“Self service is the best service”

14, జనవరి 2011, శుక్రవారం

వివేకానందుని జాతకం- కొత్త కోణాలు

వివేకానంద స్వామి జాతకాన్ని ఇంతకు ముందు కూడా విశ్లేషించాను. ఇప్పుడు విమ్శాంశ కుండలిని మరొక్కసారి పరిశీలిద్దాం.

పట్టుదలకు ప్రతిరూపం అయిన మకరం లగ్నం కావడమూ, లగ్నాధిపతి మంత్ర స్థానం లో మిత్రస్తానంలో ఉండటమూ వల్ల తీవ్రమైనసాధనతోనూ అచంచలమైన దీక్షతోనూ పొందిన యోగసిద్ధి సూచితం అయింది.

లగ్నాధిపతి దృష్టి మనః కారకుడైన చంద్రునిపైన ఉండటం వల్ల ఆయన మనస్సు ఎల్లప్పుడూ ఉన్నతమైన ఆధ్యాత్మిక భావాలతో నిండిఉండేదని తెలుస్తున్నది.

సప్తమాధిపతి అయిన పూర్ణ చంద్రుడు స్వస్తానంలో ఉండటం వల్ల ఆయన మనస్సు ఎల్లప్పుడూ లోకానికి మేలు చెయ్యాలని తపించేదని సూచింప బడుతున్నది.

నవమాధిపతి అయిన బుధుడు లాభ స్థానం లో ఉండి శనిచేత చూడబడుతూ, స్వామికి లౌకికచింతలు లేవని, ఆయనబుద్ధి అంతా ఆధ్యాత్మిక మార్గంలో నిమగ్నమై ఉండేదని చూపిస్తున్నాడు. అయితే బుధుడు కుజ స్థానంలో ఉండటంవల్ల, ఆయన మంచి బుద్ధి శాలి అనీ, తనకోసం కాక లోకం కోసం తపించేవాడనీ సూచితం అవుతున్నది.

శని దృష్టి వాక్స్థానంలో ఉన్న రాహుకేతువుల పైన ఉండటం వల్ల ఆయన వాక్కులలో వైరాగ్యపూరితములైన ఆధ్యాత్మికతరంగాలు ప్రసరించేవని తేటతెల్లం అవుతున్నది.

అష్టమంలోని శుక్ర కుజుల వల్ల, ఆయనలోని కామవాసనలు యోగశక్తి గా మార్పు చెందినాయనీ, పశువాంఛలు ఆయనలో పూర్తిగా నశించాయనీ క్లియర్ గా కనిపిస్తున్నది.

శుక్రకుజుల బలీయమైన ఓజోదృష్టి బుధుని మీద ఉండటం వల్ల, ప్రచండయోగశక్తి ఆయన తీక్ష్ణమైన బుద్ధి ద్వారా లోకాన్ని ప్రబావితం చేసిందని తెలుస్తున్నది.

అదే దృష్టి ద్వితీయం లోని రాహుకేతువుల పైనా తృతీయం లోని రవి పైనా ఉండటం వల్ల, ఆయన వాక్కులకు, భావాలకు అంత అద్భుతమైన ఆధ్యాత్మికశక్తి ఎలా వచ్చిందో మనకు అర్ధం అవుతున్నది.

ఇటువంటి మహత్తరమైన యోగజాతకం కనుకనే ఆయన శ్రీ రామకృష్ణుని కృపకు పాత్రుడు కాగలిగాడు. ఆధునికరుషిపుంగవునిగా తన దివ్య వాక్కులతో భారతదేశానికి దిశానిర్దేశం చెయ్యగలిగాడు. వెయ్యి సంవత్సరాలుగా బానిస బ్రతుకుతో నిద్రపోతున్న దేశాన్ని తన విద్యుత్స్పర్శతో తిరిగి జాగృతం చెయ్యగలిగాడు.

భారతీయ జ్యోతిర్విజ్ఞానం విధంగా ఒక మనిషి యొక్క జీవన గమనాన్ని మాత్రమేగాక అతని వ్యక్తిత్వంలోని విభిన్నకోణాలను కళ్ళఎదుట చూపగలుగుతుంది. ఇది ఒకఅద్భుతమైన సైన్స్ అని నిస్సందేహం గా చెప్పవచ్చు.