నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

22, ఆగస్టు 2011, సోమవారం

కృష్ణస్తు భగవాన్ స్వయం

భగవంతుని  అవతారాలలో  కెల్లా నీకిష్టమైన అవతారం ఏది? అని నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే తడుముకోకుండా వెంటనే నేను సమాధానం చెప్పగలను-- కృష్ణావతారం -- అని. నా జవాబు వెనుక కొన్ని కారణాలున్నాయి. 

పుణ్యభూమి అయిన మన దేశంలో అనేక మంది మహనీయులూ సిద్దులూ యోగులూ ప్రతి తరంలోనూ జన్మించారు. జన్మిస్తూనే ఉంటారు. అంతే గాక భగవంతుని అవతారాలు కూడా అనేకం మన దేశంలో వచ్చాయి. ఎన్ని భగవద్విభూతులు అవతారాలుగా వచ్చినప్పటికీ కృష్ణావతారం వంటి అవతారం మాత్రం ఇంకొకటి రాలేదు, రాబోదు అని మనం విశ్వసిస్తాం. మిగిలిన అవతారాలు అన్నీ అంశావతారాలు అనీ, కృష్ణుడొక్కడే పూర్ణావతారం అనీ మన  పురాణాలు చెబుతున్నాయి. 

శ్రీ మద్భాగవతం ఇలా అంటుంది.

శ్లో || ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం
ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి  యుగేయుగే  [1.3.28 ]

[ఈ అవతారములన్నీ భగవంతుని యొక్క అంశకళలు మాత్రమే. కానీ శ్రీ కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే. ధర్మ  విరోదులచేత లోకం వ్యాకులం చెందినపుడు రక్షించడానికి వీరు ప్రతి యుగంలోనూ వస్తుంటారు]

కొన్ని అవతారాలలో  పదిపాళ్ళు, కొన్నింటిలో పాతిక పాళ్ళు, ఇంకోన్నింటిలో ఏభై పాళ్ళు, ఇలా రకరకాలుగా  భగవంతుని శక్తి ఆవిర్భావం జరిగింది. కాని శ్రీ కృష్ణుని అవతారంలో నూటికి నూరు శాతం భగవంతుని శక్తి భూలోకానికి దిగి వచ్చిందని శ్రీమద్భాగవతం అంటుంది. 

కృష్ణావతారం ప్రత్యేకతలు ఏమిటీ అంటే :--

1 .ధర్మాధర్మాలకు అతీతమైన భూమికలో లీలా వినోదంగా జీవితాన్నిగడుపుతూ ధర్మసంస్థాపన చెయ్యడం.

2.అన్నీ తెలిసీ ఏమీ తెలియనట్లు లీలా నాటకాన్ని నడపడం. 

3.అన్నీ ఆచరిస్తున్నప్పటికీ దేనికీ అంటకుండా దేన్నీ అంటించుకోకుండా  ఉండటం.

4.భౌతిక స్తాయిలో పూర్తిగా నిమగ్నమైనా కూడా తనదైన అతీత దివ్యస్వరూపంలో నిత్యమూ స్తితుడై ఉండటం.

5.దేనినీ అసహ్యించుకోకుండా దేనికీ లొంగకుండా ఉండటం.

6.తన చిలిపిపనులతో అల్లరిచేష్టలతో అందరి హృదయాలనూ కొల్లగొట్టడం.

"భౌతికంలోకి దివ్యత్వం దిగిరావాలి" అన్న అరవిందుల ఆకాంక్ష కృష్ణావతారంలో నిజమైనట్లు అనిపిస్తుంది. కాకపొతే కృష్ణుడు భగవంతుని అవతారం. అరవిందులు ఆశించినది మానవ పరిణామక్రమసాధనలో పరిపూర్ణత. అరవిందుల పూర్ణయోగాన్ని అందులోని స్తాయిలనూ భూమికలనూ శ్రీకృష్ణుడే ఆయనకు దర్శనమిచ్చి  స్వయంగా బోధించాడని తన "Synthesis of Yoga" అన్న గ్రంధంలో అరవిందులు చెప్పారు.

భగవద్గీత కూడా అప్పటివరకూ ఉన్న రకరకాలైన వేదాంత మార్గాలను సాధనా విధానాలను క్రోడీకరించడానికి చేసిన ప్రయత్నం లాగా మనకు కనిపిస్తుంది. యుద్ధ రంగంలో కొన్నిగంటల వ్యవధిలో పద్దెనిమిది అధ్యాయాలుగల గీతను కృష్ణుడు అర్జునునికి నిజంగా బోధించాడా? ఇది నిజమేనా? అన్న అనుమానాలూ దీనిమీద చర్చలూ అనవసరమైన విషయాలు. యుద్ధమధ్యంలో వేదాంతచర్చ జరిగి ఉండవచ్చు ఉండక పోవచ్చు. కాని అప్పటివరకూ అందుబాటులో ఉన్న వివిధ వేదాంతసాంప్రదాయాలను ఒకచోట క్రోడీకరించాలన్న వ్యాసభగవానుని ప్రయత్నం చాలా ఉన్నతమైనది. అప్పటినుంచీ ఇప్పటిదాకా భగవద్గీత ఎన్ని లక్షలమందికి ఆత్మోన్నతిని ఇచ్చిందో మనం ఊహిస్తే, ఒకవేళ యుద్ధరంగంలో వేదాంతచర్చ అసంబద్ధం అనుకున్నప్పటికీ, భగవద్గీతా రూపంలో జరిగినది ఎంత గొప్ప ప్రయత్నమో ఎంత నావెల్ ఐడియానో మనకు తెలుస్తుంది.

శ్రీకృష్ణావతారం వల్ల లోకానికి మూడు ముఖ్యమైన ప్రయోజనాలు ఒనగూడాయి అని నా భావన. 

ఒకటి - వేదాంతం గ్రంధాలకే పరిమితం కాదు అది ఆచరణాత్మకమే అని తన  అద్భుతమైన జీవితం ద్వారా నిరూపించడం. దేవుడు మానవునిగా దిగివచ్చిన అన్ని అవతారాలలోనూ బాధలు పడ్డాడు. విలపించాడు. మానవునిలాగే ఆవేశ కావేశాలకు లోనైనాడు. శరీరంలో ఉన్నంతవరకూ శరీర తాదాత్మ్యాన్ని అనుభవించాడు. శ్రీరాముడు కూడా " ఆత్మానం మానుషం మన్యే రామం దశరధాత్మజం" అంటూ తాను మానవుణ్ణి, దశరధుని కుమారుణ్ణి అని మాత్రమే తాను తలుస్తున్నట్లుగా అంటాడు. కాని శ్రీ కృష్ణావతారంలో మాత్రం, శరీరధర్మానుసారం . ఎన్ని బాధలు పడినప్పటికీ, ఎన్ని  యుద్ధాలు చేసినప్పటికీ, ఎంత మంత్రాంగం నడిపినప్పటికీ, తాను భగవంతుణ్ణి అన్న స్పృహ మాత్రం ఆయనను ఎప్పుడూ వీడనట్లు కనిపిస్తుంది. కనుకనే " అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే (నేనే అంతటికీ ప్రభువును అంతా నన్ను అనుసరించే నడుస్తున్నది)" ,"అహమాత్మా గుడాకేశా  సర్వభూతాశయ స్తితః , అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంతయేవచ (సర్వభూతములలో ఉన్న ఆత్మను నేనే. సర్వభూతముల ఆది, మధ్య, అంతం అన్నీ నేనే)" అని గీతలో చెప్పగలిగాడు. ఇటువంటి మాటలు గీతలో కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇలా చెప్పగలగడం సామాన్య విషయం కాదు.అందుకే ఆయన  మాయామానుషవిగ్రహుడయ్యాడు. లీలానాటకసూత్రధారి అనిపించుకున్నాడు. ప్రపంచం ఒక లీల అన్న విషయం తెలిసినవాడు గనుక చిరునవ్వుతో అన్నింటినీ చక్కబెట్టాడు. శత్రువులకూ మోక్షాన్నిచ్చాడు.

రెండు- అత్యద్భుతమైన మధురభక్తిమార్గాన్ని లోకానికి అందించడం. కృష్ణప్రేమభక్తి మాధుర్యంలో ఓలలాడి ఎందరు భక్తవరేణ్యులు దివ్యానందాన్ని చవిచూసారో లెక్కలేదు. వేదాంతంలో అత్యున్నతమైనదిగా తలచే మోక్షాన్ని కూడా తక్కువ స్తాయిదిగా తలచి త్రుణీకరించగల శక్తి మధురభక్తి సొంతం. దివ్యమైన మధురప్రేమానుభావం ముందు మోక్షం కూడా వెలవెలా బోతుంది అన్నది వాస్తవమే. ప్రేమానందంలో మునిగి మత్తులైన ధన్యాత్ములు అద్వైతప్రతిపాదిత మోక్షాన్ని కూడా నిరసించారు. భక్తి మార్గ ప్రవర్తకులైన మధ్వ, రామానుజ,చైతన్య, నింబార్క, వల్లభాదులు, మీరా, సూరదాస్, మొదలైన మహాభక్తులు అద్వైతమోక్షం అనేది ప్రేమభక్తి కంటే ఎక్కువ ఏమీ కాదన్నారు. శ్రీ రామకృష్ణులు కూడా ఒక పాటను ఎప్పుడూ ఆలపించేవారు " నేను మోక్షాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ వెనుకాడను. కాని నిర్మలమైన ప్రేమభక్తిని మాత్రం అంత త్వరగా ఎవరికీ ఇవ్వను." అంటూ ఆ గీతం సాగుతుంది. ముల్లోకాలలో ఎంత గొప్పసంపద అయినా అది ప్రేమభక్తికి సాటిరాదు. ప్రేమభక్తి ఉన్నవానికి భగవంతుడు కట్టుబడతాడు. అట్టి భక్తుణ్ణి వదిలి భగవంతుడు ఎక్కడికీ పోలేడు. అటువంటి భక్తిమార్గం కృష్ణావతారం ద్వారా లోకానికి ఇవ్వబడింది.

మూడు - సమస్త వేదాంతసిద్ధాంతాలనూ భగవద్గీతా రూపంలో సమన్వయపరచడం. ఇప్పటివరకూ వచ్చిన ఆచార్యులు పండితులు అందరూ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాసినవారే. ఎందుకంటే సమస్త వేదవేదాంతాల సారం గీతలో నిక్షిప్తమై ఉన్నది. దానికి వ్యాఖ్యానం వ్రాయగలిగితే సమస్త వేదాలనూ స్ప్రుశించినట్లు అవుతుంది అని వారందరూ భావించారు. గీతలు ఎన్నున్నా భగవద్గీత ఒక్కటే సమస్త  వేదవేదాంత సారంగా వెలుగుతూ వచ్చింది. హిందూ ధర్మాన్ని అధ్యయనం చెయ్యాలనుకునేవారు ఏ గ్రంధం చదివినా చదవకపోయినా భగవద్గీత చదివి అర్ధం చేసుకుంటే చాలు, హిందూధర్మం మొత్తం అర్ధం అవుతుంది. ఇది కూడా లోకానికి కృష్ణ ప్రసాదమే.

కాకపోతే ఇటువంటి మహత్తరమైన అవతారాన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడం ఎప్పటిలాగే మన దురదృష్టం. కృష్ణుడు అబద్దాలు చెప్పాడనీ, మోసాలు చేసాడనీ, గోపికలతో సరసాలు సాగించాడనీ, రాసలీల అనేది కామకేళి అనీ పిచ్చిపిచ్చి మాటలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. రాముడు చేసినట్లు చెయ్యండి, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యండి - వ్యతిరేకంగా మాత్రం చెయ్యకండి. అన్న శ్లేషాత్మకవ్యాఖ్యలూ ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ కృష్ణుని ఔన్నత్యం అర్ధంకాక అజ్ఞానులు అనుకునే పిచ్చిమాటలు. కృష్ణావతార మహత్యాన్ని అణుమాత్రం గ్రహించగలిగినా ఆ కధల వెనుక ఉన్న అద్భుతమైన ఔన్నత్యాన్ని మనం చూడగలుగుతాం.

కృష్ణుడు పిల్లలలో పిల్లవాడు, యువకులలో యువకుడు, జ్ఞానవృద్ధులలో వృద్ధుడు, రాజులకురాజు, వీరులలో వీరుడు, వేదాన్తులలో వేదాంతి, ఆదర్శవంతుడైన కుమారుడు, స్నేహితుడు, సోదరుడు, ప్రేమికుడు, భర్తా, రాజూ, సేవకుడూ, యోగీ, శిష్యుడూ, గురువూ అన్నీ తానే. ఒక్క వ్యక్తిలో ఇన్ని పరిపూర్ణతలు ఆవిర్భవించడం పరమాద్భుతం. ఒక్క భగవంతుడు మాత్రమే ఇన్నికోణాలలో పరిపూర్ణతను ప్రకటించగలడు. ఇది ప్రపంచంలో ఏ మానవునికీ సాధ్యమయ్యే విషయం కాదు. చిన్నబాలునిగా తన ముద్దుమాటలతో, అల్లరి చేష్టలతో గోకులాన్ని కట్టిపడేశాడు. ప్రేమికునిగా గోపికలకూ రాధకూ మహత్తర ప్రేమభక్తిని చవిచూపించాడు. వీరునిగా యుద్ధాల్లో పాల్గొన్నాడు. సోదరునిగా అన్నకు అండగా నిలబడ్డాడు. రాజుగా ధర్మాన్ని నిలబెట్టాడు, సేవకునిగా సారధ్యం వహించాడు, కుమారునిగా తండ్రి ఋణం తీర్చుకున్నాడు, స్నేహితునిగా కుచేలునీ, బంధువుగా పాండవులనూ ఆదరించాడు, ఉత్తమశిష్యునిగా సాందీపని ఆచార్యుని ఋణం తీర్చుకున్నాడు. ఉత్తమ గురువుగా అర్జునునీ ఉద్దవునీ ఉద్దరించాడు. తననే నమ్మిన రుక్మిణికి, అష్టమహిషులకూ, పదహారువేలమంది భార్యలకూ న్యాయం చేశాడు. ధర్మయుద్ధాన్ని నడిపించాడు. ఒక్కడే పాశ్చాత్యరాజుల దాడులను, కుట్రలనూ ఎదుర్కొన్నాడు. దుర్మార్గులను అంతం చేసాడు. చివరిగా తనవారు తన ఎదురుగానే కొట్టుకుని చచ్చిపోతుంటే నిర్వికారంగా చూస్తూ మౌనంగా ఉన్నాడు. తాను వచ్చినపని అయిపోయిన అనంతరం ఎవరికీ చెప్పకుండా, ఏ విధమైన మోహాలూ లేకుండా, అందర్నీ వదిలి,  దేహాన్ని వదిలి తన స్వధామాన్ని చేరుకున్నాడు. అందుకే "కృష్ణస్తు భగవాన్ స్వయం" అన్న మాట అక్షరాలా నిజం. 

కృష్ణునిలోని ఇన్ని కోణాలనూ చక్కగా అర్ధం చేసుకున్నప్పుడే కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం అని మహనీయులు ఎందుకు అన్నారో మనకు కొద్దిగానైనా అర్ధం అవుతుంది.