Love the country you live in OR Live in the country you love

3, ఆగస్టు 2011, బుధవారం

అభినవగుప్తుని కాశ్మీరశైవం - పరాద్వైతం

మన హిందువుల్లో చాలామందికి హిందూమతం గురించి ఏమీ తెలియదు అంటే వినడానికి విచిత్రంగా ఉండొచ్చు. కాని ఇది చేదువాస్తవం. పాపులర్ హిందూయిజం అంటే ఏదో ఒక గుడికెళ్ళి రావడం, మొక్కులు మొక్కుకోవడం ఏదో ఒక బాబాకో స్వామికో అనుయాయులుగా ఉండటం అని చాలా మంది అనుకుంటారు అలాగే అనుసరిస్తారు కూడా.

కాని అసలైన హిందూమతం ఇది కాదు. హిందూమతాన్ని పూర్తిగా అర్ధం చేసుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలూ అతితేలికగా అర్ధమౌతాయి. అంతేకాదు ప్రపంచ తాత్వికచింతన అంతా కూలంకషంగా అర్ధం అవుతుంది. ఎంతమంది మహనీయులు మన మతాన్ని తరతరాలుగా పరిపుష్టం చేశారో అధ్యయనం చేస్తే, 'అసలు మతమంటే ఏమిటి?' అన్నవిషయం పైన  అద్భుతమైన అవగాహన కలుగుతుంది.

కాని చాలామంది ఆ దిశగా ప్రయత్నం చెయ్యరు. మన మతం గురించి మనకే పూర్తి అవగాహన లేనప్పుడు ఎవరు ఏది చెప్పినా నమ్మవలసి వస్తుంది. ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నది అదే. తెలుసుకుందామని తృష్ణ ఉన్నవారు చాలామంది ఉన్నారు. కాని సరిగా చెప్పేవారే లేరు. ఉన్న కొద్దిమంది స్వాములూ వారివారి సొంత వ్యాపారాలు చక్కగా చేసుకుంటున్నారు. అంతేగాని సనాతన హిందూమతాన్ని గురించి సరియైన అవగాహన ప్రజలకు కలిగిద్దామని వారిలో ఎవరికీ లేదు.

నిజానికి ప్రతి మతంలోనూ రెండు రకాల మనుషులుంటారు.

ఒకటి -- మతాన్ని సరిగ్గా అర్ధం చేసుకోకుండా, తమకు తోచినదాన్నే సరియైనదిగా భావిస్తూ, తాము ఆ మతాన్ని సరిగానే అనుసరిస్తున్నాం అనుకుంటూ ఉండేవారు.

రెండు -- మతాన్ని లోతుగా స్టడీ చేసి దానిలోని వివిధ సాంప్రదాయాలను ఆకళింపు చేసుకుని వాటిని ఆచరణలో పెట్టేవారు.

ఏ మతం లోనైనా ఎక్కువశాతం మొదటి రకమే ఉంటారు. వీళ్ళ మధ్యనే గొడవలూ కొట్టుకు చావడమూ ఉంటాయి. రెండో రకం వారితో ఏ రకమైన ఇబ్బందీ ఉండదు. వారు ఎవరితోనూ గొడవ పడరు.

అదలా ఉంచితే, మన మతంలోని అనేకమంది మహనీయుల పేర్లే మనకు తెలియవు అంటే ఇంకా వింతగా ఉంటుంది. కాని ఇది కూడా వాస్తవమే. త్రిమతాచార్యులైన  మధ్వ, రామానుజ, శంకరుల పేర్లు విన్నవారికి కూడా వారి వారి భావాల్లోని లోతుపాతులు తెలియవు. ఇక దక్షిణదేశపు సిద్ధ సాంప్రదాయమూ, ఉత్తరదేశపు నాధ సాంప్రదాయమూ, కాశ్మీరదేశపు పరాద్వైతమూ గురించి కనీసం విననివారు కూడా ఎందఱో హిందూమతంలో ఉన్నారు.

ఉదాహరణకు, కాశ్మీరశైవంలో అత్యంత ప్రతిభాశాలీ, మహానీయుడూ ప్రవక్తా అయిన అభినవగుప్తుని పేరు మనలో చాలామందికి తెలియదు. ఆయన వ్రాసిన గ్రంధాలూ, వాటిల్లో ఆయన చర్చించిన అద్భుతమైన విషయాలూ అసలే తెలియవు. శంకరుని సిద్దాన్తంలోనూ, బుద్ధుని సిద్ధాంతం లోనూ ఉన్న లోటుపాట్లను సవరించిన మేధాశాలి అభినవగుప్తుడు.  మహాపాండిత్యానికి తోడు అష్టసిద్దులనూ అరచేతులో ఉంచుకున్న యోగశక్తి ఈయన సొంతం. ఈయన జీవితం ఒక అద్భుతం. మనకున్న ఋషిఋణం తీరాలంటే ఇటువంటి మహనీయుల జీవితాలను మనం తెలుసుకోవాలి.

అభినవగుప్తుని జీవితాన్నీ భావాలనూ వచ్చే పోస్ట్ లో చూద్దాం.