నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

3, మార్చి 2010, బుధవారం

విలక్షణ హాస్య నటుడు పద్మనాభం జాతకం



విలక్షణ హాస్య నటుడు బసవరాజు వెంకట పద్మనాభ రావు ఉరఫ్ పద్మనాభం గారు నాకు బాగా ఇష్టమైన హాస్య నటులలో ఒకరు. ఒక రకంగా చెప్పాలంటే రేలంగి కంటే నేను పద్మనాభం గారి నటననే ఇష్టపడతాను. ఆయన నటనలో అధ్బుతమైన టైమింగ్ సెన్స్ ఉండేది. డైలాగ్ డెలివరీలో ఆయన శైలి విలక్షణంగా ఉంటుంది. పాతకాలపు హీరోల తో సమానమైన అందగాడు.

ఈయన జనన సమయం దొరకలేదు. కనుక ఖచ్చితమైన జాతకం చూడటం కుదరలేదు. కనీసం చంద్ర లగ్నం గుర్తించను కూడా వీలు కాలేదు. కారణం జనన తేదీలుగా రోజు,మరుసటి రొజు రెండు రోజులు కనిపిస్తున్నాయి. కాని సినిమా నటులు సాధారణంగా తులా లగ్నంలో పుడతారు కనుక చంద్రుని తులా లగ్నంలో ఉంచాను. ప్రస్తుతం గోచార శని ద్వాదశ రాశి సంచారం కనుక మరణ సూచన ఉన్నది. అదే వృశ్చిక రాశి అయితే శని లాభస్థాన సంచారం కనుక అది సాధ్యం కాదు. కనుక విధంగా కూడా తులా రాశే సరియైనది అనిపిస్తున్నది.

సరియైన జన్మ సమయం లేదుకనుక, చంద్రుని డిగ్రీలను లెక్కలోకి తీసుకోకుంటే, శుక్రుడు ఆత్మకారకుడు అవుతాడు. కనుక సినిమా రంగంలో నటునిగా రాణింపు సహజమే.

లాభ స్థానంలో రవి బుధులు, దశమ స్థానంలో గురు శుక్రులు ఒక మంచి గ్రహయుతి. గురువు వర్గోత్తమాంశ లో ఉండి ఈయనది మంచి పుణ్యబలం కలిగిన జాతకం అని చూపిస్తున్నాడు. ఆ గురువుతో కలిసి ఉన్న శుక్రుడు దశమ స్థానంలో బలంగా ఉండటం కళా రంగజీవితానికి సూచన. గురువు యొక్క ఉచ్చ వర్గోత్తమ స్థితివల్ల ఈయన మనస్తత్వం చాలా మంచిది అని తెలుస్తున్నది. అంతే గాక ఈ కాంబినేషన్ వల్ల ఈయన మంచి దైవ భక్తి కలిగిన వాడు అని కూడా చెప్పవచ్చు. ఈయన సినీ జీవితం 1945-1975 మధ్య బాగా సాగింది. ముఖ్యం గా 1965 నుంచి 1970 మధ్యలో సిని్మాలు నిర్మించారు.

ఉజ్జాయింపుగా వేసిన లెక్కల ప్రకారం- సమయంలో ఈయన జాతకంలో కొంత శని దశ,మిగతాది బుధ దశ
జరిగాయి. లగ్నానికి శని యోగకారకుడు కనుక శని దశలో ఆయన సినీ రంగ ప్రవేశం జరిగి ఉండవచ్చు. లాభ స్థానంలో ఉన్న బుధ దశలో ఈయన సినీ జీవితం బాగా సాగింది. ద్వాదశంలో ఉన్న కేతు దశలొ సినీ రంగంలో అవకాశాలు తగ్గాయి.

సినీ రంగం ఒక రొచ్చుగుంట. దానిలో ఉన్నన్ని కుళ్ళు రాజకీయాలు ఇంకెక్కడా ఉండవు. అక్కడ మొట్టమొదట అడిగేది
కులం, తరువాత వర్గం వాడు అనేది ముఖ్యం,తరువాత విషయం డబ్బు. దాని తరువాతే టాలెంట్ ఇతర విషయాలు లెక్కలోకి వస్తాయి. మూడూ లేని వాడు చిల్లిగవ్వకు కూడా కొరగాడు. ప్రస్తుతం సినీరంగం బాగా చెడిపోయింది. ఇటువంటి వాతావరణంలో పాతకాలపు నటులు బతకలేరు.

డబ్బు ఉండి పైరవీలు చెయ్యగలిగే వారికే రంగంలో రాణింపు ఉంటుంది. దీనికి తోడు కులవర్గపు ఆసరా,రాజకీయ
ఆసరా ఉన్నవారికే ఇక్కడ జీవితం. పాతకాలపు నటుల జీవితాలు విషాదాంతాలు కావటం విచారించదగ్గ విషయం.కొన్నాళ్ళు పోతే ఇటువంటి అద్భుత కళాకారులు ఎవరికీ గుర్తు కూడా ఉండరేమో. ఆయన అంత్య క్రియలకు అతి తక్కువమంది హాజరు కావడం బాధాకరం. అడుగంటుతున్న విలువలకు ఇది నిదర్శనం.

పద్మనాభం గారి సరియైన జనన సమయం ఎవరికైనా దొరికితే నాకు మెయిల్ చెయ్యగలరు.