“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

7, జనవరి 2014, మంగళవారం

జిల్లెళ్ళమూడి అమ్మగారి మంత్రమూ,ప్రయోగ విధానమూ???

ప్రతి ఏడాదీ విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ కు వెళ్లడం అలవాటు గనుక ఈసారీ వెళ్ళివచ్చాను.నా దగ్గర ఉన్న మంచి పుస్తకాలను ఎవరో ఒకరు పట్టుకు పోతుంటారు.ఇక అవి తిరిగి రావు.అందుకని మళ్ళీ మళ్ళీ వాటినే కొంటూ ఉంటాను.ఇలా ప్రతి ఏడాదీ జరుగుతూ ఉంటుంది.

ఈసారి నాతోపాటు మదన్,ఉమామహేశ్వర్ ఉన్నారు.అక్కడకు వెళ్ళాక శ్రీకాంత్ కలిశారు.మాట్లాడుకుంటూ అన్ని స్టాల్సూ బయటనుండి చూస్తూ ఉండగా ఒక స్టాల్లో జిల్లెళ్ళమూడి అమ్మగారి పుస్తకాలు కనిపించాయి.జిల్లెళ్ళమూడి వారే ఆ స్టాల్లో ఒక భాగంలో వారి పుస్తకాలు ఉంచారు.వాటిలో పాత పుస్తకాలు కొన్ని మంచివి ఉన్నాయి.అవి తీసుకుని,నా వెంట వచ్చిన వారిచేత కూడా కొన్ని పుస్తకాలు మంచివి కొనిపించి బయటకు వచ్చాను.

బిల్ వేయిస్తుంటే అక్కడ ఉన్న సేల్స్ అబ్బాయి ఒక పుస్తకం ఇస్తూ 'సార్.ఇది ఫ్రీగా ఇస్తున్నాను.తీసుకోండి.' అన్నాడు.

దానిపేరు ఏమిటా అని చూచాను.'జిల్లెళ్ళమూడి అమ్మగారి మూలమంత్రమూ ప్రయోగ విధానమూ' అంటూ విచిత్రంగా కనిపించింది.ఇదేం ఖర్మరా బాబూ చివరికి ఈమెను కూడా ఒక సాంప్రదాయ దేవతను చేసి కూచోపెట్టారా ఈ అజ్ఞానులు?అనుకుంటూ యధాలాపంగా ఆ పుస్తకాన్ని పైపైన తిరగేశాను.విషయం అర్ధమైంది.

'ఈ పుస్తకాన్ని ఎందుకు ఇస్తున్నావు బాబూ' అంటూ అతన్ని అడిగాను.

'ప్రచారం కోసం సార్.ఇది చదివితే అమ్మగారి తత్త్వం మీకు అర్ధమౌతుంది' అన్నాడు అతను.

నవ్వొచ్చింది.

'బాబూ నీవీ పుస్తకం చదివావా?' అడిగాను.

అతనేమీ మాట్లాడలేదు.

'చూడు నాయనా.ఈ పుస్తకం చదివిన కొత్తవాళ్ళకి అమ్మగారి తత్త్వం అర్ధం కాకపోగా,పూర్తిగా తప్పు మెసేజి వాళ్ళ తలలోకి చేరిపోతుంది.దయచేసి ఈ పుస్తకాలు ఎవరికీ ఇవ్వకు.' అన్నాను.

అతను అర్ధం కానట్లు చూచాడు.

'ఈ పుస్తకం వ్రాసిన రచయితకు అమ్మతత్త్వం ఈషణ్మాత్రం కూడా అర్ధం కాలేదు.' అంటూ ఒక పేజి తీసి చూపించాను.

అందులో - వశీకరణం కోసం అమ్మమంత్రాన్ని ప్రయోగించే విధానం,అని వ్రాయబడి దానికోసం ఎలా హోమం చెయ్యాలి?ఏఏ సమిధలతో హోమం చెయ్యాలి అన్న వివరణ ఇవ్వబడి ఉన్నది.అలాగే ఇంకా ఇతరపనులు కావడం కోసం అమ్మ మంత్రాన్ని ఎలా హోమం చెయ్యాలో చెప్పబడి ఉన్నది.ఇంతా చేస్తే అమ్మ మహామంత్రంగా - "జయహోమాతా శ్రీఅనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి" అని జిల్లెల్లమూడిలో అఖండంగా వినిపించే నామం ఇవ్వబడింది.

నాకు ఒకేసారి నవ్వూ కోపమూ కలగలసి వచ్చాయి.

'అమ్మను చివరికి ఒక క్షుద్రదేవతను చేసి కూచోపెట్టారు ఈ ఘనులు? ఇదా వీళ్ళు అమ్మను అర్ధం చేసుకున్నది? అసలు అమ్మ ఏం చెప్పింది?

"తిధులు విధుల్ని మార్చలేవు" అంటూ విధి బలీయతను నొక్కి చెప్పింది అమ్మ.

"అన్నం పరబ్రహ్మ స్వరూపం" అనిన శాస్త్రిగారితో - "మరి అశుద్ధమో?" అని ఎదురు ప్రశ్నించి ఆలోచనను రగిలించింది అమ్మ.

"నవగ్రహాలు ఎక్కడున్నాయి నాన్నా ఉన్నవి రెండేగ్రహాలు-రాగమూ ద్వేషమూ"- అంటూ మనిషిని నడిపిస్తున్న అసలైన గ్రహాల గుట్టు విప్పింది అమ్మ.

"దేవుళ్ళాడినా దొరకని వాడే దేవుడు" అంటూ దైవానికి నిర్వచనం ఇచ్చింది అమ్మ.

"మహత్తత్వానికి మహిమలెందుకు నాన్నా?"అంటూ ప్రత్యేకంగా మహిమలెందుకు?కళ్ళుతెరిచి నీచుట్టూ ఉన్న నిత్యమహిమను చూడరా అని ఉద్బోధించింది అమ్మ.

"సుఖాన్ని దేవుడిస్తుంటే మరి కష్టం ఎవరిచ్చారూ?" అని అద్భుతమైన వేదాంతాన్ని సులభమైన మాటలో చెప్పింది అమ్మ.

"దైవాన్ని చేరడానికి అన్ని దారులూ మంచివే నాన్నా.నీ దారి నీకు మంచిది" అంటూ తన దారిని తాను వెదకాలి అని చెప్పింది అమ్మ.

"భక్తితో చేస్తే పాకీదొడ్దిలో అయితే మాత్రం ఏం?" అంటూ టాయిలెట్లో ఉన్నపుడు కూడా సాధన ఎలా చెయ్యవచ్చో చెప్పింది అమ్మ.

"సంకల్పమే సంసారం" అంటూ సంసారాన్ని జయించే మార్గాన్ని ఉపదేశించింది అమ్మ.

"తెలియలేదమ్మా" అని ఒకరంటే " తెలియలేదని తెలుసుకున్నావుగా" అని సూక్ష్మంగా చెప్పింది అమ్మ.

"సృష్టికి ఆది లేదు" అంటూ అతీతమైన సత్యాన్ని సులభంగా చెప్పింది అమ్మ.

"జగత్తు ఎప్పుడూ ఉంటుంది.వచ్చేవాడు వస్తూ ఉంటాడు.పోయేవాడు పోతూ ఉంటాడు" అని జీవితపు అనిత్యత్వాన్నీ సృష్టి యొక్క నిత్యత్వాన్నీ విశదీకరించింది అమ్మ.

"చేతలు చేతుల్లో లేవు" అంటూ మానవుడి అహాన్ని సున్నితంగా ఖండించింది అమ్మ.

"ప్రేరణే దైవం" అని దైవం యొక్క నిజతత్వాన్ని కళ్ళెదుట నిలిపింది అమ్మ.

"బ్రాహ్మణుడు తప్ప ఇది చెయ్యరాదనే వాడు బ్రాహ్మణుడు కాడు" అంటూ నిజమైన బ్రాహ్మణత్వం ఏమిటో చెప్పింది అమ్మ.

"నా దృష్టిలో జడమే లేదు.అంతా చైతన్యమే" అంటూ మహోన్నత ఉపనిషత్ జ్ఞానాన్ని మామూలు మాటల్లో చెప్పింది అమ్మ.

"అమ్మా.నా తప్పు క్షమించు" అని అడిగిన ఒకనితో " నేను తప్పని అనుకుంటే కదా నాన్నా క్షమించడం" అంటూ నిజమైన మాతృత్వానికి నిర్వచనం అయి భాసించింది  అమ్మ.

"పొడుగూ పొట్టియే గాని మంచి చెడ్డలనేవి ఎక్కడున్నాయి నాన్నా?"అన్న అద్భుతమైన మాటలో మానవుల లోగుట్టును బహిర్గతం చేసింది అమ్మ.

"అదేంటమ్మా? నీ దిండు మీద పిల్లి పడుకుంది?" అని అడిగిన ఒకనితో " ఏం? అదేమన్నా మనకంటే తక్కువదా?" అంటూ అన్ని జీవులలోనూ ఉన్న దివ్యత్వాన్ని సూచించింది అమ్మ.

"నీ పధ్ధతి ఏమిటమ్మా?"అని ఒకరు అడిగితే "ఏ పద్ధతీ లేకపోవడమే నా పధ్ధతి" అంటూ త్రిగుణాతీత స్థితిని మార్మికంగా చెప్పింది అమ్మ.

"రాగద్వేషాలు రహితమైనదే అనసూయ" అని అమ్మ అన్నది.వీరేమో ఆ అనసూయానామంతో హోమం చేసి వశీకరణం ఎలా చెయ్యాలో నేర్పించే పుస్తకాలు వ్రాస్తున్నారు.మానవుల అజ్ఞానానికి అంతులేదనే నా నమ్మకం రోజురోజుకీ బలపడుతున్నది.దానికి బలమైన రుజువులు కూడా నాకు ప్రతిరోజూ కనిపిస్తున్నాయి.

"ప్రపంచంలోని అత్యున్నతమైన ఫిలాసఫీని తేలిక మాటల్లో చెప్పటమే కాక,నిత్యజీవితంలో ఆచరించి చూపించింది అమ్మ.అలాంటి అమ్మతత్త్వం వ్రాస్తున్నామంటూ చివరికి ఒక క్షుద్రదేవతా పూజావిధానం వంటి పుస్తకం వ్రాస్తారా?ఎంత ఘోరం?" అంటూ ప్రశ్నించాను.

పాపం ఆ అబ్బాయి ఏమీ మాట్లాడలేదు.అతనికి ఈ విషయాలలో ఏమీ అవగాహన లేనట్టు కనిపించింది.కిమ్మనకుండా ఆ పుస్తకాలు తీసి లోపల దాచి పెట్టుకున్నాడు.ఊరకే సేల్స్ కోసం అతన్ని అక్కడ ఉంచినట్లు అనిపించింది.సరేపాపం అతనితో ఎందుకులే వాదన అనుకుంటూ అతను ఫ్రీగా నాకిచ్చిన పుస్తకాన్ని కూడా తిరిగి అతనికే ఇచ్చేశాను.

ఇదంతా చూస్తూ శ్రీకాంత్ నవ్వుతున్నాడు.అక్కణ్ణించి ఇవతలకి వచ్చేసి మాటల్లో పడ్డాం.

"అమ్మతత్వాన్ని చివరికి ఇలా భ్రష్టు పట్టిస్తున్నారు చూడండి.అన్నేళ్ళపాటు అమ్మదగ్గర ఉన్న ఎవరికీ అమ్మతత్త్వం అర్ధంకాలేదు.ఇక వారి శిష్య పరమాణువులకు ఎలా అర్ధం అవుతుందని మనం భావించగలం?ఎంత విచిత్రం?బహుశా వీళ్లెవరూ అమ్మస్థాయిని అందుకోలేక పోయారనుకుంటా. లేకుంటే వాళ్ళ అజెండాలు వాళ్ళకుండి ఉంటాయి. ఎందుకంటే అమ్మ చెప్పినది the greatest and highest religion in very simple terms.మహత్యాలూ మహిమలూ దెయ్యాలూ భూతాలూ హోమాలూ మంత్రాలూ ప్రేతలోకవిశేషాలూ వాటిసాయంతో పనులు సాధించడాలూ ఇలాంటి తక్కువస్థాయిలో ఉన్నవారికి మహోన్నతమైన అమ్మతత్త్వం ఎలా అర్ధమౌతుంది?

అమ్మతత్త్వం అతిసరళం అతిసహజం అతిసులభం.అందుకే అది అర్ధం కావడం కూడా అతికష్టం.ఇక ఆచరణలోకి రావడం అత్యంతకష్టం.అమ్మ చెప్పిన ఒక్క చిన్నమాటను జీవితంలో ఆచరించడం చాలాచాలా కష్టం.దానికంటే ఇలాంటి పనికిమాలిన అర్ధరాత్రిహోమాలు ఒక వెయ్యి చెయ్యడం తేలిక." అన్నాను.

అవునంటూ శ్రీకాంత్ తలాడించాడు.

"ఒక జీసెస్ క్రీస్ట్ విదేశాలలో పుడితే ఆయన్ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి ఒక అద్భుతమైన వ్యవస్థగా రూపుదిద్దించారు పాశ్చాత్యులు.వాళ్ళ organizing ability అలాఉన్నది.మరి ఆయనకంటే ఎంతో ఉన్నతమైన తత్వాన్ని చెప్పిన అమ్మ మనమధ్యన పుడితే ఆమెను గుంటూరుజిల్లాకు పరిమితంచేసి కూచోపెట్టారు ఈ నియోగిబ్రాహ్మణులు.ఇంకా చెప్పాలంటే ఆమెను వారి వంటింటి పూజగూడుకు పరిమితమైన కోరికలు తీర్చే ఒక దేవతగా మార్చివేశారు.ఈపుస్తకం ద్వారా ఆమెను ఇంకా దిగజార్చి ఒక క్షుద్రదేవతను చేసి కూచోపెట్టారు.అదే పాశ్చాత్యులకూ తెలుగుబ్రాహ్మలకూ ఉన్న తేడా.పైగా ఇలాంటి పుస్తకాలొకటి?చాలా దారుణం.ఏం చేస్తాం?మన ఖర్మ?"అన్నాను.

ఆ పుస్తకం చూచి మా అందరికీ చాలా బాధ అనిపించింది.విషయం మీద సరియైన అవగాహన లేకుండా ఇలాంటి పుస్తకాలు ఎందుకు వ్రాస్తారో అర్ధం కాదు.

ఈరోజు చరణ్ కనిపిస్తే ఈ సంగతి అతనితో చెప్పాను.మొదట్లో అతను నవ్వేసినా కాసేపటికి అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

"అమ్మతత్త్వం వీళ్ళకు ఎలా అర్ధం అవుతుంది అన్నగారు?" ఎదురు ప్రశ్నించాడు.అమ్మను కళ్ళారా చూచి అమ్మ సమక్షంలో ఉన్న రోజులు అతనికి గుర్తొచ్చాయని నాకనిపించింది.అమ్మ ప్రేమను ప్రత్యక్షంగా చవిచూచిన రోజులు గుర్తొచ్చి అతని కళ్ళలో నీళ్ళు గిర్రున ఉబికి వచ్చాయి.

"ఇలాంటి వ్రాతలన్నీ అగ్నికి పట్టిన చెదలు" అంటూ అతికష్టంమీద ఒకేమాటను గద్గదస్వరంతో అన్నాడు.

ఇంకా ఇలా అన్నాడు."ఇలాంటి వారికి కావలసింది ఏమంత్రం చేస్తే ఏపని అవుతుంది?ఏహోమం చేస్తే ఏపని అవుతుంది?కష్టపడకుండా హోమాలు చేసి తేరగా ఎలా ఫలితాలు పొందాలి?ప్రేతలోకవిశేషాలూ పనికిమాలిన మహత్యాలూ. అంతవరకే అన్నగారు.వీళ్ళు ఇంతకంటే ఎదగలేరు.హైయ్యెస్ట్ ఫిలాసఫీని తెలుసుకుందాం.జీవితంలో అనుసరిద్దాం ఆచరిద్దాం అని వీరికి తోచదు.అమ్మ తత్వాన్ని ఇలాంటివారు ఏనాటికీ అర్ధం చేసుకోలేరు"

అమ్మ మాటలు ఆణిముత్యాలు.అవి వేదవాక్యాలు.అంతకంటే ఇంకా ఎక్కువ అనినా కూడా తప్పులేదు.అమ్మని ఎలా నిర్వచించగలం? ఆమె భావజాలం ఇదీ అంటూ ఎలా కుదించగలం?అమ్మ విశ్వజనీన.ఒక్కొక్కరికీ ఒక్కొక్క విధంగా సత్యాన్ని వివరించి చెప్పింది.ఎవరి స్థాయినిబట్టి వారికి అర్ధమయ్యేటట్లు అతిమామూలు మాటల్లో అత్యున్నతమైన మతాన్నీ సత్యాలనూ చెప్పింది.విచిత్రమేమంటే అమ్మతో ఏళ్లకెళ్ళు నివసించి కలిసిమెలసి ఉన్నవారు కూడా అమ్మను ఔపోసన పట్టలేకపోయారు.

"అమ్మను ఔపోసన పట్టలేకపోయారు అనడం తప్పేమో చరణ్.ఎందుకంటే అది అసాధ్యం.కనీసం అమ్మను సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయారు."అన్నాను.

"కాదన్నగారు.ఎదురుగా ఉన్న అమ్మను కనీసం సరిగ్గా చూడలేకపోయారు. సరిగ్గా 'చూడటమే' వారికి చేతకాలేదు.ఇక అర్ధమేమి చేసుకోగలరు?"అన్నాడు చరణ్.

ప్రపంచంలో అత్యున్నతమైనవి అన్నీ అతి సింపుల్ గానే ఉంటాయి. ఉదాహరణకి గాలీ నీరూ తీసుకుందాం.మనం వాటికి ఏ మాత్రం విలువనూ ఇవ్వం.కాని అవి లేకుంటే మన జీవితాలు లేవు.అయినా సరే వాటి ఉనికిని కూడా మనం గుర్తించం.ప్రపంచాన్ని నడిపే మూలశక్తులు అతి సరళంగా అతి సహజంగానే ఉంటాయి.వాటి ఉనికిని కూడా అవి చాటుకోవు.కాని మనకు అవి అవసరం లేదు.మనకు ఏవేవో కావాలి.మన చూపంతా ఎక్కడో చుక్కల్లో ఉంటుంది.అందుకే నిరంతరం మన చుట్టూ ఉండి మనల్ని రక్షిస్తున్న వాటిని మనం గుర్తించం.ఇది మానవ నైజం.

అమ్మలాంటి అవతారమూర్తులు మనమధ్యనే పుట్టి మనమధ్యనే తిరిగినా కూడా వారిని మనం గుర్తించం.అర్ధం చేసుకోలేం.అందుకోలేం.ఆచరించలేం. విచిత్రమేమంటే అమ్మతో అన్నేళ్ళు కలిసుండీ నేడు సమాజంలో ఘరానా గురువులుగా చెలామణీ అవుతున్న ఘనులుకూడా అమ్మను ఇసుమంత కూడా అర్ధం చేసుకోలేకపోయారు.బహుశా అర్ధం చేసుకుంటే వాళ్ళ వ్యవహారాలు సాగవు కదా? అదే వాళ్ళ భయం అయి ఉంటుంది.

సహజంగా ఉండమని అమ్మ చెప్పింది.మంత్రాలూ హోమాలూ మహిమలూ అంటూ అసహజమైన వాటిని నిరంతరమూ ఆశించే మనకు సహజత్వం ఎలా అర్ధమౌతుంది?

చిన్నపిల్లల్లా మారనిదే ఎంతటివారికైనా దైవానుభూతి కలగదని జీసస్ చెప్పాడు. ఆఫ్కోర్స్ అదీ మన గ్రంధాల కాపీవాక్యమే. సహజస్థితి అన్నా,త్రిగుణాతీత స్థితి అన్నా అదేగా.మరి మన కోరికలు ఆకాశంలో విహరిస్తూ ఉంటే చిన్నపిల్లల్లా ఎలా మారగలం?అమ్మలాంటి వారిని ఎలా అర్ధం చేసుకోగలం?

హే భగవాన్!!!ఇలాంటి గురువులనుంచీ వారి శిష్యులనుంచీ అసలైన హిందూమతాన్ని కాపాడటానికి నువ్వు ఇంకో వెయ్యిసార్లు కాదు లక్షసార్లు మా మధ్యకి రావాల్సి వస్తుందేమో?అప్పటికైనా మేము నిన్ను సరిగ్గా అర్ధం చేసుకుంటామా?

భగవంతుడు కరుణామయుడు కాకపోతే ఇలాంటి మొద్దుమనుషులకు సత్యాన్ని అర్ధమయ్యేలా చెయ్యాలని విసుగులేకుండా యుగయుగాలుగా ప్రయత్నిస్తూనే ఎలా ఉండగలడు?