Love the country you live in OR Live in the country you love

23, మార్చి 2012, శుక్రవారం

ఉగాది గ్రీటింగ్స్ చెప్పుకొటం మాత్రమె మనకు తెలుసు

ప్రతి పండుగా ఒక ఉత్తేజకరసంఘటన నుంచి పుడుతుంది. క్రమేణా అది నిర్జీవం అవుతుంది. మనమే దాన్ని అలా మారుస్తాం. చివరికి అది ప్రాణం లేని తంతుగా మిగిలిపోతుంది. ఎందుకంటే జీవం లేని జనం చేతిలో అది పడింది గనుక.

పండుగల లోని అంతరార్ధాలు మనకు అనవసరం. వాటిని తెలుసుకుంటే ఆచరించాల్సి రావచ్చు. కనుక అసలు ఆ కోణాన్ని తెలుసుకోకుండా ఉత్త గ్రీటింగ్స్ చెప్పుకోడం, మళ్ళీ మన కుళ్ళు బతుకులు మనం బతకడం చాలా సులభమైన పని. ఇదే మనకు తెలిసిన అసలైన విద్య.

ఈ దేశపౌరులంత వెన్నెముక లేని వెధవలు ఎక్కడా ఉండరు. అన్నిరంగాలలో దేశం సర్వదోపిడీకి గురవుతుంటే, కిమ్మనకుండా మౌనంగా అన్నీ భరించే సామాన్యుడికి అంత సహనం ఎలా వచ్చిందా అని ఆలోచిస్తే వెయ్యేళ్ళ ముస్లిం పాలనా, రెండు వందలేళ్ళ ఇంగ్లీష్ పాలనా కారణాలా అన్న సందేహం వస్తుంది. లేదంటే మొదటినుంచీ మన జాతిగుణమే ఇంతేమో. స్వార్ధమూ పిరికితనమూ చేతగానితనమూ కలగలిసిన జాతి మనదే అని అనిపిస్తుంది.

మన సంస్కృతీ మన సంప్రదాయమూ మన వేదాలూ మన చట్టుబండలూ అన్నీ జనమందరి గొప్పలు కావు, మన అందరి కష్ట ఫలితాలూ కావు. అవి కొందరు ప్రత్యెకవ్యక్తుల తపోఫలాలు మాత్రమె. ఏ కాలంలోనైనా వాటిని ఆచరించినవారు బహుకొద్దిమంది మాత్రమె. మిగతా వారందరూ వాటి చాటున దాక్కుని, అవి పాటించకుండా, వాటిని తమ స్వార్ధానికి కావలసినంతవరకూ వాడుకోవటం, దేశాన్ని చేతనైనంత దోచుకోవడం మాత్రమె చేస్తున్నారు. ఇది తరతరాలుగా నడుస్తున్న చరిత్ర.

కులాన్ని దాటి మనం ఆలోచించలెం. ప్రాంతాన్ని దాటి మనం చూడలేం. ఎవడు ఎంత తప్పు చేసినా, ఎంతగా దేశాన్ని సర్వనాశనం చేసినా వాడు మన కులంవాడైతే చాలు. వాడు చేసింది మంచే అని వాదిస్తాం. ఈ నీచమైన మనస్తత్వం పోనంతవరకూ ఎన్ని పండగలు జరుపుకున్నా మన దేశం బాగుపడదు గాక బాగుపడదు.

మన దేశానికి పట్టిన ఇంకొక ఖర్మ ఏమిటంటే, ఎన్నుకోడానికి సరైన నాయకులు మనకు లేరు. ఒకసారి ఒకాయనకి పట్టం కడతాం. కొన్నాళ్ళు ఆయనా, ఆయన అనుచరులా దోపిడీ సాగుతుంది. విసుగొచ్చి ఇంకోకాయనను గద్దేనేక్కిస్తాం. ఇక వీరి దోపిడీ మొదలు. ఏతావాతా, ప్రతిసారీ కొందరు వ్యక్తులు వాళ్ళ గ్రూపులు దేశాన్ని దోచుకుని బాగుపడటం మాత్రమె ఈదేశంలో తరతరాలుగా జరుగుతున్న కధ. మళ్ళీ నీతులు మాత్రం అందరూ చెబుతూ ఉంటారు. ఒకరినొకరు 'దొంగలు' అని తిట్టుకునే దొంగలమయం మన దేశం.

మనకు నీతి లేదు. కాని నీతికబుర్లు మాత్రం భలే చెబుతాం. రూలు మనం పాటించం. కాని ఎదుటివాడికి బాగా రూల్స్ చెబుతాం. ఎదుటివాన్ని చూచి ఏడవటం, దోపిడీ అవకాశం కోసం ఎదురు చూడటం, అవకాశం వస్తే నీతులూ రూల్సూ తుంగలో తొక్కి ఎగబడి దోచుకోవటం -- ఈ మూడే ఈ దేశంలో పౌరుడికైనా నాయకుడికైనా తెలిసిన అసలైన రూల్స్.

మన ఆధ్యాత్మికత ఒట్టి నేతిబీరకాయ. అది మాటలకే పరిమితం. మన జీవితాలలో ఎక్కడా నిజమైన ఆధ్యాత్మికత లేనేలేదు. కులగురువులూ, బిజినెస్ దేవాలయాలూ, పండగలలో మాత్రమె గుర్తొచ్చే దేవుళ్ళూ -- ఇవే ఆధ్యాత్మికత అనుకునేవాళ్ళను చూచి నేను జాలిపడతాను. వెలయాలికీ భార్యకూ ఎంత తేడా ఉందొ ఇలాంటి ఆధ్యాత్మికతకూ నిజమైన ఆధ్యాత్మికతకూ అంత తేడా ఉంది.

నిన్న రాత్రి ఒంటిగంట సమయంలో ఒక పని ముగించుకుని ఇంటికి వస్తున్నాను. ఈ మధ్యనే బాగా పాపులర్ అవుతున్న ఒక రోడ్డుపక్కన  సాయిబాబాగుడి ముందు ఒకభక్తుడు రోడ్డుమీదే కిందపడి మరీ సాష్టాంగనమస్కారం చేస్తున్నాడు ఇంత రాత్రిపూట ఈసమయంలో, ఎవరా ఇంత మహాభక్తుడు అని ఆగి చూచాను. మొదటిభార్యను పెట్రోల్ పోసి తగలపెట్టి రెండవపెళ్లి చేసుకున్న ఒక ఘనుడాయన. అర్ధరాత్రి సాయిబాబా గుడి ముందు రోడ్డుమీద సాష్టాంగం చేస్తున్నాడు. బహుశా మూడోపెళ్ళాం కోసం ముడుపు కట్టుకుంటున్నాడేమో. 'మీరు మారర్రా, మీ బతుకులింతే ' అని అనుకుంటూ ఇంటివైపు కదిలాను. మన సమాజంలోని మనుషుల మనస్తత్వానికి ఆ వ్యక్తి ప్రతిబింబంలా కనిపించాడు.

హిపోక్రసీ ఒక్కటే నేడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న అసలు సమస్య. అది ఒదిలిన నాడు దేశం బాగుపడుతుంది. అప్పటిదాకా మనఖర్మ ఇంతే. పొరుగున ఉన్న చైనా మనల్ని దాటి 100 ఏళ్ళు అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోయింది.మనమేమో అన్నిరకాల రోగాలతో అవినీతితో కుళ్ళిపోతున్నాం. కారణాలేంటి? హిపోక్రసీ ఒక్కటే అసలు కారణం. సామాన్యుడైనా నాయకుడైనా, అట్టడుగుస్థాయిలోనైనా,లేక అత్యున్నతస్థాయిలోనైనా  చెప్పేదొకటి చేసేదొకటి. రూల్స్ నీకు దోపిడీ నాకు. వాగుడేక్కువ ఆచరణ తక్కువ -- ఇదే మన పతనానికి కారణం. ఒకవేళ చైనాతో గనక యుద్దమే వస్తే వాళ్ళు మనల్ని పిచ్చికొట్టుడు కొట్టడం ఖాయం. వాళ్లకు సమర్ధమైన గట్టి నాయకత్వం ఉంది. మనకు అదే లేదు.

రైల్వే బడ్జెట్లో రేట్లు ఎనిమిదేళ్ళ తర్వాత పెంచారని రైల్వేమంత్రిని తొలగించిన సంఘటనచూచి ఇతరదేశాలు పగలబడి నవ్వుతున్నాయి అన్న స్పృహకూడా లేని అవకాశవాదనాయకులు మనదేశానికి శ్రీరామరక్షలు. రేపు ట్రాక్ భద్రతకోసం, వంతెనల భద్రతకోసం, మెయింటేనేన్స్ కోసం ఖర్చుపెట్టడానికి డబ్బులేక రైలుప్రమాదాలు జరిగి జనం వేలల్లో చస్తే బాధ్యులెవరు? జవాబు లేదు. నెలకు 250 రూపాయలు సామాన్యుడు భరించలేడట. చాలా వింతగా ఉంది. నేడు ఇండియాలో బెగ్గర్ కూడా రోజుకు రెండువందలు తేలికగా సంపాదిస్తున్నాడు.

అన్నీ నాటకాలూ నయవంచనలూ స్వార్ధమూ పిరికితనమూ కలగలిసిన వెన్నెముకలేని జాతికి ఇంతకంటే మంచిస్తితి వస్తుందని ఊహించడం కూడా తప్పే. ఇలా జరుగుతుందని ఇంగ్లీషువాడు మనకు స్వాతంత్రం ఇచ్చేటప్పుడే అన్నాడు. అదే తూచాతప్పక జరుగుతోంది. అయినా ఎవరెలా పోతే మనకెందుకులే. మన ఉగాదిపండగ మాత్రం మనం చేసుకుందాం అది కూడా ఇంగ్లీషులో గ్రీటింగ్స్ చెప్పుకుంటూ.

హెప్పీ ఉగాడీ.