ ప్రవక్త.ఒక దివ్యాత్ముడు.ఈ నాడు మీరు పూజిస్తున్న ప్రవక్తలు అందరికంటే ఆయన ఉత్తముడు.పరిపూర్ణుడు.'

'ప్రస్తుత మన దేశపరిస్థితికీ,సమాజపరిస్తితికీ,మానవుల వ్యక్తిగత జీవితాలలోని సమస్యలకీ ఆయన అసలైన,సత్యములైన, పరిష్కారాలను సూచించాడు.కాని వాటిని ఆచరించాలంటే మన జీవితాలలో వ్యక్తిగత త్యాగం అవసరం.దానికి ఎవరూ సిద్ధంగా లేరు.కనుక మీలాంటివారు ఆయన్ను అనుసరించలేరు.కానీ ప్రయత్నం చేయ్యాలి.అంతకంటే మీక్కూడా వేరు మార్గం లేదు.అలా ప్రయత్నం చెయ్యకపోతే మీ జీవితాలు ఇంకాఇంకా దిగజారి చివరికి మీరు ఘోరమైన నిరాశలోనూ నిస్పృహలోనూ,నైతిక దిగజారుడులోనూ కూరుకోక తప్పదు.' అని ఆయనకు చెప్పాను.

చాలామందికి నా మాటలు నచ్చవు.ఆయనకు కూడా నా మాటలు నచ్చినట్లు అనిపించలేదు.

అర్ధం చేసుకోకుండా ఆచరించకుండా వివేకానందునికి మొక్కుబడి ఉత్సవాలు చేస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది.మనం దయ్యాలుగా ఉండటమో దేవతలుగా మారడమో మన చేతులలోనే ఉన్నది.ఉత్త ఉపన్యాసాలు చెబుతూ కూచుంటే మనం దయ్యాలుగా మిగిలిపోతాం.ఆచరిస్తే దేవతలం అవ్వగలం.చాయిస్ ఎప్పుడూ మనదే.

అవకాశం ఎదురుగా ఉన్నప్పుడు కూడా ఉపయోగించుకోని వారిని ఎవరు మాత్రం ఉద్దరించగలరు?