Love the country you live in OR Live in the country you love

5, జనవరి 2020, ఆదివారం

Kalpataru Day Celebration - 2020

ప్రతి ఏడాదీ జనవరి ఒకటో తేదీన లోకం క్రొత్త సంవత్సరాన్ని జరుపుకుంటుంది. నేనూ దీనిని పాటిస్తాను. అయితే లోకం చేసే విధంగా కాదు. షాపింగులు, పార్టీలు చేసుకుని, తిని, తాగి, తందనాలాడి, రాత్రంతా మేలుకుని సొల్లు మాటలు చెప్పుకుంటూ, సినిమాలు, టీవీలు చూస్తూ కాదు. ఇవన్నీ చేస్తూ క్రొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడం చాలా చౌకబారు పోకడగా, ఇలా చేసేవారిని చాలా చౌకబారు మనుషులుగా నేను భావిస్తాను. దీనికి పూర్తిగా భిన్నమైన విధానంలో నేను క్రొత్త సంవత్సరాన్ని జరుపుకుంటాను. పూర్తిగా ఏకాంతంలో, మౌనంలో, ధ్యానంలో నేను ఈ రోజున కాలం గడుపుతాను. సరదాలలో, కులాసాలలో, పనికిమాలిన కాలక్షేపాలలో వేస్ట్ చేసుకోవడానికి మానవజీవితం ఉద్దేశించబడలేదని నా భావన.

1886 సంవత్సరంలో జనవరి ఒకటో తేదీన ఈ అధ్బుతం జరిగింది. ఆ రోజున తన భక్తులు ఏది కోరితే దానిని ఇచ్చారు శ్రీ రామకృష్ణులు. అది ఆధ్యాత్మికమైనా, లౌకికమైనా సరే, వారి కోరికలన్నీ ఆ రోజున అనుగ్రహించబడ్డాయి. ఆ రోజున తనను అర్ధించిన వారిని కాదనకుండా ఆయన తన కరుణను వారిపైన వర్షించాడని ఆ సంఘటనను చూసిన వారు వ్రాశారు. అందుకని అప్పటినుంచీ ఆయన భక్తులు ఆ రోజును 'కల్పతరు దినోత్సవం' గా జరుపుకుంటారు.

ఈ మహత్తరమైన సంఘటనను తలచుకుంటూ ప్రతి ఏడాదీ జనవరి ఒకటో తేదీన మితాహారం, జపం, ధ్యానం, యోగాభ్యాసాలలో నేను కాలం గడుపుతాను. ఇది ఎన్నో ఏళ్ళ నుంచీ నేను పాటిస్తున్నాను. అదే విధంగా ఈ ఏడాది కూడా చేశాను. కాకపోతే, ఈ ఏడాది నేనొక్కడినే లేను. నాతో పాటు పంచవటి బృందం ఉంది. ఆ రోజంతా ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక భావనా తరంగాలలో గడిచింది. నాతో బాటు ఉన్నవారికి ఎన్నో insights ను, spiritual experiences ను ఇచ్చింది.

ప్రస్తుతం నేను హైదరాబాదులోనే ఉంటున్నాను గనుక హైదరాబాద్ వాస్తవ్యులు చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వారికి, మిగతా దూరప్రాంతాలనుండి ఇక్కడకు వచ్చినవారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

విదేశాలలో ఉన్న పంచవటి సభ్యులకు ఫేస్ బుక్ లింక్ ద్వారా దీనిని వీక్షించే అవకాశం కల్పించాము. రాత్రంతా మేలుకుని దీనిని వీక్షించిన, వారికి కూడా నా కృతజ్ఞతలు.

ఆ ఫోటోలలో కొన్నింటిని ఇక్కడ చూడండి.