“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

13, ఆగస్టు 2021, శుక్రవారం

బ్రిటిష్ యువరాజు ఆండ్రూ పై రేప్ కేసు

గ్రహప్రభావం లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకూ ఎవరినీ వదలడం లేదు.

ఆంధ్రా ఎమ్మెల్యే ఒకాయనపైన ఒక వివాదాస్పద ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తిరుగుతోంది. మసాజ్ చెయ్యడానికి ఒకమ్మాయిని పంపమంటూ అడగడం, ఇతర సంభాషణ దాంట్లో ఉంటుంది. దానికాయన 'ఇదంతా నా ప్రత్యర్దుల కుట్ర. ఆ గొంతు నాదికాదు. వాళ్ళమీద కేసులు పెడతాను' అంటూ వివరణ కూడా ఇచ్చుకున్నాడు. లోకల్ లీడర్స్ పైన గ్రహప్రభావం ఇలా ఉంటే, అంతర్జాతీయ ప్రముఖులపైన ఇంకెలా ఉందొ చూద్దాం.

బ్రిటిష్ యువరాజు  ఆండ్రూ, 20 ఏళ్ళక్రితం తనకు 17 ఏళ్ళున్న సమయంలో తనను రేప్ చేశాడని, తనకు న్యాయం కావాలని, వర్జీనియా గిఫ్రీ అనే ఒక 38 ఏళ్ల అమెరికన్ వనిత న్యూయార్క్ కోర్టులో ఇప్పుడు కేసేసింది. ఇది గ్రహప్రభావం కాకపోతే మరేమిటి?

అప్పట్లో, ఎస్టీన్ అనే ఒక మహానుభావుడు ఇలా టీనేజీ అమ్మాయిలను చాలామందిని ట్రాప్ చేసి, సెలెబ్రెటీలకు వాళ్ళను సప్లై చేసేవాడట. అతనికి ఒక ప్రయివేట్ ద్వీపమే ఉండేది అప్పట్లో. అనేక అలాంటి సెక్సువల్ నేరాలమీద, రెండేళ్ల క్రితం ఇతన్ని అరెస్ట్ చేసి మన్ హాటన్ జైల్లో పెట్టారు. అందులో ఉన్నపుడే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

రెండో ఎలిజబెత్ రాణి రెండో కొడుకైన ప్రిన్స్ ఆండ్రూకు ఇప్పుడు 61 ఏళ్ళు. ఆయన యధావిధిగా 'ఎస్టీన్ ఎవరు? అలాంటి వ్యక్తిని కలుసుకున్న గుర్తే నాకు లేదు. ఈ అమ్మాయెవరో నాకేమీ తెలీదు' అంటున్నాడు. కానీ కేసును ఎదుర్కోవాల్సిందే.

ఏదేమైనా, బ్రిటిష్ రాయల్ పేమిలీ పరువుకు ఇది చాలా నష్టం కలిగించే విషయమే. 20 ఏళ్ల క్రితం ఎప్పుడో జరిగిన చీకటిభాగోతం తీరికగా ఇప్పుడు బయటపడటం, నేను చెబుతున్న గ్రహస్థితికి నిదర్శనమా కాదా మరి?

సామాన్యుడైనా, సెలబ్రిటీ అయినా మనిషి మనిషేగా. సామాన్యుడు పచ్చడి మెతుకులు తింటే, సంపన్నుడు యాభై డిషెస్ తో తినవచ్చు. కానీ ఆకలి ఇద్దరికీ ఒకటే. సామాన్యుడికి కేసులుండవు. సంపన్నుడికి అనేక కేసులుంటాయి.  అంతే తేడా. అవి నిజాలో కాదో కాలం నిర్ణయిస్తుంది.

ఏమంటారు?