“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, డిసెంబర్ 2009, గురువారం

భక్త కవి పోతన పై వచ్చిన ఇరవై పద్యాలు










భక్తకవి పోతన చిరస్మరణీయుడు. ఆంధ్రభాగవత మున్నంతవరకు ఆయన పేరు ఆచంద్రార్కంగా నిలబడి ఉంటుంది.భోగభాగ్యముల నొల్లక,నిరాడంబరజీవియై, భక్తియనునదే జీవితమున అతిముఖ్యసూత్రమని జీవించి చూపిన సత్కవి.ఆయన జీవితము తెలిసినవారికి ఈ పద్యముల వివరణ అక్కరలేదు."అక్షరమెరుగని పోతన" అనే ఒక్కపద్యము మాత్రము సందేహము కలిగించవచ్చు. పొతనకు అక్షరములు రావా?యని.అది నిజము గాకపోవచ్చు.వాడుకగా వినిపించే కొన్ని స్థానికగాధలను బట్టి ఆ పద్యము నా మదిలో అల్లుకున్నది.

పోతనయొక్క భాగవతరచన ఇక్కడనే జరిగినది అని దివాకర్ల వెంకటావధానిగారు,
వానమామలై వరదాచార్యులుగారు,శేషాద్రిశర్మగారు, పుట్టపర్తి నారాయణాచార్యులుగారు,వావిలికొలను సుబ్బారావు గారు తేల్చిచెప్పిరి.ఆంద్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారైతే తన దివ్యదృష్టితో చూచి కిష్కింధ నేటి హంపియనికూడా చెప్పిరి.

ఒంటిమిట్టలో బమ్మెరగడ్డ అనిన భూమి ఈనాటికీ ఉండుటను,పోతన భూమిదున్నిన మడి ఇక్కడ ఉండుటను,ఆయన నివసించిన ఇల్లు ఒంటిమిట్టలో ఉండుటను బట్టిచూస్తె పోతన ఒంటిమిట్టలో నివసించిన దాఖలాలు ఉన్నాయి.పరిశోధకులు తేల్చినదేమనగా కాకతీయరాజ్య పతనానంతరము ఓరుగల్లులో ముస్లిముల అరాచకాలు,హింస,దేవాలయవిద్వంసము మితిమీరగా ఆ ప్రాంతములో నివసించలేక అనేక కుటుంబాలు వలసలు పోయాయి.పోతన కుటుంబము కూడా అక్కడనుంచి విధిలేని పరిస్తితులలో వచ్చి ఒంటిమిట్టలో  స్థిరపడి చిన్నభూమిని దున్నుకొనుచూ ఒంటిమిట్టలోని బమ్మెరగడ్డ అను ప్రాంతములో బ్రతికినారు.

పోతన ఓరుగల్లువాడా లేక ఒంటిమిట్టవాడా అని సందేహములు మిక్కుటముగా కలవు.అనేకులు పండితులు పరిశోధించి తెల్చినదేమనగా,బమ్మెర గ్రామము ఓరుగల్లు సమీపముననే ఉండుట నిజము. కాని పోతన ఒంటిమిట్టలో నివసించినదీ నిజమే. ఓరుగల్లు ప్రాంతములలో శివాలయములు దప్ప ప్రసిద్ధికెక్కిన రామాలయములు లేవు. కనుక పోతన భాగవతమును అంకితమిచ్చిన కోదండరాముడు ఒంటిమిట్టరాముడే.

పోతన నిరుపేదయని, పిల్లవానిగా
పశువులు గాచుకునే సమయంలో చిదానందయోగి వద్ద శ్రీరామ షడక్షరీ తారక మంత్రోపదేశమును పొంది దానిని నిత్యమూ అనుష్టానము జేసెడివాడని ఒకగాధ ఈ ప్రాంతములో ప్రచారములో కలదు.రామనామ మహిమయే ఆయనను సత్కవిని జేసినది.రామనామమును భక్తితో కొద్దిసేపు స్మరించిన సామాన్యుడనైన నాకే ఇన్ని పద్యములు స్ఫురించగా లేనిది,మరి ఆజన్మాంతము నియమపూర్వక సాధనజేసిన పోతనవంటి బ్రాహ్మణోత్తములకు అంతటి కవితాశక్తి వచ్చుటలో వింత ఏముండును ? శ్రీ రామనామ మహిమ ఊహించనలవిగానిదిగదా.ఇక పద్యాలు చదవండి.

కం ||తలచితి పోతన సత్కవి
నలసిన మది సేదదీర నతిభక్తి యుతిన్
విలసిత రామచరిత్రు న
కలంక నిశ్చల గుణయుతు నద్భుత చరితున్ ||


అలసిన నా మది సేదదీరునట్లు సత్కవి, రామభక్తి పరాయణుడూ, మలినము లేనట్టి నిశ్చలమైన మనస్సు కలవాడూ అయిన పోతన్నను భక్తితో ధ్యానించాను.

కం || పోతన పద్యమె పద్యము
వితతముగా భక్తి మీరు వింతౌ నడకల్
సతతము రామానందము
గతియై గన్పట్టు లోకతతులకు నిలలో ||


పద్యమనగా పోతన్నదే పద్యము. భక్తితో నిండి వింతైన నడకలతో ఒప్పారుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ రామభక్తిలో ఓలలాడుతూ ఉండి ఈ నశ్వర లోకానికి గతియై కనిపిస్తూ ఉన్నది.

కం || బమ్మెర యుండుట నిక్కము
ముమ్మాటికి నోరుగల్లు సామీప్యమునే
ఇమ్మహి పోతన జెప్పెను
నెమ్మదిగా భాగవతము నొంటీమిట్టన్ ||


బమ్మెర గ్రామము ఓరుగల్లు సమీపముననే ఉండవచ్చు. కాని పోతన్న భాగవత రచన చేసినది మాత్రము ఇక్కడనే.

కం || సంకుల సమరానలమౌ
వంకన ఆ యోరుగంటి నొదలుచు వడిగా
పొంకముగా జేరితివిట
శంకారహిత సుమనమున సత్కవిచంద్రా||


వరుస దండయాత్రలతో కునారిల్లుతున్న ఓరుగల్లును ఒదిలి కుటుంబంతో సహా పోతన్న ఒంటిమిట్టకు వచ్చి చేరినాడన్నది చారిత్రికవాస్తవం.

కం || అల వైకుంఠపురంబని
చెలగినదా కవిమనంబు నిచ్చోటుననే
వెలయుచు రాముండప్పుడు
బలిమిని పద్యంబొసగిన ప్రాంతంబిదిగో ||


'అల వైకుంఠ పురమ్ములో' అంటూ పోతనార్యుని   మనస్సు చెలరేగినది ఇక్కడనే. అసంపూర్తిగా ఉన్నట్టి పద్యపాదాన్ని శ్రీరాముడే స్వయముగా పూరించిన ప్రాంతం ఇదిగో.

కం || హాలిక కుశలమ్మా యని
గేలిగ శ్రీనాధుడు తన వాలము జూపన్
ఆలోకించుచు పోతన
లీలగ నా కాడి విప్పి తోలెను హలమున్ ||


'ఓ హాలికా కుశలమా' అంటూ శ్రీనాధుడు పొలము దున్నుచున్న పోతన్నను గేలిచేసిన ప్రాంతం ఇదే. దానికి దీటుగా పోతన్న ఎద్దులను విప్పి ఒట్టినాగలితో పొలమును దున్నించిన మహిమాన్విత ప్రాంతం కూడా ఇదే.

కం || ఒడలెల్ల నొంచి పోతన
మడి దున్నిన భూమి యిదియె మాన్యత గనుమా
సడలింపడు యభిమానము
ఒడి బట్టడు రాజులెదుట వహ్వా యనుచున్ ||


బ్రతుకు తెరువుకోసం పోతన తన  ఒళ్ళు వంచి పొలము దున్నిన ప్రాంతం ఇదేసుమా.కష్టాన్ని సహించి వ్యవసాయం చేసాడుగాని అభిమానం చంపుకొని రాజులను పొగడి వారి ఎదుట చెయ్యి చాచలేదు.

కం|| హాలికు డైనను ఏమా

జాలమునన్ జిక్కకుండ కాలుని కెదురై
చాలింపుచు నత్యాసలు
మేలంచున్ రాము గొల్చె మనమున నిటనే ||


ప్రపంచ వ్యవహారం లో చిక్కకుండా ఉంటే చాలు, రైతునైతే మాత్రం ఏమి? అంటూ కాలాన్ని ధిక్కరించిన పోతన్న, శ్రీరాముని తన మనస్సులో ధ్యానించిన చోటు ఇదే కదా.

కం|| బాల రసాలం బంచున్
లీలగ తాజెప్పెనిచట శ్రీనాధునితో
హాలికుడనైన నేమని
ఏలెను తాభక్తి సీమ నేకాంతికుడై ||


'బాల రసాల సాల నవపల్లవ' మ్మంటూ నీవు అలవోకగా శ్రీనాధునికి పద్యం చెప్పిన ప్రాంతం ఇదే. భూమి దున్నుకుంటూ బ్రతికితే మాత్రం ఏమైనది?భక్తి సామ్రాజ్యాన్ని ఏలినావు కదా పోతనార్యా?

కం || ఇమ్మని నంతన్ రాజుకు
కమ్మని శ్రీభాగవతపు కన్యామణినిన్
ఇమ్మనుజాధములకు తా
సమ్మతి నమ్మక ముదమున రామున కొసగెన్ ||


మహారాజుకు నీ కవితా కన్యకను అంకితం ఇవ్వవయ్యా నీ దరిద్రం తీరుతుంది అని శ్రీనాధుడు చెప్పినా వినకుండా, డబ్బుకోసం ఈ మనుజాధములకు నా కవితామణిని అమ్ముకోను అంటూ దరిద్రంతో బాధపడుతూ కూడా భాగవతాన్ని శ్రీరామునకే అంకితం ఇచ్చావు కదా. ఎంత అద్భుతం?

కం || సేవేల రాచ కొలువున?
చావేలని ఆ కుతంత్ర శోకాంబుధిలో?
ఛీ వలదని ఆ ఖర్మము
సేవకుడైతివి చనవుగ శ్రీరామునకున్ ||


రాజుల కొలువులో సేవ నాకెందుకు?ఆ కుట్రలు కుతంత్రాలలో చావెందుకు?ఛీ!! అట్టి ఖర్మ నాకు వద్దంటూ శ్రీరామదాసుడయ్యాడు పోతన్న.

కం || పేదవు నీవా కవివర?
లేదా శ్రీరామ భక్తిరత్నము నీతో?
వేదాంత సారమిలలో
నాదాంతపు సీమనిచ్చు నద్భుతమణిగా ||


ఓ కవివర్యా ! నీవు పేదవా? ఎవరా మాటన్నది? రామభక్తి అనే అద్భుతమైన రత్నం నీవద్దలేదా?వేదాంత సారమైనట్టిది కదా ఆనామం.యోగులు ఆశించే నాదాన్తపు సీమకు ఆ నామం అవలీలగా చేర్చగలదుకదా. అటువంటి నిధి నీవద్ద ఉండగా నీవు పేదవు ఎట్లా అవుతావయ్యా?

కం || ఏరీ ఆ రాజన్యులు?
ఏరీ నిను దూరినట్టి ఆ కవివర్యుల్
పేరైన గలదె భూమిని?
వారలు బోవగ హరికథ వాసిగ నిల్చెన్ ||


ఆ మహారాజులందరూ ఏరి? నిన్ను ఎగతాళి చేసి నవ్విన ఆ కవులందరూ ఏరి? వారి పేరైనా ఇప్పుడు భూమిమీద ఉన్నదా? వారందరూ గతించారు. వారిని అనుకునేవారు లేరు. కాని నీ రచనయైనట్టి 'శ్రీమద్భాగవతం' మాత్రం చిరస్థాయిగా నిలిచి ఉన్నది.

కం || తలచిన వారేరిలలో
బలసిన ఆ గర్వమతుల భంగపు పాటున్
వెలయుచు తారార్కంబుగ
నిలచెను నీకృతియెనిట్లు నో కవివర్యా ||


ఆ గర్వపోతుల భంగపాటును తలచుకునే వారైనా ఇప్పుడు భూమిలో ఉన్నారా?కాని నీ కృతిమాత్రం సూర్యచంద్రులు,నక్షత్రములున్నంత వరకూ నిలిచి ఉంటుంది కదా.

కం || అక్షరమెరుగని పోతన
అక్షయ కావ్యమ్ము జెప్పె నచ్చెరు వొదవన్
అక్షరమారగు మంత్రము
దక్షతగా దలచినట్టి  లక్షణ మహిమన్ ||


అక్షరం ముక్కరాని పోతన్న అక్షయమైన కావ్యాన్ని చెప్పగలిగాడు. ఎంత ఆశ్చర్యం? ఇదంతా శ్రీరామషడక్షరీ మంత్రోపాసనా ఫలితమే కదా?

ఆ || భట్టురాజు నగుచు బ్రతుగంగ నేటికి
ధరణిపతుల బొగడు దాస్యమేల
లోకనాధు గొలుతు లోటేమి నాకంచు
పోతనార్యుడంత పొంగె మదిని ||


ఒక భట్రాజులాగా రాజులను పొగుడుతూ వారికి ఊడిగం ఎందుకు చెయ్యాలి? కీర్తించడం తప్పకపోతే లోకనాదుడైన భగవంతునే కీర్తిస్తాను.అని నీమదిలో నిశ్చయించు కున్నట్లు నాకు తోస్తున్నది.

ఆ || లక్ష్మియన్న నతని లాస్యంపుటిల్లాలు
అతడు జూడ నాకు నయ్యడిచట
తల్లి కొమరునొదలి తానెట్టులుండునో
చూడవలయునిట్టి చోద్యమికను ||


విష్ణువు నా తండ్రి. లక్ష్మి ఆయన యొక్క ఇల్లాలు. నా తల్లి నన్ను వదలి ఎలా ఉంటుంది? అసంభవం. ఈ చోద్యం కూడా చూద్దాం అని నీవు అనుకున్నట్లు నాకు అనిపిస్తున్నది.

ఆ || మించి మీరినట్టి మాన్యంబు లవియేల
పట్టజాలనంత పసిడియేల
జీవయాత్ర జరుగ జాలంచు పోతన్న
భక్తినిధిని బొందె భవ్యముగను||


లెక్కలేనన్ని భూములు ఎందుకు?మొయ్యలేనంత బంగారం ఎందుకు? బ్రతకడానికి సరిపోయేటంత ఉంటే చాలు అనుకుంటూ పోతన్న, భక్తి అనే దివ్యమైన నిధిని పొందగలిగాడు.

ఆ || మోహవాంఛ లెల్ల దాహంబు హెచ్చించు
జన్మలెన్నొ ఇచ్చు జంతురీతి
నిన్నుగొల్చి మదిని నిర్భీతినుండెదన్
మోక్షసీమనంది మోదమలర ||


మోహవాంచలన్నీ దాహాన్ని పెంచుతాయి.ఎన్నెన్నో జంతుజన్మలను ఇస్తాయి.ఈ గోలంతా నాకెందుకు? నిన్ను ధ్యానిస్తూ నిర్భయంగా జీవిస్తాను.చివరిలో మోక్షాన్ని అందుకుంటాను.అని పోతన్న అనుకున్నాడు.

కం || బండలు రాజుల మనములు
మెండగు భక్తియె దడవుచు నండగ నిలచున్
గుండెత్తుచు శ్రీ నాధుడు
నిండుగ తావగచెనిట్లు డెందము నందున్ ||


'రాజుల మనస్సులు బండరాళ్ళు. ఎప్పటికైనా భక్తి అనేదే అండగా నిలుస్తుంది. నీవు చెప్పినది సత్యమే పోతన్నా ' అంటూ బండరాయిని ఎత్తుతూ శిక్ష అనుభవించే సమయంలో శ్రీనాధుడు తలచే ఉంటాడు కదా.