“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

28, డిసెంబర్ 2009, సోమవారం

ఒంటిమిట్ట - మిగిలిన ముప్పై ఎనిమిది పద్యాలు

భవనాశి మాలఓబన్న మహాభక్తుడు. ఈ క్షేత్రములోనే నూట ఇరువది ఏండ్లు బ్రతికి రామనామస్మరణచే ధన్యుడైనట్టి పుణ్యజీవి.కులము గాదు గుణము ప్రధానమని నిరూపించిన సాధుపుంగవుడు.'భవనాశి' అని సార్థకమైన ఇంటిపేరు గలవాడు. నేడు ఈయన కుటుంబమువారు ఇక్కడి దగ్గరిలోనే పల్లెలో 'బోనాసి' వారనే పేరుతొ ఉన్నారు.వారికి ఆలయంలో ఈనాటికీ ప్రత్యెక గౌరవం కలదు.

కం||విత్తంబు నొదలి యోబన
తత్వంబుల బాడెనిచట తన్మయుడగుచున్
చిత్తంబున్ రామునకిడి
మొత్తంబుగ మహిని నిల్చె మోక్షాధిపుడై ||

ధనేషణ వదలి తన చిత్తాన్ని రామునకిచ్చి తత్వాలను పాడుకుంటూ ఇదే క్షేత్రంలో ఓబన్న అనే సాదుపుంగవుడు నివసించేవాడు.

కం||అన్నా యనుచుం జీరిరి
కన్నారము నీదు మహాధన్యపు భక్తిన్
చెన్నారగ రమ్మని యో
బన్నను బట్టుక యేడ్చిరి భక్తవరేణ్యుల్||

ఒకనాడు ఇతడు మాలవాడని తలచి,'వాకిలి ఎదురుగా నీవేమిటి?'అని ఆక్షేపించి అతన్ని ఆలయం వెనుకవైపు కూర్చోనమని ఆదేశించారు ఆలయపెద్దలు.తర్వాత చూడగా సీతారాముల విగ్రహాలు దిశమారి ఆలయం వేనుకవైపునకు చూస్తూ కనిపించాయి. అప్పుడు తమ తప్పు గ్రహించి క్షమించమని అతన్ని ప్రార్ధించి మర్యాదగా ఆహ్వానించి గౌరవించారు.

||తాను తినెడిముద్ద తగ నీకె ర్పించి
కీర్తనముల బాడి ఆర్తుడగుచు
మాలకులము నందు మహనీయ మూర్తియై
ధరణినిల్చె యోబదాసుడిచట||

తాను తినే ముద్దనే నీకు నైవేద్యంగా అర్పించేవాడు.ఆర్తితో కీర్తనములు పాడేవాడు.మాలకులంలో పుడితే మాత్రం ఏమి?మహనీయుడయ్యాడు. అటువంటి ధన్యజీవి ఓబన్న.

ఆ||పండుముసలియగుచు నుండేనీ యోబన్న
నూట ఇరువదేండ్లు వాటముగను
పుణ్యపురుషుడగుచు పూర్ణాయువందెరా
మాలయైన యేమి మాన్యుడతడె||

పండు ముసలి వయస్సులో నూటఇరవైఏళ్ళు బ్రతికి పూర్ణజీవి అయ్యాడు ఓబన్న. మాలయైతేనేమి ఇతడే కదా మాన్యుడు.

ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఉండిన అయ్యలరాజు తిప్పరాజు అనే కవి ఒంటిమిట్ట నివాసి. ఆయన రామానుగ్రహంతో రఘువీరశతకం వ్రాసినాడు.

కం||రఘువీరుని శతకంబును
జిగిమీరగ జెప్పినావు చిత్రపు రీతిన్
తగ నొంటిమిట్టవాసిగ
జగమేలిన త్రిపురాంతక తిప్పయరాజా||

అయ్యలరాజు రామభద్రకవి పదినెలల పాపగా దేవాలయములో తప్పిపోయి రాత్రంతా మహాలయంలో పురుగూపుట్రా మధ్యలో చీకటిలో ఏడుస్తూ ఉండి,మనసు కరిగిన తల్లి సీతమ్మవారి దయకు పాత్రుడై, ఆయమ్మ స్తన్యమును గ్రోలిన ధన్యజీవి. ఆయన రామాభ్యుదయము అనే కావ్యమును రచించాడు.

కం||పిల్లని తల్లియు తండ్రియు
చల్లన మరి వీడిపోయి రల్లన గుడిలో
తల్లిగ పాలంద్రాపెను
బాలకునా లోకమాత బాగుగ గాచెన్ ||

ఒకనాడు ఉత్సవ కోలాహలంలో ఇతని తల్లీ తండ్రీ పిల్లవానిని గుడిలో వదలి మరచి ఇంటికి పోయారు. అంత పెద్ద దేవాలయంలో చీకటిలో ఏడుస్తున్న పిల్లవానిని సీతామాత కరుణించి పాలిచ్చి కాపాడింది. తెల్లవారి లేచి అందరూ వెదకి చూడగా పిల్లవాడు గర్భగుడిలో నిద్రిస్తూ ఉండటమూ పిల్లవాని నోటినుంచి పాల చారికలు ఉండటమూ చూచి అందరూ విస్తుపోయారు.

కం||ఎంతటి భాగ్యము నీదిర
అంతటనా వేల్పులెల్ల వింతగ జూడన్
మాతయె బ్రహ్మకు పావన
జాతయె నిను ముద్దుచేయు రీతియదేమో?||

రామభద్ర కవీ!!ఏమి భాగ్యమయ్యా నీది?ఆ దేవతలందరూ వింతగా చూస్తుండగా సాక్షాత్తూ లోకమాత నిన్ను ముద్దుచేసి నీకు పాలిచ్చిన సంఘటన ఎంత వింతగా ఉన్నది?

కం||ధన్యము నీదగు జన్మము
ధన్యంబిక నీ గోత్రము ధన్యము భువిలో
ధన్యంబిక ముమ్మాటికి
అన్యము గాదనుట నిజము అయ్యలభద్రా||

ఓ అయ్యలభద్రా,నీ జన్మధన్యం.నీ గోత్రం ధన్యం.ముమ్మాటికి నీవు ధన్యుడవు.నీ గురించి ఇంకేమీ చెప్పలేము.

ఇమాంబేగ్ అనే ముస్లిం పాలనాధికారి దేవాలయాల విధ్వంసం చేసి అందలి సంపదను కొల్లగొట్టి నవాబుకు అర్పించేవాడు.అతడు ఇచ్చట రాముని పరీక్షించి ఆయన వాణిని విని అచేతనుడై రామభక్తుడై దేవాలయాభివృద్ధికి కృషి చేసినాడు.

||తురకలెల్ల జేరి తుచ్చంపు మనమున
బేగునంపి కూల్చి దేవళముల
మంచి వైన యట్టి మాణిక్య రత్నాలు
వారి రాజుకంపు విధము నిచట ||

||బేగుడొచ్చి ఇచట భీకరంబుగనిల్చి
దేవుడున్న యెడల రావలయును
లేని యెడల కూల్తు దేవళంబని జెప్ప
పలికినావు నీవు పట్టుబట్టి||

కం||కలడా దైవంబిట యని
అల్లన బేగుండు జేరి గొల్లున బిలువన్
పలికిన నీ స్వరమును విని
ఉలుకున నీ భక్తుడయ్యె తురకుండిలలో||

పోతులూరి వీరబ్రహ్మంగారు ఇక్కడి శ్రీరాముని దర్శించి తరించిన మహా యోగులలో ఒకడు. ఆయన గురించి తెలియని తెలుగువాడు ఉండడు.

||కందిమల్లపల్లె కవిరాజ ముఖ్యుండు
నిన్ను జూడవచ్చి సన్నుతించి
కలిమిమీర జెప్పె కాలంపు జ్ఞానంబు
నీదు కరుణచేత నిక్కముగను||

||పోతులూరి యోగి పొంకమ్ముగావచ్చి
దండమాచరించి ధన్యుడయ్యె
కాలజ్ఞానసుధను కామితంబుగ జెప్పి
కీర్తినొందెనిచట సార్థకముగ||

||వీరబ్రహ్మయోగి వింతైన తత్వాల
లోతులెరుగ తరమె లోకులకును
నీదుకరుణవల్ల నిజబోధ గల్గురా
మందహాస యొంటిమిట్టవాస||

ద్వాపరయుగంలో పరీక్షిత్ మహారాజుకిచ్చిన శాపంవల్ల తనకు కలిగిన తపో హీనతను పోగొట్టుకోడానికి శృంగిమహాముని ఇక్కడే తపస్సు చేసినాడు. ఇక్కడికి దగ్గరిలోనే శృంగిశైలం అనే పర్వతం ఇప్పటికీ ఉన్నది.

||శృంగిశైలమనెడి బంగారు కొండపై
తపము జేసె శృంగి ద్వాపరమున
బాలకాండ వ్రాసె భళియాంద్ర వాల్మీకి
ఇదియె పర్వతమున నింపుగాను||

||పాము దెచ్చి రాజు పాపమా మునిమెడను
వేసిపోవ శృంగి వేసరిల్లి
తక్షకుండు గఱచి తాజంపు నిన్నంచు
శాపమిచ్చె నపుడు సాహసమున||

||శాపమొసగి తాను శక్తి హీనుండౌట
జూచి శౌనకుండు చల్లగాను
రాముడున్న యట్టి రమ్యమౌ శైలాన
తపము జేయుమంచు తనయునంపె||

ఇక్కడకు దగ్గరలోనే మృకండుకొండయనే ఒక పర్వతం కలదు. దానిమీదనే మార్కండేయుడు తపస్సు చేసి శివుని మెప్పించిన మృకండేశ్వరాలయం ఉన్నది.


కం||వీలుగ మార్కండేయుడు
శూలిని మెప్పించెనిచట కాలుని గెలిచెన్
హాలాహలకంఠుని గని
ఏలెను చిరజీవితమ్ము రాలెను సుమముల్||

కం||కలదొక పర్వతమిచ్చట
నిల మృకండుని కొండను ఇంపగు పేరన్
లీలగ గంగాధరుడిట
కాలుని దండించెనంత బాలుడు బ్రదికెన్||

ఆలయంలోనే 1961 సంవత్సరంలో సమర్థసద్గురు నారాయణ మహారాజ్ గారు పదకొండురోజులు అఖండరామనామ సంకీర్తనం నిర్వహించారు. ఆయన తన దివ్యదృష్టితో అనేకవేల సంవత్సరములనుండీ భూస్థాపితమై ఉన్న స్పటికసాలగ్రామమును భూగర్భములో దర్శించి దానిని బయటకు తీయించి రామలింగేశ్వరుడనే పేరుతో ప్రతిష్ట చేసారు.

||కాంచెనిచట గురుడు ఘనసాలగ్రామంబు
ధరణియందు నొకటి దాగినటుల
త్రవ్వితీసి దాని స్థాపించె నిచ్చోట
రామలింగుడనుచు రక్తిమీర||

మళయాళసద్గురుని శిష్యుడైన సాయంవరదదాసు మంచికవి.ఆయన ఇక్కడివాడే.శ్రీరామునిపైన ఆయన కవిత్వము విని తిరుపతి వెంకటకవులే మెచ్చుకున్నారు.వరదదాసా!!కవివంటే నీవు మేము కాదన్నారు.ఇక ఇతరులు చెప్పెడిదేమి?

||వరదదాసు కవిత వర్ణింప నాలించి
వేంకటాఖ్య కవులు వింతగాను
కవివియన్న నీవు కామంచు మేమని
సన్నుతించిరతని సమ్మతించి ||

కం||మళయాళ గురుని శిష్యుడు
ఇల రాముని కీర్తించుట వినుచును వారల్
భళియని తిరుపతి కవులిట
తలలూచిరి వరదదాస! వరకవి వనుచున్||

మువ్వగోపాలపదముల లోకప్రసిద్ధుడైన క్షేత్రయ్య క్షేత్రమును దర్శించి రామానుగ్రహమునకు పాత్రుడయ్యెనని ఇక్కడ అంటారు

||పదములెల్ల బాడి పరగెనీ క్షేత్రయ్య
పాపమెల్ల బాసి పావనుండు
దేశమెల్ల దిరిగి దైవతంబుల దలచి
నిన్నుగొల్చి తాను ధన్యుడయ్యె||

||మువ్వగోపబాలు ముత్యాల పదముల
బాడినావు నీవు పాపరహిత
సరిగ నాల్గువేల శృంగారతత్వాల
రమ్యతాళ గతుల గమ్యమలర||

ఒంటిమిట్ట కోదండరాముని కీర్తించి ముక్తిని పొందినవారు ఎందఱో ఎందరెందరో?మహాకవులు,మహాభక్తులు,మహాయోగులు ఎందరికో వరము లిచ్చిన ఘనుడీ కోదండరాముడు.

||భక్తకవుల బృంద మత్యంత వినయాన
పొగడి నిన్ను ముక్తి పొందిరిచట
ఇంతకన్న వరము ఇంకేమి కలదురా
మందహాస యొంటిమిట్టవాస||

భగవంతుని ఏది కోరితే అది తప్పక లభిస్తుంది. ధనం కోరితే అదీ లభిస్తుంది. ముక్తి కోరితే అదీ దొరుకుతుంది. ఏది కావలెనో మనమే తేల్చుకోవాలి.

||పసిడి గోరనదియె ప్రాప్తించు నిక్కంబు
నిన్నుగోరి వేడ నిన్నెజేరు
తెలివిగలుగు వారు తేల్చుకోవలెనింక
మందహాస యొంటిమిట్టవాస||

జీవునికి చిట్టచివరి జన్మలయందుగాని మోక్షమందు ధ్యాస కలుగదు.

||తిరిగి జన్మలందు తపియించి జీవుండు
కడమ పుట్టుకమున కనులు దెరచి
నిన్నుదలచినపుడు నిర్వాణమందురా
మందహాస యొంటిమిట్టవాస||

||నేను నాది యన్న నీచంపు భ్రమలేల
బ్రతుకులోన నిన్ని బాధలేల
నిన్ను జేరి నేను నిత్యుండనయ్యెదన్
మందహాస యొంటిమిట్టవాస||

ఏమి స్థలమహాత్యము? ఇట్టి స్పందనలు ఎక్కడా కలుగలేదు కదా?ఇట్టి రసానుభూతి, కవితావేశం కలిగించిన నేలలో ఎంతటి ధన్యత్వం ఉన్నదో

||ఇట్టినేల జూడ నెక్కడైననులేదు
ఎందరెందరిచట బంధ మూడి
పరమముక్తి గనిరి పావనాత్మకులైరి
మందహాస యొంటిమిట్టవాస||

||కవులు యోగులెల్ల కమనీయ మొప్పార
భక్తులెల్ల నిన్ను బాడిరిచట
భక్తి నదిని మునిగి బ్రహ్మరూపకులైరి
మందహాస యొంటిమిట్టవాస||

నీకరుణ ఉన్నచో నాకేమి తక్కువ?నేను నీ భక్తుడను.భుక్తియైనా, భక్తియైనా,శక్తులైనా, మరి ముక్తియైనా నాకు సులభమే.

||నీదు కరుణ యున్న నింకేమి తక్కువ
భక్తియైన దివ్యశక్తులైన
ముక్తియన్న నాకు ముంజేతి దండరా
మందహాస యొంటిమిట్టవాస||

||రామరామ యనుచు రామచంద్రయనుచు
రామభద్ర యనుచు రంగుగాను
నీదు నామమింక నిత్యంబు దలచెదన్
మందహాస యొంటిమిట్టవాస||

శ్రీరామకృష్ణుని మనస్సులో నిరంతరమూ స్మరించిన నా భాగ్యవిశేషమేమో, క్షేత్రములో శ్రీరామానుగ్రహము ప్రాప్తించినది.రాముడైనా కృష్ణుడైనా నేనే అని చెప్పినాడుగా శ్రీ రామకృష్ణుడు.

||రామకృష్ణునింక నీమమ్ముగానేను
గొల్చినట్టి ఫలిత మిద్దియేమొ
రామచంద్రు కరుణ రమ్యంబు గాదక్కె
ధన్యుడైతి నీదు దయను బొంది||

||దేహదాస్య మింక సాహసంబున వీడి
ఇంద్రియముల మించి ఇచ్చగించి
ఆత్మగతిని బొంది అమరుండ నయ్యెదన్
రామ నీదు కరుణ రచ్చలేల||


శ్రీరామా.నీకరుణ చేత సామాన్యుడనైన నేను నూరుపద్యములు ధాటిగా చెప్ప గలిగాను. అది నా గొప్ప గాదయ్యా. నీ కరుణ మాత్రమె.

||ఒంటిమిట్ట యనెడు యొకదివ్య వరభూమి
గాంచియుంటి నేను ఘనతరముగ
నీదు కరుణ దడిసి నిక్కంపు కవినైతి
మందహాస యొంటిమిట్టవాస||

కం||కలమా ప్రాణము లేనిది
బలమై నా రాముడుండ బహువిధరచనల్
కలిగిన రీతిని నాచే
కల్పించితివిట్టి పద్యకవితా గరిమల్||

కం||నీదగు కవితా శక్తిని
నాదగు ఈపాణి బట్టి నడపించితివా
నీ దయ గూరిమి మహిమన్
నాదౌ ఈరచన వెలసెనిటు చిత్రముగా||

క్షేత్రాన్ని దర్శించి, నీ కరుణావృష్టిలో తడిసి నేను ధన్యుడనైనాను. క్షేత్రంలో నాకు కలిగిన ఆంతరికానుభవం ఏమిటో నేను వ్రాయలేను. అది నాలోనే ఉంటుంది. కాని నిన్ను, క్షేత్రాన్ని, ఇక్కడి మహాపురుషులనూ స్మరిస్తూ పద్యాలను ముక్కోటిఏకాదశినాడు వ్రాసి పూర్తిచేయగలిగాను.

కం||ధన్యుడనన్నమ దేశిక
ధన్యుండను తాతాయతి ఘనసిద్ధేశా
ధన్యుండను వసుదాసా
ధన్యుడ నేనొంటిమిట్ట ధరణీనాధా||

ఓ అన్నమయ్యా, ఓ తాతయ్యయోగీ,ఓ సిద్ధేశ్వరా,ఓ వసుదాసా,ఓ కోదండరామప్రభూ!!! మీస్మరణచేత నేను ధన్యుడనయ్యాను.