“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

10, మే 2010, సోమవారం

మానవ జీవితం పైన గ్రహప్రభావం-1

మానవ జీవితం పైన గ్రహప్రభావానికి అనేక ఉదాహరణలు మనకు నిత్యజీవితంలో కనిపిస్తూనే ఉంటాయి. కాని దానిని చూచే సరియైన దృష్టి మనకు ఉండాలి. చూచే దృష్టితో చూస్తే, సాధారణ సంఘటనల వెనుక గ్రహ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

సామాన్యంగా, మనిషికి మంచి దశలు జరుగుతున్నపుడు అంతా తన గొప్పే అనుకుంటాడు. చెడు దశలు జరిగేటప్పుడు దేవుని నిందిస్తాడు. దీనికి కారణం మానవుని అవగాహనా రాహిత్యం. జీవితాన్ని లోతుగా పరిశీలించగలిగితే విచిత్ర విషయాలు కనిపిస్తాయి. అడుగడుగునా మనిషి జీవితం అతీత శక్తుల ప్రభావానికి ఎలా లోనవుతోందో అర్ధం అవుతుంది. ఆయా శక్తులను ఎలా మలుచుకోవాలో తెలిస్తే జీవితం అనబడే ఆట భలే తమాషాగా ఉంటుంది.

నేను గుంటూరుకు బదిలీ అయ్యిన తరువాత నాకొక ఆఫీస్ రూమ్ కేటాయించబడింది. అప్పటికే జరుగుతున్న దశను బట్టి, సంఘటనలను బట్టి ఇదంతా ఏ కారక గ్రహం ప్రభావమో నాకు బాగా తెలుస్తూనే ఉంది. ఇది పూర్వజన్మ లోని ఏ కర్మ ఫలితమో కూడా అర్ధం అవుతూనే ఉంది. కాని నేను ఆ రూం లోనికి అడుగుపెడుతూనే కనిపించిన విషయాలు నాకు అర్ధం కాలేదు.

ప్రస్తుతం గురుగ్రహ ప్రభావంలోని దశ జరుగుతున్నందున ఆ గ్రహానికి సంబంధించిన లక్షణాలున్న రూం కేటాయించబడాలి. అంటే ఈశాన్య వాకిలి గాని, నడక గాని ఉన్న గది అయ్యి ఉండాలి. కాని దానికి భిన్నంగా జరిగింది. ఆ గదికి నైరుతి వాకిలి ఉండటమే గాక వాస్తు మొత్తం అసహజంగా ఉంది. అంటే రాహు ప్రభావం పనిచేస్తున్నది. జనన జాతక రీత్యా రాహు ప్రభావం నా మీద బలంగా ఉన్నది. కనుక అలా జరిగి ఉండవచ్చు.

రాహువు యొక్క బలం ఉన్నప్పటికీ, చివరకు దశా పరంగా గురువు యొక్క కారకత్వం నిరూపించబడాలి. కాని అలా జరగలేదు. ఆ గదిలో ఇంతకు ముందున్న అధికారి అనేక ఆరోపణలు ఎదుర్కొని బదిలీ కాబడ్డాడు. ఆ గదిలో పనిచేసే ఎవ్వరైనా ఋజువర్తనతో, మనశ్శాంతితో, ఉండటం అసాధ్యం. జాతకరీత్యా, యోగకారక శుభదశలు జరుగుతున్నందున, ప్రస్తుతం ఇటువంటి రూం నాకు కేటాయించబడరాదు. ఏం జరుగుతుందో చూద్దామని అనుకున్నాను.

నేను ఏమీ మాట్లాడకుండా ఆ గదిలోనే పని చేసుకుంటున్నాను. అయితే మౌనంగా తాంత్రిక రెమెడీస్ లోలోపల జరుపుతున్నాను.రెండు రోజులు గడిచాయి. ఉన్నట్టుండి పరిస్థితులు అనుకోని రకంగా మారిపోయాయి. కొన్ని హఠాత్ కారణాల వల్ల అకస్మాత్తుగా రూం మారవలసి వచ్చింది. కొత్తగా ఇచ్చిన రూంకి ఈశాన్య వాకిలి ఉండటమేగాక మొత్తం వాస్తు పరంగా గురు గ్రహ లక్షణాలకు చాలా చక్కగా సరిపోయింది. దశాప్రభావానికి అనుగుణంగా ఈ కొత్త గది ఉంది.

ఉద్యోగులు రకరకాలుగా వారిలో వారు చర్చించుకుంటున్నారు. పాత రూం బాగుందని కొందరు, ఇదే బాగుందని ఇంకొందరు అనుకుంటుంటే విన్నాను. నేను మాత్రం ఏ వ్యాఖ్యా చెయ్యకుండా మౌనంగా ఉన్నాను. ఈ మార్పు వెనుక ఉన్న అసలైన అంతర్గత కారణాలు అర్థమైన నాకు వారిమాటలు వింటుంటే లోలోపల నవ్వొచ్చింది. కర్మ ఫలితం ఎంత విచిత్రంగా ఉంటుందో కదా అనిపించింది.

జీవితంలో జరిగే ప్రతి చిన్న ఘటన వెనుకా సూక్ష్మమైన కర్మ ఫలితం ఉంటుంది. అంతర్దృష్టితో చూస్తే దాని అసలు కారణం తెలుస్తుంది. ఆ దృష్టి లేనపుడు, ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకోవటం జరుగుతుంది. కొందరు తమ గొప్ప అనుకోవడం, లేదా దేవుని కరుణ అనుకోవడం, మరికొందరు తమ చేతగాని తనం అనుకోవడం, లేదా దేవుని నిందించడం ఇలా రకరకాలుగా జరుగుతుంది.

అసలు కారణాలు ఇవి కావు. మనిషి జీవితం కర్మ మయం. కొంత పూర్వ కర్మ ఫలంగాను, మరికొంత ప్రస్తుత ప్రయత్న ఫలంగాను ఏ సంఘటనైనా జరుగుతుంది. ఈ రెండింటి నిష్పత్తి ప్రతి క్షణమూ మారుతూ ఉంటుంది. తదనుగుణంగా మానవుని మనస్సు, జీవితమూ మార్పులకు లోనవుతూ ఉంటాయి. ఏది ఏంతవరకు పనిచేస్తున్నదీ తెలుసుకోవాలంటే సూక్ష్మ దృష్టి ఉండాలి. దానికి ధ్యానబలం కావాలి.

అప్పుడు మనం నిత్యం చూచే ఈ ప్రపంచం లోనే ఇంకొక నిగూఢ ప్రపంచం కనిపిస్తుంది. అతి మామూలు విషయాల వెనుక లోతైన కారణాలు కనిపిస్తాయి. ఆ కారణాలకు మూలమైన శక్తులు దర్శనం ఇస్తాయి. వాటిని ఎలా మలుచుకోవాలో, మార్చుకోవాలో తెలిస్తే అప్పుడు జీవితంలోని అసలైన ఆనందం సొంతం అవుతుంది. అప్పుడు "నీ విధికి నీవే కారకుడవు" అన్న మహనీయుల వాక్కుల వెనుక గల అర్ధం గ్రహింపుకు వస్తుంది.