13, జనవరి 2020, సోమవారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (నామ నక్షత్రాల గోల)

పురోహిత జ్యోతిష్కులు జ్యోతిష్యశాస్త్రానికి చేసిన మరొక పెద్ద కీడు - 'నామనక్షత్రాలు' అంటూ ఒక స్కీమ్ తయారు చెయ్యడం. దీనిని కొంతమంది అజ్ఞానులు చాలా గుడ్డిగా పాటిస్తున్నారు. ఇది కూడా తప్పే. ఎందుకంటే, జ్యోతిషశాస్త్రంలో ప్రతిదానికీ ఒక లాజిక్ ఉంటుంది. కానీ దీనికి మాత్రం ఏ లాజిక్కూ లేదు.

జ్యోతిష్యశాస్త్రంలో లేని అనేక విషయాలు పంచాంగాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ 'పురోహిత జ్యోతిష్కుల' సృష్టే. వీటిని పాటించవలసిన పని ఏ మాత్రమూ లేదు. అసలు ఇలాంటి కట్టుకథలు సృష్టించబడడం వల్లనే ఎంతో గొప్పదైన జ్యోతిష్యశాస్త్రం ప్రజలలో తన విలువను కోల్పోయింది. నోరున్న ప్రతివాడూ ఎగతాళి చేసేలా తయారైంది నేడు దాని పరిస్థితి.

మీరు ఏ పంచాంగం చూసినా మీకిది కనిపిస్తుంది.

చూ-చే-చో-ల - అశ్వని
లీ-లూ-లే-లో - భరణి ..... ఇత్యాది

అంటే, అశ్వని మొదటి పాదంలో పుట్టినవారికి 'చూ' అనే శబ్దంతో మొదలయ్యే పేరు పెట్టాలని ఇది చెబుతుంది. ఈ అక్షరంతో పేరు పెట్టాలంటే 'చూడామణి' అనే పేరు తప్ప, లేదా, 'చుంచుమొహం', 'చుప్పనాతి' మొదలైన పేర్లు తప్ప ఇంకే పేర్లూ దొరకవు. ఇదే విధంగా మిగతా నక్షత్రాలకు కూడా ఉంటుంది. కానీ దీనికి ప్రమాణం మాత్రం ఎక్కడా మనకు దొరకదు. దీని వెనుక ఉన్న లాజిక్కూ దొరకదు.

దీనికి విరుద్ధంగా - ఒక జాతకంలో సప్తమంలో శని ఉంటే, ఆ జాతకునికి ఏమి జరుగుతుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. లేదా అక్కడ కుజుడు ఉంటే, ఏమి జరుగుతుందో కూడా మనకు తెలుసు. వీటి వెనుక లాజిక్స్ ఉంటాయి. కానీ నామనక్షత్ర స్కీమ్ వెనుక ఉన్న లాజిక్ మాత్రం శూన్యం. తంత్రశాస్త్రంలోనూ, మంత్రశాస్త్రంలోనూ, నాడీశాస్త్రంలోనూ ఈ లాజిక్స్ ఉన్నాయని కొందరు భావిస్తారు. ఇవి మూడూ నాకు బాగానే తెలుసు. ఈ విషయం వరకూ, వాటిల్లో కూడా స్థిరమైన లాజిక్స్ ఎక్కడా నాకు కనపడలేదు.

లగ్నాధిపతికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, నక్షత్రాలకు ప్రాముఖ్యతనివ్వడం వల్లనే ఈ గొడవంతా మొదలైంది. ఈ గోల మొదలు పెట్టినవారు, జ్యోతిష్యశాస్త్రంలో లోతైన అవగాహన లేని పురోహిత జ్యోతిష్కులే.

పోనీ, నక్షత్రాలే ముఖ్యం అనుకుంటే, అభిజిత్ నక్షత్రం ఏమైంది? దానినెందుకు తీసేశారు? దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే, అప్పుడు దానికేమేమి అక్షరాలూ పంచుతారు? ఎలా పంచుతారు? అసలు నక్షత్ర వైబ్రేషన్స్ ను ఎవరు లెక్కించారు? ఎలా లెక్కించారు? వీటికి జవాబులు లేవు.

అసలీ గోలంతా లేకుండా, దీనికంటే శాస్త్రీయమైన విధానం మరొకటి ఉంది.

లగ్నాధిపతిని బట్టి, లేదా లగ్నాన్ని బాగా ప్రభావితం చేస్తున్న గ్రహాన్ని బట్టి శిశువుకు పేరును పెట్టడం అనేది చాలా తార్కికమైన భావన. ఇది నామనక్షత్రం కంటే మంచిది. చాలా మంచి ఫలితాలనిస్తుంది కూడా.

పేరును బట్టి జాతకం చెప్పడం శుద్ధ తప్పువిధానం. అయితే దీనిలో ఒక సౌలభ్యం ఉంది. పాతకాలంలో, నామనక్షత్రాన్ని బట్టి పేరు పెట్టేవారు కనుక, ఒకరి పేరు తెలిస్తే, ఆ పేరులోనే మొదటి అక్షరాన్ని బట్టి అతని జన్మనక్షత్ర పాదం తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఆ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో తెలుస్తుంది. దాన్ని బట్టి, గోచార గ్రహాలను గమనించి స్థూలంగా ఫలితాలు చెప్పవచ్చు. ఇంతవరకూ ఈ విధానం పనికొస్తుంది. కానీ, అసలు మొదట్లో, ఈ నామనక్షత్ర స్కీమ్ ఎలా తయారైంది? దీని వెనుక ఉన్న లాజిక్స్ ఏమిటి? అన్న ప్రశ్నలకు స్పష్టములైన జవాబులు లేవు. దొరకవు.

ముస్లిం దండయాత్రలలో అగ్నికి ఆహుతైన వేలాది విలువైన గ్రంధాలలో ఈ సమాచారం ఉందని కొందరు వాదిస్తారు. అది నిజమే కావచ్చు. కానీ, కొన్ని తంత్రగ్రంధాలలో ఉన్న ప్రాధమిక సమాచారం తప్ప, ఈ సబ్జెక్టు మీద లోతైన వివరాలు ప్రస్తుతం మనకు దొరకడం లేదు.

లగ్నాధిపతి అయిన గ్రహం ఆ జాతకుడికి సూచిక. ఆ గ్రహానికి సంబంధించిన పేరు జాతకుడికి పెట్టడం తార్కికం అవుతుంది. క, చ, ట, త, ప సూత్రం ప్రకారం హల్లుల గ్రూపులకు గ్రహాల ఆధిపత్యం మనకు తెలుసు.

అచ్ఛులు - సూర్యుడు
క గ్రూప్ (క, ఖ, గ, ఘ, జ్ఞ) - కుజుడు
చ గ్రూప్ (చ, ఛ, జ, ఝ,న్య ) - శుక్రుడు
త గ్రూప్ (త, థ, ద, ధ, న ) - గురువు
ట గ్రూప్ (ట, ఠ, డ, ఢ, ణ ) - బుధుడు
ప గ్రూప్ (ప, ఫ, బ, భ, మ) - శని
య గ్రూప్ (య, ర, ల, వ, శ, ష, స, హ) - చంద్రుడు

సూర్యుడూ చంద్రుడూ బింబగ్రహాలు. అంటే, మండలాకారంలో (Circle) ఉండే గ్రహాలు. మిగతా ఐదూ తారాగ్రహాలు. అంటే చుక్కల్లాగా (Dot) ఉండే గ్రహాలు. మండలంలో బిందువు (Dot in Circle) అనేది శ్రీచక్రానికి, static and dynamic energies of the universe కి సూచిక.

దీనిలో ఉన్న యోగరహస్యాలను కొద్దిగా ఇక్కడ స్పృశిస్తాను. నా ఇన్నర్ సర్కిల్ శిష్యులకు ఇవన్నీ సుపరిచితాలే.

'అ' అనేటప్పుడు ఊపిరి లోనికి పీలుస్తాము. అంటే ఉచ్ఛ్వాసం. 'హ' అనేటప్పుడు ఊపిరి వదులుతాము. అంటే, నిశ్వాసం. అక్షరాలన్నీ 'అ' నుంచి 'హ' మధ్యలోనే ఉన్నాయి. అందుకే 'అహమ్ (నేను)' అనేది దైవానికి గల అసలైన పేరు. ఈ దైవం అహమ్ అహమ్ అంటూ నిత్యం మనలో ఊపిరిగా సంచరిస్తూ ఉన్నది. ఇదే మనలో నిత్యం సాగే అజపాజపం. అందుకే అది మనలోనుంచి పోతే, దైవం మనల్ని వదిలేస్తే, మనం చనిపోతాము.

అలాగే కుజాది అయిదు గ్రహాలూ సూర్యచంద్రుల మధ్యలోనే ఉన్నాయి. వాటి అక్షరాలు కూడా అలాగే ఉన్నాయి. రాహుకేతువులు ఛాయాగ్రహాలు గనుక వాటికి అక్షరాలు లేవు. అవి ఏ రాశిలో ఉంటె, ఆ అక్షరం ఆ శబ్దం వాటిదై పోతుంది.

కుజ, శుక్ర, గురు, బుధ, శనిగ్రహాల అధీనంలో ఉన్న 5x5= 25 శబ్దాలు + చంద్రుని అధీనంలో ఉన్న 8 శబ్దాలు మొత్తం 33. ఈ 33 అక్షరాలే వేదకాలంలో పూజింపబడిన ముప్పై ముగ్గురు దేవతలు. ఇవి సృష్టిని నడిపించే వైబ్రేషన్స్ లేదా ధ్వనిశక్తులు. వీటిల్లో అ నుంచి అ: వరకూ ఉన్న అచ్చులు అంతర్లీనంగా ఉంటూ వాటిని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అంటే, ప్రకృతి శక్తులకు సూర్యశక్తి ఆధారం అయినట్లుగానే, హల్లులకు అచ్ఛులే ఆధారంగా ఉంటాయి. ఉదాహరణకు, క్ అనేదానికి అ అనే శబ్దం కలిస్తేనే క అనే శబ్దం వస్తుంది.  అంటే, క్ అనే మూలశబ్దానికి అ అనే శబ్దం ఆధారంగా ఉన్నది.

సందర్భం వచ్చింది గనుక, వేదకాలపు ప్రాచీన దేవతలు ఎవరో ఒకసారి చెప్తాను.

అష్టవసువులు      -       8 మంది
ఏకాదశ రుద్రులు -     11 మంది
ద్వాదశ ఆదిత్యులు - 12 మంది
అశ్వనీ దేవతలు -       2
మొత్తం -                     33

కొన్ని చోట్ల అశ్వనీ దేవతల బదులుగా ఇంద్రుడు, ప్రజాపతి ఉంటారు. మొత్తం మీద ఎలా చూచినా ఈ 33 దేవతలే వేదాలలో ఉన్నారు. ప్రకృతిలో కూడా మనకు ఇవే శక్తులు కనిపిస్తాయి.

నేడు మనం పూజిస్తున్న దేవతలందరూ, వేదకాలపు దేవతలు కారనీ, పురాణకాలంలో మనం కల్పించుకున్న రూపాలేనన్నది ముందుగా మనం గ్రహించాల్సిన చేదునిజం. నేడు మనం పూజిస్తున్న దేవతలెవరూ వేదాలలో లేరు. నేడు వైదికులుగా చెప్పుకుంటున్నవారు కూడా వేదకాలపు దేవతలను పూజించడం లేదు. పురాణకాలపు దేవతలని పూజిస్తున్నారు. అసలు వేదాలలో ఏయే దేవతలున్నారో కూడా నేటి వైదికులలో ఎవరికీ గుర్తులేరు. ఇదొక విచిత్రం ! 

ఈ రకరకాల కల్పిత దేవతలకు కూడా ఈ 33 మూలశక్తి వైబ్రేషన్స్ మాత్రమే ఆధారశక్తులుగా ఉంటాయి. ఈ 33 అక్షరాల లోనుంచే అన్ని మంత్రాలూ పుట్టాయి. మంత్రశాస్త్రానికి కూడా ఈ 33 అక్షరాలే ఆధారాలు. అందుకనే మంత్రశక్తిలో (శబ్దశక్తిలో) దైవశక్తి ఉంటుందని మంత్రశాస్త్రం అంటుంది. ఇదే అసలైన మంత్ర - తంత్ర విజ్ఞానం.

కనుక, లగ్నాధిపతిని సూచించే మంత్రశబ్దాలైన అక్షరాల ప్రకారం జాతకునికి పేరు పెట్టడం కరెక్ట్ అవుతుంది. అంతేగాని, నామనక్షత్ర స్కీమ్ ప్రకారం పేర్లు పెట్టడం తప్పున్నర తప్పేగాక దాని వెనుక ఏ విధమైన లాజిక్కూ లేదు.

ఇకపోతే, పేర్లను బట్టి వివాహపొంతనం చూడటం కూడా శుద్ధ తప్పుపధ్ధతే. జాతకంలోని లగ్నభావం, చతుర్ధభావం, సప్తమభావం, అష్టమభావాలను గమనించి, ఇద్దరి జాతకాలలోనూ ఈ రెండూ సరిపోయినప్పుడు మాత్రమే వారిద్దరికీ వివాహం చెయ్యాలి. కానీ, ఇది నేటి జ్యోతిష్కులు చాలామంది పాటించడం లేదు. దీనిగురించి మరో పోస్ట్ లో వ్రాస్తాను.

ఈ నామనక్షత్ర స్కీమ్ ఎంత ఎగతాళి పాలైపోయిందంటే, పాతకాలంలోని ఏదో జానపద సినిమాలో మాంత్రికుడి శిష్యుడు 'లీలూలేలో -  దేదోచాచీ' మొదలైన మాటలను మంత్రాలుగా వాడుతూ ఉంటాడు. అంటే, కామెడీ మంత్రాలన్నమాట !

లగ్నాధిపతిని బట్టి జాతకుడికి పేరు పెడితే, ఆ పేరు వైబ్రేషన్ ఆ జాతకంతో తులతూగుతుంది (నేటి భాషలో చెప్పాలంటే, మ్యాచ్ అవుతుంది) కాబట్టి, ఆ పేరుతో పిలిచిన ప్రతిసారీ, అతని లగ్నం శక్తిని పుంజుకుంటూ ఉంటుంది. ఆ విధంగా అతనికి మేలు జరుగుతుంది. దీనికి విరుద్ధంగా, ఏవేవో పిచ్చిపిచ్చి పేర్లు, లేదా నామనక్షత్రం ప్రకారం, లీలూలేలో స్కీమ్ ప్రకారం పేర్లు పెడితే దానికి విరుద్ధంగా జరుగుతుందని గమనించాలి. అప్పుడు ఆ జాతకుడికి మంచి జరగకపోగా, అతని జాతకంలో చెడు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, వేరే ఏదో లగ్నం పేరుతో ఆ జాతకుడిని  పిలవడం వల్ల అతని జాతకం శక్తిని కోల్పోతూ ఉంటుంది. అందువల్ల అతని జీవితంలో నెగటివ్ వైబ్రేషన్ పెరుగుతూ ఉంటుంది !

నేను చెబుతున్నది నిజం అనడానికి ఒక రుజువును చూపిస్తాను !

చాలామందికి మామూలు పేరుతో బాటు ముద్దుపేర్లు ఉంటాయి. ఆ ముద్దుపేరుతో వారు పిలిపించుకుంటూ ఉన్నంత కాలం వారి జీవితం బాగా ఉంటూ ఉంటుంది. దానికి కారణం వారి జాతకంలో పుణ్యకర్మ బలంగా ఉండటమే. దానికి అనుగుణమైన ముద్దుపేరుతో వారు పిలువబడుతూ ఉండటమే !

దీనికి విరుద్ధంగా మరి కొంతమందికి వారి జాతకానికి విరుద్ధమైన ముద్దుపేర్లు చెలామణీలో ఉంటూ ఉంటాయి.  వారు ఆ పేరుతో పిలిపించుకుంటూ ఉన్నంతకాలం, వారి జీవితంలో చేదు అనుభవాలు కలుగుతూనే ఉంటాయి. దీనికి కారణం వారి జాతకంలో బలంగా ఉన్న చెడు ఖర్మ.  అందుకే వారా పేర్లతో పిలువబడుతూ ఉంటారు.

ఒక ఉదాహరణ !

ఒకతనికి 'నాగ వెంకట ఆంజనేయ దుర్గా వరప్రసాద్' అని తల్లిదండ్రులు పేరు పెడతారు. ఇందులో, తాత ముత్తాతలనీ, కులదేవతలనీ అందరినీ కలుపుకుని ఆ పేరు పెడతారు. కానీ పిలవవలసి వచ్చేసరికి, "వెంకట్" అని మాత్రమే పిలుస్తూ ఉంటారు. లేదా, 'పప్పీ!' అంటూ కుక్కపేరుతో పిలుస్తూ ఉంటారు. అన్ని దేవతల పేర్లూ తన పేరులో ఉండి, చివరకు కుక్కపేరుతో ఆ వ్యక్తి పిలువబడుతూ ఉంటాడు. అలా పిలవబడటానికి కూడా ఆ జాతకంలో ఉన్న బలమైన గ్రహం ( వాడి ఖర్మను బట్టి అది చెడుగ్రహం కావచ్చు లేదా మంచిగ్రహం కావచ్చు) మాత్రమే కారణం అవుతుంది. అంతేగాని నామనక్షత్రమూ కారణం కాదు. లేదా మనిష్టం వచ్చినట్లు పెట్టుకునే పేరూ కారణం కాదు.

అలా పెట్టుకోడానికి కూడా ఆ మనిషికి స్వతంత్రం లేదన్నది సారాంశం. ఆ మనిషి జాతకంలో బలమైన గ్రహాన్ని బట్టి ఆ సమయానికి ఆ పేరు పెట్టబడుతుంది. ఆ పేరు పెట్టేవాడికి ఆ సమయానికి అలాంటి బుద్ధి పుడుతుంది. లేదా అలాంటి ముద్దు పేరుతో పిలిపిస్తుంది. ఆ పేరు పెట్టేవారు హిందువులైనా కాకపోయినా సరే, జాతకాలను నమ్మేవారైనా నమ్మనివారైనా సరే, ఇండియాలో ఉండేవారైనా, లేక విదేశాలలో ఉంటూ వేరేభాష మాట్లాడేవారైనా సరే, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. గ్రహప్రభావాలకు మన నమ్మకాలతో, మనం ఉండే దేశాలతో, మనం మాట్లాడుకునే భాషతో పని లేదు.

'మోహన్ దాస్ కరంచంద్ గాంధీ' అని పేరు పెట్టబడిన గాంధీజీ, 'బాపూ' అని  పిలువబడుతున్నాడు. జవహర్లాల్ నెహ్రూని 'చాచాజీ' అంటూ పిలుస్తున్నారు. అసలు పేర్లు పోయి, ఇవి మిగిలాయి. అది వారివారి ఖర్మను బట్టి జరుగుతుంది. అర్థమైందా అక్షరాల వైబ్రేషన్ శక్తి?

మనం నమ్మినా నమ్మకపోయినా ఎండ వేడిగానే ఉంటుంది, వెన్నెల చల్లగానే ఉంటుంది కదా మరి !
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (నామ నక్షత్రాల గోల) "

6, జనవరి 2020, సోమవారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (అమెరికా ముహూర్తాలు)

పాపం మనవాళ్ళు ఎక్కడకు పోయినా చిన్నప్పటినుంచీ నేర్చుకున్న ఆచారాలనూ పద్ధతులనూ అక్కడకు కూడా తీసుకుపోతూ ఉంటారు. ఇది మంచి విషయమే. ఏ దేశానికి పోయినా, మనం మనంగానే ఉండాలి. అయితే, అక్కడి పద్ధతులను కూడా ఆకళింపు చేసుకోవాలి. పాటించాలి. కానీ, లోలోపల మనం మనంగానే ఉండాలి. అప్పుడే మన వ్యక్తిత్వం మనదిగా ఉంటుంది. కానీ, దీనిని ఆసరాగా తీసుకుని దొంగ గురువులు, దొంగ జ్యోతిష్కులు, దొంగ పురోహితులు, దొంగ పూజారులు అలాంటివారికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ బెడద అమెరికాలో ఉన్న మనవారికి బాగా ఎక్కువగా ఉంటోంది.

పాపం అక్కడున్న మనవాళ్ళు, ఏ శుభకార్యం తలపెట్టుకున్నా, మంచి ముహూర్తం కోసం పురోహితుడినో, జ్యోతిష్కుడినో సంప్రదిస్తారు. అందులోనూ, అమెరికాలో ఉంటున్నారు గనుక, డబ్బులు బాగా ఉంటాయి గనుక, పేరుమోసిన పంచాంగకర్తలకు ఫోన్ చేసో, లేదా టీవీలో కనిపించే జ్యోతిష్కులకు ఫోన్ చేసో, ముహూర్తం పెట్టమని అడుగుతూ ఉంటారు. వీళ్ళు పెడుతూ ఉంటారు. వాళ్ళు ఆ సమయానికి అమెరికాలో ఆ కార్యక్రమం చేస్తూ ఉంటారు. పప్పులో కాలేస్తూ ఉంటారు. కానీ అలా కాలేశామని కూడా తెలియనంత స్థితిలో ఉంటారు. వెరసి ఏదో ఒక దుర్ముహూర్తంలో ఆ కార్యక్రమం జరిగిపోతూ ఉంటుంది. వింతగా ఉంది కదూ? నేను చెబుతున్నది పచ్చి నిజం. ఎలాగో వినండి మరి !

ఒక ఉదాహరణ చెప్తాను. విషయం బాగా అర్ధమౌతుంది !

ఒకాయన కూతురూ అల్లుడూ కాలిఫోర్నియా లో ఉన్నారు. వాళ్లకు ఒక పాప పుట్టింది. అన్నప్రాశన ముహూర్తం పెట్టాలి. ఇండియాలో ఉన్న ఒక పేరుమోసిన జ్యోతిష్కుల వారిని ఫోన్లో సంప్రదించారు. ఈయన సింపుల్ గా పంచాంగం చూసి, కాలిఫోర్నియాకీ మనకీ ఉన్న time difference ను తీసేసి, అలా తియ్యగా వచ్చిన అమెరికా టైం కి కార్యక్రమం చేసుకోమని చెప్పాడు. వాళ్ళు చేసుకున్నారు. కానీ అది శుద్ధ తప్పుడు ముహూర్తం ! ఇంతా చేస్తే, ఒక దుర్ముహూర్తంలో ఆ పాప అన్నప్రాశన జరిగింది. ఎలాగో వినండి !

ఏ ముహూర్తమైనా సూర్యోదయకాలం నుంచి లెక్కించాలి. మనకు సూర్యోదయమే అన్నింటికీ ముఖ్యం. ఆ రోజున కాలిఫోర్నియాలో సూర్యోదయం ఎప్పుడౌతుందో లెక్కించి, అక్కడనుంచి లెక్క పెడుతూ ఇష్టసమయానికి ఏ ముహూర్తం ఉన్నదో చూచి ఆ ముహూర్తాన్ని పెట్టుకోవాలి. అంతేగాని, డే లైట్ సేవింగ్ అవర్స్ ని లెక్కలోకి తీసుకోకుండా, సూర్యోదయ సమయాన్ని లెక్కించకుండా, సింపుల్ గా ఇండియా టైం లోనుంచి ఇంత తగ్గించండి సరిపోతుంది అని చెప్పే ముహూర్తాలన్నీ తప్పులే ! ఎందుకంటే, ఇండియాకూ కాలిఫోర్నియాలకూ కాలగణనంలో చాలా తేడాలుంటాయి. ఇవి ముఖ్యంగా సూర్యోదయకాలంలోనూ, దినప్రమాణంలోనూ ఉంటాయి.

కాలగణనం అనేది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఉన్న సమయాన్ని బట్టి లెక్కించబడుతుంది. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో అయితే ఇది 12 గంటలకు అటూ ఇటూ గా ఉంటుంది. కానీ దానికి దూరంగా ఉండే ప్రదేశాలలోనో. లేక దినప్రమాణం  చాలా తక్కువగా ఉండే ప్రాంతాలలోనో ఇది మారిపోతూ ఉంటుంది. కనుక ఆయా దేశాలలోని హోరలు, కాలప్రమాణాలు, లగ్నప్రమాణాలు,  పుష్కరాంశలు మొదలైనవన్నీ మారిపోతాయి.

ఉదాహరణకు, దినప్రమాణం 12 గంటలు ఉండే దేశాలలో మాత్రమే, హోరలు ఒక్కొక్క గంట పాటు ఉంటాయి. అది తగ్గితే ఇవీ తగ్గుతాయి. కానీ జ్యోతిష్కులు ఇది చెప్పరు. అలాగే రాహుకాలం సంగతి చూడండి. దీనిని సామాన్యంగా గంటన్నరగా చూపిస్తారు. ఎందుకంటే 12 గంటలను 8 భాగాలు చేస్తే (ఏడు గ్రహాలు+1 ఖాళీ భాగం) ఒక్కొక్కటి గంటన్నర వస్తుంది గనుక. అదే, పగటి సమయం ఎనిమిది గంటలు మాత్రమే ఉండే దేశాలలో, రాహుకాలం ఒక గంట మాత్రమే ఉంటుంది. ఈ విధంగా అన్ని ముహూర్తాలూ, కాలహోరలూ, ఉపగ్రహసమయాలూ అన్నీ సూర్యోదయాన్ని బట్టి, దినప్రమాణాన్ని బట్టి మారిపోతాయి. ఈ విషయం గుర్తించకుండా, మనకీ ఆ దేశానికీ ఉన్న టైం డిఫరెన్స్ ను బట్టి, ఇండియా టైం లోనుంచి అన్ని గంటలు తగ్గించి, అదే అసలైన ముహూర్తం అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. అర్ధమైంది కదూ !

కానీ, నేటి ప్రముఖ టీవీ జ్యోతిష్కులూ, పంచాంగకర్తలూ ఇవే ముహూర్తాలను అమెరికా వారికి పెడుతున్నారు ! వారు చంకలు చరుచుకుంటూ దుర్ముహూర్తాలలో కార్యక్రమాలు చేసుకుంటున్నారు, నవ్వొస్తోందా? హాయిగా నవ్వుకోండి. ఇదే కలిమాయ అంటే !!

ఆ మధ్యన, విజయవాడలో ఒక జ్యోతిష్యసభ జరిగింది. ఆ సభలో, మిత్రుడు పాలపర్తి శ్రీకాంత్, ఒక ప్రముఖ పంచాంగకర్తను ఇలా ప్రశ్నించాడు. 'ఒక ప్రదేశానికి సూర్యోదయసమయాన్ని ఎలా గణిస్తారో, వేదిక మీద నుంచి కొంచం వివరించండి'. ఆ పంచాంగ కర్తగారు తెల్లముఖం వేసి, 'సారీ! మర్చిపోయామండి. మేము సూర్యోదయ సమయాన్ని మూడేళ్ళకు ఒకసారి మాత్రమే లెక్కలు వేస్తాము. తర్వాత గుడ్డిగా దానినే అనుసరిస్తాము' అని ఒప్పుకున్నాడని శ్రీకాంత్ నాతో చెప్పారు. ఇదీ నేటి పంచాంగజ్యోతిష్కుల పరిస్థితి ! ఇక గ్రహగణితం ఏ మాత్రమూ రాని టీవీ జ్యోతిష్కుల సంగతి చెప్పనే అక్కర్లేదు.

జ్యోతిష్కులలో ఒక విచిత్రం ఉంది. గణితం వచ్చినవాడికి ఫలితం చెప్పడం రాదు. ఫలితం చెప్పేవాడికి గణితం రాదు. గణితం ఫలితం రెండూ వచ్చినవాడికి పరిహారం (రెమెడీ) చెయ్యడం రాదు. గణితం - ఫలితం - పరిహారం - ఈ మూడూ వచ్చినవాడు లోకంతో బిజినెస్ చెయ్యడు. మౌనంగా వాడి పని వాడు చూసుకుంటాడు. ఎందుకంటే వాడొక ఋషిగా మారిపోతాడు. కనుక వాడు లోకానికి పనికిరాడు. ఈ మధ్యలో ఉన్నవారు మాత్రం తమతమ వేషాలతో లోకాన్ని బాగా ఆడుకుంటూ ఉంటారు. పిచ్చిలోకులు మోసపోతూ ఉంటారు. ఈ మొత్తం నాటకంలో, జ్యోతిష్కుడూ, పృఛ్చకుడూ ఇద్దరూ చెడుకర్మను మూటగట్టుకుని భుజాన వేసుకుని మోస్తూ ఉంటారు. ఇదీ అసలు సంగతి !

అందుకే ఈ ఆశుపద్యాన్ని ఇక్కడ చెబుతున్నాను.

కం || గణితము, ఫలితము, మఱియున్
గుణముగ పరిహారమెల్ల గురుతుగ జెప్పన్
పణమున నెగ్గెడి జోస్యుల్
అణువుల్ ! పరికింతమన్న నందరు సత్యా !

గణితం, ఫలితం, పరిహారం - ఈ మూడూ శుద్ధంగా తెలిసిన, ఋషితుల్యులైన జ్యోతిష్కులు ఈ భూమిమీద లక్షకొకరో, కోటికొకరో ఉంటారుగాని ఎక్కడబడితే అక్కడ దొరకరు.

పాపం అమెరికా ఎన్నారైలు మాత్రం ఇండియా జ్య్తోతిష్కుల చేతుల్లో ఇలా మోసపోతున్నారు. దుర్ముహూర్తాలకు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఏం చేస్తాం? సముద్రాలు దాటి వెళ్ళినా ఎవరి కర్మ వారిని వెంటాడటం తప్పదు గదా !
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (అమెరికా ముహూర్తాలు) "

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (యమగండం ఎందుకు చెడ్డది?)

'యమగండం' అనేది ఎవడో కల్పించిన కల్లబొల్లి మాట తప్ప, అసలది ప్రామాణిక జ్యోతిష్య గ్రంధాలలో లేదని వ్రాశాను కదా ! కానీ దీనికి ప్రత్యామ్నాయంగా వేరే మాట లేదు గనుక ప్రస్తుతానికి ఈ మాటనే వాడుకుందాం. దీని గురించి మరికొంత వినండి !

యమగండ సమయంలో ఏ పని చేసినా చెడిపోతుందని, సర్వనాశనం అవుతుందని అనేవాళ్ళు ఆ సమయంలో ఏదైనా చేసి చూడండి. ఏమీ కాదు ! ఎవరైనా కొన్నిసార్లు సరదాగా టెస్ట్ చేసి అప్పుడు చెప్పండి !

పోనీ ఇంకో విషయం ! మనం ఏదైనా ముహూర్తం పెట్టుకున్నప్పుడు ఈ యమగండం అనేదాన్ని చూసి, దాన్నుంచి తప్పుకుంటున్నాం కదా ! మామూలుగా మనం చేసే రోజువారీ పనులలో కూడా  యమగండం అనేది ఎన్నోసార్లు వస్తూనే ఉంటుంది. కానీ ఆ విషయం మనం పట్టించుకోము. రీసెర్చి మైండ్ తో దీనిని చూసేవాళ్ళు మాత్రమే అలా గమనిస్తారు. నేనలా చాలాసార్లు గమనించాను. ఆ సమయంలో మనం చేసే పనులన్నీ చెడిపోవాలి కదా ! అలా ఏమీ జరగదు. జరగకపోగా, చాలాసార్లు ఆ సమయంలో మనం చేసే పని సక్సెస్ అవుతుంది. ఇది చాలాసార్లు గమనించాను. అప్పుడే నాకు అనుమానం వచ్చింది 'ఇదేంటి?' అని.

ఇంకో విషయం వినండి ! యమగండ సమయంలో చాలామంది పుడుతూ ఉంటారు. మరి వాళ్ళందరూ వెంటనే చనిపోవాలి కదా ! అలా ఏమీ జరగదు. ఈ విషయం ఎవరైనా గమనించారా మరి? అలాంటివాళ్ళు, వారివారి జీవితాలలో ఆధ్యాత్మిక మనస్కులుగా ఉండటం నేను చాలాసార్లు గమనించాను. అంటే, ప్రతి పనినీ స్వార్ధపూర్తితంగా 'నాకేంటి?' అంటూ చెయ్యకుండా, మంచీ చెడూ, న్యాయం ధర్మం, ఆలోచించి, నిదానంగా, ఎదుటి వ్యక్తులను బాధపెట్టకుండా, ఉన్నంతలో హాయిగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. 'యమగండం' అనేది అలా పనిచేస్తుంది. ఎందుకంటే, అది గురువు యొక్క ఉపగ్రహం గనుక, మనిషిని న్యాయమార్గంలో, ధర్మమార్గంలో నడిపిస్తుంది. న్యాయం, ధర్మం అనుసరించే మనిషి తన నిత్యజీవితంలో దూకుడుగా ఉండడు. స్వార్ధపూరితంగా ఉండడు. 'ఎవడెలా పోతే నాకేంటి? నాపని నాకు కావాలి' అనుకోడు. కనుక అలాంటివాడు తన జీవితంలో - నేడు లోకం అనుకుంటున్న 'సక్సెస్' ను - పొందలేడు.

అసలు, నేటిలోకం దృష్టిలో సక్సెస్ అంటే ఏమిటి? 'ఎలా సంపాదించావు? అని ఎవరూ అడగడం లేదు. 'ఎంత సంపాదించావు? అని మాత్రమే అడుగుతున్నారు. 'ఎంత ధర్మంగా బ్రతుకుతున్నావు?' అని అడగడం లేదు. 'ఎంత జల్సాగా బ్రతుకుతున్నావు? అని మాత్రమే అడుగుతున్నారు. 'ఇన్ని తప్పులు ఎందుకు చేశావు?' అనడగడం లేదు. 'ఇంత అమాయకంగా ఎలా దొరికిపోయావు?' అని మాత్రమే అడుగుతున్నారు. 'ఇంత తక్కువమందిని మాత్రమే ఎందుకు ముంచావు?' అనడుగుతున్నారు. కనుక నేటి లోకంలో ' సక్సెస్' నిర్వచనమే మారిపోయింది. అలాంటి సక్సెస్ ను 'యమగండకాలం' ఇవ్వదు గనుక అది పనికిరాని సమయం అయి కూచుంది. ధర్మంగా బ్రతకమని చెబుతుంది గనుక, 'అవసరమైతే దేనినైనా వదులుకోగాని ధర్మాన్ని మాత్రం వదలకు' అని చెబుతుంది గనుక అది 'గండకాలం' అయి కూచుంది. బూచిగా మారింది. దోషకాలం అయింది.

అంటే, నువ్వు చేసే ప్రతి వెధవపనికీ ఆసరాగా నిలవకపోతే అది చెడు అవుతుందా? ఆలోచించండి ! నువ్వు చెయ్యాలనుకున్న తప్పుడు పనులను  చెడగొడుతుంది గనుక యమగండకాలం దుష్ట సమయం అయింది. కాలక్రమేణా శుభకార్యాలలో కూడా దీనిని 'చెడు'గా చూడటం మొదలుపెట్టారు. పంచాంగాలలో వ్రాస్తున్నారు. జనం అనుసరిస్తున్నారు. జనానికి లాజిక్ అక్కర్లేదు కదా ! గొర్రెలమందకు లాజిక్ ఎందుకు? ముందు గొర్రె ఎటు పోతే వెనుకవి కూడా ఆటే పోతాయిగాని, 'ఇలా పోవడం సరియైనదేనా?' అని ఆలోచించవు. అదే ప్రస్తుతం మన సమాజంలో జరుగుతోంది.

యమగండం అనేది ఆధ్యాత్మికానికి చాలా మంచిది. ఈ సమయంలో చేసిన ధ్యానం చాలా మంచి ఫలితాలనిస్తుంది. ఈ విషయం నేను లెక్కలేనన్ని సార్లు గమనించాను. ఎన్నోసార్లు నాకిలా జరిగింది. ఆఫీస్ పనిలో ఉన్నపుడైనా, లేదా ఎక్కడో ఏదో స్టేషన్లో ఇన్స్పెక్షన్ లో ఉన్నప్పుడైనా, లేదా ఇంకేదో పనిలో ఉన్నప్పుడైనా, అకస్మాత్తుగా నాకు ధ్యానస్థితి చాలాసార్లు దానంతట అదే కలుగుతూ ఉంటుంది. అప్రయత్నంగా మనస్సు ఏకాగ్రం అవుతుంది. 'సతోరి' అనుభవంలోకి వస్తూ ఉంటుంది. నా చిన్నప్పటినుంచీ ఇలా చాలాసార్లు జరిగింది. అలా జరిగిన చాలాసార్లు ఆ సమయంలో 'యమగండకాలం' నడుస్తూ ఉండటం నేను గమనించాను. ఆ సమయంలో 'డబ్బు' గురించి, 'సంపాదన' గురించి, విలాసాల గురించి, సినిమాలు షాపింగులు, రాజకీయాల గురించి, ఇంకా ఇలాంటి చెత్త విషయాల గురించి, ఎవరైనా మాట్లాడితే వాళ్ళు క్రిమికీటకాలుగా నాకు కన్పిస్తారు. నేనెక్కడో మేఘాల పైన వెలుగులో ఉన్నట్లు, వాళ్లంతా బురదలో దొర్లుతున్నట్లు అనిపిస్తుంది. మనస్సు అంత ఎత్తులో ఉంటుంది. 'అమూల్యమైన మానవజన్మను పొంది కూడా ఎలా బ్రతుకుతున్నార్రా మీరు? ఎంత టైం ని వేస్ట్ చేసుకుంటున్నార్రా?' అని చాలా జాలి నాలో తలెత్తుతూ ఉంటుంది. ఇలాంటి మానసికస్థితిలో ఉన్న మనిషి  సోకాల్డ్ ' సక్సెస్' ను ఎలా పొందగలడు? ఎదుటివాడిని దోచుకోవాలని ఎలా అనుకోగలడు? కనీసం ఆ కోణంలో ఎలా ప్రయత్నించగలడు? కుదరదు. అలాంటివాడు తన జేబులోనుంచి ఎదుటివాడికి ఇస్తాడు గాని, ఎదుటివాడి జేబులోంచి లాక్కోడు. కనుక, యమగండకాలం దోషపూరితం అయింది. అన్నింటినీ చెడగొట్టే పాడుసమయం అయి కూచుంది. అదీ అసలు సంగతి !

సున్నితంగా, మెత్తగా, మంచిగా, ఆధ్యాత్మికంగా ఉండే మనుషులు ఈ లోకం దృష్టిలో చేతగానివాళ్ళు, పనికిరానివాళ్ళు, బ్రతకడం తెలియనివాళ్ళు, దద్దమ్మలు, మేనేజిమెంట్ తెలియనివాళ్ళు. ఎదుటి మనిషిని మాయమాటలతో బోల్తా కొట్టించి, దోచుకుని, బ్రతికేవాళ్ళు తెలివైనవాళ్ళు. ఇదీ నేటి లోకం తీరు !

యమగండం అనేది లౌకికమైన పనులకు, అందులోనూ స్వార్ధపూరితమైన పనులకు మాత్రమే చెడును చేస్తుంది. ఎందుకంటే అది ధర్మపూరిత సమయం గనుక. ధర్మానికి ప్రతిరూపమైన గురువు యొక్క ఉపగ్రహమైన యమఘంటక సమయం కనుక, ధర్మాన్ని ప్రోత్సహిస్తుంది. అధర్మాన్ని ఖండిస్తుంది. పాడుపనులను ఖచ్చితంగా చెడగొడుతుంది. అంతేగాని అది అన్నింటినీ చెడగొట్టదు. ఆధ్యాత్మిక సాధనలకు ఈ సమయం చాలా మంచిది.

ఈ విషయాన్ని నేను అనుభవంలో నిగ్గు తేల్చుకున్న తర్వాత మాత్రమే చెబుతున్నాను. మీరూ గమనించి చూడండి మరి !
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (యమగండం ఎందుకు చెడ్డది?) "

5, జనవరి 2020, ఆదివారం

Kalpataru Day Celebration - 2020

ప్రతి ఏడాదీ జనవరి ఒకటో తేదీన లోకం క్రొత్త సంవత్సరాన్ని జరుపుకుంటుంది. నేనూ దీనిని పాటిస్తాను. అయితే లోకం చేసే విధంగా కాదు. షాపింగులు, పార్టీలు చేసుకుని, తిని, తాగి, తందనాలాడి, రాత్రంతా మేలుకుని సొల్లు మాటలు చెప్పుకుంటూ, సినిమాలు, టీవీలు చూస్తూ కాదు. ఇవన్నీ చేస్తూ క్రొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడం చాలా చౌకబారు పోకడగా, ఇలా చేసేవారిని చాలా చౌకబారు మనుషులుగా నేను భావిస్తాను. దీనికి పూర్తిగా భిన్నమైన విధానంలో నేను క్రొత్త సంవత్సరాన్ని జరుపుకుంటాను. పూర్తిగా ఏకాంతంలో, మౌనంలో, ధ్యానంలో నేను ఈ రోజున కాలం గడుపుతాను. సరదాలలో, కులాసాలలో, పనికిమాలిన కాలక్షేపాలలో వేస్ట్ చేసుకోవడానికి మానవజీవితం ఉద్దేశించబడలేదని నా భావన.

1886 సంవత్సరంలో జనవరి ఒకటో తేదీన ఈ అధ్బుతం జరిగింది. ఆ రోజున తన భక్తులు ఏది కోరితే దానిని ఇచ్చారు శ్రీ రామకృష్ణులు. అది ఆధ్యాత్మికమైనా, లౌకికమైనా సరే, వారి కోరికలన్నీ ఆ రోజున అనుగ్రహించబడ్డాయి. ఆ రోజున తనను అర్ధించిన వారిని కాదనకుండా ఆయన తన కరుణను వారిపైన వర్షించాడని ఆ సంఘటనను చూసిన వారు వ్రాశారు. అందుకని అప్పటినుంచీ ఆయన భక్తులు ఆ రోజును 'కల్పతరు దినోత్సవం' గా జరుపుకుంటారు.

ఈ మహత్తరమైన సంఘటనను తలచుకుంటూ ప్రతి ఏడాదీ జనవరి ఒకటో తేదీన మితాహారం, జపం, ధ్యానం, యోగాభ్యాసాలలో నేను కాలం గడుపుతాను. ఇది ఎన్నో ఏళ్ళ నుంచీ నేను పాటిస్తున్నాను. అదే విధంగా ఈ ఏడాది కూడా చేశాను. కాకపోతే, ఈ ఏడాది నేనొక్కడినే లేను. నాతో పాటు పంచవటి బృందం ఉంది. ఆ రోజంతా ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక భావనా తరంగాలలో గడిచింది. నాతో బాటు ఉన్నవారికి ఎన్నో insights ను, spiritual experiences ను ఇచ్చింది.

ప్రస్తుతం నేను హైదరాబాదులోనే ఉంటున్నాను గనుక హైదరాబాద్ వాస్తవ్యులు చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వారికి, మిగతా దూరప్రాంతాలనుండి ఇక్కడకు వచ్చినవారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

విదేశాలలో ఉన్న పంచవటి సభ్యులకు ఫేస్ బుక్ లింక్ ద్వారా దీనిని వీక్షించే అవకాశం కల్పించాము. రాత్రంతా మేలుకుని దీనిని వీక్షించిన, వారికి కూడా నా కృతజ్ఞతలు.

ఆ ఫోటోలలో కొన్నింటిని ఇక్కడ చూడండి.

















read more " Kalpataru Day Celebration - 2020 "

30, డిసెంబర్ 2019, సోమవారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (రాహుకాలం - యమగండం)

నేటి పంచాంగాలలో జనాన్ని అనవసరంగా భయపెడుతున్న రెండు మాటలు రాహుకాలం - యమగండం. వీటి అసలు తత్త్వం ఈ పోస్టులో చూద్దాం. కాస్త ధైర్యంగా ఈ పోస్టును చదవండి మరి !

జ్యోతిష్యంలో, మనకు తెలిసిన ఏడు ముఖ్యగ్రహాలకు తోడు ఉపగ్రహాలని ఉన్నాయి. వీటిని పరాశరహోర చెప్పింది. ఫలదీపిక మొదలైన ఇంకా ఇతర ప్రామాణిక గ్రంధాలలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ ఉపగ్రహాలను ఎలా లెక్కించాలి అనే దానికి ఫార్ములాలు ఉన్నాయి.

కానీ ఈ ఉపగ్రహాలను కూడా తమ జాతక విశ్లేషణలో ఉపయోగించే జ్యోతిష్కులను ఆంధ్రాలో గాని, తెలంగాణలో గాని నేనింతవరకూ ఒక్కడంటే ఒక్కడిని కూడా చూడలేదు.

నిజమే మరి ! నవగ్రహాలే ఇంతవరకూ అర్ధం కాక ఛస్తుంటే వీటికి తోడు ఇంకో తొమ్మిది ఉపగ్రహాలా? మా వల్లకాదు దేవుడోయ్ ! అంటారేమో? సరే అది వారిష్టం. 'ప్రమాణగ్రంధాల నుంచి కూడా మాకిష్టం వచ్చినంత వరకే తీసుకుంటాం' అంటే ఎవరూ ఏమీ చెయ్యలేరు !

పరాశరహోర ప్రకారం ఉపగ్రహాలు అయిదు. అవి - ధూమ, వ్యతీపాత, పరివేష, ఇంద్రచాప, కేతువులు. ఇవన్నీ సూర్యుని డిగ్రీల నుండి లెక్కించబడతాయి.

ఈ అప్రకాశ (కంటికి కనిపించని) ఉపగ్రహములు సూర్య, చంద్ర, లగ్నములతో గనుక కలిస్తే, క్రమముగా, వంశము, ఆయువు, జ్ఞానములను నశింపజేస్తాయని చెబుతూ పరాశరహోర వీటిని పంచార్కదోషములని అంటుంది. అంటే, సూర్యునికి సంబంధించిన అయిదు దోషములని అర్ధం. 

శ్లో || రవీందు లగ్న గేశ్వేషు వంశాయుర్జ్నాన నాశనం
ఏషాం పంచార్క దోషాణాం స్థితి పద్మాసనోదితా:

ఇవి పూర్వం, బ్రహ్మదేవునిచేత చెప్పబడ్డాయని కూడా అంటుంది ఇదే గ్రంధం.

ఇకపోతే, ఉపగ్రహములను గురించి చెబుతూ మంత్రేశ్వరుడు తన ఫలదీపిక 25 వ అధ్యాయ ప్రారంభశ్లోకం లోనే ఇలా అంటాడు.

శ్లో || నమామి మాన్దిం యమకంటకాఖ్య
మర్ధప్రహారం భువికాల సంజ్ఞం
ధూమ వ్యతీపాత పరిధ్యభిఖ్యాన్
ఉపగ్రహానింద్ర ధనుశ్చ కేతూన్

1. మాంది 2. యమకంటక 3. అర్ధప్రహార 4. కాల 5 . ధూమ 6 . పాత 7 . పరిధి 8. ఇంద్రధనుసు 9. కేతువు అనే తొమ్మిది ఉపగ్రహాలకు నమస్కరిస్తున్నాను అంటాడు.

అసలివన్నీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఉన్న కాల వ్యవధిని బట్టి ఏర్పడతాయి. ఈ టైం స్లాట్ ను ఎనిమిది భాగాలు చేస్తే, ఏడు భాగాలకు ఆ వారంనుంచి మొదలుపెట్టి ఏడు గ్రహాలు అధిపతులు అవుతాయి. ఎనిమిదో భాగానికి ఎవరూ అధిపతి కాదు. రాత్రి పూట అయితే, ఐదో వారం నుంచి లెక్క మొదలౌతుంది.

వీటిల్లో శనీశ్వరుని ఉపగ్రహాన్ని మాంది, లేదా గుళిక అని పిలుస్తారు. గురువుగారి ఉపగ్రహం పేరు యమఘంటక లేదా యమకంటక. అంతేగాని అది 'యమగండం' కాదు.

రాహుకాలం

రాహుకాలం అనేదాన్ని పెద్ద బూచిగా నేటి జ్యోతిష్కులు చూపిస్తున్నారు. ఇది నిజం కాదు. రాహుకాలం అందరికీ చెడ్డది కాదు. ఏ జాతకంలో అయితే రాహువు శుభగ్రహమో, ఆ జాతకానికి రాహుకాలం చాలా మంచిది. ఆ సమయంలో వారు చేసే ఏ పనైనా సక్సెస్ అవుతుంది. ఈ విషయం చెప్పకుండా నేటి కుహనా జ్యోతిష్కులు 'ఆమ్మో ! రాహుకాలం వచ్చేసింది. ఇప్పుడు నువ్వు బాత్రూం కి కూడా పోకూడదు. బిగబట్టుకో.' అని చెబుతున్నారు. పిచ్చిజనం నమ్ముతున్నారు. మోసపోతున్నారు.

రాహుకేతువులు ఒకరి జాతకంలో శుభులైతే, అతడిని అన్నింట్లోనూ శిఖరాగ్రానికి చేరుస్తారు. వారు చేసే మంచి మనం ఊహించలేనంతగా ఉంటుంది. కానీ ఈ విషయం ఎవరూ చెప్పడం లేదు. వారిని దుష్టగ్రహాలుగానే చూస్తున్నారు. కుహనాజ్యోతిష్కులు అలా చూపిస్తూ జనాన్ని నమ్మిస్తున్నారు. గొర్రెలు నమ్ముతున్నారు.

ఒక ఉదాహరణ !

ఒకరి జాతకంలో రాహువు ఉచ్ఛస్థితిలో ఉంది. శుభగ్రహమై ఉంది. ఆ జాతకునికి సరిగ్గా రాహుకాలం సమయంలో సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ జ్యోతిష్కులు ఎక్కించిన భయాలతో బిగదీసుకు పోయాడు. లోపలికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. కానీ నేను చెప్పిన మాటలు నమ్మి నార్మల్ గా ఇంటర్వ్యూ చేశాడు. ఫలితం ఏమిటో తెలుసా? అతనికి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో ఆల్ ఇండియా 10th రాంక్ వచ్చింది. ఇది జరిగి ఇప్పటికి ముప్పై ఏళ్లయింది. ఇప్పుడతను ఒక స్టేట్లో చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. ఇతను నా మిత్రుడు. రాహుకాలం అతనికి ఏమీ చెడు చేయకపోగా, ఎంతో మంచిని చేసింది.

ఇన్నేళ్ల నా అనుభవం నుంచి, నేను ఇప్పటిదాకా విశ్లేషణ చేసిన 1000+ జాతకాల నుంచి, ఈ విషయంలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా ఇవ్వగలను.

రాహుకాలం బూచి కాదు. ఇది అందరికీ చెడూ చెయ్యదు. అందరికీ మంచీ చెయ్యదు. కానీ నేటి జ్యోతిష్కులు జనాన్ని 'అమ్మో రాహుకాలం' అంటూ భయపెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాహువు ఒక్కొక్కరి జాతకాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఫలితాన్నిస్తుంది. ఆ సూక్ష్మాలు తెలుసుకోవాలి.

జ్యోతిష్యశాస్త్రంలో యూనివర్సల్ మంచి గ్రహాలూ, యూనివర్సల్ చెడు గ్రహాలూ లేవన్న విషయం నేటి జ్యోతిష్కులు మరచిపోయారు. అందుకే ఈ పిచ్చి ధోరణులు !

యమగండం

ఇప్పుడు ఇంకో బూచి గురించి చెబుతాను. అదే యమగండం. మీకో విషయం తెలుసా? అసలు యమగండం అనే పదం జ్యోతిష్య శాస్త్రంలో లేనేలేదు.

వింతగా ఉంది కదూ? అదేమరి నేటి జ్యోతిష్కుల మాయంటే??

ఉపగ్రహాలలో, గురువు యొక్క ఉపగ్రహాన్ని 'యమఘంటక' అంటారు. ఈ ఉపగ్రహం యొక్క కాలవేళ మధ్యభాగంలో ఉదయించే లగ్నసమయాన్ని 'యమఘంటక కాలం' అంటారు. దానిని జ్యోతిష్యశాస్త్రపు ఓనమాలు తెలియని నేటి పంచాగజ్యోతిష్కులు 'యమగండం' గా మార్చిపారేశారు. జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

అసలు 'యమగండం' అనే పదమే శుద్ధబూతు. ఏ ప్రామాణిక జ్యోతిష్య గ్రంధంలోనూ ఈ పదం లేదు. కానీ ఏ పంచాంగం చూసినా ఈ పదం కనిపిస్తుంది. మిమ్మల్ని భయపెడుతుంది. అదేమరి నేటి జ్యోతిష్కుల మాయంటే !

ఇంకో విషయం తెలుసా? ఇదే జ్యోతిష్కులు, గురువును పరిపూర్ణ శుభగ్రహం అంటారు. మరి ఆ గురువు యొక్క ఉపగ్రహమైన 'యమఘంటక' ను మాత్రం చాలా చెడ్డగ్రహం అంటారు. ఇదేంటి? అని అడిగిన వారికి సమాధానం చెప్పలేక పలాయనం చిత్తగిస్తారు. ఒకసారి అడిగి చూడండి !

పరిపూర్ణ శుభగ్రహం యొక్క ఉపగ్రహం అశుభం ఎలా అవుతుంది? ఏ జ్యోతిష్కుడినైనా చెప్పమనండి చూద్దాం !

ఫలదీపికలో మంత్రేశ్వరుడు ఏమన్నాడో ఒకసారి చూడండి మరి !

శ్లో || గులికస్య తు సంయోగే దోషాన్ సర్వస్య నిర్దిశేత్
యమఘంటక సంయోగే సర్వత్ర కధయే శుభమ్ (ఫలదీపిక 25 - 18) 

'గులికుడు కలిస్తే ఏ గ్రహమైనా చెడిపోతుంది. ఆశుభాన్నిస్తుంది. అదే, యమకంటకుడు కలిస్తే అంతా శుభమే జరుగుతుంది' అని దీని అర్ధం. దీన్ని 'యమగండం' అని మార్చిన పంచాంగ జ్యోతిష్కులు ఇది చాలా చెడుకాలం అని చెబుతున్నారు !

ఇంకో శ్లోకం చూడండి.

శ్లో || దోషప్రదానే గులికో బలీయాత్
శుభ ప్రదానే యమకంటకస్యాత్

'దోషములు ఇవ్వడంలో గులికుడు బలమైనవాడు. శుభ ఫలితములు ఇవ్వడంలో యమకంటక బలీయమైనది' అని దీని అర్ధం.

మరి నేటి జ్యోతిష్కులు దీనికి పూర్తిగా వ్యతిరేకంలో చెబుతున్నారేమిటి? వీరిని శాస్త్రం తెలిసినవారనాలా? దొంగలనాలా? అజ్ఞానులనాలా? మోసగాళ్ళనాలా? లేక ఇంకేమనాలి?

అదే ఫలదీపిక నుంచి ఇంకో శ్లోకం చూడండి !

శ్లో || శనివద్గులికే ప్రోక్తం గురువద్యమకంటకే
అర్ధప్రహారే బుధవత్ఫలం కాలేతు రాహువత్

పైన చెప్పిన ఉపగ్రహాలలో కేతువును గురించి చెప్పారు. గుళిక గురించి చెప్పారు, మరి రాహువు ఎక్కడ అని అనుమానం రావచ్చు. దీనిని వివరిస్తూ పై శ్లోకంలో 'కాలే రాహువత్' - 'కాలము అనే ఉపగ్రహం రాహువు వంటిది' అంటాడు.

కనుక - రాహుకేతువుల ఉపగ్రహాలుగా కాల - కేతువులనూ, శనీశ్వరుని ఉపగ్రహంగా గుళికనూ చెబుతూ, ఇవి చాలా దోషప్రదమైనవి అన్నారు ప్రాచీనఋషులు. 'యమకంటక' అనేది గురువు యొక్క ఉపగ్రహం కనుక చాలా శుభప్రదం అని కూడా వారే చెప్పారు. పైన ఉదాహరించిన శ్లోకాలే దీనికి ప్రమాణాలు.

మరి నేడు ఏ పంచాంగం చూసినా - 'యమగండం' అనే పదాన్ని వాడుతూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇదేంటి? ఈ పదాన్ని అసలు సృష్టి చేసిన గిరీశాలెవరు? దాన్ని అదేపనిగా పంచాంగాలలో ఎందుకు, ఎలా వాడుతున్నారు?

అంతేగాక - అంత దోషాన్నిచ్చే గుళిక కూడా, కొన్ని కొన్ని యోగాలలో ఉన్నప్పుడు అమిత శుభాన్నిస్తుంది అని కూడా కొన్ని మినహాయింపులను ప్రామాణిక గ్రంధాలే చెప్పాయి. అదెప్పుదంటే,

శ్లో || గుళిక భవననాధే కేంద్రగే వా త్రికొణే
బలిని నిజగృహస్థే స్వోచ్చమిత్రస్థితేవా
రధగజతురగానాం నాయకో మారతుల్యో
మహిత పృధుయశస్యాత్ మేదినీ మండలేంద్ర:

అంటూ - 

'గులికుడున్న రాశినాధుడు గనుక ఉచ్చ, మిత్ర క్షేత్రములలోగాని, స్వగృహంలో గాని ఉంటూ, అవి కేంద్రకోణములైతే, ఆ జాతకుడిని రధములు, ఏనుగులు, గుర్రములు కలిగినవానిగా, మన్మధుని వంటి రూపసిగా, గొప్ప కీర్తి కలిగిన రాజుగా చేస్తాడు' అంటాడు మంత్రేశ్వరుడు.

కనుక రాహుకేతువులు, శనీశ్వరుడు కూడా కొన్నికొన్ని యోగాలలో ఉన్నప్పుడు అమితమైన శుభాన్ని ఇస్తారని ప్రామాణికగ్రంధాలే చెబుతుండగా, నేటి కుహనాజ్యోతిష్కులు మాత్రం, వీరందరినీ చూపించి జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. డబ్బుతో బాటు చెడుకర్మనూ మూటగట్టుకుంటున్నారు.

రాహుకేతువులూ, శనీశ్వరుడూ దుష్టగ్రహాలు కారు. యమఘంటక లేదా యమకంటక అనేది కూడా దుష్టగ్రహమూ దుష్టసమయమూ కాదు. 'యమగండం' అనేది అసలు లేనేలేదు. దొంగజ్యోతిష్కుల మాటలు నమ్మకండి !! వీళ్ళే అసలైన దుష్టగ్రహాలు !!

మీకొక అనుమానం రావచ్చు, మీకొక్కరికే జ్యోతిశ్శాస్త్రం తెలుసా? లోకంలో ఇంకెవరికీ తెలీదా? పంచాంగాలన్నీ మరీ ఇంత తప్పులా? అని.

దీనికి సమాధానం వచ్చే పోస్ట్ లో చెబుతాను. యమగండం (?) అనేది చెడు సమయంగా ఎందుకు లోకం భావిస్తోందో కూడా చెబుతాను. వేచి చూడండి మరి !

(ఇంకా ఉంది)
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (రాహుకాలం - యమగండం) "

28, డిసెంబర్ 2019, శనివారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (ఋషులు పెట్టిన ముహూర్తాలు)

ముహూర్తంలోనే అన్నీ ఉన్నాయి అది చాలా ముఖ్యం అనే వాళ్లకు నాదొక ప్రశ్న.

సప్తఋషులలో ఒకరైన వశిష్టమహర్షి పెట్టిన శ్రీరామ పట్టాభిషేక  ముహూర్తం ఎందుకు తప్పిపోయింది? బ్రహ్మఋషి అయిన ఆయనకు మనంత జ్యోతిష్యం రాదా? లేక కావాలనే తప్పిపోయే ముహూర్తం పెట్టాడా?

దీనికి మన పురోహితజ్యోతిష్కులూ పురాణపండితులూ రకరకాల బుకాయింపు   కబుర్లు చెబుతారు.

ఆ ముహూర్తం తప్పిపోతేగాని శ్రీరాముడు అడవికి పోడు. అప్పుడుగాని రావణసంహారం జరగదు. అందుకని అలాంటి తప్పుడు ముహూర్తం పెట్టాడు వశిష్ట మహర్షి - అంటారు వాళ్ళు.

నా జవాబు : అంటే, వశిష్టుని వంటి బ్రహ్మర్షి కూడా అబద్దాలు చెబుతాడన్నమాట ! అబద్దపు ముహూర్తం పెడతాడన్న మాట ! అలాంటాయన బ్రహ్మర్షి ఎలా అవుతాడు?

రావణసంహారం జరగడమే పరమార్ధం అయితే, దానికోసం శ్రీరాముడూ సీతాదేవీ వనవాసం చెయ్యడం ఎందుకు? ఈ మొత్తం గొడవతో ఏ సంబంధమూ లేని లక్ష్మణుడిని కూడా తోడు తీసికెళ్ళి ఆయన్ను హింస పెట్టడం ఎందుకు? సరాసరి రావణుడిమీద యుద్ధం ప్రకటించి అతని యుద్ధంలో చంపెయ్యవచ్చు కదా ! దానికోసం ఇంతమంది ఇంత హింస అనుభవించాలా? సీతమ్మతల్లి అన్ని బాధలు పడాలా?

కనుక ముహూర్తం అనేది జాతకాన్ని అధిగమించలేదు అని స్పష్టంగా తెలుస్తున్నది. అంతేకాదు, ఆ కార్యక్రమం సజావుగా జరగడానికి కూడా ముహూర్తం ఏమాత్రమూ సహాయం చెయ్యదు. అలా చేసే పనైతే, శ్రీరామ పట్టాభిషేకం ముహూర్తం ఎందుకు తప్పింది?

అందుకనే జిల్లెళ్ళమూడి అమ్మగారు - "పెట్టినది ముహూర్తం కాదు, జరిగినదే ముహూర్తం" - అన్నారు. 

ఇకపోతే, రెమెడీలతో అన్ని పనులూ సజావుగా జరిగే పనైతే, పాండవులు అన్నేళ్లు అన్ని బాధలు ఎందుకు పడ్డారు? వారి దగ్గర ధౌమ్యుడు ఉన్నాడు కదా ! ఆయనకు జాతకాలు చూపించుకుని రెమెడీలు చేసేసి, తమ రాజ్యాన్ని తాము పొందవచ్చుఁ కదా? అన్నేళ్లపాటు అన్ని బాధలు పడటం ఎందుకు? వాళ్ళు తలచుకుంటే వేళ్ళకు ఉంగరాలు పెట్టుకోలేరా? మెడలో గొలుసులు వేసుకోలేరా?

కనుక వశిష్టమహర్షికి, ముందుముందు జరుగబోయేది తెలియదు అని అర్థమౌతోంది. అలాగే పాండవుల విషయంలో చూస్తే, రెమెడీలు కర్మను తీర్చలేవు అని స్పష్టంగా అర్థమౌతోంది.

ఇంగిలీషు వారి పాలనాసమయంలోనూ, అంతకుముందు తురుష్కుల పాలనా సమయంలోనూ, ఉన్న రాజులూ, సంస్థానాధీశులూ హోమాలు చేయించలేరా? ఉంగరాలు పెట్టుకోలేరా? ప్రదక్షిణాలు చేయలేరా? రెమెడీలు చేయలేరా? వాళ్ళ దగ్గర పురోహితులు లేరా? అన్నీ ఉండి,  పరాయి పాలకుల చేతిలో అన్ని బాధలు ఎందుకు పడ్డారు?

వశిష్టమహర్షి వంటి ప్రాచీన మహర్షుల విషయంలోనే ఇలా  ఉంటే,  మరి నేటి పురోహితులెంత? పంచాంగాలెంత? వీటిల్లో ఒక పంచాంగానికీ ఇంకో పంచాంగానికీ సరిపోదు. ఎవరి ముహూర్తాలు  వారివే. ఎవరి విధానాలు వారివే. కొంతమందికి అమావాస్య చాలా మంచిది. మరికొంతమందికి అమావాస్య చెడ్డది. సాయన విధానానికీ నిరయన విధానానికీ చుక్కెదురు. నిరయనంలో కూడా ఎవరి అయనాంశ వారిదే. అయనాంశ తేడాలవల్ల నక్షత్రాలు మారిపోతాయి. తిధులు మారిపోతాయి. ముహూర్తాలు కూడా మారిపోతాయి. నార్త్ ఇండియాలో ముహూర్తాలు వేరు. సౌత్ ఇండియాలో ముహూర్తాలు వేరు. ఈస్ట్ లో వేరు. వెస్ట్ లో వేరు. మరి, నేటి పంచాంగాలలో ఏ పంచాంగం కరెక్ట్? ఎవరి  ముహూర్తం కరెక్ట్? ఎవరి విధానం కరెక్ట్?

ఇకపోతే, ఇంకొక పాయింట్ ! ప్రపంచ జనాభాలో హిందువుల శాతం ఎంత? 15% కదా? మరి మిగతా 85% ప్రజలు ఏ ముహూర్తాలు చూసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు? ఏ పంచాంగాలను  అనుసరిస్తున్నారు? ఆ పెళ్లిళ్లు అన్నీ పెటాకులు అవుతున్నాయా? లేదు కదా? ఇంతకుముందు అయితే, 'విదేశాలలో విడాకుల శాతం చాలా ఎక్కువ' అనేవారు. ఇప్పుడు ఇండియాలో కూడా అవి ఎక్కువగానే ఉంటున్నాయి. యూరప్ లో, అమెరికాలో, ఇతర దేశాలలో కూడా ఒకరికొకరుగా జీవితాంతసంసారం సాగిస్తున్న జంటలు చాలామంది ఉన్నారు. అక్కడి కన్సర్వేటివ్ కుటుంబాలలో వివాహవ్యవస్థ కూడా మనలాగే పటిష్టంగానే ఉంటుంది.  అల్లరి చిల్లరగా ఏమీ ఉండదు.

మరి ముహూర్తాలు పెట్టి చేసిన పెళ్ళిళ్ళూ, పెట్టకుండా చేసిన పెళ్ళిళ్ళూ రెండూ ఒకేలాగా ఉన్నప్పుడు, ఫెయిల్యూర్ శాతం రెండింటిలోనూ సమానంగానే ఉన్నపుడు, మనం పెడుతున్న ముహూర్తం విలువ ఎంత? నేటి జ్యోతిష్కులు చెబుతున్న ముహూర్తాలకూ, రెమెడీలకూ విలువ ఎంత? విధిని ఇవన్నీ అధిగమించగలవా? అంత శక్తి వాటిల్లో ఉందా?

ఆలోచించండి !
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (ఋషులు పెట్టిన ముహూర్తాలు) "

25, డిసెంబర్ 2019, బుధవారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (జాతకమా - ముహూర్తమా?)

గత పోస్టులో నేను చెప్పిన నిజాలను చాలామంది జీర్ణించుకోలేరు. ఆత్మస్తుతి పరనింద దిశలో నేను చేస్తున్న ప్రయత్నంగా దీన్ని చాలామంది అనుకోవచ్చు. వాళ్ళు నా పాయింట్ ను సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు.

ఈ నా వాదనకు వ్యతిరేకంగా పంచాంగ ముహూర్తాలను సమర్ధించే పురోహితులు, పంచాంగజ్యోతిష్కులు చెప్పే లాజిక్స్ కొన్ని ఉంటాయి. అవేమిటో వరుసగా చూద్దాం.

1. అబ్బాయి అమ్మాయి జాతకాలను బట్టి వారి జీవితం నడుస్తుంది గాని, ముహూర్తాన్ని బట్టి కాదు. కనుక ముహూర్తం లేదని అనకూడదు.

నా జవాబు: జాతకమే సర్వస్వం  అయినప్పుడు ముహూర్తం ఎందుకు? దానికింత ప్రాధాన్యత ఎందుకు? ఏ ముహూర్తానికి పెళ్ళిచేసినా, ఎవరి జాతకాన్ని బట్టి వారికి జరుగుతుంది కదా? మరి ముహూర్తం చూడకుండా పెళ్ళి ఎందుకు చెయ్యకూడదు? పైగా, ఎవరి జాతకాన్ని బట్టి వారికి సరిపోయే ముహూర్తం పెట్టాలిగాని, అందరికీ ఒకే ముహూర్తానికి పెళ్లిళ్లు ఎలా చేస్తారు?

2. ముహూర్తం పెట్టేది, వాళ్ళ జీవితాలు మార్చడానికి కాదు. ఆ కార్యక్రమం సరిగ్గా జరగడానికి మాత్రమే. ముహూర్తం విలువ, ఆ కార్యక్రమం వరకే. అంతేగాని వధూవరుల జీవితాలను అది మార్చలేదు.

నా జవాబు: అలా అయితే, ముహూర్తానికి చతుర్ధశుద్ధి, సప్తమ శుద్ధి, అష్టమశుద్ధి ఎందుకు చూస్తున్నారు? లగ్నశుద్ధి ఒకటే చాలుకదా? కానీ ఎవరూ ఒక్క లగ్నశుద్ధితో ఊరుకోవడం లేదు. కనుక మీరు చెప్పేది కరెక్ట్ కాదు. వాళ్ళ జీవితాలు కూడా అన్నివిధాలుగా బాగుండాలనే ముహూర్తం పెడతారు. మరి అలా ఎందుకు ఉండటం లేదు? కనుక ఈ మొత్తం విషయంలో మీకు అర్ధం కానివి ఇంకా చాలా ఉన్నాయని తెలుసుకోండి. పంచాంగ ముహూర్తాలు కరెక్ట్ కాదు. ఆ ముహూర్తాలకు అందరికీ పెళ్లిళ్లు చెయ్యకూడదు.

3. ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయాన్ని మీరు ఎలా కాదంటారు? మీరు అంత గొప్పవారా?

నా జవాబు: నేను సాంప్రదాయ విరోధిని కాను. సత్యాన్వేషిని మాత్రమే. మీరు గుడ్డిగా పాటిస్తున్న అనేక ఆచారాలలో అర్ధం ఏమాత్రమూ లేదని నేను చెబుతున్నాను. మీరు పాటిస్తున్న ఆచారాలు అనేకం, ప్రాచీన వేదకాలంలో లేవు. మధ్యయుగాలలో అవి పుట్టుకొచ్చాయి. అలా పుట్టడానికి, ముస్లిం దండయాత్రల వంటి అప్పటి సామాజికకారణాలు అనేకాలు ఉన్నాయి. ఆయా పరిస్థితులు ఇప్పుడు మన సమాజంలో లేవు. కనుక ఆ ఆచారాలను ఇప్పుడు కూడా పాటించడం అవివేకం.

4. పంచాంగ కర్తల కంటే మీరు గొప్పవారా?

నా జవాబు: పంచాంగ గణితం వేరు. ఫలిత జ్యోతిష్యం వేరు. పంచాంగ కర్తలకు, గణితం మాత్రమే తెలుస్తుంది. ఆ గణితం ప్రకారం లెక్కలు వేసి, వాళ్ళు పంచాంగాలు వ్రాస్తారు. కానీ వ్యక్తిగత జ్యోతిష్యం వారికి రాదు. నిరంతరం పరిశోధిస్తూ, పరిశీలిస్తూ, దానినుంచి నేర్చుకుంటూ ఉండే ప్రక్రియ వారిలో ఉండదు. కనుక వారు వ్రాసే ముహూర్తాలకు విలువ లేదు.

ఫలిత జ్యోతిష్యం తెలిసినవారు తగ్గిపోయి, పురోహిత జ్యోతిష్యం చెప్పేవారు సమాజంలో ఎక్కువ కావడంవల్ల మాత్రమే నేడు మీరు చూస్తున్న ఈ పరిస్థితి వచ్చింది. కనుక గుడ్డిగా పంచాంగ ముహూర్తాలను అనుసరించడం తప్పు. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ముహూర్తం పెట్టుకోవాలి. అంతేకాదు, పెళ్ళిలో చేస్తున్న తంతులలో కూడా చాలావాటికి అర్ధం లేదు. వాటిని తీసెయ్యాలి.

5. అలాంటప్పుడు అందరూ వాటిని ఎందుకు పాటిస్తున్నారు? ఎవరికీ మీరు చెప్పేవి తెలియవా?

నా జవాబు: కొంతమంది ఆలోచనాపరులు నాలా ఆలోచించేవారు గతంలోనూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. కానీ, లోకం అంతా భయంతో నిండిపోయి ఉంది. 'ఏమో? ఎదుటివాళ్ళు చేస్తున్నారు, మనం చెయ్యకపోతే ఏ చెడు జరుగుతుందో?' అన్న భయంతో, పనికిరాని వాటిని సాంప్రదాయం అంటూ అందరూ పాటిస్తున్నారు. ఈ పోకడకు కారణం 'భయం' తప్ప ఇంకేమీ కాదు.

నేటి జ్యోతిష్కులందరూ 'భయం' కార్డు వాడుతూ జనాల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కానీ సత్యాన్ని చెప్పడం లేదు. చెప్పాలంటే, ముందు వారికి తెలియాలి కదా ! వారికే సత్యజ్ఞానం లేనప్పుడు లోకానికి ఎలా చెప్తారు? డబ్బు మీద ఆశ ఉన్నప్పుడు నిస్వార్ధంగా ఉన్నదున్నట్టు ఎలా చెప్పగలుగుతారు? 

(ఇంకా ఉంది)
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (జాతకమా - ముహూర్తమా?) "

21, డిసెంబర్ 2019, శనివారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (వివాహ ముహూర్తాలు)

నేడు బంపర్ గా సాగుతున్న రెండు వ్యాపారాలేవంటే జ్యోతిష్యమూ, వాస్తులే. టీవీ పెడితే చాలు రకరకాల బిరుదులున్న జ్యోతిష్కులు ఊదరగొడుతూ కనిపిస్తారు. పత్రిక పేజీ తిప్పితే చాలు, జ్యోతిష్యమూ, వాస్తుల గురించి ప్రశ్నలు సమాధానాలు కనిపిస్తాయి. రోడ్డుమీద ఎక్కడ చూసినా పెద్దపెద్ద బోర్డులు కన్పిస్తాయి. వెరసి సమాజంలో ఇవి రెండూ బాగా చెలామణీ అవుతున్నాయని అందరికీ తెలుసు.

కానీ, నేడు సమాజంలో చలామణీ అవుతున్న జ్యోతిష్యం నిజమైనదేనా? వాస్తు నిజమైనదేనా అంటే, 'కాదంటే కాదని' నేనంటాను. నేటి జ్యోతిష్కులు చెబుతున్న జ్యోతిష్యమూ తప్పే, వాస్తుశాస్త్రజ్ఞులు చెబుతున్న వాస్తూ బూటకమే అని బల్లగుద్ది మరీ చెబుతాను. నా ఈ వాదనకు ఆధారాలు జ్యోతిశ్శాస్త్ర ప్రామాణిక గ్రందాల నుంచి, శ్లోకాల నుంచి వందలకొలది చూపించగలను. మిగతా పూర్తి వివరాలకు త్వరలో రాబోతున్న నా పుస్తకం 'జ్యోతిశ్శాస్త్ర రహస్యాలు' చదవండి !

ప్రస్తుతానికి మాత్రం, అందరికీ తెలిసిన కొన్ని విషయాలనుంచి చిన్నచిన్న ఉదాహరణలతో నేను చెబుతున్నది నిజమే అని నిరూపిస్తాను.

వివాహ ముహూర్తాలు

మీరు ఏ పంచాంగం తిరగేసినా, వివాహ ముహూర్తాలు కనిపిస్తాయి. ఒక రోజున ముహూర్తం ఉంటె, ఆ రోజున ఆ ముహూర్తానికి వేల కొలది పెళ్ళిళ్ళు జరుగుతాయి. మరి ఆ వేల పెళ్ళిళ్ళలో అన్ని కాపురాలూ అన్నివిధాలుగా బాగుండాలి కదా? ధనకనక వస్తు వాహనాలతో, అన్యోన్య దాంపత్యంతో, దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి కదా? ఎందుకని అలా ఉండటం లేదు? 

ఖచ్చితంగా వీటిల్లో కొన్ని పెళ్ళిళ్ళు మాత్రమే సక్సెస్ అవుతాయి. కొన్ని చెడిపోతాయి. వీరిలో కొంతమంది చనిపోతారు. కొంతమంది విడాకులు తీసుకుని విడిపోతారు. కొంతమంది తిట్టుకుంటూ కొట్టుకుంటూ సంసారం చేస్తూ ఉంటారు. మరికొంతమందికి పిల్లలు ఉండరు. కొంతమందికి పెళ్లి అయిన వెంటనే పెద్దలు గతిస్తారు. లేదా ఏవేవో అశుభాలు జరుగుతాయి. మరికొంతమంది, పది ఇరవై ఏళ్ళు సంసారం చేసి, పిల్లల్ని కని, ఆ తరువాత డైవోర్స్ తీసుకుని విడిపోతుంటారు. మరికొంతమంది ఒకరు గాని, ఇద్దరూ గాని, extra marital affairs నడుపుతూ ఉంటారు.

ఇదంతా ఏమిటి? అన్నీ చూసి, అన్ని లెక్కలూ వేసి, మంచి సుముహూర్తంలో చెయ్యబడిన పెళ్ళిళ్ళు ఇలా ఎందుకు అవుతున్నాయి? అన్న ప్రశ్నకు ఏ పురోహితుడు గాని, ఏ జ్యోతిష్కుడు గాని, ఏ పంచాంగకర్త గాని జవాబు చెప్పలేడు. ఎందుకంటే, వాటికి అసలైన జ్యోతిష్యం తెలియదు కాబట్టి ! వారికి తెలిసిన జ్యోతిష్యమూ, తెలుసని అనుకుంటున్న జ్యోతిష్యమూ అసలైనది కాదు కాబట్టి !

నేటి జ్యోతిష్కులు, జ్యోతిశ్శాస్త్రం మీద తపనతో, దానిని మధించిన వాళ్ళు కారు. ఏళ్లకేళ్లు దానిని పరిశోధించినవారూ కారు. అమాయకుల్ని మోసం చెయ్యగా వఛ్చిన డబ్బుమదంతో మదించిన వాళ్ళు మాత్రమే. వీళ్ళకు కావలసింది శాస్త్రం కాదు, ధనం. వీళ్ళకు రీసెర్చి చేసే ఓపిక ఉండదు. Investigative thinking ఉండదు. తపశ్శక్తి అసలే ఉండదు. కనుక, అంత లోతైన రీసెర్చి చెయ్యకుండా, అంత కష్టపడకుండా, ఏవేవో నాలుగు మాటలు బట్టీపట్టి, హోమాలని, పూజలని, లోకాన్ని మోసం చేస్తూ, మార్కెటింగ్ చేసుకుంటూ, పబ్బం గడుపుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. అందుకే వీరు పెట్టె ముహూర్తాలు ప్రాక్టికల్ గా నిలబడవు. వీరు చెప్పే జ్యోతిష్యాలు నిజం అవవు.

ప్రసిద్ధి గాంచిన వేమన పద్యాన్ని గమనించండి.

ఆ || విప్రులెల్ల జేరి వెర్రికూతలు గూసి
సతిపతుల జేర్చి సమ్మతమున
మును ముహూర్తముంచంగ ముండెట్లు మోసెరా?
విశ్వదాభిరామ వినుర వేమ !

ఎంతో జాగ్రత్తగా జాతకాలు చూసి, పంచాంగాలు వెదికి, వాదప్రతివాదాలు చేసి, మంచి ముహూర్తాన్ని నిర్ణయించి, మంగళవాయిద్యాలతో, వేద మంత్రాలతో, వేదాశీర్వచనాలతో పెళ్లి చేస్తే, అది డైవర్స్ వరకూ ఎందుకు పోతోంది? లేదా కాపురం సజావుగా ఎందుకు సాగడం లేదు? రకరకాల అశుభాలు ఎందుకు జరుగుతున్నాయి? అన్న ప్రశ్న ఈ నాటిది కాదు. ఆలోచనాపరులకు ఏనాడో వచ్చింది. దానికి ప్రతిరూపమే ఈ వేమన పద్యం. ఇందులో ఎంతో నిజం ఉంది.

అసలూ, 'గుంపులో గోవిందా' అన్నట్లు సమాజం మొత్తానికీ ఒకే ముహూర్తం ఎలా సరిపోతుంది? జాతకం అనేది వ్యక్తిగతమా సామూహికమా? ఎవడి జాతకం వాడికి చూస్తారా, లేక లోకం మొత్తానికీ ఒకే జాతకం చూస్తారా? ఎవరి జాతకం వారిదైనప్పుడు, ముహూర్తం మాత్రం వ్యక్తిగతం కాదా? అందరికీ ఒకేరోజున పెళ్లి ముహూర్తం ఎలా ఉంటుంది? ఎవరి జాతకాన్ని బట్టి వారికి సరిపోయే మాసంలో, పక్షంలో, వారంలో, తిధి రోజున, లగ్నాన్ని ఎన్నుకొని వివాహ ముహూర్తం పెట్టాల్సిన అవసరం లేదా? గుడ్డిగా పంచాగం చూసి అందులో ఉన్న ముహూర్తాన్ని అడిగిన ప్రతివాడికీ నిర్ణయించడం తప్పు కదా? అన్న ప్రశ్నకు నేటి పంచాంగ కర్తలతో సహా, ఏ జ్యోతిష్కుడూ జవాబు చెప్పలేడు. ఛాలెంజ్ ! చెప్పండి చూద్దాం !

అందుకే నేనేం చెప్తానంటే - నేటి పెళ్లి ముహూర్తాలన్నీ శుద్ధతప్పులే, పొరపాట్లే, తప్పు ముహూర్తాలే అంటాను. ఆ ముహూర్తాలు రాస్తున్న పంచాంగకర్తలకు నిజమైన జ్యోతిష్యం రాదు. పెళ్లి చేయిస్తున్న పురోహితులకు మంత్రాలు తప్ప, జ్యోతిష్యం తెలియదు. చేయించుకుంటున్న వారికి, భయమూ దురాశా తప్ప, బుద్ధి ఉండదు. అందుకే సమాజం ఇలా ఉంది మరి ! కానీ మనం చెబితే ఎవరు వింటారు? 'వినాశకాలే విపరీత బుద్ధి:' అంటే ఇదే కదూ మరి !

కొన్ని మాసాలు వివాహానికి మంచివి కావనడమే అసలైన పెద్దతప్పు. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఏ మాసంలోనైనా వివాహం చెయ్యవచ్చు. దోషం లేదు. శూన్యమాసం అనేది అసలు లేదు. చెడుకాలమూ అంతకంటే లేదు. అనేది నా అభిప్రాయం. ఈ నా అభిప్రాయానికి ప్రాచీన జ్యోతిష్యశాస్త్రపు అండ ఉంది. అనుభవంలో పరీక్షకు నిలిచే సత్తా ఉంది. పంచాగంలో మీరు చూసే ముహూర్తాలకు ఇవి రెండూ లేవు. గమనించండి.

ముహూర్తం అనేది, వ్యక్తిగత జాతకాన్ని బట్టి నిర్ణయించాలిగాని, పంచాంగాన్ని బట్టి కాదు. అందరికీ ఒకేరోజున పెళ్ళిళ్ళు చేసే సామూహిక ముహూర్తాలు ఎక్కడా లేవు ఉండవు. కానీ ఏ పంచాగం చూసినా ఇవే మీకు కనిపిస్తాయి. అందరూ వీటినే అనుసరిస్తున్నారు. మోసపోతున్నారు. ఇదే కలిప్రభావం ! ఈ మోసానికి లోను కాకండి. ఈ ఊబిలో ఇరుక్కోకండి.

అసలైన శాస్త్రం తెలియని సో కాల్డ్ ఘనాపాటీలు, జ్యోతిష్యసామ్రాట్లు, టీవీలో ఊదరగొట్టే మాయజ్యోతిష్కులు చెప్పే మాయమాటలకు పడిపోకండి. తప్పుడు ముహూర్తాలకు పెళ్ళిళ్ళు చేసి మీమీ జీవితాలను, మీ పిల్లల జీవితాలను చెడగొట్టుకోకండి !

(ఇంకా ఉంది)
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (వివాహ ముహూర్తాలు) "

15, డిసెంబర్ 2019, ఆదివారం

షష్ఠగ్రహ కూటమి - 2019

ధనూరాశిలో షష్ఠగ్రహకూటమి రాబోతోంది. అంటే ధనూరాశిలో ఆరుగ్రహాలు కలవబోతున్నాయి. ఇది ఈ నెల 25, 26, 27 తేదీలలో ఉంటుంది. అవి, గురు, శని, కేతు, సూర్య, చంద్ర, బుధులు. ఆరు గ్రహాలు కలవడం వల్ల లోకమేమీ బద్దలై పోదు. అక్కడక్కడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయి. రక్తపాతం, ప్రాణనష్టం, దేశాల వ్యవస్థలు కూలడం, ప్రకృతి ప్రమాదాలు జరుగుతాయి. కొందరు జ్యోతిష్కులు చెబుతున్నట్టు ప్రపంచం తల్లక్రిందులు ఏమీ కాదు. కాలగమనంలో ఇలాంటివి  చాలా జరిగాయి. ప్రతిసారీ ఏవో ఒక గొడవలు ఉపద్రవాలు మాత్రం జరుగుతుంటాయి.

28-12-2019 నుంచి 12-1-2020 వరకూ చంద్రుడు తప్ప మిగతా అయిదు గ్రహాలు కలసి ధనూరాశిలో ఉంటాయి. ఆ 15 రోజులు కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి. తరువాత రెండురోజులకు బుధుడు కూడా మకరానికి మారిపోతాడు.  ఆ తరువాత నాలుగు గ్రహాలు కలసి కొంతకాలం ధనూరాశిలో ఉంటాయి. అప్పటివరకూ లోకమంతా ఇదే గోల రకరకాలుగా సాగుతుంది. 

ఈ కూటమిలో ముఖ్యమైన కూడిక గురు శనులది. వీరిద్దరూ దాదాపు ఇరవై ఏళ్ల కొకసారి ఒక రాశిలో కలుస్తారు. పోయినసారి 1999-2000 సంవత్సరంలో కలిశారు. ఇప్పుడు 2019 లో కలుస్తున్నారు. వీరు కలిసిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా మేజర్ మార్పులు ఉంటాయి. గతంలో జరిగాయి. ఇప్పుడూ జరుగుతాయి. మనుషుల కర్మవలయం అంతా ఈ రెండు గ్రహాల మధ్యనే నియంత్రించబడుతూ ఉంటుంది. ఏ జాతకంలో నైనా, ముఖ్యమైన మేజర్ గ్రహాలు ఇవి రెండే. మనిషి జాతకంలో  ఏమి జరగాలన్నా వీరిద్దరి పాత్ర లేనిదే జరుగదు.

ప్రస్తుతం వీరు కలుస్తున్న ధనూరాశి, భారతదేశాన్ని సూచించే మకరరాశికి ద్వాదశరాశి. మనకు స్వతంత్రం వచ్చిన వృషభరాశికి అష్టమరాశి. అంటే ఇండియాలో, కుట్రలు కుత్రంత్రాలు బాగా జరుగుతాయి. ప్రజాజీవితంలో భారీ మార్పులు జరుగుతాయి. నష్టం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న Citizenship Amendment Act గొడవలు అవే. ఈశాన్యభారతం అట్టుడుకుతూ ఉండటం, మిగతా దేశానికి కూడా ఈ గొడవలు పాకడం వీరి చలవే.

ఇకపోతే ఈసారి జరుగబోతున్న అసలైన పెద్దమార్పు మాత్రం అమెరికాలో ఉంటుంది. ఎందుకంటే, అమెరికాను సూచించే మిధునరాశి సరిగ్గా ధనుస్సుకు ఎదురుగా ఉంటుంది, ఇంకా చెప్పాలంటే, ప్రస్తుతం మిధున - ధనూరాశుల ఇరుసులో రాహుకేతువులు ఉఛ్చస్థితిలో ఉన్నారు. అందుకనే, ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ ఇంపీచ్ మెంట్ ను ఎదుర్కొంటున్నాడు. దీని ఫలితంగా మిడిల్ ఈస్ట్ లో కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయి. బ్రిటన్  లో అధికార మార్పు కూడా వీరి కూడిక ఫలితమే.

ప్రపంచవ్యాప్తంగా అనేకదేశాలలో అనేక రకాలైన మార్పులు ప్రమాదాలు గొడవలను ఈ గురుశనుల కూడిక సూచిస్తుంది. అవన్నీ నేను ఏకరువు పెట్టబోవడం లేదు. ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని గమనిస్తే, ఆయా  లింకులు స్పష్టంగా మీకు కనిపిస్తాయి. ఆసక్తి ఉన్నవాళ్లు ప్రయత్నించండి.

వ్యక్తిగత జాతకాలలో ఈ యోగం చేసే విధ్వంసాన్ని, మాత్రమే ఇక్కడ చెబుతున్నాను. జాగ్రత్త పడండి.

వృషభంలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

జీవితంలో పెద్ద నష్టాన్ని చవిచూస్తారు. మానసికంగా అత్యంత డిప్రెషన్ కు గురౌతారు. దీర్ఘరోగాలు బాధిస్తాయి.

మిధునంలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

వివాహజీవితం లేదా బిజిజెస్ అతలాకుతలం అవుతుంది. జీవితభాగస్వామి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది. లేదా అతనికి/ ఆమెకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మానసికంగా తీవ్ర అలజడికి గురౌతారు. పార్ట్నర్స్ మోసం చేస్తారు.

కర్కాటకంలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

అనారోగ్యం పాలౌతారు. మనస్సు భయాందోళనలకు గురౌతుంది. శత్రుబాధ పెరుగుతుంది. రుణాలు అవుతాయి. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి.

సింహరాశిలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

మనస్సు అతలాకుతలం అవుతుంది. ప్రేమలో తీవ్ర ఆశాభంగానికి గురౌతారు. సంతానం చర్యలు బాధిస్తాయి. లేదా సంతానానికి తీవ్రనష్టం కలుగుతుంది.  షేర్ మార్కెట్లో ఘోరంగా నష్టపోతారు.

కన్యలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

కుటుంబంలో కలతలు చికాకులు ఎక్కువౌతాయి. మనస్సు అదుపు తప్పి తీవ్ర డిప్రెషన్లో పడుతుంది. చదువు చట్టుబండ లౌతుంది. పరీక్షలలో తప్పుతారు.

ధనుస్సులో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

అన్నీ ఎదురౌతాయి. గందరగోళంలో పడతారు. అన్ని వైపుల నుంచీ అందరూ రకరకాలుగా ఊపుతారు. పరిస్థితులు గజిబిజిగా ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనసు మారుతుంది.

మకరంలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. ఆస్తులు కోల్పోతారు. ఆస్పత్రి పాలౌతారు. స్థానచలనం ఉంటుంది. ఉన్నఊరు వదలి వేరే ఊరికి మారవలసి వస్తుంది. పరువు పోతుంది. ఒంటరితనానికి గురౌతారు.

ముఖ్యంగా ధనుస్సు, మిధున - రాశులు, లగ్నాలకు - ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. గమనించండి.
read more " షష్ఠగ్రహ కూటమి - 2019 "

11, డిసెంబర్ 2019, బుధవారం

ప్రపంచ రేపుల రాజధాని

మొన్న కొందరు నాయకులు పార్లమెంట్ లో మాట్లాడుతూ, 'ఇండియాకు ప్రపంచ రేపుల రాజధాని అని పేరోస్తోంది' అన్నారు. Make in India బదులు Rape in India అంటే సరిపోతుంది అని కూడా అన్నారు. కొత్త సినిమా టైటిల్ భలే ఉంది కదూ An evening in Paris, Love in Tokyo లకి సీక్వెల్ లాగా Rape in India!  సినిమావాళ్ళు ఎవరైనా ఈ టైటిల్ ని ఆల్రెడీ రిజిస్టర్ చేశారో లేదో నాకైతే తెలీదు మరి !!

అసలూ, ఈ పేరు మన దేశానికి ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. సీతాదేవిని రావణుడు బలాత్కారంగా ఎత్తుకుపోవడం దగ్గరే ఇది ఉంది. నిండు సభలో ద్రౌపదికి బట్టలు విప్పడం నుంచే ఇది ఉంది. ఆడదాన్ని ఒక విలాసవస్తువుగా, ఒక ప్రాణమూ మనసూ లేని commodity గా చూడటం అతి ప్రాచీనకాలం నుంచే మన దేశంలో ఉంది. కాకపోతే, అలా చూసిన వాళ్ళను విలన్లు అన్నాం. వ్యతిరేకంగా పోరాడినవాళ్ళను హీరోలన్నాం. విషయం మాత్రం మొదటినుంచీ ఉంది. అంతే తేడా !

అయితే ఈ పోకడకి కారణం ఏంటో ఇంతవరకూ ఏ సైంటిస్టూ కనుక్కోలేక పోయాడు. ఫస్ట్ టైం నేనే కనుక్కుని చెబుతున్నా ! దీనికంతటికీ కారణం 'మషాలా' ! ఇది విన్నాక 'మాషా అల్లా' అని మాత్రం అనకండి. మళ్ళీ తేడాలొస్తాయి.

సమాజపు కట్టుబాట్లూ, చట్టమూ న్యాయమూ లేని దేశంలో - ఎవరూ మనల్ని చూడటం లేదన్నపుడు - ఏకాంతం దొరికినప్పుడు - ఎంతమంది మనుషులు - వాళ్ళు మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా - పవిత్రులుగా ఉంటారన్నది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న ! అసలు 'పవిత్రత' అంటే ఏమిటి? దాని నిర్వచనం ఏమిటి? అది మానసికమా? శారీరికమా? లేక రెండూనా? లేక రెండూ కాదా? అన్నది ఇంకో భయంకరమైన ప్రశ్న ! మౌలికమైన అనేక ప్రశ్నలకులాగే వీటికీ జవాబులు చెప్పడం అంత సులభసాధ్యం కాదు మరి !

'ఇండియాలో ప్రజలకు కామం చాలా ఎక్కువ. వాళ్ళ జనాభాని చూస్తె ఈ విషయం ఎవరికైనా తేలికగా తెలుస్తుంది' అని చాలామంది తెల్ల మేధావులు ఎప్పుడో అనేశారు. ఈ మాటల్లో నిజం ఎంతుందా? అని నిన్నటినించీ తెగ ఆలోచిస్తుంటే, అకస్మాత్తుగా కర్ణపిశాచి స్వరం వినిపించింది.

'నేను చెప్పనా దీనికి జవాబు?'

'అబ్బా ! మా తల్లే ! చాన్నాళ్ళకి వినిపించావ్ గాని, చెప్పు' అన్నా.

'మీ దేశంలో అందరూ మషాలాలు ఎక్కువగా వాడతారు. అందుకే మీకు కామం ఎక్కువ' అంది పిశాచి.

'అదేంటి? మషాలాలకీ, కామానికీ లింకుందా?' అడిగాను తెగ హాశ్చర్యపోతూ.

'ఎందుకు లేదు? మాంసమూ, మషాలాలూ, కామాన్ని బాగా ఉద్రేకిస్తాయని మీ ఆయుర్వేదమే చెబుతోంది. 'మేకమాంస లేహ్యం' పేరు ఎప్పుడైనా విన్నావా లేదా? అది మీ ఆయుర్వేదంలో మంచి aphrodisiac. తెలీదా?' అంది పిశాచి.

'ఆ ప్రయోగాలు చేసే అవసరం ఇంకా రాలేదులేగాని, ఇది నిజమా?' అడిగాను సీరియస్ గా.

'నేను చచ్చినంత ఒట్టు' అంది పిశాచి.

నాకు డౌటోచ్చింది.

'అదేంటి? చస్తేనే కదా పిశాచిగా మారేది. మళ్ళీ 'నేను చచ్చినంత ఒట్టు' అంటుందేంటి?' అనుకుని ఇలా అడిగా.

'చూడూ ! నీ వాలకం నాకేదో అనుమానంగా ఉంది. ఇందాక మీ దేశంలో అన్నావ్ ! ఇప్పుడేమో మీ ఆయుర్వేదం అంటున్నావ్ ! ఇంతకీ నువ్వేక్కడున్నావ్? ఎక్కణ్ణించి నాతో మాట్లాడుతున్నావ్? ఇండియా నుంచి కాదా?' అడిగా.

'కాదు. ప్రస్తుతం అమెరికా నుంచి నీతో మాట్లాడుతున్నా' అంది తను.

నాకు మతిపోయింది.

'అదేంటి? అలా కూడా చెయ్యగలవా?' అడిగా భయపడుతూ.

'ఎలాగైనా చెయ్యగలను. మాది యూనివర్సల్ నెట్వర్క్. నో ప్రాబ్లం' అని నవ్విందది.

'అయినా నీకక్కడెం పని? అమెరికాలో ఎక్కడున్నావ్? డెట్రాయిట్ సమీపంలోనా?' అడిగా మళ్ళీ భయం భయంగా.

'అవున్లే. నీ భయాలు నీవి ! అయినా మీకు అమెరికా అంటే, USA ఒక్కటే గుర్తొస్తుంది. నేనున్నది లాటిన్ అమెరికాలో' అంది తను.

'ఓ, అక్కడున్నావా? ఎన్నాల్లేంటి ట్రిప్?' అడిగా.

'మా బాస్ ఇక్కడ ఒక ద్వీపం కొనేశాడు. అందుకని కొన్నాళ్ళు ఇక్కడ వెకేషన్ కనీ వచ్చా' అంది.

తనేం చెప్తోందో అర్ధమైంది.

'యూ మీన్ Parama Shivam?' అడిగా.

'ఎస్. మేమంతా భూతాలం కదా. ఆయనెక్కడుంటే మేమక్కడే ఉంటాం' అంది తను.

'ఐసీ ! ఈ మధ్యనే మీ భూతాల ఫోటోలు కొన్ని చూశా. మీలో కూడా మాంఛి అందగత్తెలున్నారు సుమీ !' అన్నా చనువుగా.

'ఎందుకుండరు? మాకు ప్రతిరోజూ నాన్ వెజ్జూ, మషాలా కూరలూ లేందే ముద్ద దిగదు. అందుకని మాకు అందమూ ఎక్కువే, అన్నీ ఎక్కువే' అందది వికటంగా నవ్వుతూ.

'ఎలాగైనా మీ బాస్ భలే లక్కీఫెలో కదా ! ' అన్నా అసూయగా.

'ఎందుకో?' అంది తను దీర్ఘం తీస్తూ.

'మరి మీలాంటి అందమైన భూతాల మధ్యన తన దేశంలో తనున్నాడు. న్యాయమూ చట్టమూ అన్నీ మీవే. మిమ్మల్ని అనేవాడూ లేడు, అడిగేవాడూ లేడు. రోజూ మషాలా కూరలు. కేసులుండవు. భలే ఉంది మీ పని' అన్నా.

'ఇదుగో అంటేగింటే మమ్మల్ని ఏమైనా అను, ఊరుకుంటా, మా బాస్ ని ఏమైనా అన్నావో నీ సంగతి చెప్తా' అంది తను కోపంగా.

నాకు నిజ్జంగా భయమేసింది.

'బాబోయ్. అనన్లే. ఇక చాలు చెప్పకు. వినగావినగా నాకూ మీరు తినేవన్నీ రోజూ  లాగించాలనిపిస్తోంది. వద్దులేగాని, మీ ఐలెండ్ లో ఏం జరుగుతోంది అసలు?' అడిగా.

'చూడూ ! కూపీలు లాగాలని చూడకు. నీ ఫస్ట్ డౌట్ గురించి మాత్రమే నువ్వడుగు. అంతేగాని, మా బాస్ గురించి కూపీలు లాగావో చూడు నిన్నేం చేస్తానో?' అని బెదిరించింది అది.

'సర్లే ఆయనేం చేస్తే నాకెందుకులే గాని, అయితే, ఇండియాలో జరుగుతున్న రేపులన్నిటికీ మషాలాలే కారణం అంటావ్?' అన్నా.

'ముమ్మాటికీ అంతే, వాటికి తోడు మద్యం, మాంసం, ఇవి రెండూ కలిస్తే రేపులు కాక ఇంకేం జరుగుతాయి మరి?' అంది తను కాన్ఫిడెంట్ గా.

'ఇక చాలు. నువ్వేమీ చెప్పకుండానే, మీ ద్వీపంలో ఏం జరుగుతుందో నాకు బాగా అర్ధమైపోయింది. కాకపోతే, అక్కడ దాన్ని 'రేప్' అనరేమో? అంతేనా?' అడిగా నవ్వుతూ.

'అవును. ఇక్కడ రేప్ చేసినవాళ్ళమీద కేసుండదు. చెయ్యకపోతే మాత్రం 'ఫలానా సిటిజెన్ మషాలాలు సరిగా తినడం లేదు' అంటూ మా బాస్ కి కంప్లెయింట్ చేస్తాం. అప్పుడు కేసౌతుంది.' అందది.

చచ్చే నవ్వొచ్చింది నాకు.

'అంతా మషాలా మహిమ ! అయితే, మా దేశంలో ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏం చెయ్యాలి మేం?' అడిగా.

'మందూ, మాంసం, మషాలాలు - మూడూ మానుకొని, రోజూ పచ్చిమొలకలు తింటూ యోగా చెయ్యడం మొదలుపెట్టండి. అందరూ శాంతిగా ఉంటారు. అప్పుడు చూడండి నేను చెప్పేది నిజమో కాదో?' అంది.

'యూ మీన్ sprouts?' అడిగా అమాయకంగా.

'యూ ఫూల్ ! What else could I mean? సర్లే, నీతో ఈ వాదన తెగదులే గాని, నేనొస్తా. పనుంది' అంది మాయమైపోబోతూ.

'ఆగాగు. ఎక్కడికి? అంత అర్జెంట్ పనేముంది?' అన్నా.

'కూరల్లోకి మషాలాముద్ద నూరుకుని రమ్మన్నాడు బాస్. ఈ లోపల నీ బాధ చూడలేక నీ నెట్వర్క్ లోకి అడుగుపెట్టా. త్వరగా వెళ్ళకపోతే ఈ పూటకి చప్పిడికూరలు తినాల్సి వస్తుంది. అప్పుడు జరిగే నష్టానికి నేనే జవాబుదారి. నేనిలాగే లేట్ చేస్తే, మా సిటిజెన్స్ పెర్ఫామెన్స్ లెవల్స్ పడిపోతాయి. సాటి భూతాలనుంచి ఎన్ని కంప్లెయింట్స్ వెళ్తాయో మా బాస్ కి రేపు? నాకొద్దు ఆ పనిష్మెంట్. వస్తా. బై' అంటూ మాయమై పోయింది తను.

'హా పరమశివమ్ ! ఇదా అసలు సీక్రెట్?' అనుకుంటూ కుర్చీలోంచి పైకి లేచా.
read more " ప్రపంచ రేపుల రాజధాని "