Love the country you live in OR Live in the country you love

30, ఏప్రిల్ 2025, బుధవారం

అక్షయతృతీయనాడు ఏం చెయ్యాలి?

పదవి, అహంకారం, గర్వం, లెక్కలేనితనం, దౌర్జన్యం  - ఒకవైపు

సాత్వికజీవనం, తపస్సు, మర్యాద, మంచితనం, నిదానం - మరొకవైపు

రెంటికీ జరిగిన ఘర్షణలో మొదటివర్గమే గెలిచింది.

అడవిలో తపోమయజీవనం గడుపుతూ, ధ్యాననిష్ఠలో ఉన్న జమదగ్నిమహర్షి హత్యకు గురయ్యాడు.

ఆయన కుమారుడైన పరశురాముడు క్రుద్ధుడయ్యాడు.

భారతఉపఖండమంతా 21 సార్లు వెదకి, దుర్మదాంధులైన పాలకులను వారి సైన్యాలను ఒక్కడే ఎదుర్కొని, వారిని అంతం చేశాడు పరశురాముడు.

దౌర్జన్యాన్ని ఒంటిచేతితో ఎదుర్కొని నిలిచి, తపశ్శక్తి ఒక్కటే ఆయుధంగా న్యాయంకోసం ఒక్కడే పోరాడిన మహావీరుడు పరశురాముడు. 

మానవచరిత్రలో అంతటి మహావీరుడు మరొకడు లేడు. 

అంతటి అమానుషశక్తి సంపన్నుడు కనుకనే, సాక్షాత్తు నారాయణుని అవతారాలలో ఆరవ అవతారంగా పూజించబడుతున్నాడు.

నిజంగానా?

దశావతారాల బొమ్మలలో తప్ప ఎక్కడా ఆయన ఆరాధన కనిపించడం లేదే?

ఒక్క కేరళలో, తుళునాడులో, ఉత్తరభారతం కొన్ని ప్రాంతాలలో కొంతమంది బ్రాహ్మణులు తప్ప ఎవరు పరశురామావతారాన్ని పూజిస్తున్నారు?

ఎవరూ లేరు.

మళ్ళీ కదిలిస్తే చాలు 'సనాతనధర్మం' గురించి అందరూ ఉపన్యాసాలిస్తారు. 

ఎక్కడుంది సనాతనధర్మం?

ఎవరిని పూజించాలి? ఎవరిని పూజిస్తున్నాం?

మన మహాపురుషులెవరు? మనం గుళ్లుకట్టి పూజిస్తున్నదెవరిని?

మనకసలు ఆత్మాభిమానం ఉందా?

ఆత్మపరిశీలన చేసుకోండి. అర్ధమౌతుంది.

ఈ రోజు పరశురామజయంతి.

నిస్సహాయస్థితిలో ఉన్నాసరే, న్యాయంకోసం, ధర్మంకోసం, రాజులనే ఎదుర్కొని పోరాడిన మహాఋషి పుట్టినరోజు ఇది.

మనజాతికి ఆత్మాభిమానాన్ని నేర్పిన అవతారపురుషుడు పుట్టిన రోజు ఇది.

కనీసం ఈరోజైనా ఆయనను ఆరాధించాలి.

కానీ, అందరూ ఏం చేస్తున్నారు? బంగారం షాపులకు ఎగబడి, కొద్దో గొప్పో బంగారం కొనుక్కుని, సనాతనధర్మాన్ని ఏదో ఉద్ధరించామని మురిసిపోతూ, సాయంత్రం సాయిబాబా గుడికెళ్తున్నారు.

చాలాబాగుంది కదూ ! ఇదే మరి సనాతనధర్మమంటే !

పరశురాముడిని మర్చిపోయాం గనుకనే పహల్ గావ్ జరిగింది.

ఆత్మాభిమానం నశించింది గనుకనే, అందరూ మనల్ని తొక్కుతున్నారు.

కనీసం ఈరోజైనా పరశురాముని ఆరాధించండి. ఆయన చరిత్రను చదవండి. ఆయనను ధ్యానించండి. ఆయన పౌరుషాన్ని కొద్దిగానైనా మనకు ప్రసాదించమని వేడుకోండి.

అప్పుడే భారతజాతికి మనుగడ ఉంటుంది.

లేదంటే, ఈరోజు మనం హాయిగా షాపింగులు చేసుకుంటూ, బంగారాలు కొనుక్కుంటూ, సాయంత్రం సినిమాలకెళ్తూ బ్రతకవచ్చు. రేపు మన పిల్లలు, వారి పిల్లలు ఈ దేశంలో ఉండలేక పారిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మన ఆడపిల్లలు నేడే లవ్ జిహాద్ లకు గురౌతున్నారు. రేపు ఇంకేం జరుగుతుందో కాస్త ఊహించుకోండి.

నకిలీ సనాతనధర్మాన్ని కాదు, అసలైన సనాతనధర్మాన్ని అనుసరించండి.

అప్పుడే మనకు భవిష్యత్తు.

తమ మూలాలను, తమ మహనీయులను మర్చిపోయేవారిని, ఆత్మాభిమానం లేనివారిని ఎవరూ బాగుచెయ్యలేరు.

read more " అక్షయతృతీయనాడు ఏం చెయ్యాలి? "

28, ఏప్రిల్ 2025, సోమవారం

సనాతనధర్మం

మొన్న కొంతమంది మా ఆశ్రమాన్ని చూడటానికి వచ్చారు.

కాసేపు కూర్చుని సేదతీరాక, వారిలో ఒకాయన, 'నేను సాయిబాబా ఆలయాల కమిటీకి ప్రెసిడెంట్ ను' అని పరిచయం చేసుకున్నాడు.

జాలిగా ఆయనవైపు చూశాను.

'ముప్పై ఏళ్ళనుంచీ ఇదే మార్గంలో ఉన్నాను' అన్నాడాయన.

ఏడుపొచ్చింది.

'పంచవటి' అని బోర్డుమీద ఉంది. పంచవటి అంటే నాసిక్ దగ్గర కదా?' అన్నాడాయన.

'అవును. వనవాసం సమయంలో సీతారామలక్ష్మణులు ఉన్న ప్రదేశం పేరే పంచవటి. అంతేకాదు, రామకృష్ణులు సాధన చేసిన ప్రదేశం పేరు కూడా అదే' అన్నాను.

'యోగాశ్రమం అని ఉంది. మీరు యోగా నేర్పిస్తారా?' అడిగాడాయన.

'మీరనుకునే యోగా, మాకు తెలిసిన యోగశాస్త్రంలో ఎల్కేజీ మాత్రమే' అన్నాను.

ఆయనకు అయోమయంగా ఉంది.

'మీరు ఇస్కాన్ భక్తులా?' అడిగాడాయన.

'మేము కృష్ణభక్తులమే. కానీ ఇస్కాన్ భక్తులం కాదు. వాళ్ళ పిడివాదం మాకు నచ్చదు' అన్నాను. 

'ఎవరైనా వాళ్ళ ఊరిలో సద్గురువు ఆలయాన్ని కట్టుకుంటామంటే, సాయిబాబా గుడి ఎలా కట్టాలో అదంతా నేను సలహాలిస్తుంటాను' అన్నాడాయన.

'హిందూమతంలో ఉండటం ఎందుకు? ఇస్లాం స్వీకరించండి' అందామనుకున్నా.

'సనాతనధర్మాన్ని కాపాడటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదా?' అన్నాడాయన.

'సనాతనధర్మానికి సాయిబాబాకూ ఏంటి సంబంధం?' అడిగాను.

ఆయన మాటలు ఆగిపోయాయి.

'సద్గురువుకు ఆలయం కట్టాలంటే ఆదిశంకరుల ఆలయాన్నో, రామానుజుల ఆలయాన్నో, మధ్వాచార్యుల ఆలయాన్నో, లేక ఈ మూడుభావనలనూ సమన్వయం చేసిన రామకృష్ణుల ఆలయాన్నో కట్టాలి. అసలు సాయిబాబా సద్గురువు ఎలా అవుతాడు?' అడిగాను.

సాయిబాబా పేరు చెబుతూనే నేనుకూడా అందరిలాగా డంగై పోయి, కాళ్ళు పట్టుకుంటానని అనుకున్నట్టున్నారు. నేనలా లేకపోయేసరికి వాళ్లకేం అనాలో తోచలేదు.

'సద్గురువైనవాడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలని వేదం చెబుతోంది. సాయిబాబా ఈ రెండూ కాదు. మరి ఆయన సద్గురువేంటి?' అడిగాను.

'మీరెవరిని పూజిస్తారు?' ప్రశ్నలు మొదలయ్యాయి.

'ధ్యానమందిరానికి వెళ్లి చూడండి. తెలుస్తుంది' అన్నాను.

'అక్కడ రామకృష్ణుల ఫోటో ఉంది' అన్నాడు.

'ఇంకా చాలామంది ఫొటోలున్నాయి. వివేకానందస్వామి, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగారు, మెహర్ బాబా, అరవిందులు, కంచి పరమాచార్య, మా గురువులు ఇలా చాలా ఉన్నాయి. అన్నింటినీ మించి, కలకత్తా కాళీమాత ఫోటో ఉంది. కనిపించలేదా?' అడిగాను.  

'మీది రామకృష్ణా మిషనా?' మళ్ళీ ప్రశ్న.

'మాది ఏ మిషనూ కాదు. మాదగ్గర వాషింగ్ మిషను తప్ప ఇంకేమీ లేదు. అక్కడున్న ఫోటోలలో ఉన్నవారి సంస్థలతో దేనితోనూ మాకు సంబంధం లేదు. కేవలం వారి ఉదారభావాలు మాత్రం మాకు నచ్చుతాయి. వాటిలో కూడా అన్నీ నచ్చవు. ప్రాచీన ఋషిప్రోక్తమైన వేదాంత-యోగభావాలతో కలిసినంతవరకూ ఎవరిభావాలైనా మాకు నచ్చుతాయి. కలవకపోతే నచ్చవు. వాటిని బోధించిన అసలైన మహనీయులను అందరినీ మేము ఆరాధిస్తాము' అన్నాను, 'అసలైన' అనే పదాన్ని వత్తి పలుకుతూ.

'సేవా కార్యక్రమాలు ఏమీ చెయ్యరా?' అడిగాడాయన.

'సమాజసేవ పైన మాకు నమ్మకం లేదు. దానిపేరుతో చేయబడే వ్యాపారం కంటే, ఆత్మసేవే ముఖ్యమని నా ఉద్దేశ్యం. అందుకే ఏ విధమైన సేవనూ మేము పెట్టుకోలేదు. నా ఉద్దేశంలో సేవ అనేది అసలిప్పుడెవరికీ అవసరం లేదు' అన్నాను.

వారు చేస్తున్న 'సేవ' గురించి చెప్పడం ఆయన మొదలుపెట్టాడు.

'ఏడాదికొకసారి ఊరంతా తిరిగి లారీడు బియ్యం పోగుచేసి అందరికీ అన్నదానం చేస్తుంటాము' అన్నాడాయన.

'అందరూ డబ్బులేసుకుని అందరూ కూచుని తింటే అది పార్టీ అవుతుందిగాని అన్నదానం ఎలా అవుతుంది? అసలు దానమంటే ఏమిటి? అది ఎవరికి అవసరం?' అన్నాను.

ఆయనకు కోపం వచ్చింది. అయినా తమాయించుకుని, 'పిల్లలకు భగవద్గీత పోటీలు పెడుతుంటాము' అన్నాడు.

'పోటీలు పెట్టడానికి అదొక గేమ్ కాదు. పోటీలతో భగవద్గీత ఎన్నటికీ అర్ధం కాదు. ముందు పెద్దలు దానిని సరిగ్గా అర్ధం చేసుకుంటే తరువాత పిల్లలకు నేర్పవచ్చు' అన్నాను.

'శాస్త్రీయసంగీతం నేర్పిస్తుంటాము. గాయకులను పిలిచి కచేరీలు చేయిస్తాము' అన్నాడాయన.

'అవి లలితకళలు. అది మన సంస్కృతి. వాటిని నిలబెట్టడం మంచిదే. కానీ మీరనుకుంటున్న సనాతనధర్మం అదికాదు' అన్నాను.

ఆయన మాటమార్చి, ' మీకు వాచ్ మెన్ లేడా?' అడిగాడు.

'ఉన్నాడు. మీకు కనిపించడు' అన్నాను.

'ఇంత ఎడారిలో ఎలా ఉంటున్నారు?' అన్నాడాయన.

'దేవుడే దిక్కు' అన్నాను.

నా మాటలు వాళ్లకు రుచించలేదు.

'సరే. ఏదో ఆశ్రమం అని ఉంటే చూచి పోదామని వచ్చాము. వెళ్లొస్తాం' అన్నాడాయన.

'సనాతనధర్మం ఏమిటో తెలుసుకోవాలంటే పదినిముషాలు సరిపోదు. తీరిగ్గా రండి. కూచుని మాట్లాడుకుందాం'. అన్నాను.

వాళ్ళు వెళ్లిపోయారు.

చాలా జాలేసింది.

ముప్పై ఏళ్ళనుంచీ గుడ్డిగా నడుస్తున్నంత మాత్రాన అది సరియైనదారి అవాలని ఎక్కడుంది?

ఆ మాటకొస్తే, సరైనదారిని తెలుసుకోవాలని మాత్రం ఎవరికుంది?

ఎవరికి తోచిన పనిని వారు చేస్తూ, 'ఇదే సనాతనధర్మం' అనుకుంటున్నారు. 

దే మరి కలిమాయ అంటే !

ఈ మాయప్రపంచాన్ని, ఈ మనుషులను, సంస్కరించడం ఎవరివల్లా కాదని నాకు మరోసారి అర్ధమైంది.

read more " సనాతనధర్మం "

27, ఏప్రిల్ 2025, ఆదివారం

మా 70 వ పుస్తకం 'శివయోగ దీపిక' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 70 వ పుస్తకంగా, శ్రీ సదాశివబ్రహ్మేంద్రసరస్వతీస్వామివారు రచించిన 'శివయోగదీపిక' అనబడే సంస్కృతగ్రంధమునకు తెలుగు వ్యాఖ్యానము నేడు వెలువడుతున్నది. దీని మాతృక 300-400 ఏళ్ల క్రిందటిది.

16-17  శతాబ్దముల మధ్యలో తమిళనాడులో జీవించిన శ్రీ సదాశివేంద్రసరస్వతీస్వామికే సదాశివయోగీంద్రుడనిన నామాంతరమున్నది. మహాయోగి మరియు బ్రహ్మజ్ఞానియైన ఈయన, శ్రీ పరమశివేంద్ర సరస్వతీస్వామి శిష్యుడు. ఈయన కంచి కామకోటి పీఠమునకు  58 వ ఆచార్యునిగా ఉన్నారు.


సదాశివయోగీంద్రులు వెలనాటి నియోగి బ్రాహ్మణకుటుంబంలో శ్రీవత్సస గోత్రంలో జన్మించారు. నేను కూడా అదే కావడం నా అదృష్టం. కనుక స్వామివారు మా పూర్వీకులేనని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. వెలనాడు అంటే కృష్ణా పెన్నా నదుల మధ్యప్రాంతం. ముఖ్యంగా గుంటూరు, రేపల్లె, నెల్లూరు ప్రాంతాలను ఆ కాలంలో వెలనాడు అనేవారు.


ముస్లిముల రాక్షసదండయాత్రలనుండి, వారు పెట్టిన హింసలు, అరాచకాలనుండి తప్పించుకోవడానికి, తమ ఆడవారిని తమ కుటుంబాలను కాపాడుకోవడానికి, ఆ కాలంలో అనేక తెలుగుకుటుంబాలు వారివారి ఆస్తిపాస్తులను వదలిపెట్టి, కట్టుబట్టలతో తమిళనాడులోని కుంభకోణం కోయంబత్తూరు మొదలైన ప్రాంతాలకు పారిపోయి అక్కడ క్రొత్తజీవితాన్ని మొదలుపెట్టాయి. అటువంటి కుటుంబాలలో వీరిది కూడా ఒకటి.


వీరి పూర్వనామధేయం శివరామకృష్ణశర్మ. పరమశివేంద్రులవారి వద్ద ఉపదేశమును పొంది, అనేక ఏళ్లపాటు కావేరీతీరంలో తపస్సు చేసిన తరువాత ఈయన బ్రహ్మజ్ఞానసిద్ధిని పొందారు. శాస్త్రాలలో ఎంతో ఉన్నతంగా కొనియాడబడిన అవధూతస్థితిని అందుకున్న అతికొద్దిమంది నవీనులలో ఈయనొకరు. వీరి సజీవసమాధి తమిళనాడులోని కరూర్ జిల్లాలో గల నేరూరు గ్రామంలో ఉన్నది.


సదాశివయోగీన్డ్రుల గురించిన అనేక మహిమలు మరియు గాధలు దక్షిణాదిలో ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరమహంస యోగానందగారు తన పుస్తకం Autobiography of a yogi లో పొందుపరచారు. అనేక భక్తికీర్తనలను, వేదాంతగ్రంథములను సదాశివ బ్రహ్మేంద్రస్వామి రచించారు. వాటిలో బ్రహ్మసూత్రములకు, యోగసూత్రములకు వ్రాసిన వ్యాఖ్యానములు పేరెన్నిక గన్నవి.


పిబరే రామరసం, భజరే గోపాలం మానస, గాయతి వనమాలీ మధురం, ఖేలతి మమ హృదయే రామ, మానస సంచరరే బ్రహ్మణి, స్థిరతా నహినహి రే, మొదలైన కీర్తనలు ఈనాటికీ కీర్తనాప్రియులైన భక్తుల నోళ్ళలో నానుతూ ఉంటాయి. బాలమురళీకృష్ణ,  పురుషోత్తమానందస్వామి వంటి మధురగాయకులు వీటిని ఎంతో శ్రావ్యంగా గానం చేశారు.


వీరి గ్రంధములలో ఒకటి - మంత్ర, లయ, హఠ, రాజ, భక్తి, జ్ఞానయోగముల మేలుకలయిక అయిన ఈ గ్రంథము. ఎన్నో యోగసాధనల సంకలనా సమాహారంగా ఈ గ్రంథం గోచరిస్తుంది. పంచవటి నుండి వెలువడుతున్న 70 వ గ్రంథముగా దీనిని పాఠకులకు అందిస్తున్నాము.


ఇటువంటి మహనీయుడు వ్రాసిన ఈ అద్భుతగ్రంధమును నా వ్యాఖ్యానంతో ఆయనయొక్క మాతృభాష అయిన తెలుగులోకి తేగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.


ఈ పుస్తకమును వ్రాయడంలో నాకు అనుక్షణం చేదోడువాదోడుగా ఉన్న నా శ్రీమతి సరళాదేవికి, శిష్యులు అఖిల. లలిత, శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.


ప్రస్తుతం ఈ పుస్తకం E-Book గా అందుబాటులోకి వస్తున్నది. యధావిధిగా ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.


మా ఇతర గ్రంధములను ఆదరించినట్లే అద్భుతమైన ఈ గ్రంధాన్ని కూడా ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను.

read more " మా 70 వ పుస్తకం 'శివయోగ దీపిక' విడుదల "

23, ఏప్రిల్ 2025, బుధవారం

మా 69 వ పుస్తకం Indian Astro Numerology విడుదల

ఇంతకు ముందు నాచే తెలుగులో వ్రాయబడిన 'భారతీయ జ్యోతిష సంఖ్యాశాస్త్రము' అనే పరిశోధనా గ్రంధం, ఇప్పుడు ఇంగ్లీషులోకి తర్జుమా చేయబడి, Indian Astro Numerology అనే E-Book గా నేడు విడుదల అవుతున్నది. 

ఇది నా కలం నుండి వెలువడుతున్న 69 వ గ్రంధం. ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా విడుదల అవుతుంది.

పాశ్చాత్య సంఖ్యాశాస్త్రానికి భిన్నమైన మన భారతీయ సంఖ్యాశాస్త్రాన్ని నా పరిశోధనలో కనిపెట్టి  52 జాతకచక్రాల సహాయంతో సోదాహరణంగా ఈ గ్రంధంలో వివరించాను.

ఈ గ్రంధం తెలుగులో చాలా ప్రజాదరణను పొందింది. హైద్రాబాద్, విజయవాడ పుస్తకప్రదర్శనలలో ఎక్కువగా పాఠకులు తీసుకున్న గ్రంధాలలో ఇదీ ఒకటిగా నిలిచింది. ఈ పద్ధతి చాలా బాగుందని, జాతకాల విశ్లేషణలో బాగా ఉపయోగపడుతున్నదని చదువరుల నుండి నాకు మంచి రివ్యూలు కూడా వచ్చాయి.  

అంతర్జాతీయ పాఠకుల ఉపయోగార్ధమై ప్రస్తుతం దీనిని ఇంగ్లీషులోకి అనువదించి విడుదల చేస్తున్నాము.

తెలుగు పుస్తకమును ఇంగ్లీషులోకి అనువాదం చేసిన నా శిష్యురాలు స్నేహలతారెడ్డికి ఆశీస్సులు తెలుపుతున్నాను.

ఇంగ్లీషు చదివేవారిలో దీనికి విస్తృత పబ్లిసిటీని కల్పించాలని Panchawati USA టీమ్ వారిని కోరుతున్నాను.

read more " మా 69 వ పుస్తకం Indian Astro Numerology విడుదల "

చైనా ఇజ్రాయెల్ లను చూచి బుద్ధితెచ్చుకోండి

35 ఏళ్ల క్రితం, హైద్రాబాద్ వాసి సందీప్ కుమార్ భట్టాచార్య, కాశ్మీర్ యాత్రకని కుటుంబంతో సహా వెళ్లి, శ్రీనగర్ గడియారస్థంభం సెంటర్లో బాంబుపేలుడులో చనిపోయాడు. అతను నా స్నేహితుడు. 

నిన్న 27  మంది అమాయక టూరిస్టులు పహల్గావ్ లో హత్యకు గురయ్యారు. మతం అడిగి మరీ ఈ హత్యలు చేశారు. 35 ఏళ్ళు గడచినా, కాశ్మీర్ పరిస్థితిలో గాని, ఇస్లామిక్ రాక్షసాధముల తీరులో గాని, పెద్దగా మార్పు  ఏమీ  రాలేదు

మొన్న శ్రీనగర్, నిన్న ముజఫర్ నగర్, నేడు పహల్ గావ్, రేపు ఇంకెక్కడో. దారుణాలు కిరాతకాలు మళ్ళీమళ్ళీ జరుగుతూనే ఉంటాయి. మనం మాత్రం క్షమించేస్తూ ఉంటాము. కళ్ళు మూసుకుని అన్నీ మర్చిపోయి హాయిగా బ్రతికేస్తూ ఉంటాము.

మన మధ్యనే ఉన్న రాక్షసులు మనకు నీతులు చెబుతూనే ఉంటారు. మతాలన్నీ ఒకటేనంటారు. శాంతిసూత్రాలు వల్లిస్తారు.  సరిహద్దు అవతల ఉన్న వారి సోదరులు కూడా, అదే గ్రంథం ప్రాతిపదికగా హత్యలు చేస్తూ ఉంటారు. అడిగితే, మేమేం చెయ్యలేదంటారు. మిమ్మల్ని మీరే చంపుకుని అమాయకులమైన మామీద తోస్తున్నారంటారు.

మనమేమో డబ్బుకు అమ్ముడుపోతూనే ఉంటాము. వాళ్ళచేతే తన్నించుకుంటూ ఉంటాము. దేశాన్ని తాకట్టుపెడుతూ ఉంటాము. అదే మనకు ఆనందం !

సమస్య టెర్రరిజంలో లేదు. మనలో ఉంది. వాళ్ళ పనిని వాళ్లు తెలివిగా చేస్తూనే ఉన్నారు. మనమే చేతులు కట్టుకుని కూర్చున్నాం.

పరిష్కరించనంత వరకూ సమస్య ఉంటూనే ఉంటుంది. జండుబామ్ తో కేన్సర్ తగ్గదు. మంచిమాటలు రాక్షసులకు వినిపించవు. 

దెబ్బకు దెబ్బచాలదు. ఒక దెబ్బకు పది దెబ్బలు పడాలి. చైనా ఇజ్రాయెల్ లను చూచి మన దేశం నేర్చుకోవాలి. లేదంటే ముందుముందు సర్వనాశనమే.

read more " చైనా ఇజ్రాయెల్ లను చూచి బుద్ధితెచ్చుకోండి "

17, ఏప్రిల్ 2025, గురువారం

చేతకానివాళ్ళు

గొర్రెలు కసాయినే నమ్ముతాయి

కొన్ని రాష్ట్రాలు ఇంకా కాంగ్రెస్ నే నమ్ముతున్నాయి

ఆ పార్టీ పుణ్యమాని దేశం మూడు ముక్కలైంది.

ఎన్నో సంక్షోభాలలో చిక్కుముళ్లలో ఇరుక్కుపోయింది


ముందుముందు ఇంకెన్ని ముక్కలు కానుందో?

ఇంకెన్ని గడ్డుపరిస్థితులను ఎదుర్కోబోతోందో?


మొన్న కాశ్మీర్ లో పండితులు నిన్న మణిపూర్లో మైతీలు 

నేడు బెంగాల్లో హిందువులు తమదేశంలోనే తాము శరణార్థులై

ఇళ్ళూ వాకిళ్ళూ వదిలి పారిపోయి

శిబిరాలలో దాక్కొని ఉంటున్నారు.


రోడ్లమీద కొట్టుకునే రోజొస్తుందని 

సివిల్ వార్ కి దారితీస్తుందని

పదేళ్లనుంచి చెబుతున్నాను

నిజమౌతోంది చూడండి


కాశ్మీర్, పంజాబ్, బెంగాల్, తెలంగాణా, కర్ణాటక, కేరళ

ఇలా ఒక్కొక్క రాష్ట్రానికీ మతోన్మాద వైరస్ సోకుతోంది

మతనిష్పత్తి రూపంలో ప్రమాదం

చాపక్రింద నీరులా ముంచుకొస్తోంది

దీనికొకటే పరిష్కారముంది


గాంధీ నెహ్రూలు కాంగ్రెస్ నాయకులు

ఇన్నేళ్లు కష్టపడి ఇంత నాశనం చేశాక

ఇక మనమేం బాగుచెయ్యగలం?

మనమే కాదు ఎవరూ ఏమీ చెయ్యలేరు


ఈ యుద్ధాన్ని గెలవడం అసాధ్యం

అందుకే ఒక పనిచేద్దాం


అన్ని రాష్ట్రాలూ కాంగ్రెస్ కే ఓటెయ్యాలి

మిగతా పార్టీలను రద్దు చేయాలి

బార్డర్స్ బార్లా తెరవాలి

ఎవరొచ్చినా నోర్మూసుకోవాలి


తంతే తన్నించుకోవాలి

చంపితే చంపించుకోవాలి

ఇళ్లనూ వాకిళ్ళనూ ఆడాళ్ళనూ భూమినీ లాక్కుంటే

వదిలేసి పారిపోయి గుడారాలలో దాక్కోవాలి

శాంతియుతంగా అన్నీ అప్పజెప్పాలి


లేదా,


అందరూ ఇస్లాంలోకి మారిపోవాలి

రాజ్యాంగం పోయి షరియా రావాలి

ఇండియా ఇస్లామిక్ దేశం కావాలి

మిగతావాళ్లకు ఓటుహక్కు తీసేయాలి


కనీసం సివిల్ వార్ తప్పుతుంది

కుట్రలూ కుతంత్రాలూ అరాచకాలూ

హింసా చావులూ అల్లకల్లోలాలూ తప్పుతాయి

కనీసం అదైనా చేద్దాం

చేతకానివాళ్ళు ఇంకేం చెయ్యగలరు మరి?

read more " చేతకానివాళ్ళు "

13, ఏప్రిల్ 2025, ఆదివారం

అశాంతి నిలయం

'ఆ మధ్యన అమెరికా నుండి కొంతమంది స్నేహితులొస్తే అశాంతినిలయం వెళ్ళొచ్చాము' అన్నదొక శిష్యురాలు. 

'అమెరికా - అశాంతినిలయం, ప్రాస బాగుందిగాని, విషయం చెప్పు' అన్నాను.

'పటాటోపం తప్ప అక్కడేమీ లేదు' అందామె.

'ఇరవై ఏళ్ళనుంచీ నేనుకూడా ఇదే చెబుతున్నాను' అన్నాను ప్రాస కలుపుతూ.

'వాలంటీర్లకూ భక్తులకూ మా ఎదురుగానే గొడవైంది' అన్నదామె. 

'వాలంటీర్లకు వాలం ఉందా?' అడిగాను.

'అర్ధం కాలేదు' అంది 

'పోనీ భక్తులకు రెక్కలున్నాయా?' అడిగాను.

'మళ్ళీ అర్ధం కాలేదు' అంది 

'వాలం అంటే తోక, తోక ఉన్నవారే వాలంటీర్లు. అంటే కోతులు. బకము అంటే కొంగ. నేటి భక్తులందరూ బకులే. అంటే  కొంగజపం చేసే అవకాశవాదులన్నమాట. గట్టిగా అదిలించామంటే తుర్రున ఎగిరిపోతారు. మరి కోతులూ కొంగలూ ఒకచోట చేరితే అశాంతినిలయం కాక ఇంకేమౌతుంది? అడిగాను.

'మరి స్వామి ఏం చేస్తున్నట్టు?' అనుమానమొచ్చింది శిష్యురాలికి.

'ఉన్నప్పుడేం చేశాడు ఇప్పుడు చెయ్యడానికి?' అడిగాను.

'మళ్ళీ అర్ధం కాలేదు' అంది

'విచారణ జరుగుతోంది. బోనులో నిలబడి ఉన్నాడు' అన్నాను.

'ఏంటో మీ మాటలేవీ అర్ధం కావు' అందామె.

'కొన్ని అర్ధం కాకపోవడమే మంచిది' అన్నాను.

read more " అశాంతి నిలయం "

11, ఏప్రిల్ 2025, శుక్రవారం

చెప్పేది చెయ్యకు

మెదడుకు శస్త్రచికిత్స చేయించుకున్న గురువుగారు

ఆరోగ్యసూత్రాలు చెబుతున్నారు

అణువులు గంతులేస్తున్నారు


యోగాను భక్తులకు బోధించే ఇంకో గురువుగారు

తనేమో జిమ్ము చేస్తున్నారు

పరమాణువులు పల్టీలు కొడుతున్నారు


చెప్పేది చెయ్యమని శాస్త్రంచెబుతోంది

చెప్పేది చెయ్యక్కర్లేదని  వీరంటున్నారు

కలియుగంలో ఇలాగే ఉంటుందని నేనంటున్నాను

అణువులూ పరమాణువులూ వర్ధిల్లండి !

read more " చెప్పేది చెయ్యకు "

రాత్రి భజనలు

దుకాణం దగ్గర గుడి పూజారి కలిశాడు.

'ఊర్లోకొచ్చారు కదా ! మా ఇంటికెళదాం రండి. కాఫీ త్రాగుతూ మాట్లాడుకుందాం' అన్నాడు మర్యాదగా.

'లేదండి. నేను త్రాగను, ఇంకోసారి వస్తాలెండి మీ ఇంటికి' అన్నాను.

'గుడికి రండి. రాత్రి పదకొండుదాకా భజన చేస్తారు' అన్నాడాయన.

'అవన్నీ చిన్నప్పుడే అయిపోయాయి. క్రొత్తగా ఇప్పుడెందుకు?' అన్నాను

ఆశ్చర్యంగా చూశాడాయన.

'అయినా, అంత రాత్రిపూట భజనలు చేయకూడదు. రాత్రిళ్ళు పూజలు చేసేది రాక్షసులు. పైగా శబ్దకాలుష్యం. ఆ టైంకి మేమొక నిద్రతీసి లేస్తాం' అన్నాను.

మళ్ళీ ఆశ్చర్యంగా చూశాడాయన.

'ఏదైనా వేళకి చెయ్యాలి. అలా చేయకపోవడమే రోగాలకు ఒక కారణం' అన్నాను.

ఆయనలా చూస్తున్నాడు.

'ధర్మాన్ని మనం అనుసరించాలి. మనం చేసే ప్రతిదీ ధర్మం అనుకోకూడదు' అన్నాను

ఇంకా అలాగే చూస్తున్నాడాయన.

నేనొచ్చేశాను.

read more " రాత్రి భజనలు "

మేం చేస్తున్నదేంటి?

నిన్నొక పనిమీద ఊర్లోకెళ్ళాను.

మాటల మధ్యలో, 'ఫలానా మాతాజీకి 102 ఏళ్ళుట. నిన్న చనిపోయింది' అన్నారొకరు.

'మర్రిచెట్టు కూడా బ్రతుకుతుంది. ఉపయోగం?' అన్నాను

'సాధువుగా మంచిగా బ్రతికింది కదా అన్నేళ్లు?' అన్నదామె.

'మాయసాధువుగానా? వాళ్ళు చెప్పేదంతా ధర్మవిరుద్ధం. బూటకం.' అన్నాను.

'మరి మంచిగా ఉంటూ అన్నేళ్లు ఆరోగ్యంగా బ్రతకాలంటే ఏం చెయ్యాలి?' అన్నదామె.

'మేము చేస్తున్నదేంటి?' అన్నాను. 

read more " మేం చేస్తున్నదేంటి? "