“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

19, డిసెంబర్ 2009, శనివారం

ఒంటిమిట్ట-మొదటి పది పద్యాలు

కం ||మ్రొక్కితి పాదాబ్జంబుల
చిక్కితి నీ చేతులందు చింతలవేలా?
సొక్కె కరుణా వృష్టిం
దిక్కెవ్వరు నీవు దక్క తిరుమల రాయా||

ఓ వెంకటేశ్వరా ! నీ పాద కమలాలవద్ద ప్రణామం చేశాను. నీ చేతుల్లో చిక్కాను. నాకింక చింతలు లేవు. నీ కరుణా వర్షంలో తడుస్తాను. నీవు తప్ప నాకు దిక్కెవ్వరు ?

ఆ || తాళ్ళపాక యనుచు తనరారు గ్రామాన
పుట్టినావు ఇను దిట్టముగను
ముప్పదారు వేలు ముద్దుగా కృతులల్లి
నిలిచినావు మహిని నిబ్బరము ||
 
ఓ అన్నమాచార్యా ! తాళ్ళపాక అనే ఊరిలో జన్మించావు. ముప్పై యారు వేలు కృతులను ముచ్చటగా అల్లి ఈ భూమిమీద ఘనుడవైనావు.

ఆ || శివుని గొల్చి నీవు చిత్రంపు రీతిగా
విష్ణు జేరినావు వింతలల
శివుడు కేశవుండు నొక్కడే జనులార
భేదమంచు లేదు వాదమేల ||

మొదట్లో నీవు శివభక్తుడవు. ఆ శివభక్తి నిన్ను విష్ణు పాదాల చెంతకు చేర్చింది. ఇదేమి వింతయో? శివుడూ కేశవుడూ ఒక్కరే అని ఈ విధంగా జనులకు చెబుతున్నావా? 

కం|| అన్నయ కవితా రీతుల్
వెన్నను పొంగింప వచ్చు సన్నపు నేతుల్
విన్నాణపు వేదములవి
వెన్నంటును తరతరములు వన్నెల నిచ్చున్ ||
 
అన్నమయ్య కవిత్వ రీతులు వెన్నను పొంగిస్తే వచ్చే కమ్మని వాసనల వంటివి. అవి విజ్ఞానఖనులు. ఎన్నో తరాలు మారినా అవి నిలిచే ఉంటాయి. కీర్తిని తెస్తాయి.

కం|| తనరగ సిద్దేశ్వరునకు
నొనరించితి సాష్టాంగము ఒప్పెడు మదితో

అనితర మోక్షప్రదాతకు
ఘన యోగిబృందపతికి గిరిజా పతికిన్ ||
 
నిశ్చల మనస్సుతో సిద్దేశ్వరునకు, గిరిజాపతికి, మోక్ష ప్రదాతకు, మహా యోగుల బృందానికి అధినాదుడైన పరమేశ్వరునకు సాష్టాంగ నమస్కారం చేశాను.

కం
|| కామాక్షి కామదాయిని
వామాంకి సిద్దేశ్వరి వారినేత్రీ
రామ సహోదరి తల్లీ
కామంబులు దీర్పవమ్మ కంజదళాక్షీ ||

అమ్మా కామాక్షీ.కామదాయినీ.సిద్దేశ్వరునకు సగభాగమా. పద్మలోచనీ.విష్ణుసహోదరీ.నా మనోభీష్టాలను  నెరవేర్చు తల్లీ.

కం || సరిగా నిను మదిని దలచి
వరమిమ్మని కవితా సతి కరమును గోరన్
బిరబిర పద్యము లల్లన
వరుసలుగా నొరసి మెరసె వింతగ తల్లీ ||

చక్కగా నిన్ను మనస్సులో స్మరించి కవిత్వ శక్తిని ప్రసాదించు తల్లీ అని కోరుకున్నాను. వెంటనే పద్యములు బిరబిరమంటూ వరుసలుగా బయల్వేడలి వింత గొలుపుతున్నాయి.

కం || ఏకా తాతయ సిద్ధుం
డేకాకిశివుని గొల్చి యైక్యం బొందెన్
లోకాలోకము లొల్లక
పాకాదుల వదలి మీరి పరమును గాంచెన్ ||

ఏకా తాతయ్య అనే సిద్ధుడు ఈ క్షేత్రంలో ఏకాంత వాసిగా శివుని ధ్యానించి శివునిలో లీనం అయ్యాడు. స్వర్గ భోగాలను ఈసడించిన వాడై, జిహ్వ చాపల్యాది మానవసహజ మోహాలను త్రోసివేసి మోక్షాన్ని పొందాడు.

కం|| తాతయ్య వంటి యోగియు
పాతకహారిగ బరగెడి సిద్దేశ్వరుడున్
సీతాపతి వంటి విభుడును
కృతికవి యన్నయ సరియౌ కవియున్ గలరే ||

తాతయ్య వంటి యోగీ, సిద్ధేశ్వరుని వంటి పాపములు పోగొట్టు దేవుడూ, శ్రీరాముని వంటి ప్రభువూ, అన్నమయ్య వంటి కవీ ఎక్కడా లేరుకదా.

కం|| అన్నయ గాంచెను ధన్యత
చెన్నుగ కేశవ పదముల సన్నిధియందే
దన్ను వైష్ణవు డయ్యెను
వెన్నుని మహిమలను బాడి విఖ్యాతముగా ||

ఈ కేశవమందిరంలోనే అన్నమయ్య ధన్యత్వాన్ని పొందాడు. విష్ణుమహిమలను చక్కగా కీర్తించి వైష్ణవునిగా మారాడు.