“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, జనవరి 2011, ఆదివారం

శబరిమల ప్రమాదం- ప్రశ్న జ్యోతిష్యం-పూర్వజన్మ కర్మ

మొన్న శబరిమలలో తొక్కిసలాట జరిగి షుమారు నూరుమంది అయ్యప్ప భక్తులు చనిపోయారు. దైవదర్శనానికి వెళ్ళిసరాసరి దేవుని దగ్గరకే వెళ్లారని కొందరు అనుకుని బాధపడ్డారు,కొందరు సరిపెట్టు కున్నారు.సామాన్యంగా ఇలాటి నిత్యప్రళయాలను నేనంతగా పట్టించుకోను.వీటి వెనుక ఉన్న కారణాలేమిటో నేను ఊహించగలను.

కాని ఈ సంఘటనమీద ప్రశ్నజ్యోతిష్యం ఏమి చెబుతుందో చూద్దామని నిన్న రాత్రి నాకు అనిపించింది.ఈ విధంగా అనిపించటం చాలా అరుదుగా జరుగుతుంది.ఇంపల్స్ చాలా బలంగా ఉండటంతో ప్రశ్నచక్రం వేసి చూఛాను.ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.

తేదీ:15-1-2011
సమయం:20.02 గంటలు
ప్రదేశం: గుంటూరు.

లగ్నం సింహం:౦.48 డిగ్రీలు

సింహం వనచరరాశి కనుక కొండల్లో అడవుల్లో జరిగిన సంఘటనను సూచిస్తున్నది.లగ్నడిగ్రీలు రాశిసంధిలో పడి బలహీనంగా ఉన్నాయి.దీనివల్ల జరిగిన సంఘటన సరిగానే సూచింపబడుతున్నది.లగ్నాధిపతి రవి ఆరింట శత్రుస్థానంలో ఉండి వీరందరూ మృత్యువాత పడడాన్ని చూపుతున్నాడు. నవమాధిపతి ఐన కుజుడు ఆరింట ఉఛ్ఛస్థితిలో ఉండి ధార్మికమైన కార్యక్రమమే వీరికి మృత్యుగండాన్ని ఇస్తుందని చూపిస్తున్నాడు. పంచమాధిపతి గురువు అష్టమంలో ఉండి ఆధ్యాత్మికపరమైన కార్యక్రమమే వీరి చావుకు కారణం అవుతుందని సూచిస్తున్నాడు.

ఆత్మారూఢం నుంచి రవికుజుల కాంబినేషన్ అష్టమరాశిలో పడి ఈ విశ్లేషణ కరెక్ట్ అనీ వారికి బలవంతమైన మృత్యువు రాసిపెట్టి ఉన్నదనీ చూపిస్తున్నది.

ఇంతవరకూ అంతా బాగానే ఉంది.కాని ఈ సామూహిక మరణానికి కారణాలు ఏవై ఉండవచ్చు?మనకు కనిపించే కారణాలు చాలా ఉంటాయి. ఏదో వాహనం దూసుకొచ్చి బోల్తా పడటం తద్వారా తొక్కిసలాట జరగటం ఇలా అనేకకారణాలు బాహ్యంగా కనిపిస్తాయి. కాని ఆ వాహనం అదే సమయానికి ఎందుకు అలా దూసుకురావాలి? అంతమంది మనుషులు ఆ సమయానికి అక్కడే ఎందుకుండాలి? అక్కడే ఎందుకు తొక్కిసలాట జరగాలి? అని ఆలోచిస్తే ఈ సంఘటన వెనుక బలీయమైన సామూహిక పూర్వకర్మ కనిపిస్తుంది.

మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు అనేక విషయాలను చెబుతూ సామూహిక మరణాలకు కారణాలను వివరిస్తాడు. సామూహికంగా చేసిన బలీయమైన దుష్కర్మ ఇలాటి సంఘటనలకు కారణం అవుతుంది. ఉదాహరణకు, ఏ కాశీకో గుంపుగా పోతున్న యాత్రికులను మార్గమధ్యంలో దారికాచి చంపి దోచుకునే అడవిదొంగల గుంపులు పూర్వకాలంలోఉండేవి. వారు సామూహికంగా బలవత్తరమైన దుష్కర్మను చేస్తారు. ఎందరిదో ఉసురు పోసుకుంటారు. కనుక తరువాతిజన్మలలొ వారందరూ ఒకేచోట,ఒకేసమయంలో ఇలా గుమిగూడి ఏక్సిడెంట్లలో మరణిస్తారు.

ప్రస్తుతం మన ప్రశ్న చక్రంలో ఏం కనిపిస్తున్నదో చూద్దాం.

పూర్వకర్మను సూచించే నవమాధిపతి కుజుడు.ఇతడు బలమైన ఉఛ్ఛస్థితిలో శత్రుస్థానంలో ఉన్నాడు. కుజుడుహింసకు కారకుడు. కనుక పూర్వజన్మలలొ వీరందరూ బలీయమైన హింసాకాండకు పాల్పడ్డారు అనిసూచింపబడుతున్నది. అది ఎటువంటి హింసాకాండ అయి ఉంటుంది?

కుజుడు రవి నక్షత్రంలో ఉన్నాడు. రవి లగ్నాధిపతి. రాజులకు ఉన్నతాధికారులకు సూచకుడు. కనుక రాజకార్యంనిమిత్తమై పోతున్న అనేకమందిని వీరు సామూహికంగా మట్టుబెట్టటం జరిగింది.ఈసంఘటన ఎక్కడ జరిగి ఉంటుంది?ప్రస్తుత సంఘటనను సూచించే రాశి మకరం.మొసలి నదులలోనూ అడవులలోని మడుగులలోనూ ఉంటుంది. కనుక నదీతీరంలోని అడవులలో ఈసంఘటన జరిగింది.

ఇంకా లోతుగా పరిశీలిద్దాం. దానికి ప్రత్యెక లగ్నాలద్వారా , అంశ చక్రాలు,దశల ద్వారా పరాశరమహర్షి విధానంలో విశ్లేషణ చెయ్యవచ్చు.కాని కొంత విభిన్నత కోసం దీనికి కృష్ణమూర్తి పద్దతి సహాయం తీసుకుందాం.

కుజుడు బుధుని సబ్ లో ఉన్నాడు. ఆ బుధుడు పంచమంలో రాహువుతో కలిసి ఉన్నాడు. పంచమం ధార్మికకార్యక్రమాలకు సూచిక. రాహుబుధుల కాంబినేషన్ కుట్రలకు సూచిక. లగ్నాధిపతియగు రవికి బుధుడు అత్యంతసమీపంలోనే ఉంటాడు. కనుక రాజాజ్ఞ నిమిత్తమై దైవకార్యంమీద పోతున్న బృందాన్ని వీరు అడవిలో దారికాచి కుట్రపూర్వకంగా చంపటం జరిగింది.అది కూడా నమ్మించి హతమార్చటం జరిగింది. దాని ఫలితంగా ఇప్పుడు అదే అడవిలో దైవకార్యక్రమమైన దీక్షలో ఉండగా వీరికీ చావు మూడింది. వీరు కూడా వీరు నమ్మిన దైవం సన్నిధిలోనే,ఏ ప్రమాదాలూ రావని నమ్ముతున్న దీక్షా సమయంలోనే హతం అయ్యారు.కర్మ ఫలితాలు ఇలా ఉంటాయి. దీన్నిబట్టి ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. మనం చేసే తూతూ దీక్షలవల్ల మన కర్మ ఏమీ తొలగదు. మనం పెట్టె అరటిపండ్లకు, కొట్టే కొబ్బరికాయలకు భగవంతుడు కరిగిపోయి మనపాపాలు క్షమించడం జరుగదు.దానికి మార్గాలు వేరే ఉన్నాయి.

కర్మగతి ఎంత విచిత్రమైనది?కర్మ ఎటువంటి బాకీనీ ఉంచుకోదు. సృష్టి ఎంత గొప్పవారినీ ఉపేక్షించదు. కాకపోతే కర్మ పరిపక్వం కావటానికి కొంతసమయం పడుతుంది. కాయ పండుగా మారి రాలిపడటానికి కొంతసమయం తీసుకుంటుంది.ఈ లోపు మనిషి విర్రవీగుడు జరుగుతుంది.

మరి ఇప్పుడు చేస్తున్న మంచికర్మ వల్ల పాతదైన చెడుకర్మ పోదా? అన్నప్రశ్న వస్తుంది.పూర్వకర్మ దృఢమైనదైతే చెరిగిపోదు.దాని ఫలితం అనుభవించవలసిందే.వీరి సంగతే తీసుకుందాం. ప్రస్తుతం చేస్తున్న అయ్యప్పదీక్ష వీరికి ఏ విధంగా సాయపడినట్లు?మరి ఎటువంటి ఫలితాన్నీ ఇవ్వని దీక్షలు చేస్తూ వీళ్ళు ఇన్నాళ్ళుగా భ్రమల్లో ఉన్నట్లేగా?కనుక ఏతావాతా తేలేదేమంటే కర్మకు, భగవంతునికీ పక్షపాతం ఉండదు. వారూ వీరూ అన్న భేదం ఉండదు. చేసినకర్మ అనుభవించక ఎవరికైనా తప్పదు.ఒక్కొక్కసారి వడ్డీతోకూడా అనుభవించవలసి వస్తుంది.

మరి వీరిలో ఎవరైనా ఈ విషయాలు ముందుగానే తెలుసుకొని వాటిని పరిహారాల ద్వారా మార్చుకునే ప్రయత్నం చెసిఉంటే ఈ చావును తప్పించుకోగలిగేవారా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది.

కర్మ బలీయం అయినప్పుడు ఆబుద్ధి పుట్టనివ్వదు. పరిహారాల వైపు దృష్టి పోదు.అవి పిచ్చిపనులని లెక్కించటమూ వాటిని ఎగతాళి చెయ్యటమూ జరుగుతుంది.అప్పుడేగా మరి కర్మ ఫలితం అనుభవించగలిగేది.అలా ముందుగానే తెలుసుకొని మార్చుకుంటే కర్మగతి సాగేదెలా?అందుకే వారికి బుద్ది పుట్టదు. ఫలితం వైపు కర్మ లాక్కెళుతుంది. వారుమాత్రం అంతా తమ ఇఛ్ఛానుసారమే చేస్తున్నాము అనుకుంటారు.

ఇవన్నీ తెలిసేనేమో భగవద్గీత ఇలా చెప్పింది.

గహనా కర్మణో గతి: (కర్మ గతి అర్ధం చేసుకోవటం చాలా కష్టం)

గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితా: (గతాన్ని గురించిగాని ప్రస్తుతాన్ని గురించిగాని పండితులైనవారు శోకించరు)

మొత్తం నాటకంలో ఒక సీనుమాత్రమే తెలిసిన ప్రేక్షకుడు ఆయా సీన్లను బట్టి ఆనందానికీ, భయానికీ, బాధకూ లోనవుతాడు. కాని అన్ని సీన్లవెనుక ఉన్న కంటిన్యూటీ తెలిసిన దర్శకుడు మాత్రం ఏ భావానికీ లోనవ్వడు. అంతా చిద్విలాసంగా చూస్తూ ఉంటాడు.