అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

15, ఆగస్టు 2025, శుక్రవారం

ఒంగోలు పుస్తక మహోత్సవం - 2025 లో మా స్టాల్







ఒంగోలులో నేటినుండి జరుగుతున్న పుస్తకమహోత్సవంలో మాకు 28 వ నెంబరు స్టాల్ కేటాయించబడినది. పదిరోజులపాటు జరిగే దీనిలో మా గ్రంధాలన్నీ మీకు లభిస్తున్నాయి. అంతేగాక, అక్కడ పంచవటి సభ్యులను మీరు కలుసుకోవచ్చు. మాట్లాడవచ్చు.

హైదరాబాదు, విజయవాడ బుక్ ఫెయిర్ లతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నదే. కానీ మాకు దగ్గర గనుక, మా స్టాల్ ను కూడా ఇక్కడ పెడుతున్నాము. ఒంగోలు ప్రాంతంలో పుస్తకప్రియులు, అందులోనూ, ఆచరణాత్మకమైన అసలైన హిందూధర్మాన్ని తెలుసుకుందామనిన జిజ్ఞాస ఉన్నవారు, ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు. కానీ అమూల్యములైన మా గ్రంధాలను ఈ ప్రాంతపు ప్రజలకు కూడా పరిచయం చేద్దామన్న సత్సంకల్పంతో ఈ పనిని చేస్తున్నాము.

పంచవటి ఆశ్రమాన్ని గురించి, మా భావజాలాన్ని గురించి, అసలైన హిందూమతాన్ని గురించి తెలుసుకోవడానికి ఒంగోలు చుట్టుప్రక్కల ఉన్నవారికి ఇది సువర్ణావకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.

read more " ఒంగోలు పుస్తక మహోత్సవం - 2025 లో మా స్టాల్ "

11, ఆగస్టు 2025, సోమవారం

మా 73 వ పుస్తకం 'పది శాక్తోపనిషత్తులు' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 73 వ పుస్తకంగా 'పది శాక్తోపనిషత్తులు' నేడు విడుదల అవుతున్నది.

ఇప్పటిదాకా నేను ప్రధానమైన వేదాంతోపనిషత్తులను, యోగోపనిషత్తులను వ్యాఖ్యానించి మా సంస్థనుండి పుస్తకములుగా ప్రకటించాను. కానీ శక్తిప్రధానములైన ఉపనిషత్తులకు వ్యాఖ్యానమును వ్రాయలేదు. ఆ పనిని ఇప్పుడు చేశాను. ఆ వివరమంతా ఈ గ్రంధపు ముందుమాటలో చర్చించాను.

దీనిలో 1. కౌలోపనిషత్తు 2. త్రిపురా మహోపనిషత్తు 3. భావనోపనిషత్తు 4. అరుణోపనిషత్తు 5. బహ్వృచోపనిషత్తు 6. కాళికోపనిషత్తు 7. తారోపనిషత్తు 8. సరస్వతీ రహస్యోపనిషత్తు 9. త్రిపురాతాపినీ ఉపనిషత్తు 10. సౌభాగ్యలక్ష్మీ ఉపనిషత్తులకు నా వ్యాఖ్యానం మీకు లభిస్తుంది.

ఇవి, నాలుగువేదములనుండి తీసుకున్నవి అయినప్పటికీ, అధర్వణవేదం నుండి ఎక్కువగా ఉన్నాయి. తంత్రప్రధానములైన ఉపనిషత్తులు దానిలోనే మనకు కనిపిస్తాయి.

బ్లాగులో వ్రాతలను నేను బాగా తగ్గించినప్పటికీ, రచనావ్యాసంగానికి మాత్రం చుక్కపెట్టలేదు. ఉన్నతభావ సంప్రేరితములైన ప్రాచీనగ్రంథముల అధ్యయనము, వ్యాఖ్యానము, సాధన మరియు బోధనలు నిరాఘాటంగా మా ఆశ్రమంలో  కొనసాగుతూనే ఉన్నాయి. అవే లేకపోతే, ఈ చెత్తలోకంలో చెత్తమనుషుల మధ్యన మనం మనుగడ సాగించేదెలా మరి?

నేను సమాజానికి దూరంగా ఉంటున్నప్పటికీ, నిజమైన సాధకులకు మా ఆశ్రమం తలుపులు మాత్రం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి.

ఈ గ్రంధాన్ని ఆవిష్కరించడంలో తమవంతు పాత్రను పోషించిన నా శిష్యులందరికీ ఆశీస్సులు. యధావిధిగా ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

ఆగస్టు 15 నుండి 24 వరకూ ఒంగోలులో జరుగబోతున్న పుస్తకమహోత్సవం సమయానికి దీనితోబాటు మరికొన్ని మా అముద్రిత గ్రంధాలను ముద్రించి, మా స్టాల్లో అందుబాటులో ఉంచే ప్రయత్నం జరుగుతున్నది.

మా మిగతా గ్రంధాలలాగా దీనిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
read more " మా 73 వ పుస్తకం 'పది శాక్తోపనిషత్తులు' విడుదల "

10, ఆగస్టు 2025, ఆదివారం

'శ్రీవిద్యారహస్యం' మూడవ ముద్రణ విడుదల

నేను మొట్టమొదట వ్రాసిన పుస్తకం 'శ్రీవిద్యారహస్యం'. దీని మొదటి ముద్రణ పదేళ్లక్రితం 2015 లో జరిగింది. ఆ తరువాత పాఠకుల డిమాండ్ ను బట్టి 2019 లో రెండవముద్రణ జరిగింది. ఇప్పుడు 2025 లో మూడవ ముద్రణ జరిగింది. అభిమానుల సూచనలను బట్టి ప్రతిసారీ దీనిలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరుగుతున్నది.

మొదటి ముద్రణలో 1318 పద్యములున్నాయి. మూడవముద్రణలో 1731 పద్యములైనాయి. అంటే దాదాపు 400 పద్యములను అదనంగా వ్రాసి చేర్చడం జరిగింది. అంతేగాక, అదనపు అధ్యాయములను కూడా చేర్చడం జరిగింది.

ప్రస్తుతపు మూడవముద్రణలో చేర్చబడిన ముఖ్యాంశము మంత్రభాగపు వివరణ. మొదటి రెండు ముద్రణలలో మంత్రభాగాన్ని పెద్దగా స్పృశించలేదు. కారణం, మంత్రములను పుస్తకరూపంలో ఇవ్వడం ఎందుకని భావించడమే. కానీ,  శ్రీవిద్యకు మంత్రమే ప్రాణం గనుక అది కూడా ఉండాలని కొందరు అభిమానులు పదే పదే చెప్పడంతో, దానిని ఈ ముద్రణలో వివరంగా చర్చించడం జరిగింది. అయితే, గురూపదేశం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పడం జరిగింది.

మంత్రములను పుస్తకముల నుండి గ్రహించవచ్చు. కానీ వాటియొక్క జపధ్యానవిధానములను (తంత్రమును) మాత్రం గురూపదేశపూర్వకంగానే నేర్చుకోవలసి ఉంటుంది. 

2015 తరువాత ఈ పదేళ్లలో 70 పైగా పుస్తకములను నేను వ్రాసినప్పటికీ, మొట్టమొదటిసారిగా వ్రాసిన 'శ్రీవిద్యారహస్యం' మాత్రం నేటికీ పాఠకుల అభిమానగ్రంధంగా నిలిచి ఉన్నది. నా భావజాలాన్ని, మా సాధనామార్గాన్ని చదువరులకు స్పష్టం చేస్తూనే ఉన్నది.

ఈ మూడవముద్రణ సందర్భంగా నా శిష్యులకు, అభిమానులకు ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఈ నెల 15 నుండి 24 వరకూ ఒంగోలులో జరుగబోతున్న పుస్తకమహోత్సవంలో 'పంచవటి స్టాల్' లో 'శ్రీవిద్యారహస్యం' మూడవ ముద్రణతో సహా  మా పుస్తకాలన్నీ లభిస్తాయి.

ఇది మా ఆశ్రమానికి దగ్గరే కాబట్టి, పుస్తకప్రాంగణంలో నేను కూడా మీకు అప్పుడపుడు కనిపిస్తాను. పుస్తకప్రాంగణంలో కలుసుకుందాం.

read more " 'శ్రీవిద్యారహస్యం' మూడవ ముద్రణ విడుదల "