Love the country you live in OR Live in the country you love

1, మే 2025, గురువారం

నీడల వెంట పరుగులు

చిన్నచిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకున్నవారిని గతంలో ఎంతోమందిని మనం చూశాము. కానీ, సోషల్ మీడియాలో తన ఫాలోయర్స్ తగ్గిపోతున్నారని ఆత్మహత్య చేసుకున్నవారికి ఇప్పుడు చూస్తున్నాం. మిషా అగర్వాల్ కేసు వాటిలో ఒకటి. 

వారం క్రితం ఏప్రియల్ 24 న ఈమె చనిపోయింది. అప్పటికి ఆమెకు 24 ఏళ్ళు. రెండురోజులలో 25 ఏళ్ళు వస్తాయి. కాస్మెటిక్స్ రంగంలో ఎదగడం ఈమె కల. లా గ్రాడ్యుయేట్ అయిన ఈమె జ్యుడిషియల్ పరీక్షలకు తయారౌతున్నది.

పదిలక్షలమంది ఫాలోయర్స్ తన ఇంస్టాగ్రామ్ లో ఉండాలని ఈమె తీవ్రంగా కలలు కనేది. అంతమంది రాకపోగా, ఉన్నవారు కూడా క్రమేణా తగ్గిపోతూ ఉండటంతో, డిప్రెషన్ లో పడిపోయి, ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

'మనుషులను సోషల్  మీడియా పిచ్చి ఎంత దూరం తీసుకుపోతుంది?' అనడానికి ఈ అమ్మాయి ఒక నిదర్శనంగా మిగిలిపోయింది.

కామెంట్లు, లైకులు చూసుకోవడం. వ్యూయర్లు, ఫాలోయర్లు వ్రాసే 'ఆహా ఓహోలు' నిజాలనుకుని ఉబ్బిపోవడం. గ్రూపులు, గొడవలు, ఇవన్నీ బ్లాగులు వ్రాసే కొత్తలోనే, అంటే 2012 ప్రాంతాలలోనే నేను గమనించాను. ఇదొక వ్యసనమని, ఒక రొచ్చు ప్రపంచమని నాకప్పుడే అర్ధమైంది. అందుకే, వ్యూయర్స్ టాబ్ ను, ఫాలోయర్స్ టాబ్ ను, కామెంట్స్ సెక్షన్ ను నా బ్లాగ్ నుండి అప్పుడే తీసేశాను.

సోషల్ మీడియా ఫాలోయర్స్ నిజంగా మనల్ని ఫాలో అవుతారని అనుకోవడం పెద్ద భ్రమ. ఆ భ్రమ మైకంలో బ్రతకడం ఒక మానసికరోగం. అటూ ఇటూ అయితే ఈ రోగం తీవ్రమైన డిప్రెషన్ కు దారితీస్తుంది. ఈ అమ్మాయి కేసులో అదే జరిగింది.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్ళు వాళ్లకు తోచక చేస్తుంటారు. చదివేవాళ్ళు కూడా తోచకనే చదువుతుంటారు. వాటి విలువ అంతవరకే. కొంతమంది తమ మానవసంబంధాలను మెరుగుపరుచుకోవడానికి దీనిని ఉపయోగిస్తే, మరికొంతమంది మోసాలు చెయ్యడానికి వాడుకుంటారు. వాస్తవప్రపంచంలో లాగే దీనిలో కూడా అన్ని రకాల మనుషులూ ఉంటారు. వాస్తవప్రపంచంలో కృంగుబాటుకు ఎంత ఆస్కారం ఉందో, ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువగా ఉంది. ప్రాక్టికల్ గా లేకపోతే రెండిట్లోనూ దెబ్బ తినక తప్పదు.

కలల్లో బ్రతకడం, ఐడెంటిటీ క్రైసిస్, ఇతరుల కంటే తానేదో గొప్ప అన్న భ్రమలో ఉండటం, ఫాలోయర్స్ కౌంటు చూసుకుంటూ మురిసిపోతూ కలల్లో తేలిపోవడం - ఇవన్నీ మానసిక రోగలక్షణాలు. మిషా అగర్వాల్ వంటి అభాగ్యులు వీటికి బలౌతూ ఉంటారు.

ఈ అమ్మాయి 26-4-2000 న పుట్టింది. ఆనాటి జాతకంలో డిప్రెషన్ లక్షణాలు, జీవితంలో ఫెయిల్ అయ్యే పోకడలు, ఆత్మహత్య చేసుకునే యోగాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంతకు ముందైతే వాటన్నిటినీ వివరించి పెద్ద పోస్ట్ వ్రాసి ఉండేవాడిని. చాలామంది సూయిసైడ్ చేసుకున్న సెలబ్రిటీస్ జాతకాలు అలా వ్రాశాను కూడా. ఇప్పుడు రూటు మార్చాను. దగ్గరివారికి కొందరికి మాత్రమే ఆ జ్యోతిష్యకోణాలను వివరిస్తున్నాను.

సోషల్ మీడియా యొక్క కృత్రిమప్రపంచంలో నీడల వెంట పరిగెత్తడం చివరకు ఎక్కడకు తీసుకుపోతుందో ఈ అమ్మాయి కేసులో రుజువైంది. ఇప్పుడే ఇలా ఉంటే, రేపు AI విప్లవం వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో? ప్రపంచజనాభాలో సగంమంది పిచ్చోళ్ళు అయ్యే అవకాశం మాత్రం గట్టిగా కనిపిస్తున్నది.

జీవితంలో సోషల్ మీడియా అనేది ఒక చిన్న భాగంగా ఉండాలి. అంతేగాని అదే ప్రపంచమై పోయి, చివరకు వాస్తవప్రపంచాన్ని మర్చిపోయే స్థితికి మనల్ని తీసుకుపోకూడదు.

అదే జరిగితే, చివరకు ఇలాగే అవుతుంది.

read more " నీడల వెంట పరుగులు "