“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

25, ఆగస్టు 2021, బుధవారం

దీపపు పురుగులు

చంపేవాడొకడు, చచ్చేవాడొకడు

చంపమని ఆయుధాలిచ్చేదొకడు

చంపొద్దంటూ చాపచుట్టేదొకడు

ఈ వ్యాపారంలో లాభపడేదొకడు


ఎగద్రోసేదొకడు దిగదుడిచేదొకడు

ఎగబీల్చేదొకడు సగమయ్యేదొకడు

ఏరుదాటేదొకడు ఎనక పొడిచేదొకడు

ఎగాదిగా చూస్తూ ఎత్తేసేదొకడు


కులమంటూ కూతపెట్టేదొకడు

మతమంటూ మాయచేసేదొకడు

జాతంటూ వాతపెట్టేదొకడు

నీతంటూ నీరుగార్చేదొకడు


రాజకీయంతో రంగుపూసేదొకడు

ఆధ్యాత్మికమని ఆశరేపేదొకడు

నమ్మకంగా నాటకాలింకొకడు

స్నేహంగా చేయి నరికేదొకడు


అమాయకంగా అంతా దోచేదొకడు

ఘరానాగా  గాయపరిచేదొకడు

మందుపూస్తానంటూ మంటపెట్టేదొకడు

బంధువున్నేనంటూ బండవేసేదొకడు


కులం, మతం, డాబూ, దర్పం 

స్నేహం, మోహం, ప్రేమా, బంధం

వినయం, విశ్వాసం, భక్తీ, బంధుత్వం

అన్నీ మాయదారి నాటకాలే


అందరూ దొంగలే అన్నీ డ్రామాలే

తెరముందు నటనలు చూపిస్తారు

తెరవెనుక దర్శకులు దాక్కుంటారు

అందరూ హీరోలమేనంటారు


ఈ లోకంలో స్వార్ధమే పరమార్ధం

మిగతావన్నీ పైపై మెరుగులు

ఈ లోకంలో డబ్బొక్కటే సత్యం

ఆ దీపం చుట్టూ అన్నీ పురుగులు