అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

16, జనవరి 2026, శుక్రవారం

PSLV - C 62 విఫలం కావడానికి ముహూర్తం కారణమా?

మొన్న 12 వ తేదీన ప్రయోగించిన PSLV - C 62 రాకెట్ విఫలమైంది. 

టెక్నికల్ కారణాలు ఏవైనా ఉండవచ్చు గాక ! జ్యోతిష్య కారణాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. 

ఆ రోజున ఉదయం 10. 12 కి గ్రహస్థితిని నేను పరిశీలించాను. ఇంతకంటే పనికిరాని ముహూర్తం ఇంకెక్కడా ఉండదు. ఇది విఫలం కావడానికి పెట్టిన ముహూర్తంలాగా ఉంది గాని, సక్సెస్ కు పెట్టిన ముహూర్తంలాగా లేదు.

జ్యోతిష్యశాస్త్రాన్ని వారు లెక్కిస్తారో లేదో నాకు తెలియదు. కానీ, జరిగిన నష్టంతో పోల్చుకుంటే, నమ్మకం అంత ముఖ్యం కాదన్న చిన్నవిషయం వాళ్ళ లాజిక్ కు తట్టి ఉండాలి.

లేదా, సోకాల్డ్ సెలబ్రిటీ జ్యోతిష్కుల మాయలోనన్నా వాళ్ళు పడి ఉండాలి. అది అసాధ్యమేమీ కాదు.

లేదా, వివేకానందుని పుట్టినరోజు కాబట్టి మంచిరోజని భావించారా? 1863 లో వివేకానందస్వామి పుట్టినపుడు జనవరి 12 న ఉన్న గ్రహస్థితులు వేరు. 2026 లో అలా ఉండవు. ఉత్త తేదీలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే వచ్చే ఇబ్బందులు ఇవే మరి !

పైగా, లౌకికంగా చూస్తే, వివేకానందస్వామిది అంత అదృష్టజాతకమేమీ కాదు. ఆ విధంగా చూచినా, ఆ తేదీని రాకెట్ ప్రయోగానికి ఎంచుకోకూడదు.   

అయినా, PSLV రాకెట్ల ప్రయోగంలో అంత అనుభవం ఉన్న ఇస్రో, మూడవదశ ఇగ్నిషన్ లో ఎలా విఫలమౌతుంది? అన్నది అసలైన ప్రశ్న. ఇది ప్రయోగాత్మకదశ కాదుగా ! రాకెట్ టెక్నాలజీని ఇప్పుడు క్రొత్తగా ఇస్రో నేర్చుకోవడం లేదుగా ! PSLV ప్రయోగం ఇస్రోకు క్రొత్త కాదు కూడా !

తప్పులనుంచి నేర్చుకోవడం మంచిదే. కానీ నిర్లక్ష్యంవల్ల ఆ తప్పులు మాటిమాటికీ జరుగకూడదు. ప్రజాధనం విలువలేనిది కాదుగా !

నమ్మకమా? నష్టమా? అనిన ప్రశ్న వచ్చినపుడు, ఒక చిన్న నమ్మకాన్ని పాటించి నష్టాన్ని తప్పుకోవడం తెలివైనవారి లక్షణం కాదా?